సమగ్ర సంపూర్ణ విజయం

సమగ్ర సంపూర్ణ విజయం

   – డా. ఆచార్య ఫణీంద్ర

Telangana-Government-welfar

“లేమావి చివురులను లెస్సగా మెసవేవు –
ఋతురాజు కీర్తిని గొప్పగా పాడేవు –
తిన్న తిండెవ్వారిదే? కోకిలా!
పాడు పాటెవ్వారిదే?”

 

    1940 వ దశకంలో రాయప్రోలు సుబ్బారావు గారు హైదరాబాదులో ఒక కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తూ … సీమాంధ్ర మూలాలు గల కవులను గొప్పగా కీర్తిస్తూ, తెలంగాణ కవుల పట్ల కించిత్తు ఈసడింపుగా వ్యవహరించడం చూసి, ఆవేదన చెందిన మహాకవి కాళోజి అదే కవి సమ్మేళనంలో ఆశువుగా గానం చేసిన కవితలోని ప్రసిద్ధ భాగం ఇది.

      నిన్న మొన్నటి వరకు హైదరాబాదులో  సీమాంధ్ర మూలాలుగా ఉన్న తెలుగు వారిలో అందరూ అనలేం గానీ, అత్యధికుల వ్యవహారం రాయప్రోలు వారి పంథాలోనే సాగేది. ఏబయ్యేళ్ళుగా హైదరాబాదులో నివాసముంటున్నా, “మాది తెలంగాణ!” అని చెప్పుకోవడానికి వారికి మనస్కరించేది కాదు. ప్రతి విషయంలో – ” మా వేపిలా .. మా వేపలా …” అంటూ గొప్పలు చెప్పుతూ, ఇక్కడి విషయాలను తక్కువ చేయడం, దెప్పి పొడవడం జరిగేది. పైకి ప్రకటించినా, ప్రకటించకపోయినా, ఈ వ్యవహారం తెలంగాణ ప్రజల మనస్సులను బలంగా గాయపరుస్తూ వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలను పురికొల్పిన బలమైన కారణాలలో ఇదీ ఒక ప్రధాన కారణమైందని వేరుగా చెప్ప నక్కరలేదు.

     కాని, నిన్న ప్రకటించబడిన జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల ఫలితాలలో ఈ పరిస్థితి పూర్తిగా మారి, ఒక సామూహిక సుహృద్భావ ఐక్య భావన ప్రస్ఫుటంగా గోచరమయ్యింది. టి.ఆర్.ఎస్. పార్టీకి హైదరాబాద్ ప్రజలంతా కలసికట్టుగా సంపూర్ణమైన విజయం చేకూర్చడం ద్వారా అందించిన సందేశం ఇక్కడ గమనార్హం. ఏ ప్రాంతం నుండి వచ్చినా, ఇక్కడ నివాసముంటున్న హైదరాబాదీలందరి బాగోగులు ఇక్కడి ప్రాంతంతో ముడిపడి ఉన్నాయన్న సత్యాన్ని అందరూ గ్రహించినట్టుగా తెలియవస్తున్నది. ఈ అవగాహన మరాఠీ, తమిళ ఇత్యాది అన్య భాషీయులకు మొదటినుండి ఉన్నా, సీమాంధ్ర మూలాలున్న హైదరాబాదీలు దీనిని బాహాటంగా వ్యతిరేకించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి తెలంగాణ ఉద్యమకారులతో సీమాంధ్ర మూలాలున్న హైదరాబాదీల వాదన అదే. “మాది సీమాంధ్ర! హైదరాబాద్ మా రాజధాని! ఇక్కడ మేము పెద్ద సంఖ్యలో నివాసముంటున్నాం కాబట్టి ఇది మాదే!” అని వాదించిన వారిని చాల మందిని చూసాం. కాని నిన్నటి ఎన్నికలతో ఆ వాదన పూర్తిగా వీగిపోయిందనే చెప్పాలె. ముఖ్యంగా హైదరాబాదులో నివాసముంటున్న సీమాంధ్ర మూలాలున్న తెలుగు వారు కూడ “మాదీ తెలంగాణే! తెలంగాణ ఉద్యమ పార్టీ మా అస్థిత్వానికి కూడ ప్రాతినిధ్యం వహిస్తుంది.” అని మొట్ట మొదటిసారిగా అర్థం చేసుకొన్న విషయం ఇప్పుడు అవగతమవుతున్నది. ఇది శుభ పరిణామం!

      ఈ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు కూడ … ” సెటిలర్ల పాదాలకు ముల్లు గ్రుచ్చుకొంటే పంటితో తీస్తామన్న వారే .. చంద్రబాబు నాయుడిని – నీకిక్కడేం పని అని ప్రశ్నించడమేమిటి?” అని సందేహం వ్యక్తం చేసిన వారు కొందరు లేకపోలేదు. కాని వారికి తెలంగాణ ఉద్యమ లక్ష్యమే ఇంకా అర్థం కాలేదని అర్థమవుతున్నది. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలసి ఉందామని తెలంగాణ ఉద్యమకారులు మొదటి నుండి చెప్పుతూనే ఉన్నారు. కాని అన్య ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టే పాలకులుగా సీమాంధ్రులను నెత్తిన పెట్టుకోవడానికి ఇక్కడి ప్రజలు ఇంకా సిద్ధంగా లేరన్నది గ్రహించవలసిన విషయం.
అందుకే కదా తెలంగాణ ప్రజలు స్వయంపాలనను కోరుకొన్నది. అదే కదా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసింది.

      జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికలలో విజయం కేవలం టి.ఆర్.ఎస్. పార్టీదే కాదు. ఇక్కడి తెలంగాణ ఉద్యమ కారులదే కాదు. తెలంగాణలో .. ముఖ్యంగా హైదరాబాదులో నివసిస్తున్న సీమాంధ్ర మూలాలున్న హైదరాబాదీలది కూడా. ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్నాళ్ళుగా అహేతుకంగా అధర్మంగా సాగి వస్తున్న అక్కడి ప్రయోజనాలను పణంగా పెట్టి,  ఇక్కడి ప్రాంతానికి సహేతుకంగా ధర్మంగా రావలసిన ప్రయోజనాలను కాపాడుతారనుకోవడం భ్రమేనని వారూ గుర్తించడం ముదావహం.

అందుకే …
ఈ ఎన్నికల విజయం తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిందని చెప్పాలె. ఈ ఎన్నికల విజయంతో తెలంగాణ ఉద్యమ విజయం సమగ్రంగా సంపూర్ణమయిందని చెప్పాలె.

          — &&& —

4 వ్యాఖ్యలు (+add yours?)

  1. Zilebi
    ఫిబ్ర 07, 2016 @ 11:04:00

    మీ టపా మొత్తం లో ఆ చెప్పాలె బాగుందండీ !

    జై హైదరాబాదీ !

    జిలేబి

    స్పందించండి

  2. Dr.Acharya Phaneendra
    ఫిబ్ర 07, 2016 @ 12:54:16

    జిలేబీ గారు!

    వ్యవహార భాషలోని ఆధిపత్యం నుండి కొద్ది కొద్దిగా స్వాతంత్ర్య సాధనకై నేను చేస్తున్న ప్రయత్న ఫలం అది. ఇంకా కొన్ని సంస్కరించుకోవలసిన ఆవశ్యకత ఉంది.

    “చెప్పవలె” అన్న గ్రాంథిక క్రియారూపానికి తెలంగాణ ప్రాంతీయులు ప్రయోగించే “చెప్పాలె” అన్న వ్యవహార రూపం దగ్గరగా ఉంది. “చెప్పాలి” అన్న so called ప్రామాణిక వ్యవహార భాష క్రియారూపానికి ఏ ప్రమాణమూ కనిపించదు. ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె.

    ఇన్నాళ్ళు … తప్పుడు ప్రయోగాలు ఒప్పులుగా చలామణియై , ఒప్పులు అవహేళనలకు గురి కావడం నిజంగా తెలుగు భాషకు పట్టిన దౌర్భాగ్యం!

    మీ కామెంటుకు నా ధన్యవాదాలు!

    స్పందించండి

  3. Zilebi
    ఫిబ్ర 07, 2016 @ 18:07:03

    >>> ఆ ప్రయోగంలోని “లి” అన్న అక్షరంలో ఇకారం ఎక్కడ నుండి వచ్చిందో ఆ పరమాత్మునికే తెలియాలె.

    సూపర్ !

    ఈ so called కి ఈ మధ్య ఎక్కడో తెలుగొకటి చదివా కథాతధ నో లేకుంటే తదాకత అట్లాంటి దేదో మరి -> సరిగ్గా గుర్తుకు రావటం లేదు 😉

    చీర్స్
    జిలేబి

    స్పందించండి

  4. kiran
    జన 04, 2017 @ 16:55:31

    Jai telangana
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    స్పందించండి

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.