మృత్యువంటే భయం లేదు

మృత్యువంటే భయం లేదు

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

మృత్యువంటే భయం లేదు!

పుట్టిన ప్రతి పసికందుకు
పుర్రెలో బుద్ధి వికసించే వరకు
మృత్యువంటే భయం లేదు!!

బుద్ధి పుట్టి పెరిగే కొద్దీ –
భయం పుట్టి పెరుగుతూ ఉంటుంది.
జీవన యానంలో –
మనిషి తన పని తాను చేసుకొంటూ పోతూ …
మృత్యువును ఒక కంట కనిపెడుతూ ఉంటాడు.
మృత్యువు తన దారికి అడ్డు రాకుండా
జాగ్రత్త పడుతుంటాడు.
తన గమ్యం చేరేవరకు
దానితో నిరంతరం పోరాడుతూనే ఉంటాడు.
ఆశయం సిద్దించి,
అన్నీ సాధించి,
అంతా అయిపోయాక
అలసిపోయిన మనిషిని
కోరుకొన్న వేళ –
తెలియకుండా వచ్చి వరిస్తే …
మృత్యువు ఒక వరం!
మృత్యువును తప్పించుకోవడం ఎవరి తరం?
ప్రతి కథకు ఒక ముగింపు ఉండాలి కదా!

మనిషి జీవన కావ్యానికి
మృత్యువు భరత వాక్యం!

— *** —

ప్రకటనలు

మహాకవి డా.దాశరథి గారిని ఇలా స్మరించుకొని, నివాళులర్పిద్దాం.

ఈ రోజు (22 జూలై) నా అభిమాన మహాకవి డా.దాశరథి గారి జయంతి.

మిత్రులు శ్రీ కె. ప్రభాకర్ ఇటీవల దాశరథి గారు రచించిన చలనచిత్ర గీతాల సంకలనం ప్రచురించి, ఆ మహాకవికి తన వంతు నివాళులర్పించి, ధన్యులయ్యారు.

ఆ గ్రంథంలో మహా గాయని శ్రీమతి పి. సుశీల రచించిన పీఠిక పాఠకులకు అందిస్తున్నాను. ఆ మహాకవిని ఇలా స్మరించుకొని, నివాళులర్పిద్దాం.

– డా. ఆచార్య ఫణీంద్ర

“చిత్ర” సచిత్ర మాస పత్రికలో …

“చిత్ర” సచిత్ర మాస పత్రిక జూలై 2011 సంచికలో నా “వరాహ శతకము” కావ్యాన్ని “విహారి” గారు సమీక్షించారు.

అవలోకించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

నా జన్మ దినం…

ఈ రోజు వ్యాస పూర్ణిమ ( గురు పౌర్ణమి ).

తిథి ప్రకారం నా జన్మ దినం.

ఇన్నేళ్ళ నా జీవన ప్రస్థానంలో నా గురువులందరికీ వందనాలు!

శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు!

– డా. ఆచార్య ఫణీంద్ర

హరి నామ విశేష సుధా రసంబులో …

సీనియర్ పద్యకవి శ్రీ మెరుగు వేంకట దాసు గారి రచన – “యాదగిరి శ్రీ నృకేసరి శతకము” గ్రంథానికి నేనందించిన అభినందన పద్యాలను అవలోకించండి

– డా|| ఆచార్య ఫణీంద్ర


“పద్య కళా ప్రవీణ”
డా|| ఆచార్య ఫణీంద్ర
కవి, విమర్శకులు
102, శ్రీనివాస ఆర్కేడ్, ఈస్ట్ మారుతీనగర్,
మౌలాలి, హైదరాబాద్ -500040
ఫోన్ : 040-27133328, 9959882963                             తేది:  07-07-2011

                     
              హరి నామ విశేష సుధా రసంబులో …   

           చం||         పెరుగున శర్కరం గలిపి, వేసి యొకింత సుగంధ ద్రవ్యముల్,
                         గిరగిర ద్రిప్పి కవ్వమును కేళి, రుచుల్ పస మీరునట్లుగాన్
                         తరిచిన మాధురీ ద్రవము ద్రావిన గల్గు మహానుభూతి – ఈ
                         ’మెరుగు’ కులాబ్ధి సోముడగు మేటి కవీంద్రుని కబ్బమిచ్చురా!

           ఆ|| వె||     ’మెరుగు వేంకటార్యు’ మేని నరాలలో
                         నరమృగేంద్ర భక్తి నదులు పారి,
                         మారు పద్య పాద మధురిమలుగ – ఏడ
                         రక్తము? మధురాక్షరములె గాని!

           ఉ||           వేద నుతుండు శ్రీహరిని ప్రీతి నిరంతర భక్తి గొల్చు ప్ర
                          హ్లాదుడె పుట్టె నీ సుకవియై మగుడిన్ భువి పైన – లేనిచో
                          నాద మనోజ్ఞ దివ్య హరి నామ విశేష సుధా రసంబులో
                          పాదము, పాదమున్ తడిసి పావన మెట్లగు నిందు పద్యముల్?

            కం||          యాదగిరీశునికి కవి మ
                           హోదయు డందించె చంపకోత్పల మాలల్ –
                           మోదమున నల్లి కవితా
                           పాదములన్నింట భక్తి పరిమళ మెసగన్!

             తే|| గీ||      అంబుజోదర దివ్య పాదారవింద
                           చింతనామృత పాన విశేష మత్త
                           ధన్యుడు – ’మెరుగు వేంకట దాస’ సుకవి
                           హరి కృపా కటాక్ష విభవం బందు గాక!
                           
                                    — 888 —                                                                                                                   


	

అగ్ని సంస్కారం

ముప్పయ్ రెండేళ్ళ క్రితం నేను వ్రాసుకొన్న మినీ కవిత ఇది. అప్పడు నా వయసు పద్దెనిమిది ఏళ్ళు.

ఈ మధ్య ఎందుకో గుర్తుకు వచ్చింది. అప్పటికే నాలో ఉన్న భావ శబలతను ఇప్పుడు చూసుకొంటే నాకే ఆనందం కలుగుతుంది.

– డా. ఆచార్య ఫణీంద్ర

అగ్ని సంస్కారం

 

అల్లారుముద్దుగా పెంచుకొంటున్న ఆశ
అనుకోకుండా యాక్సిడెంట్లో చచ్చిపోతే …
గుండె వల్లకాట్లో కాల్చిపారేస్తున్నా!

పిచ్చి కళ్ళూ!

మీరెందుకే ఫయరింజిన్లను పిలిచారు?
జరుగుతున్నది –
అగ్ని ప్రమాదం కాదు …
అగ్ని సంస్కారం!

— * —