చరిత్ర

చరిత్ర

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

 కాల పురుషుని

రెప్ప వాల్చని కంట్లో

‘రెటీనా’ పై

నిరంతరం దృశ్యీకరింపబడే

పంచ రంగుల చలన చిత్రం –

చరిత్ర !

పాత్రధారులు

భావి రేవు చేరుకొని,

విస్మృతిని నటించినా –

పాత చిత్రాలు

గతానికి

సాక్ష్యంగా నిలిచే ఉంటాయి !

— $#$ —

ప్రకటనలు

మన్నించుడయ్య!

ధర్మ తత్త్వజ్ఞులు ధర్మ శాస్త్రంబను
      శ్రీ మహాభారత సిద్ధి నిడిన –
శ్రీ వేంకటేశ్వర శ్రీపాద సేవలో
      తరియింపజేయు కీర్తనల నిడిన –
దేశ భాషలయందు తెలుగు లెస్సయటంచు
      సత్ప్రబంధ కవి పోషణము నిడిన –
సంఘమందున దురాచారాల నణచ, జీ
      వితములనెల్ల అంకితము నిడిన –
ఈ ప్రపంచాగ్నికి సమిధలెన్నొ యిడిన –
విశ్వ నరులార! మహనీయ విబుధులార!
మీదు విగ్రహముల గూల్చు మాదు బుద్ధి
హీన చర్యల దయను మన్నించుడయ్య!

మౌన రోదనలో …
డా.ఆచార్య ఫణీంద్ర