తల్లీ! భారతీ!

కొంత కాలం క్రితం ’కమలాకర మెమోరియల్ ట్రస్ట్’ వారు ప్రచురించిన “భారత్ జయహో …!” (దేశభక్తి కవితా సంకలనం)లో ముద్రితమైన నా కవితను ఈ 65వ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందిస్తున్నాను.

విశ్వ వ్యాప్తంగా వెలుగులీనుతున్న భారతీయులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో …

– డా. ఆచార్య ఫణీంద్ర

bh1

bh2

bh3

bh4

bh5

ప్రకటనలు

‘దేవదాసు’ కెపుడు చావు లేదు!!!

చిలిపికనుల తోడ, తెలివితేటల తోడ
తెలుగుకవన గరిమ తేటపరచి
ప్రభువు మెప్పునొందు ‘రామకృష్ణ’ వికట
సత్కవీంద్ర పాత్ర చావబోదు!

చిత్తమందు గలుగు శ్రీరంగనాధుని
వేశ్యయందు గూడ వెదికి జూచు
విష్ణుభక్తుడైన ‘విప్రనారాయణ’
సత్త్వగుణుని పాత్ర చావబోదు!

“నా అనా, రహో అనా”రని జీవ స
మాధి చుట్టు తడిమి, మతిని దప్పి
ఆర్తితోడ తిరుగునట్టి ‘మొగల్ యువ
చక్రవర్తి’ పాత్ర చావబోదు!

గ్రుడ్లు తేలవేసి కొద్ది కొద్దిగ రక్త
మొలికి నోటి నుండి, ఊరి బయట
రచ్చబండ మీద ప్రాణమ్ముల వదలు
‘దేవదాసు’ కెపుడు చావు లేదు!!! 

చావు లేని ఇట్టి జీవభూమిక లెన్నొ
తెలుగు చిత్రసీమ తెరను నిలిపె
నవరసాల నటుడు నాగేశ్వరాఖ్యుడే!
చావు లే దతనికి! చావు లేదు!!!

– డా. ఆచార్య ఫణీంద్ర

దివంగత మహానటుడు
“నాగేశ్వరరావు” గారితో నాకు మిగిలిన స్మృతి చిహ్నాలు:

anr1

anr3

anr2

ఎగ్జిబిషన్లో సంక్రాంతి పూట …

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పర్వదినం నాడు సాయంత్రం ఎగ్జిబిషన్లో కవిసమ్మేళనంలో పాల్గొనవలసిందిగా కోరుతూ, నాకు అందిన ఆహ్వానం మేరకు వెళ్ళి నా కవితలను వినిపించి సత్కారం పొందాను. ప్రతిసారి కొత్త సంవత్సరంలో తొలి సన్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వ కార్మిక శాఖకు అనుబంధంగా ఉన్న ఎగ్జిబిషన్ సొసైటీ వారిచే పొందడం నాకు ఆనవాయితీగా , సెంటిమెంటుగా మారింది. ‘సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం వారి తొలి సన్మానం’అన్న ఆ సెంటిమెంట్ ఈ సారి కూడా కొనసాగడం ఆనందాన్ని కలిగించింది. కాని అంతలోనే … “బహుశా ఒక కవిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే పొందే చివరి సన్మానం ఇదేనేమో…!” అన్న భావన కలుగగానే ఎందుకో కాస్త బాధగా అనిపించింది. అయితే తెలంగాణ రాష్ట్రావిర్భావాన్ని బలంగా కోరుకొంటున్నవానిగా, “రాబోయే మార్పు సహజమే!” అని నాకు నేను సర్ది చెప్పుకొన్నాను.

IMAG0605

IMAG0606

ఆనాటి కవిసమ్మేళనం ప్రముఖ కవి డా.జె.బాపురెడ్డి గారి అధ్యక్షతన జరిగింది. ఆ కవిసమ్మేళనంలో నాతో బాటు, డా.ముదిగొండ శివప్రసాద్, శ్రీ ఓలేటి పార్వతీశం, డా.అక్కిరాజు సుందర రామకృష్ణ, డా.మసన చెన్నప్ప, డా.వడ్డేపల్లి కృష్ణ, డా.పత్తిపాక మోహన్, డా.సుమతీ నరేంద్ర, డా.శరత్జ్యోత్స్నా రాణి, డా.వై.రామకృష్ణారావు గార్ల వంటి ఎందరో లబ్ధ ప్రతిష్ఠ కవులు పాల్గొన్నారు. ఈ సారి తెలంగాణ ఉద్యమ కవులైన ‘అందెశ్రీ’, ‘జూలూరి గౌరీశంకర్ ‘గార్లను ప్రత్యేకంగా ఆహ్వానించడం – తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు సూచనగా తోచింది.

IMAG0612

IMAG0614

నేను సంక్రాంతి పండుగపై అంత్యప్రాసతో వినిపించిన పద్యం అందరినీ ఆకర్షించింది. ముఖ్యంగా చివరలో …  రానున్న తెలంగాణ రాష్ట్రంపై నేను వినిపించిన పద్యం అందరినీ బాగా ఆకట్టుకొంది. ఆ పద్యాలను పాఠకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

తెలవారు జామునే తెలుగు వాకిళ్ళలో
ముదితలు వెలయింప ముగ్గు బాట –
గగన వీధులయందు కదన రంగము బోలి
బాలల గాలిపటాల వేట –
ఘల్లు ఘల్లున కాళ్ళ గజ్జెలన్ కదిలించి
గంగిరె ద్దాడంగ గంతు లాట –
“హరిలొ రంగో హరి! హరి హరీ! హరి!” యంచు
హరిదాసు పాడంగ చిరత పాట –

గోద, రంగనాధుల భక్తి గుడులు చాట –
అరిసెలు, చకినాల్, పొంగళ్ళు కరుగ నోట –
పులకరించు మనసు, జిహ్వ  తెలుగు నాట –
కలుగు సంపూర్ణ తృప్తి సంక్రాంతి పూట!

— ***** —

శ్రీలం గూర్చగ ‘భద్రశైల’ శిఖపై సీతమ్మగా ‘లక్ష్మి’యున్ –
ఫాలంబందున జ్ఞానరేఖలు లిఖింపన్ ‘బాసర’న్ ‘వాణి’యున్ –
‘ఆలంపూరు’న జోగులాంబగ శుభాలందింపగా ‘గౌరి’యున్ –
మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలున్ బ్రోచున్ తెలంగాణమున్!

— ***** —

‘తెలంగాణ బిల్లు ‘ అగ్నిపునీత!

కాల్చుకొని దేహముల తెలంగాణ కొరకు
అమరవీరు లర్పించ ప్రాణముల నకట!
తేల్చి కేంద్రమ్ము, తుద కిప్డు తెచ్చె ‘బిల్లు ‘!
కాల్చి రది ‘భోగిమంటలన్ ‘ కఠిను లయ్యొ!

ఆధిపత్య ‘రావణు’ చెర యందు నుండి
విడుదలైన ‘తెలంగాణ బిల్లు’ నేడు
సీత మాదిరి ‘అగ్నిపునీత’ యయ్యె !
రాజిలు నది యింక ‘పవిత్ర రాష్ట్ర’ మగుచు!

sakshi14114

 

“శ్రీశ్రీ మహాప్రస్థానం”

snm22

మహాకవి శ్రీశ్రీ శతజయంతి సంవత్సర సందర్భంగా, 2010 సంవత్సరంలో నేను “శ్రీశ్రీ మహాప్రస్థానం” కావ్యాన్ని దాదాపుగా మొత్తాన్ని ఒక ప్రత్యేకమైన సభలో వ్యాఖ్యాన సహితంగా  గానం చేసి, ఆ మహాకవికి ఘనమైన నివాళిని సమర్పించుకోవడం జరిగింది.

హైదరాబాదులోని నారాయణగూడ వై.యం.సి.ఏ. హాల్లో జరిగిన ఈ కార్యక్రమానికి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డా. సి. నారాయణ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, నా కావ్య గానం తరువాత నన్ను సత్కరించారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డా. అబ్బూరి ఛాయాదేవి గారు, డా. ముక్తేవి భారతి గారు, డా. కె. బి. లక్ష్మి గారు, ఇంకా ఎంతో మంది ప్రముఖులు ఈ సభలో పాల్గొన్నారు.

ఈ కావ్యగానం ఇటీవలే యూ-ట్యూబ్ లోకి అప్ లోడ్  చేయబడింది.  ఈ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా దానిని చూడవచ్చు.      

“మహాప్రస్థానం”  గ్రంథాన్ని ఇంతవరకు చదువనివారు ఈ కావ్య గానాన్ని చూస్తే శ్రీశ్రీని, ఆయన కవిత్వాన్ని అర్థం చేసుకొనే అవకాశం ఉంటుంది.  “మహాప్రస్థానం” గ్రంథాన్ని ఇప్పటికే చదివినవారయితే … భావయుక్తంగా కవితావేశాన్ని, లయను ప్రతిఫలింపజేస్తూ సాగిన ఈ కావ్యగానాన్ని విని ఆనందించగలరని ఆశిస్తున్నాను. 

– డా. ఆచార్య ఫణీంద్ర  

http://www.youtube.com/watch?v=BZ6PSo2ltGM