అమవస నిసి

అమవస నిసి

– ’పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

kb

’ఆకలి రాజ్యమ్ము’ నందు నిరుద్యోగ
యువత కందించె దివ్యోపదేశ –
మభిమానవతులైన అతివల బ్రతుకుల
’అంతు లేని కథ’ల నరయ జెప్పె –
మానవ సంబంధ మాలిన్యముల నల్గు
’గుప్పెడు మనసు’ల గుట్టు విప్పె –
అభ్యుదయ సమాజ మందు మార్గాలకై
’రుద్ర వీణ’ల నెన్నొ మ్రోగ జేసె –

ఒకొక ’టిది కథ కాదు’ – ’మరో చరిత్ర’! –
యన్న స్థాయిలో ’చిత్రాల’ నతడు తీర్చె –
’దాద ఫాల్కే పురస్కృతి’ దక్కి, తనకు –
ఆ పురస్కృతియే గర్వ మందె నాడు!

’బాల చంద్రు’డా? కాదయ! భారతీయ
చలన చిత్ర నభో పూర్ణ చంద్రు డతడు!
అతని మృతి చిత్రరంగాన కమవస నిసి!
అతని స్మృతికి నివాళి, బాష్పాంజలిదియె!

ప్రకటనలు