చంద్ర శేఖర్ ’ఆజాద్’

చంద్ర శేఖర్ ’ఆజాద్’

రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర


“ఎప్పటి కాంగ్ల జవానుల

గుప్పిట చిక్కుటకు నొప్పకుం ’దాజాదున్’ !

తప్పి ఒకవేళ, చిక్కక

తప్పనియెడ ఆత్మహత్య తలదాల్తు” నటన్ –


’ఓవరు కోటు’ జేబునెపు డొక్క బులెట్టును దాచియుంచుచున్,

చావుకు సిద్ధమై – భరత జాతి విముక్తికి పోరు సల్పుచున్,

చేవను జూపినా డతి విశేష మహోన్నత దేశ భక్తితో –

పావన ’చంద్ర శేఖరుడు’ – భారత మాతకు ముద్దు బిడ్డడై !


’భగతు సింగు’ వంటి భారత స్వాతంత్ర్య

వీర వరుల కతడు దారి చూపె –

పోరు బాటలోన ముందుండి నడిపింప –

బ్రిటిషు గుండె లదరి బెదరి పోయె !


తులసి వనమందు గంజాయి మొలచినట్లు

అతని అనుచరులందొక్క డయిన వాడె

బ్రిటిషు వారు రాల్చిన ’కుక్క బిస్కటు’ తిని

అతని ఆచూకి వారికి నందజేసె !


ఒంటరిగా నొక తోటను

కంటబడగ, బ్రిటిషు గార్డ్లు కాల్పులు జరుపన్ –

మింటికి, నేలకు నాతడు

వెంటనె తప్పించుకొనుచు వేసెను గంతుల్ !


పిదప నొక పెద్ద వృక్షమ్ము వెనుక జేరి,

జేబులో ’గన్ను’నే తీసి, చేవ మీర

పెక్కు బ్రిటిషు జవానులన్ ప్రేల్చి, చంపి,

’ఉక్కు మనిషి’గా వెలిగె వీరోచితముగ !


గడగడ వణ్కెడున్ బ్రిటిషు గార్డుల రక్తము కాల్వ గట్టగా –

కడపటి బుల్లెటౌ వరకు కాల్చియు చంపెను పెక్కు మందినిన్ !

కడతెగె నింక బుల్లెటులు కావున, యుద్ధమునందు వారిచే

మడియక తప్పదేమొ యను మాట తలంపుకు వచ్చినంతటన్ –


’ఆజాద’ను తన పేరును

బాజాపుత రుజువు చేయ, పైగల ’కోట్’లో

ఓ జేబున దాచియు ప్రతి

రోజుంచెడి బుల్లెటు గొని, త్రోసెను ’గన్’లో !


ఎడమ చేతిలో ’గన్’ పూని ఎక్కుపెట్టు

కొనిన వాడయ్యు, తన శిరస్సునకు తానె;

దక్షిణ కరమ్ముతో నేల తల్లి తడిమి,

కనుల మమకార బాష్పాలు కాల్వ గట్ట –


” ఇంతియ మాత్ర సేవనొనరింపగ నోచితి భారతాంబ ! నా

కంతిమ కాల మింక ఇటు లబ్బిన దంచును, నేల మట్టినిన్

కొంతయు చేతిలోన గొని, కొండను మించిన ఎత్తు భక్తితో

నంతట కళ్ళ కద్దుకొని, ఆ పయి దాని శిరంబు నిల్పియున్ –


వచ్చెడి జన్మలో స్వపరిపాలిత భారత దేశమందునన్

స్వచ్ఛపు భారతీయునిగ జన్మమునొంది, స్వతంత్ర వాయువుల్

స్వేచ్ఛగ వీయుచుండ నవి పీల్చెడి భాగ్యమొసంగ గోరుచున్

తచ్ఛరణారవిందముల దాల్చి స్మృతిన్, మరణించె వీరుడై !


జీవనమును, మరణమ్మును

పావన భారత ధరిత్రి పాదాంకితముం

గావించిన నిరుపమ ఘన

సేవా నిరతుండు – చంద్ర శేఖర ’ఆజాద్’ !


( 64వ భారత స్వాతంత్ర్య దినోత్సవ శుభ సందర్భంగా …

విశ్వవ్యాప్త భారతీయులకందరికీ శుభాభినందనలతో – )


” శ్రీకృష్ణరాయ నృపా ! “

శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ద్యుత్సవ సమాప్తి సందర్భంగా రాయల వారి ప్రశస్తి కవిత :

” శ్రీకృష్ణరాయ నృపా ! “

రచన : ’పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

వీర, సార భూమి విజయ నగరమందు

తెలుగు ధీర యుక్తి, ధిషణ శక్తి

ఒక్క రూపమందె ఉద్దీపనము చెంద

’కృష్ణ రాయ’డగుచు కీర్తి నొందె !


కత్తి కలమ్ముగా సమర కావ్యమునన్ రుధిరాక్షరంబులన్

విత్తగ ’కృష్ణ రాణృపుడు’, విక్రమ గీతులు పొంగు ! ఆతడే

మెత్తని పాళి గల్గు కలమే ఝళిపింపగ కత్తిగాన్, సిరా

హత్తుకొనంగ, కావ్యమె మహాద్భుతమౌ రస యుద్ధమయ్యెడిన్ !


రాజ సూర్యుడు, కవిరాజునున్ రెండయి –

తెలుగు రాజ్య రమకు దీప్తి గలుగ –

దిద్దె వీర రక్త తిలక మామె నుదుట !

అద్దె కవన మధువు నామె నోట !


అష్ట దిగ్గజాల్ మోయగా, ఆంధ్ర సాహి

తీ ప్రబంధ మండిత మహా దివ్య ’భువన

విజయ’ విస్తృత విఖ్యాత విశ్వ మకుట

ధారి – సర్వజ్ఞ శేషాహి తానె యయ్యె !


పలుకది యున్నంత వరకు –

తెలుగది యున్నంత వరకు – దేదీప్యముగాన్

వెలుగది యున్నంత వరకు –

నిలుచును శ్రీకృష్ణరాయ నృప ! నీ యశమున్ !

— *** —

( ఈ కవితా రచనకు నన్ను పురికొల్పిన బ్లాగు మిత్రులు

శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ గారికి కృతజ్ఞతలతో – )

దీపమారిన చీకటి తీరమందు …

దీపమారిన చీకటి తీరమందు …

రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

కోవెల వంటి ఇంట, ఘన ‘కోవెల’ నామ కులీన దీపమై,
‘కోవెల సోదర ద్వయము’ కుందులలో కుడి ప్రక్క దానిలో
నీవు ప్రకాశమొందితి, వినిర్మితి జేయుచు కావ్య కాంతులన్ –
కోవెల సంపతార్య ! మది కోవెల జేసియు వాణి గొల్వగన్ !

‘కాలస్పృహ’, ‘అంతర్మథ
నా’లను కూర్చితివొ – ‘చేతనావర్తము’లై
ఆలాపించగ ‘హృద్గీ
తా’లయె, ‘ఆనంద లహరి’ తాండవమాడన్ !

విశ్వవిద్యాలయాచార్య ! విబుధ వర్య !
తీర్చి విద్యార్థి గణములన్ దిద్దినావు !
లక్ష్య శుద్ధి నల్లితి పల్ విలక్షణమగు
కవన లక్షణ సువిమర్శ గ్రంథములను !

ఇంపారగ వెలయించుచు
సొంపగు వ్యాఖ్యానములను స్ఫూర్తి, కృతులకున్ –
సంపత్కుమార వర ! ఘన
సంపత్తిని కూర్చి తాంధ్ర సాహిత్యమునన్ !

ఖ్యాతి నొందితి పరిశోధకాగ్ర మణిగ !
సాటి లేని విమర్శక ! సంపతాఖ్య !
నీ మృతి వలన – సాహితి నిలుచు నింక
దీపమారిన చీకటి తీరమందు !

( సుప్రసిద్ధ విమర్శకులు, కవి ‘ఆచార్య కోవెల సంపత్కుమార’ మృతికి సంతాపంగా … )