ఆధిపత్యంపై తిరుగుబాటు

INDIA 1953

ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని విభజించి, ఆంధ్ర రాష్ట్రం ( అప్పటికి తెలంగాణను అందులో కలపాలన్న ప్రసక్తి రాలేదు. ) ఏర్పాటును ఆకాంక్షిస్తూ, 1952 లో ” శ్రీనివాస సోదర ” కవులు వ్రాసిన పద్య కవిత – ” రాష్ట్ర సాధన “

రాష్ట్ర సాధన

ఉన్నతోద్యోగమ్ము లున్నంతవరకును

కేరళుల్, తమిళులు దూరుచుండ,

ప్రాజెక్టులాది యావశ్యకమ్ముల కెల్ల

అరవ దేశంబె ముందడుగు వేయ,

పండించి తిండికై పరులకు చేజాచి

ఎండుచు తెలుగులు మండుచుండ,

తమ పట్టణమునందె తాము పరాయిలై

దెస తోప కాంధ్రులు దేవురింప,


ఆంధ్ర రాష్ట్రము కావలె ననుట తప్పె?

తెలుగు పంట, తెలుగు సొమ్ము, తెలుగు కండ

తెలుగు వారికి గాని ఈ దీన దశను

ఎంత కాలము నలిగి పోయెదము మేము?


మన యింట పరుల పెత్తన మేమియని కాదె

సత్యాగ్రహంబులు సల్పినాము?

మన సొమ్ము నితరులు తినిపోయిరని కాదె

ఉపవాస దీక్షల నూనినాము?

మన కధికారముల్ పొనరలేదని కాదె

సహకార నిరసన సలిపినాము?

మన క్షేమ లాభముల్ మసియయ్యెనని కాదె

కారాగృహమ్ముల జేరినాము?


తలలు కలుపక రండని పలికినపుడు

బ్రిటిషువారిని తెగ విమర్శించినట్టి

పెద్ద లా పాటనే వెళ్ళబెట్టి రిపుడు!

మాట నిలుకడ తప్పి రీ మాత్రమునకె!


మన ప్రధాని మాటె మనకు సిద్ధాంతంబు!

ఆంధ్ర రాష్ట్ర మొకరి నడుగ నేల?

దానమా? ఇదేమి తద్దినమా? మూల్గి,

చీది, ఒక్కడేదొ చేయి విదుప!


ఢంకాపై గొట్టి నిరా

తంకంబుగ హక్కు చూపి, దర్పము మీరన్

అంకించుకొందు మంతే!

ఇంకన్ పెద్దరికములకు నిట తావున్నే?

—***—

ఈ పద్యాలలో ” అరవ ” లేక ” తమిళ ” అని ఉన్నచోట – ” ఆంధ్రా ” అని,

” ఆంధ్ర ” లేక ” తెలుగు ” అని ఉన్నచోట – ” తెలంగాణ ” అని మారిస్తే …

ఇవి తెలంగాణోద్యమ పద్యాలయిపోతాయి. అప్పటి ఆంధ్రా వాళ్ళ మనోభావాలు, ఇప్పటి తెలంగాణా వాళ్ళ మనోభావాలు అచ్చంగా ఒకేలా ఉండడం ఆశ్చర్యకరమే అయినా, కాకతాళీయం మాత్రం కాదు.

ఆనాడు విడిపోదామన్నవారు ” భాషాభేదా ” న్ని ప్రధానాంశం చేస్తే, కలిసుందామన్న వారు ” దక్షిణ భారతీయుల సమైక్యత ” అంటూ ఆదర్శాన్ని వల్లించారు.

ఈనాడు విడిపోదామన్నవారు ” ప్రాంతీయ సంస్కృతి ” ని ప్రధానాంశం చేస్తే, కలిసుందామంటున్న వారు ” భాషా సమైక్యత ” అంటూ ఆదర్శాన్ని వల్లిస్తున్నారు.

నిజానికి ఇవేవీ అంశాలే కావు!

ఆనాడైనా, ఈనాడైనా జరుగుతున్నది ఆధిపత్యంపై తిరుగుబాటు!!

– డా|| ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు