నా కొత్త పుస్తకం…

నా కొత్త పుస్తకం – ” వరాహ శతకము “ ముద్రణ పూర్తయింది.

గ్రంథం అందంగానే వచ్చిందని భావిస్తున్నాను.

ముఖ చిత్రాన్ని చూడండి.


అట్ట నాలుగవ పేజీని చూడండి.


బహుశః వచ్చే నెల 25 వ తేది ( గురు పూర్ణిమ – నా పుట్టిన రోజు ) నాడు గ్రంథావిష్కరణ జరుగవచ్చు.

బ్లాగు మిత్రుల ఆశీస్సులను కోరుతూ …

భవదీయుడు

ఆచార్య ఫణీంద్ర

ఒక మేధావి ఆవేదన – A must watch video

నీటికి కష్టమై …

నీటికి కష్టమై …

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా|| ఆచార్య ఫణీంద్ర

” నీటికి కష్టమై కనుల నీరిడు కాలము దాపురించె – ఏ

నాటికి తీరునో వెతలు నా ” కని ఏడ్చెడు నా లతాంగి క

న్నీటిని మాపు వేళ ఇదె నేటికి వచ్చెను; నాదు భాగ్యమై

మూటెడు డబ్బు చేతికిని ముట్టెను ’ జీతపు పాత బాకి ’ గాన్ !


గొట్టపు బావి యొకటి నే

కొట్టించెదనంచు పలుక, కోమలి హృదిలో

పుట్టెడు సంతోషముతో

పెట్టెను బుగ్గలను ముద్దు, ప్రేమ కురియుచున్ !


మంచి దినము జూచి, మాటాడి యంత్రమున్,

పొలతి తోడ గూడి పూజ చేసి

ఇంటి కొక్క ప్రక్క ఈశాన్యమున, ఊట

కూప మపుడు త్రవ్వ గోరినాను.


మట్టి గంగగా మార్చెడు మంత్రగాడు –

దాహమును తీర్ప వచ్చిన తంత్రగాడు –

అభినవ భగీరథుండగు యంత్రగాడు –

మహిని దింపగా మొదలిడె మరను ద్రిప్పి –


’ గిర గిర ’ తిరుగుచు చొరబడె

త్వరితంబుగ తొలచుచు మర ధరణీ తలమున్;

హరి కరము వీడి ’ సుర సుర ’

అరి భంజన కొరకు చక్రమరిగెడు కరణిన్ !


తడి తడి మట్టి ముద్దలను తన్నుచు గ్రక్కుచునుండ యంత్రమున్,

పొడి పొడి నాదు మోవి తడి పుట్టుచునుండెను, కోర్కి మీరుచున్ !

పడి పడి చూచుచుంటినట – ప్రాప్త మదెప్పుడటంచు నార్తియై !

” పడునది ! ఏల తొందర ” ని ప్రక్కకు త్రోసెను కార్య దీక్షుడే !


తడి మట్టి వచ్చి, వచ్చియు

కడకది మా కర్మమేమొ ! కను మరుగగుచున్

పొడి మట్టి బయల్వెడలెను –

దడ పుట్టెను నాకు హృదిని, దరిశింపంగన్ !


” ఏమండీ ! ఇదియేమి శాపమని నా ఇల్లాలు బెంబేలుగా

భూమాతన్ మనసార మ్రొక్కె దయకై, భోరంచు రోదించుచున్ –

” ఏమీ బేల తనం ” బటంచు సతితో నేనెంత ఓదార్చినన్,

” ఏమో ! ఏమగునో ! ” యటంచు మదిలో నెంతైన సందేహమే !


సంశయించినటులె సగములో మర నాపి,

జలము లేదటంచు తెలిపె నతడు –

” ఇంత ఖర్చు చేసి, ఇదియేమి నాయనా !

ముందు కేగు ” మంచు మొరను బెట్ట –


” పడినదొక పెద్ద బండయె !

పడలేమిక ముందుకేగి బాధలయందున్ –

పడదిట జలమిక ! తెలియుడు !

పడదొకచో ! పోదుమిడిన పైకం ” బనియెన్ !


బండ పడెను త్రవ్వు బావిలోనే కాదు;

బండ పడెను నాదు గుండెలోన –

దాహమారుట పోయి, దాహ మధికమయ్యె

కుల పత్ని కక్కటా ! గొంతులోన –

దక్కక, దక్కక, దక్కిన దనుకొన్న

ధనమెల్ల కరిగెను ధరణిలోన –

గొంతును తడుపుటే గొంతెమ కోర్కియై

చతికిల బడితిని బ్రతుకులోన –


బిక్క మొగము వేసి, బేలగా నా వైపు

భార్య చూడ – నాకు బాధ కలిగి,

ఆమె దప్పి తీర్ప నసమర్థుడనటంచు

తలచి, దించుకొంటి తలను నేను !


నీటికి కష్టమై, కనుల నీరిడు కర్మము వీడదాయె – క

న్నీటికి మాత్రమే కొరత నిత్యము, సత్యము ! లేకపోయె – మా

బోటుల మధ్య వర్గముల పూడిన గొంతులు పూడు నూతులే !

ఏటికి ఈ ప్రభుత్వములు ? ఎప్పుడు కన్నులు విప్ప నేర్చునో ?


— ***** —చలన చిత్ర కవన ఛత్రపతి

చలన చిత్ర కవన ఛత్రపతి

రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా|| ఆచార్య ఫణీంద్ర

విద్వదుత్తమ కవి – ’ వేటూరి సుందర

రామమూర్తి ’ ఘనుడు వ్రాయగలడు

వడిగ, సుడిగ, తడిగ – పామర, పండిత

రంజకముగ గీత రత్నములను !


” జగము లేలిన వాని సగము నివ్వెరబోయె “

నని కావ్య పరిమళా లద్దగలడు –

” రాలిపోయే పువ్వ! రాగాలు నెందుకే ? “

యంచు విషాదాబ్ధి ముంచగలడు –

” ఆకు చాటున పిందె – కోక మాటున పిల్ల “

యంచు శృంగారాగ్ని పెంచగలడు –

” ఆరేసుకోబోయి పారేసుకొన్నాన “

టంచు ’ మసాల ’ దట్టించగలడు –


’ సీత కోక చిలుక ’, ’ సిరిసిరిమువ్వ ’ లున్

కేళి యాడు నతని గీతులందు !

’ శంకరాభరణము ’, ’ సాగర సంగమ ’

ధ్వనులు మ్రోగు నతని పాటలందు !


వాలి పోయె పొద్దు – వర్ణాలు దు:ఖించె

తోడు నీడ లేని మోడులగుచు –

వీడ, వేల గీత వితతు లల్లినయట్టి

చలన చిత్ర కవన ఛత్రపతియె !


( సినీ గీత రచయిత కీ.శే. వేటూరి సుందర రామమూర్తి దివ్య స్మృతికి నివాళిగా …)

— *** —