“సహస్ర దర్శనోత్సవం”

సహస్ర దర్శనోత్సవం
———————-

నవంబర్ 2008 లో ప్రారంభింపబడిన నా ఈ బ్లాగును ఇప్పటి వరకు(మూడు నెలలలోపే)- వేయి మందికి పైగా సాహిత్య ప్రియులు దర్శించారు. కొంత మంది స్పందిస్తూ, మంచి మంచి వ్యాఖ్యలను వ్రాసారు.
namaskar
గణాంకాలు :
—————–
అత్యధికంగా వీక్షకులు దర్శించిన రోజులు:
dt. 9-11-2008 :65
dt. 5-1-2009 :59

అత్యధికంగా వీక్షకులు దర్శించిన వారం:
3rd week of january 2009 : 197

అత్యధికంగా వీక్షకులు దర్శించిన నెల:
December 2008 :560

ఉత్తమ టపాలుగా గుర్తింప బడినవి:
ఒబామ(శ్వేత సౌధంలో కృష్ణ వజ్రం):94
About(నా పరిచయం):69
పానీ పూరీ:56

ఉత్తమ వ్యాఖ్యలు:

“వీధి దీపం” కవితపై పద్మార్పిత గారు:
“ఫణీంద్ర గారు…మీ కవిత చదివి మా ఇంటి ముందున్న వీధి దీపాన్ని చూస్తే నాతో మాట్లాడినట్లుందండి. చాలా బాగుందండి మీ కవిత.”

“పానీ పూరీ” కవితపై సుభద్ర గారు:
“ఫణి గారు…నాకు ఇష్టం అయిన చాట్! ఇలా నోరూరిస్తే ఎలాగండి? అబ్బా.. నోరూరుతుంది.”

వీరికి నా ప్రత్యేక ధన్యవాదాలు.

నా ఈ బ్లాగు “సహస్ర దర్శనోత్సవం” జరుపుకొంటున్న శుభ వేళ…..అనేకమార్లు నా టపాలను “వేడి టపాల”లో, నా బ్లాగును “వేడి బ్లాగుల”లో ఉంచిన “వర్డ్ ప్రెస్” వారికి,”కూడలి” వారికి,”జల్లెడ” వారికి, “జాలము” వారికి, సాహితీ ప్రియులందరికి కూడ నా అనేకానేక ధన్యవాదాలు.
– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

“Happy Republic Day”

“జయ కేతనం”
—————-
రచన:’పద్య కళా ప్రవీణ’
డా.ఆచార్య ఫణీంద్ర
—————————–
flag
మన “పింగళి వెంకయ” తన
మనస్సులో గీచినట్టి మంజు, మనోరం
జన యుక్త భావ చిత్రము –
మన దేశ పతాక యయ్యె మన భాగ్యమునన్!

అగ్ర భాగమ్ములో అమరి కాషాయంబు,
హరిత వర్ణ మమరి అడుగునందు,
చేరి రెంటి నడుమ శ్వేత వర్ణ, ’మశోక
చక్ర’ మమరి మధ్య చక్కగాను –
పాతాళమందుండి పైపైకి ఎగబ్రాకి
ఆకాశ హర్మ్యాల తాకునట్లు
నిలువెత్తు ధ్వజముపై నిలుచుండి నింగిలో
మన్ననల్ పొందెరా మన పతాక!

పూర్ణ విశ్వమందు పుడమి భారతి మిన్న –
దీటు లేదు భువిని దీని కేది! –
అన్న రీతి నెగిరె ఆకాశమందునన్
మూడు వన్నె లొలుకు ముద్దు జెండ!

ఇంతై, మరి అంతై, మరి
ఇంతింతై ఎదిగి, నింగినెంతో ఎత్తై,
అంతకు నంతై, నేడది
సంతసమున నెగురుచుండె ’జయ కేతన’మై!

***విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి
వెలుగులీనుతున్న భారతీయులందరికీ
గణతంత్ర దినోత్సవ శుభాభినందనలు!

“శ్వేత సౌధంలో కృష్ణ వజ్రం”

అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన
“బారక్ హుస్సేన్ ఒబామ” కు
శుభాభినందనలు!
obama-21
“శ్వేత సౌధంలో కృష్ణ వజ్రం”
———————————-
రచన: డా.ఆచార్య ఫణీంద్ర

నల్లని వాడు- లోతు నయనంబుల వాడు- మనుష్యులం దిలన్
తెల్లగ, నల్లగా యనుచు దేహపు వన్నెల భేద ముల్లమం
దొల్లని వాడు- నిమ్న జను లుల్లసిలంగ ’ఒబామ’ శ్రేష్ఠుడై
’తెల్లని ఇల్లు’* సాక్షిగ అధీశ్వరుడయ్యె ’అమేరికన్ల’కున్!
(పోతన పద్యానికి పేరడీ)
* తెల్లని ఇల్లు = White House

Taj mahal

“తాజ్ మహల్” (లలిత గీతం)
——————————–
రచన: డా. ఆచార్య ఫణీంద్ర

taj-mahai

నీలాకాశంలో
నిండు పున్నమి వెన్నెల
నేలపై జారి
అయ్యింది “తాజ్ మహల్”
పాల సంద్రంలో
జున్ను పాలు, మీగడ
నేలపై పొంగి
అయ్యింది “తాజ్ మహల్”

ఇది ప్రేమకు సంకేతం –
ఒక ప్రేమికుని హృదయం –
అనురాగ దేవాలయం –
ఒక అద్భుత సౌందర్యం –
||నీలాకాశంలో||

పాల రాయిలో పాల మనసును
పొదుగుకొన్న అందం –
కాల వాహిని కదలి పోయినా
చెదరిపోని బంధం –
కనుమరుగైన ప్రేయసి కోసం
కాగిన విరహపు సింధువు –
కన్నుల పొంగి, కరుడు గట్టిన
కరుగని కన్నీటి బిందువు –
||నీలాకాశంలో||

ప్రేమ పక్షులు ఎగిరెగిరొచ్చి
వాలే పాలవెల్లి –
ప్రేమ పరిమళం నాల్గు దిక్కులా
పంచే సిరిమల్లి –
ప్రేమ ప్రేమను ప్రేమించేలా
ప్రేరేపించే జాబిలి –
ప్రేమను పంచి, ప్రేమను పెంచి
పోషించే లోగిలి –
||నీలాకాశంలో||

“Paani Poori”

pani-poori4
“పానీ పూరీ”
—————-
– డా. ఆచార్య ఫణీంద్ర

చెండంటి చిన్న “పూరి”కి
కుండ వలెన్ బొక్క పెట్టి, కూర్చి “మసాలా”,
నిండార నీరు నింపగ –
పండుగరా మ్రింగినంత “పానీ పూరీ”!

“వీధి దీపం”

stlight
“వీధి దీపం”
—————–
రచన: డా. ఆచార్య ఫణీంద్ర

పట్టణ వాసులెల్లరు నివాస గృహాలకు మళ్ళునట్టి య
ప్పట్టున నిద్ర మేల్కొని, పట్టెద జ్యోతిని దారి చూపగాన్ –
చెట్టును బోలి బాటకొక చెంత నిశీథిని కాలమంతయున్
నిట్టనిటారుగా నిలిచి, నేవెలిగించుచు నా ముఖంబునే!

పరమ శివుడు తొల్లి గరళమ్మునే త్రావి,
అమృత లబ్ధి హేతువైన రీతి –
వీధి దీప మేను విద్యుత్తునే త్రావి,
వీధి జనుల కొరకు వెలుగు లిడుదు!

అంధకారమ్ము నిండగా అవని పైన
దినకరుని లేమి లోటునే తీర్చు కొరకు
రాత్రి మొత్తమ్ము నే జాగరణము చేసి,
వెలుగు ప్రసరింతు త్యాగినై వీధి పైన!

పడిగాపులు పడుచున్ నిల
బడియుందును పగలు నొంటి పాదము పైనన్ –
బడి పంతులు శిక్షింపగ
బడిలో నిలబెట్టబడిన బాలుని భంగిన్!

మంచికి బోవు వారి యెడ మానవ లోక మదేమి చిత్రమో?
కొంచము జాలియన్న దొక కోశమునందున కల్గియుండదే!
ఎంచక నాదు త్యాగము నదేలనొ సంఘ విరోధ శక్తులే
త్రుంచుచునుంద్రు నన్ను, ముఖ తోయజ కాంతియె ఆరిపోవగాన్!

లోకువగా నేనైనను
పోకిరి పిల్లలును, సమ్మె పూనిన వారల్
చేకొని రువ్వెడి రాళ్ళకు –
నా కాంతుల పంచెద మరణంబగు వరకున్!

డా.ఆచార్య ఫణీంద్ర విరచిత వచన కవితలు – 2

మనసు
——-
బొమ్మలను చూస్తే మనకు
మనను చూస్తే దేవునికి
ఆడుకోవాలనిపిస్తుంది

బొమ్మల గుండెల్లోని ఆవేదనను
మనం గ్రహించలేం – కానీ,
మనకు మనసుంది

మన గుండెల్లోని ఆవేదనను
దేవుడు గ్రహించగలడు – కాని
వాడికి మనసు లేదు
–***–

నీ సన్నిధిలో…
——————-
నీ సన్నిధిలో
మాటాడే పెదవులు
మౌనం వహిస్తున్నాయి

మాటలెరుగని కళ్ళు
మాటాడుకొంటున్నాయి

చెప్పితే విందామనుకొనే చెవులు
చెప్పలేని ఆవేదనను
అనుభవిస్తున్నాయి
–***–

నన్ను నీలో…
—————-
బండబారిన నీ గుండెను
అద్దంలా తీర్చి దిద్దుకొమ్మన్నది
నా వలపు కిరణాలను
త్రిప్పి కొట్టడానికి కాదు ప్రియా!
నా రూపాన్ని నీలో
ప్రతిబింబించడానికి
–***–mirror