18/10/2014 నాడు హైదరాబాద్ – త్యాగరాయ గానసభలో “సాధన సాహితీ స్రవంతి” ఆధ్వర్యవంలో శ్రీ ‘సుధామ’ గారి ఆధ్యక్ష్యంలో జరిగిన దీపావళి కవి సమ్మేళనంలో నేను ఆలపించిన పద్య కవిత :
“చిచ్చుబుడ్డి సందేశం”
——————————–
రచన: డా. ఆచార్య ఫణీంద్ర
——————————————–
వచ్చెను దీపావళి యని
హెచ్చిన యుత్సాహ మతిని ఏగితి కొనగా
నచ్చిన బాణా సంచా –
మెచ్చితి గని పలు రకముల మేలి పటాకుల్!
కనుల వెలుగు జిమ్ము ‘కాకర వత్తులు’,
చిచ్చర పిడుగులగు ‘చిచ్చు బుడ్లు’,
భయము గొలుపునట్టి ‘బాంబులు’, ‘రాకెట్లు’ –
వింత వింత సరుకు వెలసె నచట!
కొనుటకు చేయి బూను నను కొండొక చిన్నని చిచ్చుబుడ్డియే –
“వినుడయ! ఆంధ్ర రాష్ట్రమున వేదన నొందిరి నీదు సోదరుల్ !
మునిగి ‘తుఫాను’ బాధలను మూల్గుచు నుండిరి వార, లిత్తరిన్
కొని మము కాల్చి , వేడుకల కోరెదవా?” యని ప్రశ్న గ్రుచ్చెడిన్!
బంగాళాఖాతంబున
పొంగుచు నొక పాము వోలె బుసకొట్టుచు, తా
మ్రింగెను ‘హుదుద్ తుఫా’ నయొ!
భంగపడినదోయ్ ‘విశాఖ పట్టణ’ మకటా!
సుందరమైన సాగరము, చూడ్కుల విందగు తీర ప్రాంతమున్,
అందము లొల్కెడిన్ తరగ, లంతట నిండిన వృక్ష జాలముల్ –
గందరగోళమయ్యె పెను గాలులు, వర్షము దాడి సేయగాన్ –
చిందర వందరై ప్రకృతి చిత్రము నందున ఛిద్రమయ్యెరా!
ఎంతటి ఘోరమైన కలి! ఎచ్చట జూచిన నచ్చటచ్చటన్ –
జంతు కళేబరాలు, మనుజాళి శవాలు, ననేక వృక్షముల్,
వింతగ నేల గూలి పలు వేనకు వేలు కరెంటు స్తంభముల్!
సంతక మద్దెనే ప్రళయ శాసనమందు ‘తుఫాను’ రక్కసై!
అకట! ‘అనకొండ’ నే మించినట్టి అలలు
నోళ్ళు తెరచి వేగంబుగ నూళ్ళు మ్రింగ –
దిక్కు తోచక పరిగెత్తు దీన జనుల
బాధ వర్ణింతు నే యశ్రు భాషలోన?
కడలి పాడుగాను! కన్నీరు ధారలై
కాల్వ గట్టి , పెద్ద కడలి యయ్యె!
ఘోరమయ్యె – కుప్ప కూలు కుటుంబాల
నాదుకొనగ పూనుడయ్య!” యనియె!
‘చిచ్చుబుడ్డి’ పల్కులు విని చింత నొంది,
శాస్త్రమునకు గొంటిని విష్ణు చక్ర మొకటి –
మిగులు డబ్బుల కొక కొంత మీద గలిపి,
అంపితిని ‘ఆంధ్ర సర్కార్ సహాయ నిధి’ కి!
— *** —
ప్రకటనలు