ఆయుధం

evm
ఆయుధమున్నది – ఒక
ఆయుధమున్నది

పడతుల కడ, పురుషుల కడ,
యువకుల కడ, ముసలుల కడ,
ధనికుల కడ, పేదల కడ,
నీ కడ, మరి నా కడ,
మన అందరి కడ
ఆయుధమున్నది – ఒక
ఆయుధమున్నది

సుత్తి కన్న, చురకత్తి కన్న,
గొడ్డలి కన్న, గునపం కన్న,
పిస్తోలు కన్న, మర ఫిరంగి కన్న,
అణ్వస్త్రం కన్న, మరే మారణాయుధం కన్న,
ఆ ఆయుధం మిన్న –
కాదన్న వాడి తెలివి సున్న –

అహంకారులను అణచి వేయునది
నిరంకుశులను నీరు గార్చునది
చీకట్లను పారద్రోలునది
వేకువలను వెలికి తీయునది
ప్రజాస్వామ్యానికి ప్రాణమది –
పవిత్రమైనది – ’ఓటు’ అది!

అర్హత గల వారందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని,
బాగా ఆలోచించి సరయిన పార్టీకి, సరైన అభ్యర్థికి ఓటు వేయాలని
విజ్ఞప్తి చేస్తూ –
భవదీయుడు
డా.ఆచార్య ఫణీంద్ర

డా.ఆచార్య ఫణీంద్ర విరచిత వచన కవితలు – 4

pebbles
గులక రాళ్ళు
————–
నిండు యవ్వనంలో గడచిన నాళ్ళు
గుండె వాగులో గులక రాళ్ళు –

కాల ప్రవాహం కదలి పోయినా
జ్ఞాపకాల అలల అడుగున నిలిచి ఉంటాయి!

కాలం
——-
కాలం ఒక
కాలుతున్న సిగరెట్టు
గట్టిగా దమ్ము లాగి
ఊపిరి తిత్తుల నిండా
ఉత్తేజం నింపుకో!
ఉద్దేశ్యాలను సాధించుకో!

చేతిలో నున్న దానిని
సద్వినియోగం చేసుకోకపోతే
మిగిలేది నుసి!
వ్యర్థమైన కాలానికి
గురుతుగా మసి!!

సమైక్యత
———–
నా సంతానంలో చెలరేగే
స్పర్థలకు, సమరాలకూ
మూల కారణమయ్యే
సంపాదనను నేను
సమకూర్చదలచుకోలేదు –

ఎందుకో తెలుసా?
కనీసం నా శ్రాద్ధం నాడైనా
“మా బాబుగాడు
ఏం సంపాదించాడు?
ఏం మిగిల్చాడు? – అంటూ
కలసి కట్టుగా
దుమ్మెత్తి పోస్తారని!

—***—

తెలుగు పద్యంలో రష్యన్ సూక్తి

తెలుగు పద్యంలో రష్యన్ సూక్తి
————————–cut-apple
రచన: డా.ఆచార్య ఫణీంద్ర

ఫలమునందు సగము పంచి నీకిచ్చుచో
సగము నాకు మిగులు – సగము నీకు –
పంచి ఇచ్చునెడల మంచి ఆలోచనన్
నాకు మొత్తముండు! నీకునుండు!
—*****—

ఆచార్య ఆత్రేయ – అంకెల తమాషా

aatreya ఆచార్య ఆత్రేయ – అంకెల తమాషా
———————————————————————-
పరిశోధన, వ్యాస రచన: డా.ఆచార్య ఫణీంద్ర

“సంఖ్యా వాచకం ద్విగు” అన్నారు ’ద్విగు సమాసా’న్ని నిర్వచిస్తూ లాక్షణికులు. సనాతన కాలం నుండి సాహిత్యంలో సంఖ్యలకు సముచిత స్థానం లభించింది. ’ఏక దీక్ష’, ’ద్విగుణీకృతం’, ’కవిత్రయం’, ’చతుస్సాగర పర్యంతం’, ’పంచమ వేదం’, ’షట్చక్రవర్తులు’, ’సప్త గిరులు’, ’అష్ట దిగ్గజాలు’, ’నవ గ్రహాలు’, ’దశావతారాలు’ … వంటి శబ్దాలను పరిశీలిస్తే – సంఖ్యలు సాహిత్యంలో ఎంత చక్కగా ఇమిడిపోతాయో అవగతమవుతుంది.
సినిమా పాటకు సంబంధించినంత వరకు కీ.శే. డా|| ఆచార్య ఆత్రేయ సంఖ్యలతో అనేక చమత్కారయుక్తమైన ప్రయోగాలను చేసారు. సినిమా పాటలలో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారు అరుదనే చెప్పాలి. అంకెలతో ఆయన చేసిన తొలి తమాషా – “ఒకటి – ఒకటి – ఒకటి – మానవులంతా ఒకటి -” అన్న గీతంతో ప్రారంభమయింది. ఆ పాటను ఒక్కసారి నెమరు వేసుకొంటే – అంకెలను ఒకటి నుండి పది వరకు వరుసగా ప్రయోగించి ఎంత గమ్మత్తుగా నీతి బోధ చేసారో బోధపడుతుంది.
“ఒకటి – ఒకటి – ఒకటి –
మానవులంతా ఒకటి –
రెండు – రెండు – రెండు –
మంచి వారని, చెడ్డ వారని
మనలో జాతులు రెండు – ||ఒకటి||

మూడు – మూడు – మూడు –
మూఢుల స్నేహం వీడు –
నాలుగు – నాలుగు – నాలుగు –
నలుగురి సుఖమును చూడు – ||ఒకటి||”

… ఇలా సాగిపోతుందా పాట. ఈ పాటలో ఒక చోట –
“ఏడు – ఏడు – ఏడు –
ఇతరుల చూసి ఏడవకు -” అంటూ సగటు తెలుగు వాణ్ణి మందలిస్తారు మహాకవి ఆత్రేయ.
’బడి పంతులు’ చిత్రంలో –
” భారత మాతకు జేజేలు
బంగరు భూమికి జేజేలు” అన్న గీతంలో –
“త్రివేణి సంగమ పవిత్ర భూమి
నాల్గు వేదములు పుట్టిన భూమి
గీతామృతమును పంచిన భూమి
పంచ శీల బోధించిన భూమి” అంటూ ’మూడు’, ’నాలుగు’, ’ఐదు’ అంకెలను వరుసగా ప్రయోగిస్తూ, భారత మాతను కీర్తించారు ఆత్రేయ.
ఆచార్య ఆత్రేయ సంఖ్యలను ఇలా ప్రబోధ గీతాలకే పరిమితం చేయకుండా, ప్రేమ గీతాలలో సైతం కొలువుంచారు. ’దేశోద్ధారకులు’ అనే చిత్రంలో ఈ పాటను గమనిస్తే – సంఖ్యలనే సింహాల పాలిట ఆయన ’రింగ్ మాష్టర్’ అని అర్థమవుతుంది.
“మబ్బులు రెండు బేటీ అయితే
మెరుపే వస్తుంది –
మనసులు రెండు పేచీ పడితే
వలపే పుడుతుంది – ||మబ్బులు||

మూడు ముళ్ళు పడతాయంటే
సిగ్గే మొగ్గలు వేస్తుంది –
ఆ మొగ్గలు పూచిన మూడు రాత్రులు
తీయని ముద్రలు వేస్తాయి –
కన్నులు నాలుగు కలిసాయంటే
పున్నమి వెన్నెల కాస్తుంది –
ఆ వెన్నెల నాలుగు వారాలయిన
తరగని వెలుగై ఉంటుంది – ||మబ్బులు||

అయిదో తనమే ఆడ జన్మకు
అన్ని వరాలను మించింది –
ఆ వరాన్ని తెచ్చిన మగువే మగనికి
ఆరో ప్రాణం అవుతుంది –
అడుగులు ఏడు నడిచామంటే
అనుబంధం పెనవేస్తుంది –
ఆ అనుబంధమే ఏడేడు జన్మలకు
వీడని బంధం అవుతుంది – ||మబ్బులు||”

’ఆత్మ బలం’ చిత్రంలోని ఈ క్రింది పాటలో – అల్ప సంఖ్యలతో ఎంతటి అనల్ప భావాన్ని సృష్టించారో పరిశీలిస్తే – ఆచార్య ఆత్రేయ ప్రతిభా పాటవాలకు అంజలి ఘటించకుండా ఉండ లేము.
” నాలుగు కళ్ళు రెండయినాయి –
రెండు మనసులు ఒకటయినాయి – ”

ఈ గీతంలో ” ఉన్న మనసు నీ కర్పణ జేసి
లేని దాన నయ్యాను – ఏమి
లేని దాన నయ్యాను” – అంటూ ’శూన్యా’న్ని ( సున్న అంకెను) కూడ తలపింప జేస్తా రాయన. ’ఇంధ్ర ధనుస్సు’ అన్న చిత్రం కోసం ఆత్రేయ రచించిన
” ఏడు రంగుల ఇంధ్ర ధనుసు
ఈడు వచ్చిన నా సొగసు –
ఆ ఏడు రంగులు ఏకమైన
మల్లె రంగే నా మనసు – ” అన్న గీతంలో, ఆయన సాహిత్యంలో సంఖ్యలతోబాటు విజ్ఞాన శాస్త్రాన్ని సమ్మిళితం చేసిన తీరు నిజంగా శ్లాఘనీయం.
ఇంకా, ’బంగారు బాబు’ చిత్రంలో ” ఏడడుగుల సంబంధం – ఏనాడో వేసిన బంధం”; ’కొడుకు – కోడలు’ చిత్రంలో ” నువ్వు, నేను ఏకమయినాము – ఇద్దరము మనమిద్దరము ఒక లోకమయినాము” వంటి గీతాలు ఆత్రేయకు అంకెలపై గల మక్కువను చాటుతాయి. అలాగే, ’మరో చరిత్ర’ చిత్రంలో “పదహారేళ్ళకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు – శత కోటి దండాలు” వంటి గీతాన్ని పరిశీలిస్తే – ఆత్రేయ చిన్న సంఖ్యల నుండి, పెద్ద సంఖ్యల వరకు వేటినీ వదల లేదని, అపురూప భావాల సృష్టిలో ఆయనకు అంకెలతో ఆడుకోవడం వెన్నతో పెట్టిన విద్య అని తెలుస్తుంది.
మనసు మీద ఎన్నో మధుర గీతాలను రచించి ’మనసు కవి’ గా, ’మన సుకవి’ గా ప్రసిద్ది చెందిన డా|| ఆచార్య ఆత్రేయను ’ద్విగు సమాసాల దిట్ట’ గా అభివర్ణించవచ్చు.

—***—

“ఏక పద్య రామాయణం”

shree-ram“ఏక పద్య రామాయణం”
——————————

ఈ మధ్య అంతర్జాలంలో కొన్ని బ్లాగులలో “ఏక శ్లోకి రామాయణం” గురించి వ్రాసారు. అది చదివిన నేను “ఏక పద్య రామాయణం” ఎందుకు వ్రాయగూడదు? – అనుకొన్నాను. ఆ ప్రయత్న ఫలితమే – ఈ క్రింది పద్యం. “శ్రీ రామ నవమి” పర్వదిన సందర్భంగా అందిస్తున్న ఈ నా పద్యాన్ని చదివిన వారికి, పారాయణం చేసిన వారికి, విన్న వారికి – లోకాభిరాముడైన ఆ శ్రీరామచంద్రుడు
అన్ని ఆపదలను తొలగించి, సకలైశ్వర్య సంప్రాప్తిగా దీవించు గాక!

– డా.ఆచార్య ఫణీంద్ర

“యాగ ఫలంబుగా జననమంది, మహాస్త్ర కళా విదుండునై,
యాగము గావగా జని, శివాంకిత చాపము ద్రుంచి, జానకిన్
తా గొని పత్నిగా, పిదప – తండ్రి వచః పరిపాలనన్ వనం
బేగి, దశాననున్ దునిమి, ఏలికయౌ రఘురాము మ్రొక్కెదన్!”

త్రిసహస్ర సందర్శనోత్సవం

pushpaalu

నవంబర్ 25, 2008 నాడు ప్రారంభింపబడిన నా ఈ బ్లాగు ఈనాటితో (ఏప్రిల్ 1, 2009) మూడు వేల మంది వీక్షకుల ’చూపుల’ను పూర్తి చేసుకొంది. ’ఏప్రిల్ ఫూల్’ కాదండి. నిజంగా ’నిజం’! ఈ రోజు నా బ్లాగు ’త్రిసహస్ర సందర్శనోత్సవం’ జరుపుకొంటుంది. ఈ 125 రోజుల కాలంలో మూడు వేల మంది ప్రేక్షకులు దర్శించడం వల్లేనేమో, ’వర్డ్ ప్రెస్’లో ’అత్యధిక వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్లాగుల’ లో నా బ్లాగు పేరు అడపా దడపా కనిపిస్తుంది.
నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ప్రేమాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు!
నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ’జల్లెడ’, ’కూడలి”, ’హారం’, ’పద్యం’, ’నరసింహ’ మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

– డా.ఆచార్య ఫణీంద్ర