సీమాంధ్రుల పరిభాషలోనే …

నాలుగేళ్ళలో రెండు సార్లు రాష్ట్ర విభజనకు అనుకూలంగా ప్రకటనలు వెలువడ్డాక… ఇప్పుడు కొంత మంది సీమాంధ్రులు “రామాయణమంతా విని రామునికి సీత ఏమవుతుంది?” అన్న చందంగా – “ఇప్పుడు రాష్ట్రాన్ని విభజించవలసినంత అవసరం ఏమి వచ్చింది? అని అడుగుతున్నారంటే… అది అమాయికత్వమా? లేక నటనా? – నాకు అర్థం కావడం లేదు. నిన్న ఈ బ్లాగులోని నా పాత టపాలు కొన్ని వెదుకుతుంటే – పై అమాయిక ప్రశ్నకు సీమాంధ్రుల పరిభాషలోనే సమాధానంగా నిలిచే ’శ్రీనివాస సోదరుల’ కవిత కనిపించింది. ఈ టపాను నేను మూడున్నరేళ్ళ క్రితం (జనవరి 2010) ప్రచురించాను. “HISTORY REPEATS”  అన్న భావనను కలిగించే ఈ అలనాటి ఆ మహాకవుల కవితను ఈ రాష్ట్ర విభజన సమయంలో పునః ప్రచురిస్తున్నాను.అవలోకించండి.

— డా. ఆచార్య ఫణీంద్ర

—————————————————————————————————

ఆధిపత్యంపై తిరుగుబాటు

india-in-1952

ఉమ్మడి మద్రాసు రాష్ట్రాన్ని విభజించి, ఆంధ్ర రాష్ట్రం ( అప్పటికి తెలంగాణను అందులో కలపాలన్న ప్రసక్తి రాలేదు. ) ఏర్పాటును ఆకాంక్షిస్తూ, 1952 లో ” శ్రీనివాస సోదర ” కవులు వ్రాసిన పద్య కవిత – ” రాష్ట్ర సాధన “

రాష్ట్ర సాధన

ఉన్నతోద్యోగమ్ము లున్నంతవరకును

కేరళుల్, తమిళులు దూరుచుండ,

ప్రాజెక్టులాది యావశ్యకమ్ముల కెల్ల

అరవ దేశంబె ముందడుగు వేయ,

పండించి తిండికై పరులకు చేజాచి

ఎండుచు తెలుగులు మండుచుండ,

తమ పట్టణమునందె తాము పరాయిలై

దెస తోప కాంధ్రులు దేవురింప,

ఆంధ్ర రాష్ట్రము కావలె ననుట తప్పె?

తెలుగు పంట, తెలుగు సొమ్ము, తెలుగు కండ

తెలుగు వారికి గాని ఈ దీన దశను

ఎంత కాలము నలిగి పోయెదము మేము?

మన యింట పరుల పెత్తన మేమియని కాదె

సత్యాగ్రహంబులు సల్పినాము?

మన సొమ్ము నితరులు తినిపోయిరని కాదె

ఉపవాస దీక్షల నూనినాము?

మన కధికారముల్ పొనరలేదని కాదె

సహకార నిరసన సలిపినాము?

మన క్షేమ లాభముల్ మసియయ్యెనని కాదె

కారాగృహమ్ముల జేరినాము?

తలలు కలుపక రండని పలికినపుడు

బ్రిటిషువారిని తెగ విమర్శించినట్టి

పెద్ద లా పాటనే వెళ్ళబెట్టి రిపుడు!

మాట నిలుకడ తప్పి రీ మాత్రమునకె!

మన ప్రధాని మాటె మనకు సిద్ధాంతంబు!

ఆంధ్ర రాష్ట్ర మొకరి నడుగ నేల?

దానమా? ఇదేమి తద్దినమా? మూల్గి,

చీది, ఒక్కడేదొ చేయి విదుప!

ఢంకాపై గొట్టి నిరా

తంకంబుగ హక్కు చూపి, దర్పము మీరన్

అంకించుకొందు మంతే!

ఇంకన్ పెద్దరికములకు నిట తావున్నే?

—***—

ఈ పద్యాలలో ” అరవ ” లేక ” తమిళ ” అని ఉన్నచోట – ” ఆంధ్రా ” అని,

” ఆంధ్ర ” లేక ” తెలుగు ” అని ఉన్నచోట – ” తెలంగాణ ” అని మారిస్తే …

ఇవి తెలంగాణోద్యమ పద్యాలయిపోతాయి. అప్పటి ఆంధ్రా వాళ్ళ మనోభావాలు, ఇప్పటి తెలంగాణా వాళ్ళ మనోభావాలు అచ్చంగా ఒకేలా ఉండడం ఆశ్చర్యకరమే అయినా, కాకతాళీయం మాత్రం కాదు.

ఆనాడు విడిపోదామన్నవారు ” భాషాభేదా ” న్ని ప్రధానాంశం చేస్తే, కలిసుందామన్న వారు ” దక్షిణ భారతీయుల సమైక్యత ” అంటూ ఆదర్శాన్ని వల్లించారు.

ఈనాడు విడిపోదామన్నవారు ” ప్రాంతీయ సంస్కృతి ” ని ప్రధానాంశం చేస్తే, కలిసుందామంటున్న వారు ” భాషా సమైక్యత ” అంటూ ఆదర్శాన్ని వల్లిస్తున్నారు.

నిజానికి ఇవేవీ అంశాలే కావు!

ఆనాడైనా, ఈనాడైనా జరుగుతున్నది ఆధిపత్యంపై తిరుగుబాటు!!

– డా|| ఆచార్య ఫణీంద్ర

—————————————————————————————————

మహా ప్రసాదము

మహా ప్రసాదము         

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

 Back-To-God

నిన్న నిద్ర బోయిన నేను నేడు మరల

మేలుకొనుట నీదు కటాక్షమే గదయ్య!

నాదు జీవన పాత్రలో ఈ దినమ్ము

నీ విడిన మరియొక భిక్ష! నిజము దేవ!                     

 

నా జీవన గ్రంథములో

రాజీవాక్ష! ఇటు చేరె – ప్రాప్తంబగు నీ 

రోజొక్క  క్రొత్త పుటగా!

పూజించెద నిను, లిఖింప పుణ్యము నందున్!              

 

నీ వొసగిన దినము, నీ స్మరణములోన

గడుపుచు తరియింతు నడుగడుగున!

ప్రతి నిముషము నగుత ఫలవంతముగ – నేను

పరుల సేవలందు వరలు కొలది!                                                                                                                                           

గొప్ప పనులెన్నొ సేయుచు

నెప్పటికిని నీకు ప్రీతి నెంతయొ గూర్చన్

తప్పక శ్రమియింతునయా!

అప్పుడ నీవిడిన దినము సార్థక మొందున్!                                               

 

సత్యంబొక్కటె జీవితాశయముగా సాగంగ వీలైనచో –

ప్రత్యామ్నాయమె లేని ధర్మ గతిలో వర్తిల్ల వీలైనచో –

స్తుత్యంబౌ ఘన న్యాయశాస్త్ర విదుడై శోభిల్ల వీలైనచో –

నిత్యంబున్ నను మేలుకొల్పుమిటులే నిద్రాస్థితిన్ వీడగాన్!                        

 

స్వామి! అటు శ్రమించియు వి

శ్రామముకై మరల రాత్రి శయనింపగ, న

న్నా మరునాడును మంచి ప

నేమైన సలుపుటకైన యెడ – లేపుమయా!                 

 

లేపకు – నిద్ర నుండి నను లేపకు – నా వలనన్ ప్రయోజనం

బే పగిదైన లేని యెడ ఈ భువికిన్, భువి మానవాళికిన్!

లేపక, శాశ్వతంబునగు లీలను నిద్రను, మోక్షమిమ్ము! ఆ

రేపటి వేళ ఎప్పుడొ – నిరీక్షణ గూడ మహా ప్రసాదమే!!           

 

                  — *** —

మాతెలుగు తల్లికీ మల్లెపూదండ –

ఇది 2008లో నేను ప్రచురించిన నా పాత టపా.
రాష్ట్ర విభజన జరుగుతున్న ఈ సందర్భంలో దానిని మళ్ళీ ప్రచురించాలని అనిపించింది. చివరలో మొత్తం గీతాన్ని ప్రచురించాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

————————————————————————————————————————–

TeluguTalli

భాష వేరు .. రాజకీయాలు వేరు …

రాష్ట్ర గీతమైన ” మా తెలుగు తల్లికి మల్లె పూదండ ” లో ’ రుద్రమ్మ భుజ శక్తి ’ అన్న ఒక్క పదం తప్ప, మా ప్రాంత ప్రశస్తి ఏదీ లేదంటూ కొందరు తెలంగాణ ప్రాంతీయులు నిరసించిన సంగతి విదితమే ! అయితే శంకరంబాడి సుందరాచారి కవి ఆ గీతాన్ని రచించింది 1939లో. అప్పటి నేపథ్యమే వేరు. ఉమ్మడి మద్రాసు నగరం నుండి కోస్తా, రాయలసీమలతో కూడిన తెలుగు ప్రాంతం యొక్క వేర్పాటువాదంతో పుట్టిన నాటి ఆంధ్రోద్యమానికి ప్రాతిపదికగా రచించిన గీతం అది. ఆనాటికి ఆ తెలుగు ప్రాంతం పట్లే ఎవరికీ పూర్తి అవగాహన లేదు. అందులో మద్రాసు ఉంటుందో, లేదో తెలియదు. తెలుగు వాగ్గేయకారుడు త్యాగయ్య స్వస్థలం – తంజావూరు ఉంటుందో, లేదో తెలియదు. ఒకవేళ ఆ తెలుగు ప్రాంతం మద్రాసు రాష్ట్రం నుండి  వేరుపడ్డా, అది మరి కొన్నాళ్ళకు మరో తెలుగు ప్రాంతమైన తెలంగాణంతో కలిసి ’ఆంధ్ర ప్రదేశ్’ ఏర్పడుతుందా ? – అన్నది ఊహాజనితమైన విషయం. ఎందుకంటే, అప్పటికి తెలంగాణ బ్రిటిష్ ఇండియాలో కాక, నిజాం పాలనలో ప్రత్యేక దేశంగా ఉంది. నిజానికి సమగ్ర తెలుగు దేశం అంటే, నేటి మహారాష్ట్రలోని అజంతా – ఎల్లోరా ( ఉత్తర హిందుస్థానం నుండి దక్షిణం వైపుకు ప్రయాణిస్తుంటే, ఎక్కడ ’హలంత భాష’ మాట్లాడడం ఆగిపోయి, ’అజంత భాష’ అయిన  మన తెలుగు మాట్లాడడం మొదలవుతుందో, ఆ ప్రాంతాన్ని ’అజంతా’ అని పిలువడం ప్రారంభించారని కొందరు చరిత్రకారులు అంటారు.) నుండి దక్షిణాంధ్ర రాజులు పాలించిన నేటి తమిళనాడులోని తంజావూరు వరకు; తూర్పున నేటి ఒరిస్సాలోని గంజాం జిల్లా నుండి పడమరన కర్ణాటకలో బళ్ళారి వరకు వ్యాపించి ఉండాలి. తరువాత ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నెన్ని ప్రాంతాలను కోల్పోయి ఎలా ఏర్పడిందో అందరికీ తెలుసు. అలాంటి పరిస్థితులలో, ఆనాటి ఒక కవి ( 1939లో ), ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దులను ఊహించి, గీతాన్ని రచించాలి – అనుకోవడం అత్యాశే అవుతుంది. పైగా, ఆనాటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు కవులకు తెలంగాణ ప్రాంత ప్రశస్తి, ఇతర చారిత్రిక వివరాలు తెలిసే అవకాశాలు కూడా చాలా చాలా తక్కువ. అంతెందుకు ? ఆ గీత కర్త, గుంటూరు జిల్లాలోని అమరావతిలో గుహలున్నాయో- లేవో- తెలియకుండానే ” అమరావతీ గుహల అపురూప శిల్పాలు ” అని వ్రాసాడని, తరువాత తన మిత్రులు అక్కడ గుహలు లేవని చెప్పితే, దాన్ని ” అమరావతీ నగరి అపురూప శిల్పాలు ” అని మార్చుకొన్నారని – మా గురువుగారు డా. నండూరి రామకృష్ణమాచార్యులు నాతో చెప్పారు. కాబట్టి ఆ కవిని తప్పు పట్టవలసిన పని లేదని, ఆ గీతాన్ని నిరసించవలసిన అవసరం లేదని అందరూ గ్రహించాలి.

ఆ గీతంలో – రెండవ చరణంలో తెలుగు వారు గర్వించ దగ్గ మహనీయుల ప్రశస్తిని అద్భుతంగా అందించారా కవి. ఆ చరణాన్ని ఒకసారి చూద్దాం –

” అమరావతీ నగరి అపురూప శిల్పాలు

త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు

తిక్కయ్య కలములో తియ్యందనాలు

నిత్యమై, నిఖిలమై నిలచి యుండే దాక … (*)

రుద్రమ్మ భుజ శక్తి, మల్లమ్మ పతి భక్తి

తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక … (*)

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “

అయితే, ఇందులో (*) గుర్తు పెట్టిన పాదాలు రెండూ దాదాపుగా ఒకే అర్థాన్ని ఇస్తూ పునరుక్తి అవుతోంది. అందులో మొదటి దాని బదులు (అదే ట్యూన్ లో) – ” పోతన్న కవన మందార మకరందాలు ” అని అంటే … ఏ గొడవ లేక పోను !

అసలు సుందరాచారి కవి ఈనాడూ జీవించి ఉంటే, ఈనాటి వాదోపవాదాలకు నొచ్చుకొన్నా – తెలంగాణ ప్రాంత ప్రశస్తిని వర్ణిస్తూ ఇంకో చరణం వ్రాసి ఉండే వారని నాకనిపించింది. ఆ తలంపు రాగానే, తెలంగాణ ప్రాంత మహనీయుల ప్రశస్తిని వర్ణిస్తూ, పై చరణం ట్యూన్ లోనే, అదే శైలిలో ఒక చరణం నా గుండెలోనుండి తన్నుక వచ్చింది.

” రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు

గోపన్న గొంతులో కొలువైన రాగాలు

పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు

పోతన్న కవన మందార మకరందాలు

రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి,

మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక …

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం – “

రాష్ట్రాలుగా విడిపోయినా … కలసి ఉన్నా … రాజకీయాలు ఎటు మలుపు తిప్పినా …

నా మనసులోని మాట ఒకటే –

” జై తెలుగు తల్లి !

జై తెలుగు తల్లి !!

జై తెలుగు తల్లీ !!! “

 

– డా. ఆచార్య ఫణీంద్ర

___  ***  ___

————————————————————————————————————————-

మాతెలుగు తల్లికీ మల్లెపూదండ –
మాకన్నతల్లికీ మంగళారతులు –
కడుపులో బంగారు, కనుచూపులో కరుణ,
చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి!

||మాతెలుగు తల్లికీ||

గల గల గోదారి కడలి పోతుంటేను…
బిర బిరా క్రిష్ణమ్మ పరుగులిడుతుంటేను…
బంగారు పంటలే పండుతాయి!
మురిపాల ముత్యాలు దొరలుతాయి!

||మాతెలుగు తల్లికీ||

అమరావతీ నగర అపురూప శిల్పాలు –
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు –

తిక్కయ్య కలములో తియ్యందనాలు –

నిత్యమై నిఖిలమై నిలిచియుండే దాక –

మొల్ల కవితా శక్తి, మల్లమ్మ పతిభక్తి,
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయని కీర్తి –
మాచెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలే ఆడుతాం! – నీ పాటలే పాడుతాం!

||మాతెలుగు తల్లికీ||

రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు –

గోపన్న గొంతులో కొలువైన రాగాలు –

పాల్కుర్కి కలములో జాను తెనుగందాలు –

పోతన్న కవన మందార మకరందాలు –

రుద్రమ్మ భుజ శక్తి, దమ్మక్క హరి భక్తి, 

మాదన్న ధీయుక్తి, రుద్ర దేవుని కీర్తి –

మా చెవుల రింగుమని మారుమ్రోగే దాక …

నీ ఆటలే ఆడుతాం – నీ పాటలే పాడుతాం –

జై తెలుగుతల్లి !

జై తెలుగుతల్లి !! 

జై తెలుగుతల్లి !!!

— *** —

“రేడియో తరంగ” లో నా ‘ఇంటర్ వ్యూ’

ఇటీవల “రేడియో తరంగ” (ఇంటర్నెట్ రేడియో) లో కస్తూరి మురళీ కృష్ణ గారు నాతో జరిపిన ’ఇంటర్ వ్యూ” ప్రసారమయింది. ఆ ’ఇంటర్ వ్యూ’ ను  ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి వినండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

OLYMPUS DIGITAL CAMERA

http://telugu.tharangamedia.com/srujana-swaram-ii-dr-phanidra/

“ఈద్ ముబారక్”

సకల మహమదీయ సోదర సోదరీమణులకు
’రంజాన్’ పర్వ దిన శుభాకాంక్షలు!

id 2013

’దక్కనీ ఉరుదూ’ ఆదికవి, హైదరాబాదు నగర నిర్మాత, గోల్కొండ సామ్రాజ్య మహా ప్రభువు సుల్తాన్ ’కులీ కుతుబ్ షా’ రచించిన ’దివాన్’ కావ్యాన్ని( ఇది ఉరుదూ సాహిత్యంలో తొలి ముద్రిత కావ్యం) నేను ఆంధ్రీకరించడం జరిగింది. అందులో ’ఈద్’ పై ఆ మహాకవి కవితలకు నా అనుసృజన పద్యాలను అందిస్తున్నాను. ఆస్వాదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

“ఈద్”

కానగ నభమను నల్లని
ఏనుగు కొక చిన్ని దంత మేర్పడె నేడే!
దానిని చూచిన వెంటనె
పూనిరి ’ఈదు’ను జరుపగ పురమున జనులే!

నెల దినముల నుండి నేనెంతొ ఓపికన్

నిలిచి చూచినాడ నింగిలోన –
నేడు కానిపించె నెలవంక! చెలి! ఇమ్ము
చెమట లొలుకు పెదవి చేర్చి ముద్దు!

‘ఈదు’ పండుగే సఖి నేడు! ఈదనిమ్ము

సరస శృంగార వైభోగ సాగరమ్ము!
ఎంత త్రావినన్ చషకమ్ము నింక నింపు!
ఎంత సేపైన ఈ శయ్య నింక దిగకు!

ఆ ’ప్రవక్త’ దయయు, నాశీస్సుల వలన

కాంచు గాక రసిక ఘనుడు ’కుతుబు’
చదల పైన సూర్య, చంద్రులుండెడి దాక –
వంద లక్ష లిట్టి పండుగలను!

— *** —

గురు స్తుతి

IMAG0100

నా పి.హెచ్.డి. గైడ్ – మా గురువు గారు ప్రొఫెసర్ ఎస్.వి.రామారావు గారి 73వ జన్మ దినోత్సవం సందర్భంగా “యశస్వి” పేర ఒక అభినందన సంచిక ఆవిష్కరించబడింది. అందులో ఆయన ’షష్టి పూర్తి’ సందర్భంగా నేను రచించిన పద్యాలను పునర్ముద్రించారు. సాహిత్యాభిమానుల పఠనార్థం ఆ పద్య మాలికను ఇక్కడ పొందు పరుస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

SV1SV2

SV3

సీమాంధ్ర సోదరులారా!

tel6

హైదరాబాదుతో 50 ఏళ్ళ అనుబంధాన్ని తెంచుకోలేక మీరెంత బాధ పడుతున్నారో మాకు తెలుసు. కాని కుటుంబాలు విడిపోతున్నప్పుడు కూడ ఇలాంటి బాధలు తప్పవు. 50 ఏళ్ళుగా మనస్పర్థలు పెరుగుతూనే వచ్చాయి గాని మానసిక ఐక్యత కుదరనే లేదు. కాబట్టి ఇక విడిపోక తప్పదు.కాని విడిపోయే ముందు కూడ ఇంకా కుయుక్తులేనా? మాకు దక్కని హైదరాబాదు మీకూ దక్కకూడదు అన్న దుష్ట బుద్ధి తగునా? భౌగోళికంగా మా గుండెకాయగా ఉన్న హైదరాబాదును మానుండి ఎలా వేరు చేయమనగలుగుతున్నారు? పోని! 1956లో హైదరాబాదును మీరు మద్రాసు రాష్ట్రం నుండి పట్టుకొచ్చారా ? లేదే? అప్పటికే హైదరాబాదు మాది. అప్పటికే అసెంబ్లీ భవనాలు, హైకోర్ట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, ఉస్మానియా ఆసుపత్రి లాంటి అన్ని వసతులున్న మా రాజధాని. 50 ఏళ్ళు రాజధానిగా ఉన్నందుకే మీరు వదులుకోలేకపోతే … మాకు హైదరాబాదు 400 ఏళ్ళుగా రాజధాని! మేమెలా వదులుకొంటాం? 50 ఏళ్ళుగా కలసి చేసుకొన్న అభివృద్ధి అని మీరు వాపొతున్నారు. మరి మేము 400ల ఏళ్లుగా చేసుకొన్న అభివృద్దే! దాన్ని ఎలా వదులుకోగలం? అంత సులువుగా కేంద్ర పాలిత ప్రాంతం చెయ్యాలని, లేదా వేరే రాష్ట్రం చెయ్యాలని అనడానికి మీకు మనసెలా ఒప్పింది? తెలుగువాళ్ళే నిర్మించిన చెన్నపట్నంపై హక్కును సాధించుకోలేక తమిళులకు అప్పగించి వచ్చారే? ఇప్పుడు హైదరాబాదుపై అంత హక్కుగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? అందులో న్యాయం ఉందా? 50 ఏళ్లుగా అప్పటికే మాదైన మా ఇంట్లో మీరు మాతో ఉండడానికి ఒప్పుకొన్నాం. ఆ ఇంటికి మీరు రంగులు వేయించి ఉండవచ్చు. ఫర్నిచర్ సమకూర్చి ఉండవచ్చు. అంతమాత్రాన విడిపోయేటప్పుడు ఆ ఇల్లే మీదవుతుందా? లేక మాకూ దక్కకుండా చేసిపోతారా? ఎంత దురాలోచన అది? గుజరాతీలు బొంబాయి గురించి ఇలాగే పేచి పెట్టినప్పుడు అంబేడ్కర్ “ఎప్పటికైనా ఓనర్ ఓనరే! టెనెంట్ టెనెంటే!” అన్న విషయం మీ మేధావులకు తెలియనిదా? హైదరాబాదులో ఉండే సీమాంధ్రులు ఇక ముందు తెలంగాణ పౌరులుగా ఇక్కడే ఉండిపోవచ్చు. సీమాంధ్ర ప్రాంతంలో ఉండే సోదరులు కూడ మా ఆత్మీయులుగా వస్తూ పోతూ ఉండవచ్చు. భారత రాజ్యాంగమే ఈ హక్కును ప్రతి భారతీయ పౌరునికి కల్పించింది. ఇప్పుడున్న ఈ అనుబంధాన్ని ఇలాగే కొనసాగించుకోవాలి గాని, విడిపోయే ముందు హైదరాబాదును మాకు కాకుండా చేసి వైషమ్యాలు పెంచుకోవచ్చా? కాస్త ఆలోచించండి.

namaste

– సగటు తెలంగాణవాది ప్రతినిధిగా

డా.ఆచార్య ఫణీంద్ర