డా.ఆచార్య ఫణీంద్రకు ఉగాది పురస్కారం

picture3
అటు పద్యకవిగా రాణిస్తూ – ఇటు వచన, గేయ కవితలలో ప్రయోగాలతో అలరిస్తూ – ప్రముఖ కవిగా గుర్తింపు పొందడమే కాకుండా, “ఇన్నాళ్ళూ ’క్షీణ యుగం’గా పిలువబడుతున్న పందొమ్మిదవ శతాబ్ది తెలుగు సాహిత్యంలో ఎంతో నవ్యత ఉందని, ఇరవయవ శతాబ్ది నవ్య కవిత్వపు బీజాలు పందొమ్మిదవ శతాబ్దిలోనే పడ్డాయి” అని తన సిద్ధాంత గ్రంథం ద్వారా నిరూపించి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ’పి.హెచ్.డి’ పట్టా సాధించిన డా.ఆచార్య ఫణీంద్ర కృషికి గుర్తింపుగా ’విరోధి’ నామ సంవత్సరాది సందర్భంగా ’మానస ఆర్ట్ థియేటర్స్’, హైదరాబాదు వారు ఆయనను ’ఉగాది పురస్కారం’తో సత్కరించారు. ఆదివారం (29 – 03 – 2009) నాడు హైదరాబాదు (చిక్కడపల్లి)లోని నగర కేంద్ర గ్రంథాలయంలో ప్రముఖ చలన చిత్ర దర్శకులు శ్రీ గోపాలకృష్ణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు, సారస్వత మూర్తి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ఫణీంద్రను సత్కరించారు. ఆచార్య ఫణీంద్రతో బాటు కార్యక్రమ నిర్వాహకులు శ్రీ ’రఘుశ్రీ’ గారు – ప్రముఖ కథకులు శ్రీ ’అంబళ్ళ జనార్దన్’ (ముంబాయి) గారిని, ప్రముఖ రచయిత్రి శ్రీమతి ’జ్వలిత’ (ఖమ్మం) గారిని ’ఉగాది పురస్కారాలతో సత్కరించారు.
( ఫోటో ’ఈనాడు’ దిన పత్రిక సౌజన్యంతో… )

ప్రకటనలు

“విరోధి”

’విరోధి’
———–
– రచన: ” పద్య కళా ప్రవీణ”
డా.ఆచార్య ఫణీంద్ర
——————————–
ugadi-image-1htm3

రావె ’విరోధి’ నామ రస రమ్య నవాబ్దమ! నీదు నామ ము
ద్రే విని, గుండెలం గలిగె నేదొ భయమ్మది మా ప్రజాళికిన్!
నీవటువంటి దానవని నేను తలంపను – దుష్ట శక్తికిన్
నీవ ’విరోధి’వై నిలిచి, నిండు శుభమ్ముల నీయ రా త్వరన్!

కుసుమ కోమలంబగు ఆడ కూతురులకు
మోముపైన పైశాచికంబుగ జరిపిన
యాసిడుల దాడి సంస్కృతి కయి ’విరోధి’ –
పడతి నాదరించు సుగుణ పథము నిమ్ము!

’సత్య’ మసత్యమై, తెలుగు జాతి మహోన్నత కీర్తి, గౌరవా
లత్యతి హేయమైన గతి అట్టడుగుం బడిపోవ – కారణం
బత్యధికాశ, పాలనమునం దవినీతి గదా! ’విరోధి’వై
నిత్యము వానికిన్ – తెలుగు నీతిని, జాతిని కావుమా ఇకన్!

కణచిన వత్సర మంతయు
వణికించిన యట్టి ఉగ్ర వాదమ్మునకున్
నిను నే తలతు ’విరోధి’గ!
గుణపాఠము నేర్పు ’పాకు’ గూండాగిరికిన్!

ఎన్నికలగు వేళ ఏతెంచితివి నీవు –
ఈ అమాయిక ప్రజ కెట్టి హాని
సలుపకుండ, సత్ప్రజాస్వామ్య పాలక
విమల పక్షమునకు విజయమిమ్ము!

(విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లియున్న తెలుగు వారందరికీ
’విరోధి’ నామ సంవత్సర ’యుగాది’ పర్వదిన
శుభాకాంక్షలతో – )

—***—

“ఉగాది కోలా”

“ఉగాది కోలా”
——————–
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
—————————-

ug1

ముద్దు గారు నాదు బుజ్జాయి పుత్రుండు
’పఫ్ఫు’ లింక ’పిజ్జ’, ’బర్గరు’లను,
’కోకొ-కోల’,’పెప్సి’ కోరగా – వారించి,
ఈ ఉగాది రోజు నిటుల యంటి –

“వానికి మించిన రుచికర
మైనది చేసినది అమ్మ! అందుము మేమ
ద్దానిని ’ఉగాది పచ్చడి’!
కూనా! నీ వది ’ఉగాది కోలా’ యనుకో!

ఇందులోని ముక్కల రుచి ముందు నీదు
పిచ్చి ’బర్గర్లు’, ’పిజ్జాలు’ పేలవమ్ము!
ఈ రసామృత రుచి ముందు నింక చూడు –
నీదు ’కోకోలు’, ’పెప్సీలు’ నీరు గారు!”

తొలుత ఇష్ట పడక, “తొండి నీ”వని పల్కి,
కష్టపడుచు త్రావి కాస్త, పిదప –
కొలది కొలది రుచియె కొండ నాల్కకు తాక,
కోరి కోరి త్రావె కుండ నుండి!

కోరిన యంత ద్రావి, ఇక కుండను మాత్ర మిగిల్చె – గొంతులో
చేరిన బిందు, బిందువును చేకుర జేసెనొ మత్తు – నిద్రలో
జారెను వాడు గాఢముగ చాలిన యంతటి సేపు – పిమ్మటన్,
“లేర! ఇదేమి నిద్ర?” యని లేపిన యప్పుడు మేలుకాంచెనే!

నిద్ర లేచు పిదప, “నేనొక్క కలగంటి”
అనుచు చెప్పదొడగె నపుడు వాడు –
కలను చెప్పు వేళ – కనులలో మెరుపుండె!
భాష మారిపోయె స్పష్టముగను!!

“నేనొక తెన్గు తోటను జనించు వసంత పరీమళమ్ములన్
వేనకువేలు వెంటగొని, విశ్వము నెల్లెడ పంచబోవ – ఆ
స్థానములందు గల్గు తరు జాలము కొమ్మల చేతు లెత్తి, ఆ
హ్వానము పల్కె నంత, అభివాదముజేయుచు తెల్గు తల్లికిన్!”

నాతో ’తెల్గు దనమ్ము’నున్, ’నవ వసంతమ్ము’న్ విహారమ్మునై,
చేతోమోదముతోడ వచ్చి యచటన్ చేకూర్చె నవ్యత్వమున్!
ప్రాతఃకాలములో విదేశ పురుషుల్ పంచెల్ ధరింపంగ, ఆ
మాతల్ వారి ’కుగాది పచ్చడుల’తో మాధుర్యమున్ పంచిరే!

క్రొత్త చివురులు, పత్రాల క్రొత్త వస్త్ర
ములను ధరియించి తరువులు మురిసె నచట
గూడ – గుబురుల మాటున కోయిల లట
క్రొత్త తెలుగు గీతుల సభల్ కొలువు దీర్చె!

విరుల విరబూయ వనములే విరివిగాను –
తెలుగు పరిమళా లట నిండె దిశల నెల్ల!
తెలుగు – తెలుగు – తెలుగు – తెలుగెల్ల వ్యాపింప –
విశ్వ భాషలందు వెలిగె తెలుగు!”

అనుచు వాడు జెప్ప – ఆనందమున నాదు
కనుల యందు ధార గట్టె నీరు!
“వాని కలయె నిజము భావి నగుత!” యంచు
మనము నందు నేను మరులు గొంటి!

—***—

“ఏక వాక్య కవితలు”

“ఏక వాక్య కవితలు”
———————————–
రచన: డా|| ఆచార్య ఫణీంద్ర

తెలుగు సాహిత్యంలో నేను ప్రవేశపెట్టిన వినూత్న ప్రక్రియ – “ఏక వాక్య కవితలు”.
2004వ సంవత్సరం మార్చి నెలలో 252 ఏక వాక్య కవితల సంపుటిని “వాక్యం రసాత్మకం” పేరుతో గ్రంథంగా వెలువరించడం జరిగింది. దివంగత విమర్శకాగ్రేసరులు ఆచార్య జి. వి. సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఆవిష్కరింపబడిన ఈ గ్రంథం పలువురు సాహితీ ప్రియులు, సాహితీ వేత్తల ప్రశంసలనందుకొంది. అదే సంవత్సరం ఇది ’విజయవాడ’ లోని ’ఎక్స్-రే’ సంస్థ వారిచే ’ఉత్తమ కవితా పురస్కారం’తో సత్కరించబడింది.
ఈ గ్రంథానికి పీఠిక వెలయించిన ప్రముఖ కవి, విమర్శకులు డా. అద్దేపల్లి రామమోహన రావు “ఒకేఒక్క వాక్యంలో కవిత్వ స్ఫురణ కలిగించడం ఒక మంచి ప్రయత్నమే. ఆ ప్రయత్నం మొదటిసారిగా చేసి, 252 వాక్యాలతో “వాక్యం రసాత్మకం” అనే సంపుటిని ప్రచురిస్తున్నారు ఆచార్య ఫణీంద్ర. ఆచార్య ఫణీంద్ర తన ఏక వాక్య కవితలలో అనేక విధాలైన వస్తువులను తీసుకొన్నారు. అనేక విధాలైన అభివ్యక్తులను అనుసరించారు. సౌందర్య వర్ణన నుండి తాత్వికత దాకా ఆయన ఆలోచనల పరిధి ఈ సంపుటిలో విస్తరించింది. బాహ్య చమత్కృతి నుండి, లోతైన అభివ్యక్తి దాకా ఆయన రచనా శైలి పరుచుకొని ఉంది.” అని కితాబు నిచ్చారు.
“Indian Express” ఆంగ్ల దిన పత్రికలో శ్రీ గోవిందరాజుల రామకృష్ణారావు ఈ గ్రంథాన్ని సమీక్షిస్తూ ” Author of the book ‘VAAKYAM RASAATMAKAM’, Dr.Achaarya Phaneendra experiments by adopting a sentence as a unit for poetry. The subjects are varied. Each poem has a flash in it. The book is a delight for the lovers of new form of poetry.” అని ప్రశంసించారు.

ఆ గ్రంథంలోని కొన్ని ఏక వాక్య కవితలు మచ్చుకు కొన్ని ఆస్వాదించండి.

* అక్షరాలు సంగమించి అర్థాన్ని ప్రసవిస్తాయి.

* హృదయం కదిలింది- కళ్ళ నుండి నీళ్ళు బొటబొటా !

* తన్నినా లాలించింది- తల్లి కదా!

* బాల్యంలో తల్లిపై, యవ్వనంలో భార్యపై, వృద్ధాప్యంలో కోడలిపై ఆధారపడే మగాడు ఆడదాన్ని అబల అంటాడేమిటి?

* ఆ కవి ఎన్ని రాత్రులను మింగాడో, పగలు సూర్యునిలా వెలుగుతున్నాడు.

* ఆ కుడ్య చిత్రం ఒక మౌన కవిత!

* బుగ్గపై సొట్ట – నవ్వు పువ్వు నెవరైనా కోసుకొన్నారేమో!

* పువ్వుల గుత్తులను కొమ్మలతో పట్టుకొని, నాట్య భంగిమలో నిలుచుంది తరువు.

* పడుకొన్నవాడు లేచి, తిరిగి, మళ్ళీ పడుకోడమేగా జీవితం.

* జీవితాంతం దేని గురించి పరుగెత్తావో, జీవితాంతంలో అది నీది కాదు.

* నింగిని, నేలను నీళ్ళ దారంతో ఒక్కటిగా కుట్టే దర్జీ – సముద్రుడు.

* కళ్ళ కిటికీల గుండా మనసు తొంగి చూస్తుంది.

* శిల్పి కల శిలలో ప్రతిఫలించింది.

* మట్టి మనిషవుతుంది; మనిషి మట్టవుతాడు.

* నడుము తీగపై నాభి మొగ్గ!

* జీవితం – బ్లాక్ అండ్ వైట్ చిత్రం.

* కవి నా నామధేయం; నా కావ్యమే నా పరిచయం.

* ప్రేమించాను – త్యాగం నా భాష!

* వెచ్చదనం విలువ కన్నీటి నడుగు –

* భూమిపై మూడు పాళ్ళు నీళ్ళు, ఒక పాలే నేల- తరతరాల నుండి తాడిత, పీడిత ప్రజలెంత ఏడ్చారో?

* నీ కోసం జీవిత కాలం నిరీక్షించే ప్రేయసి- మృత్యువు!

* అవిశ్రాంత శృంగార సంగ్రామం- అందం చెమటలో తడిసిపోతోంది.

* ఆ చెట్టు కొమ్మలు మండుతున్నాయి అగ్ని పూల శిఖలతో!

* వెళుతున్నా- నా ముద్ర నీపై వదలి

* వాక్యం రసాత్మకం- ఉద్గ్రంథాలెందుకు?

—***—

“ఫుట్ బాల్” [పద్య కవిత]

“ఫుట్ బాల్” [పద్య కవిత]
——————————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర

images

అంత మర్రిచెట్టు నింతలో ఒదిగించు
’బోనుసాయి’ రకపు మొక్క వోలె –
పోల్చుకొనరె నన్ను? ’ఫుట్ బా’లనెడి నేను
ఉర్వి గోళమునకు నొక ప్రతీక!

విశ్వపతి యాడు క్రీడలో వెలసి, వసుధ
నరుల పద ఘట్టనల క్రింద నలిగినట్లు –
మనుజులాడు నీ ’ఫుట్ బాలు మ్యాచు’నందు
నన్ను నాటగాళ్ళును త్రొక్కి, తన్నుచుంద్రు!

పాపమొ? శాపమో? మరిది ప్రాప్తమొ గాని ఎరుంగ లేను – నన్
పాపమటంచు జూడరయొ! భండన భీముల యట్లు క్రీడలో
చూపరులెల్ల మెచ్చ, తగ జూపుచు స్పర్థయె, ఆటగాళ్ళు నా
రూపము మాసి పోవునటు – క్రోధము మీరగ తన్నుచుందురే!

అరె! పదకొండు మంది ఇటు, నట్లె యటున్ పదకొండు మందియా?
మరి, ఇరు వర్గముల్ నిలువ, మధ్యన – నేనిటు లొక్క దానినా?
ఇరువది రెండు మంది ఇటు లిష్టము వచ్చిన యట్లు తన్నుటా?
కరువది ఏమి వచ్చెనొ? ఒకండొక బంతిని తన్న రాదొకో?

కొందరు నీ మూలకు, మరి
కొందరు నా మూలకు, నను కొనిపోవుటకై –
ముందరి కాలను తన్నుచు
చిందర వందరను చేయ చిత్తయిపోదున్!

నలుబది నిముషము లటు నిటు
విలవిల లాడంగ తన్ని, విశ్రాంతి నిడన్ –
అలుపది తీరక మునుపే,
నలుబది నిముషములు మరల నా గతి యంతే!

బలి పశువట్లు జేసి నను బాది పదమ్ముల రెండు వర్గముల్
కలకల మెంతొ రేప – అది కాంచుచు పెద్ద మనీషి యొక్కడున్
గెలుపును నిర్ణయించునట! క్రీడన నిద్దియె? గుండె లేదె? నా
కలతను కాంచలేనియెడ కారిక పెద్ద యతండు, మీరునున్!

—***—

ఎన్నికలలో ఎన్ని కలలో!

evm-photo2

———————————–
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
————————————

ఎన్నికలలో ఎన్ని కలలో!
ఎన్ని కలలో! ఎన్ని కలలో!

దిక్కు తోచని తమను గాచే
చక్కనైన ప్రభుత కోసం
బక్క చిక్కిన బడుగు ఓటరు
కెన్ని కలలో ఎన్నికలలో!

ధనికులకు తమ లాభములకే
దమ్మునిచ్చే పాలసీలను
అమలుపరిచే ప్రభుత కోసం
ఎన్ని కలలో ఎన్నికలలో!

ప్రచారానికి పైసలిస్తే
పదో వంతే ఖర్చు చేసి,
మిగతా మ్రింగ, కార్యకర్తల
కెన్ని కలలో ఎన్నికలలో!

ఓటు ఓటుకు విలువ గట్టి
నాటు సారా కుమ్మరించి
పోటీలో గెలువగా నేతల
కెన్ని కలలో ఎన్నికలలో!

ఖర్చు పెట్టే ప్రతి పైసాకు
హెచ్చు రెట్లార్జింప, నేతకు
మంత్రి పదవే దక్కవలెనని
ఎన్ని కలలో ఎన్నికలలో!

ఉన్న పదవులు ఊడకుండా
ఎన్ని మార్లని చూడకుండా
మరల విజయం కోరు మంత్రుల
కెన్ని కలలో ఎన్నికలలో!

’వితుడ్రా’ చేసుకొంటే
విత్తమేదో దొరుకుతుందని
గాలివాటం క్యాండిడేటుకు
ఎన్ని కలలో ఎన్నికలలో!

విపక్షంలో ఉండి ఉండీ
విసుగు చెందిన పార్టీలకు
పాలనా భాగ్యమ్ము కోరి
ఎన్ని కలలో ఎన్నికలలో!

ఎన్ని కలలో! ఎన్ని కలలో!
ఎన్నికలలో ఎన్ని కలలో!!

(’ఈనాడు’ దినపత్రిక – 09-04-1996 నాటి సంచికలో ప్రచురితం)