సార్థకత

సార్థకత

రచన: డా. ఆచార్య ఫణీంద్ర
poetry
కవిగా జన్మించితివోయ్ –
సార్థకతను సాధించు!
రవిగా భాసించుటకై
పవిని చేత ధరియించు!
నీ ముందరి అన్యాయం –
నిప్పులతో నిరసించు!
తిమిరాలను ఖండించగ
దీప్తి ధార లిఖియించు!
చరిత్రలో ఘన కవిత్వ
మొలికించగ రచియించు!
కవిత్వాన ఘన చరిత్ర
నెలకొల్పగ  శ్రమియించు!

— &&& —

కృష్ణుడు – క్రీస్తు

300 ఇది నా ఈ బ్లాగులో 300 వ టపా!!!

christ & krishna

పుట్టినది జెయిలు – పుట్టె పసుల పాక –
అతని పుట్టు కెటులొ, ఇతని దటులె!
చంపు ’కంసుం’డంచు – చంపు ’హీరొద’టంచు
అతని స్థలము మార్చి, రితని దటులె!
మాయ ముందుగ జెప్పె – మరి, దేవదూ తిట –
అతని జన్మ రహస్య, మితని దటులె!
అతడు గోవుల గాచె – ఇతడు గొర్రెల గాచె –
అతని తత్త్వం బేదొ, ఇతని దటులె!

శాంతి రాయబారి, శాంతి దూత యగుచు –
గీత నతడు, మనుజ నీతి నితడు
బోధ జేసి, ఆత్మ ముక్తి మార్గము జూపె –
కృష్ణుని మది తలచ క్రీస్తు మెదలు!

అందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలతో …

– డా. ఆచార్య ఫణీంద్ర

సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మానసిక పరిస్థితి

                                    ఇది నా శిష్యుడు – చిరంజీవి ‘పన్నగ శాయి’ తన “ధర్మమేవ జయతే” బ్లాగులో ప్రచురించిన టపా. ఈ టపాలోని అభిప్రాయంతో సీమాంధ్రులు ఎంత వరకు ఏకీభవిస్తారో తెలియదు గాని, ఇది – సీమాంధ్ర ప్రజాప్రతినిధుల ప్రస్తుత మానసిక పరిస్థితికి అద్దం పడుతున్నదన్న విషయం అందరూ అంగీకరించక తప్పదు.

– డా. ఆచార్య ఫణీంద్ర

dj1

dj2

“భువన విజయం” లో …

12 డిసంబర్ 2013 నాడు సాయంత్రం హైదరాబాద్ త్యాగరాయ గాన సభలో ప్రదర్శించిన “భువన విజయం” సాహిత్య రూపకంలో “నంది తిమ్మన కవి” రూపంలో నేను …

– డా. ఆచార్య ఫణీంద్ర

bv1

bv3

bv2

వేరు కాపురమ్ము

“వేరు కాపురమ్ము”

రచన : “పద్య కళా ప్రవీణ” డా. ఆచార్య ఫణీంద్ర

tg

‘అరువది తొమ్మిది’న్ మరియు నా పయి రేగిన యుద్యమాలలో
నొరిగిన కంఠ మాలల మహోన్నత త్యాగ ఫలంబునౌచు, నే
డరుగుచు నుండె గాదె ’తెలగాణము’ పూర్ణ స్వతంత్ర మొందుచున్!
అరువది యేండ్ల స్వప్న మిది, యాకృతి దాలిచి ముందు నిల్చెడిన్!!

నా ’తెలంగాణ’ కోటి రత్నాల వీణ
సర్వ స్వాతంత్ర్య రాష్ట్రమై సాకృతి గొన –
నమరులైన వీరుల యాత్మ లందె శాంతి!
మురియుచుండ్రి ’తెలంగాణ’ భూమి సుతులు!!

ఒక రాష్ట్రమందునే యొక సంస్కృతి యటన్న
చిన్న చూపును జూడ చింత నొంది,
యొక భాష యందునే యొక మాండలిక మటన్న
కించ పరుప జూచి కినుక బూని,
యొక ప్రాంత ప్రజలపై యొక రాధిపత్యమ్ము
నడిపింపగ తెలగాణ ప్రజ లెల్ల
దాయాది పోరులో ధర్మాగ్రహమ్ముతో
వేరు కాపురమును కోరినారు!

ఒక్క గూటిలో నివసించి యొకరి నొకరు
తిట్టి దుమ్మెత్తి పోయు నా తీరు కన్న,
యన్నదమ్ములై విడిపోయి యాదరమును
పంచుకొను మార్గమె తెలుగు ప్రజకు గలిగె!

మరచి వైషమ్యముల నెల్ల మనము లందు
“రాష్ట్రములె వేరు – తెలుగు వార లొకటె!” యని,
సోదరులుగ నింక పరస్పరాదరమును
నాంధ్ర, తెలగాణ రాష్ట్రీయు లందుకొనుత!

       — &&& —

“గాలి బ్రతుకులు”

‘చిత్ర’ సకుటుంబ సచిత్ర మాస పత్రిక (డిసెంబర్ 2013 సంచిక) లో నా పద్య కవిత – “గాలి బ్రతుకులు” ప్రచురితమయింది. ఆ కవితను సాహిత్యాభిమానుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ch2