అంకితోత్సవ సభలో …

నా శిష్యుడు “శంకు” నాకు తన గ్రంథాన్ని అంకితం చేసిన సభలో …

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

 

ప్రకటనలు

సాదరాహ్వానం!

జంట నగరాల‌ సాహిత్యాభిమానులందరికీ సాదరాహ్వానం!
– డా. ఆచార్య ఫణీంద్ర

గ్రామ స్వరాజ్యం

గ్రామ స్వరాజ్యం

రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
————————————————-


పచ్చని గ్రామముల్ వెలసి,
పాడియు పంట సమృద్ధి నొందగా
వచ్చిన భాగ్యముల్ గలిగి
వర్ధిల రైతు కుటుంబముల్ – సదా తెచ్చెడి సంతసంబునకు
దేశములోపలి అన్ని రాష్ట్రముల్
విచ్చిన పూల వోలె మురి
పించుత కీర్తి పరీమళమ్ముతో!

నగరమునకు దీటుగ – పల్లె నవ్య రీతి
విద్య, వాణిజ్య, వైద్యాల వెలుగు గాక!
ఆధునిక పరిశ్రమ వాడలన్ని వెలసి
గ్రామమే దేశమున స్వర్గధామ మగుత!

స్వామియు, సేవక భేదము
లే మాత్రము లేని యట్లు నెల్లరు
మురియన్
గ్రామ స్వరాజ్యము వెలయుత –
భూమిసుతులు సకల వృత్తి పోషణ
గొనుచున్!

ఏ గ్రామమందున ఎల్ల విద్యార్థులు
ఉన్నత విద్యల నొందగలరొ –
ఏ గ్రామమందున ఎల్ల యువత తగు
ఉద్యోగ ప్రాప్తితో ఊరడిలునొ –
ఏ గ్రామమందున వృద్ధులు, బాలలున్
ఆరోగ్య రక్షణ నందగలరొ –
ఏ గ్రామమందున ఎల్ల నారీమణుల్
పురుష సమానులై వరలగలరొ –

అట్టి గ్రామాలతో దేశ మలరు గాక!
పట్టణములకు సాగెడి వలస లాగి,
పల్లెలు సుభిక్షమై శక్తివంత మగుచు
చేకురవలె సర్వార్థ సంక్షేమ మవని!

(ఇటీవల శ్రీ పి. వి. మనోహర రావు (పూర్వ ప్రధాని శ్రీ పి. వి. నరసింహా రావు గారి సోదరులు) గారి సంస్థ “సర్వార్థ సంక్షేమ సమితి” రజతోత్సవ సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆలపించిన కవిత -)

 

 

— @@@ —

మట్టి గణపతి

మట్టి గణపతి
——————
రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా.ఆచార్య ఫణీంద్ర
————————————————–

అరయ “ముల్తాని మట్టి”తో, అందమలర
అంబ పార్వతి స్నానంబు నాడు వేళ –
భావన చిగుర్చి, మట్టి రూపంబు గట్టి,
బాల గణపతి బొమ్మగా కేల వెలసె!

రూపము దాల్చిన బొమ్మకు
ఆ పర్వత రాజ పుత్రి ఆయువు నిడగా –
పాపడునై ఆ గణపతి,
ఆపై విఘ్నాధిపతిగ నందెను పూజల్!

మట్టికి రూపమీయగ “ఉమాసుతు” డైనటువంటి సత్కథన్
గట్టిగ నమ్ము భక్తులది గానక, “పీ.ఒ.పి.” విగ్రహంబుల
న్నెట్టుల నిల్పి పూజ నొనరింతురయా? అది తప్పు గాదొకో?
మట్టి వినాయకుండె మహిమాన్వితమై అలరారు నిద్ధరన్!

యుక్తము మట్టి గణపతియె!
భక్తి కథానుగుణమగును! పర్యావరణా
సక్తిని సైతము గాచును!!
ముక్తిినొసగు కలుషిత జలముల నుండి అదే!

కనుక భక్తు లెల్ల గట్టి ప్రతిన బూని
“మట్టి గణపతి” నిలబెట్టి, కొలిచి –
ఇహము నింక పరము లిరురీతి మేల్గూర్చు
ధర్మపథమున జని ధన్యు లగుత!

— &&& —