కవి సంతకాలు


నిండియు నిండకుండనె కనీసము బాల్యము గూడ నాకు, మున్
గుండెకు చిల్లు బడ్డదని ఘొల్లున యేడ్చిన నాదు తల్లితో –
“ఉండవె అమ్మ! అంతగ మనోవ్యథ యేలనె? చిల్లు బడ్డచో,
దండిగ లోని పద్య సుధ ధారగ కారు” నటంచు పల్కితిన్!

***

ఇష్ట సఖి అధరమ్ము జూచి మోహింతు-

నికృష్ట జీవుల రుధిరమ్ము గాంచి విలపింతు-

కష్ట సుఖములకు స్పందించి కదలు

ఉత్కృష్టమైన కలము నాది!

***

వివక్ష ఎక్కడ ఉన్నా

వినిపిస్తా నా గొంతు!

సమాన హక్కుల కోసం

పోరాడుట నా వంతు!

***

భరతమాత శిరస్సు –

బహు మతాల సదస్సు –

హిమవన్నగ రోచిస్సుల

“కాశ్మీరు” కు నమస్సు!

***

దేశ భాషలందు తెలుగు లెస్స యనుట

ప్రాత వడిన మాట -శ్రోతలార!

దేశ భాషలును, విదేశ భాషలునెల్ల

విశ్వ భాషలందు వెలుగు తెలుగు!

***

భావావేశము పొంగి పొర్లి నదియై పారంగ, పద్యంబులే

వేవేలై ఎగసెన్ మదీయ హృది నువ్వెత్తున్ తరంగాలుగా –

నా వాక్కందున తోయమయ్యె రుచిగా, నానా రసాల్ పంచగా!

రావే! ఆంధ్ర రసజ్ఞ! తేల, రస ధారా స్నాన పానంబులన్!

***

నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై

ఆకాశమంత ఎత్తార్చినాను –

నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి

పద్యాలు గొంతెత్తి పాడినాను –

నే దాశరథి కవి నిప్పు లురుము గంట

మొడుపులన్ కొన్నింటి బడసినాను –

నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై

పద్య ప్రసూనాల పంచినాను –

 

ఐదు కోటుల సీమాంధ్రులందరికిని
మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి,
మూడునర కోట్ల ప్రజలకు ముక్తి గలుగ –
పాడినాను తెలంగాణ భాగ్య గీతి!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: