అభినందన సుస్వర గీతిక

sr2

 

 

 

 

అభినందన సుస్వర గీతిక

 (ప్రముఖ గాయని శ్రీమతి శారదా రెడ్డి గారు తమ గాన కళా జీవన ప్రస్థానంలో నలుబది వసంతాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా,  ‘రసజ్ఞ’ సంస్థ వారు రూపొందిస్తున్న ’సావనీరు’కు  నేను అందించిన అభినందన పద్య మాలిక)         

 

–  “పద్య కళా ప్రవీణ”

    డా. ఆచార్య ఫణీంద్ర

 

 

తే.గీ. ఉద్యమాల నేపథ్యంబు నున్న ఇంట
        ఉద్భవించి, “ఉద్యమ గీత” ముగ్గు పాల
        ఒంట బట్టించుకొన్నట్టి ఉవిద వీవు!
        శారద! మధుర గాయని! సార్థకాఖ్య!

 

చం. నలుబది వత్సరాలుగ, అనారత గాన కళా తపస్సునం
       దలుపను నద్ది లేని యటు లద్భుత రీతిని మున్గి దేలుచున్ –
       తెలుగు ధరిత్రిపై “విమల దివ్య సుగాన కళా విపంచి”గా
       వెలసితివమ్మ! శారద! విభిన్న విశిష్ట కళా విశారదా!

 

కం. అభినుత సుస్వర సేవల 

      అభిమానుల నలరజేయ – “ఆలాపన” యం

      చభిధానము గల సంస్థను
      అభినవ శారద! నడిపెద, వభినందనముల్!

                        —- *** —-

ప్రకటనలు

బొమ్మ

నలుబది వేలు …

నలుబది వేల వీక్షకులు నాదగు నీ రమణీయ ‘బ్లాగు’నున్

చెలగియు ప్రేమ మీర దరిశించిరి నేటికి – నాలుగేళ్ళలో 

పలు విధ శీర్షికల్ నిలిపి; పద్యము, గద్యము, గేయ మాదిగా 

గల బహు ప్రక్రియల్ వెలయ, కానుక లిచ్చిన తృప్తి నొందితిన్!

 

 

అందరికీ ‘వినాయక చతుర్థి’ శుభాకాంక్షలతో –

 

డా. ఆచార్య ఫణీంద్ర