మౌక్తిక హారం – 2
30 నవం 2012 2 వ్యాఖ్యలు
” నాకు స్వేచ్ఛ వలయు ” – కేక పెట్టుచు నిట్లు
పూవులునయ్యె తారకలు; పుష్ట ఫలమ్మయె చందమామ; నె
ఆ నడురేయి శయ్యపయి యౌవన మాధురులొల్కు పత్నినిన్,
వేసవి కాలమందు నిశ వేళల ఆరు బయళ్ళ మంచమున్
పాలుగారెడినట్టి పసిబుగ్గలనుగల్గు
ముదిమి వయసునందు ముదిరిన జబ్బులో
ఎడ నెడ పృథ్వియందు రమణీయ కవిత్వము, సత్కళాకృతుల్,
భావావేశము పొంగిపొర్లి నదియై పారంగ, పద్యంబులే
భువిని విధ్వంసక క్రియల్ పూన వలదు –
అవ్వకు బుట్టువారె జనులందరు; అందరి కాకలైనచో
విజయనగర రాజ్య విభవమ్ము గతియించె –
కలిగిన నవ్య భావనల కమ్మని పద్యములట్లు కూర్చుచున్,
తడియు మిత్రునొకని దాతృత్వ బుద్ధితో
ఆకలిగొన్నవానికగు అన్నపుముద్దగ – ఎండిపోయెడిన్
జన్మదినం
25 నవం 2012 7 వ్యాఖ్యలు
25 నవంబర్ 2008 నాడు ప్రారంభించబడిన నా ఈ బ్లాగు ఈ రోజుతో నాలుగేళ్ళు పూర్తి చేసుకొని 5వ జన్మదినం జరుపుకొంటుంది. ఈ నాలుగేళ్ళలో 200 పైగా పోస్టులను ప్రచురించబడి, 42 వేలకు పైగా వీక్షణలను సాధించింది ఈ బ్లాగు. నా ఈ నాలుగేళ్ళ అంతర్జాల ప్రస్థానంలో “నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం”, “మౌక్తికం” అన్న మరో రెండు బ్లాగులను ప్రారంభించి, ఒక్కొక్క దానిలో నూరు పోస్టుల చొప్పున ప్రచురించాను.
ఈ రోజు “పుస్తక పరిమళం” పేర మరొక కొత్త బ్లాగును ప్రారభిస్తున్నాను.
దాని url :
drphaneendra.wordpress.com
దానిని కూడ దర్శించి ఆశీర్వదించగలరని ప్రార్థన!
– డా. ఆచార్య ఫణీంద్ర
వార్తా కథనాలు …
12 నవం 2012 1 వ్యాఖ్య
నిన్న హైదరాబాదులోని తెలుగు లలిత కళా తోరణంలో నిర్వహించబడిన ’తెలుగు తోట’ కార్యక్రమాలపై వివిధ వార్తా పత్రికలలో వచ్చిన కథనాలను అందిస్తున్నాను. సాహిత్యాభిమానులు చదువగలరు.
– డా. ఆచార్య ఫణీంద్ర
తెలుగు తోట
12 నవం 2012 2 వ్యాఖ్యలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంస్కృతిక శాఖ, ‘సాధన సాహితీ స్రవంతి’ సంయుక్తాధ్వర్యంలో, హైదరాబాదులోని ‘తెలుగు లలిత కళా తోరణంలో, గడచిన మూడు రోజులుగా ‘తెలుగు తోట’ పేరిట తెలుగు భాషా సాహిత్య సంస్కృతులకు సంబంధించిన వస్తు కళా ప్రదర్శన(ఎగ్జిబిషన్)తోబాటు, వివిధ సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించింది. నేటి సమాపనోత్సవంలో భాగంగా నిర్వాహకులు నాకు ‘డా.ఆచార్య తిరుమల స్మారక పురస్కారం’ ప్రదానం చేసి సత్కరించారు. నాతోబాటు డా.రాపాక ఏకాంబరాచార్య, డా. ముదిగొండ శివప్రసాద్, డా. వెలుదండ నిత్యానంద రావు, డా. వాడ్రేవు చిన వీరభద్రుడు పురస్కారాలను అందుకొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సాంస్కృతిక సలహాదారు డా. కె.వి.రమణాచారి గారు, ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారు, శ్రీమతి హైమవతి భీమన్న గారు అతిథులుగా పాల్గొన్నారు. ఆ విశేషాలను చూడండి.
– డా. ఆచార్య ఫణీంద్ర
ఆహ్వాన పత్రిక :
తెలుగు తోటలో దేవాలయం స్టాల్ :
పండుగల స్టాల్ :
పుణ్య క్షేత్రాల స్టాల్ :
సభా వేదిక :
నా సత్కారం చిత్రాలు :
మౌక్తిక హారం – 1
04 నవం 2012 2 వ్యాఖ్యలు
మౌక్తిక హారం
నా మరొక బ్లాగు “మౌక్తికం” లో ఒక మెరుపులా ఆలోచనలు మెరిసినప్పుడు రూపు దిద్దుకొన్న ముక్తక పద్యాలను పోస్టులుగా అందిస్తున్నాను.ఆ బ్లాగు ఇటీవలే వంద పోస్టుల మైలు రాయిని దాటింది. వాటిలో నాకు బాగా సంతృప్తిని ఇచ్చిన పద్యాలను ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఆస్వాదించండి.
– ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర
పెండ్లి కూతురు
అరయ కవనమన్న ఆలోచనమె గదా !
ఊహ విస్తరించి దేహమగును –
మేలి పదములన్ని మెరుగు భూషలగును –
కూడి, కవిత పెండ్లి కూతురగును !
మత్తు
మందు త్రావినపుడె మత్తెక్కునను మాట
ఉత్త మాట ! వట్టి చెత్త మాట !
మంచి కవిత గ్రోల, మత్తెక్కు నాకెంతొ –
దిగదు మత్తు త్వరగ ! దిగదు ! దిగదు !
ఇంచుక బిందువు …
పెక్కుగనుండు వేయి, పదివేలని గాకయు లక్షలాదిగా
చుక్కలు నింగియందు కనుచూపుకు తోచుచు; కంటి చూపుకున్
దక్కకయున్నయట్టి ఘన తారకలెన్నియొ విశ్వమందునన్ –
ఎక్కడ మానవుండు ? అతడించుక బిందువు సంద్రమందునన్ !
ఒకింత నవ్వరా !
ఏడ్చుచు భూమిపై పడెద; వేడ్చెద వా పయి అమ్మ పాలకై;
ఏడ్చెద వన్నమున్ తినగ; ఏడ్చెద వేగగ పాఠశాలకున్;
ఏడ్చెద వీవు జీవనము నీడ్చుచు తాకగ నాటు పోటులున్;
ఏడ్చెద వట్లె చచ్చుటకు – ఏడ్పుల మధ్య ఒకింత నవ్వరా !
ఆకలి
దాహమైన యపుడు త్రాగు నీరు వలయు –
పసిడి ద్రావకమ్ము పనికి రాదు !
ఆకలైన వేళ అన్నమే కావలెన్ –
వజ్రములవి తినగ పనికి రావు !
వరియన్నము
అప్పుడ వండి వార్చు వరియన్నము పళ్ళెమునందునుంచగా
గుప్పున వేడియావిరులు కొల్లలుగా ముఖమందు సోకగా
చెప్ప తరంబె ఆకలికి చిత్తయియున్నటువాని గుండెలో
డప్పులు మ్రోగినట్లగును – డాసినయట్లనిపించు స్వర్గమున్ !
బంగారు గడ్డ
సత్య వాక్పథ దీక్ష సాగించు క్రమములో
సతిని, సుతుని అమ్ము సహన గుణము –
పితృ వాక్య పాలన ప్రియముగా తలదాల్చి,
వన వాసమున కేగు వినయ గుణము –
ప్రాణ హానియునైన, వర కవచము జీల్చి
దానమ్మొసంగు వదాన్య గుణము –
పతి ప్రాణ రక్షకై భయ కంపములు వీడి
సమునితో ఎదురించు సాధ్వి గుణము –
రాజ్య, భోగమ్ము, లర్ధాంగి, ప్రాణ సుతుని
సత్య శోధనకై వీడు సత్త్వ గుణము –
ఇన్ని సుగుణాల గల పుణ్య హృదయ వరుల
బిడ్డలుగ గన్న బంగారు గడ్డ మనది !
బాలీవుడ్ టాప్ గ్లామరస్ హీరోయిన్స్
అందగత్తెగ తొల్త అలరించె ’ నర్గీసు ’;
’ నూతన్ ’ చెలువము మనోజ్ఞమగును;
మధువులొలుకు రూపు ’ మధుబాల ’ కే సొత్తు !
అతి మనోహరి ’ వైజయంతి మాల ’;
భామలందున మేటి ’ హేమ మాలిని ’ చెన్ను;
’ రేఖ ’ సౌందర్య సురేఖ సుమ్ము !
అందాల బొమ్మ ’ జయప్రద ’ యన చెల్లు;
దివ్య శోభలిడు ’ శ్రీదేవి ’ సొబగు !
మదిని దోచెడు కొమ్మ ’ మాధురీ దీక్షిత్తు ’;
కోమలాంగి మనీష కోయిరాల;
విశ్వ విఖ్యాతమ్ము ’ ఐశ్వర్య రాయ్ ’ సొంపు;
ప్రీతి నందించు ’ కరీన ’ సొగసు –
’ బాలివుడ్డు ’ సినిమ ప్రారంభమందుండి
భారతీయ పురుష వరుల మదుల
దోచుకొన్నయట్టి దొరసానులే వీరు !
కనుడు కన్నులార ! కొనుడు ముదము !
(ఇది అత్యధికంగా వీక్షించబడిన పోస్ట్ )
‘డబ్బు’ జబ్బు
కనులు నెత్తికెక్కు – గర్జించు కంఠమ్ము –
చెవుల దీన ఘోష చేరబోదు –
పొరుగు వార లెల్ల పురుగు లట్లగుపించు –
’డబ్బు’ జబ్బు గలుగు డాబుసరికి !
‘ డాలర్ ‘
డబ్బన పిచ్చి! అందునను, ‘డాలర’ టన్న మరింత పిచ్చి! ఏ
సుబ్బికి చూలు వచ్చినను, చూచును స్వప్నము – పుట్టబోవు నా
అబ్బియె ‘కంప్యుటర్’ చదివి, ‘అమ్మెరికా’ భువికేగి, ‘డాలరుల్’
దొబ్బియు పంపగా, నవియె దోపగ సంచులు నుబ్బినట్లుగాన్!
చిత్రం !
ఒక శిల గుడిలో ప్రతిమగు –
ఒక శిల ఆ గుడికి ముందు నొదుగును మెట్టై –
ఒకదానిని మ్రొక్కెదరు – మ
రొకదానిని త్రొక్కెద, రదియొక చిత్రమ్మే !
’ ఫ్యూడలిస్టు ’ బుద్ధి
వామపక్ష భావ వాదిని ‘మార్క్సు’పై
చిరు ప్రసంగ మొకటి చేయ బిలువ –
కారు పంపకున్న కదలబోనన్నాడు!
‘ఫ్యూడలిస్టు’బుద్ధి పోవు నెట్లు?
(ఇంకా కొన్ని తరువాత పోస్టులో…)
—***—
జాబిలి కుమిలింది …
01 నవం 2012 వ్యాఖ్యానించండి
జాబిలి కుమిలింది … ( విషాద గీతం)
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
జాబిలి కుమిలింది –
తరిగింది!
మేఘం ఉరిమింది –
కరిగింది!
నీ హృదయం పగిలింది గానీ …
కన్నీరైనా ఒలకవేమి? || జాబిలి ||
నీ కన్నులలో కాటుక నలుపే
లోకం నిండిందా?
నీ గుండెలలో వేదన బరువుకు
భూమే కుంగిందా?
ఓ ఆకాశమా!
నీ ముఖమెందుకు నల్ల బారె?
ఈ ఆశల తారక …
నేడెందుకు నేల జారె? || జాబిలి ||
ఆత్మీయత – అనుబంధం –
అంతా ఒక మిథ్యేనా?
ఆచారం – సంప్రదాయం –
అంతా ఒక రొచ్చేనా?
ఓ హోమ కుండమా!
నీ అగ్నిని నియంత్రించు!
అది ఒక చితి మంటగా
కాకుండా నిలువరించు! || జాబిలి ||
కరుగని ఈ రాతిరికి
ఉదయం వస్తుందా?
కడు చిక్కని చీకటికి
వెలుగే ఇస్తుందా?
ఓ నవ రవి బింబమా!
నీ వెక్కడ దాగున్నావు?
ఈ మానవ జాతిని
నీ వెప్పుడు మేల్కొలిపేవు? || జాబిలి ||