2 జనవరి 2017 నాటి సాయంత్రం త్యాగరాయ గాన సభలో నూతనాంగ్ల సంవత్సర సందర్భంగా నిర్వహించిన కవి సమ్మేళనంలో నా కవితా గానం ..
– డా. ఆచార్య ఫణీంద్ర
నవ వర్ష గ్రంథము
————————
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
————————————–
మూడు వందల పై చిల్కు పుటలు గల్గు
పుస్తకమ్మును నేడింక మూసి వేసి,
క్రొత్త పుస్తకమ్మును జనుల్ కోరి తెరచు
సముచిత ముహూర్త మిప్పు డాసన్నమయ్యె!
ఒకొక పుటలోన నొక కల –
ఒకొకటి నెరవేరు – తీర కొకొకటి మిగులున్!
రకరకముల సుఖ దుఃఖాల్
చక చక రుచి జూపి సాగు సంవత్సరమే!
సాక్షిగ కాలమున్ నిలువ సాగిన దింకొక వత్సరంబు – నే
వీక్షణ జేయుచుండ నగుపించెను నూతన వత్సరంబు, తా
సాక్షిగ నిల్చె కాలము – “డిసంబరు ముప్పది యొక్క” టర్ధ రా
త్ర్యక్షర పాత్రమైన బహుళార్థక నూతన గ్రంథమిచ్చుచున్!
ఆశావహ దృక్పథమున
ఈశోపాసన సలిపెద నీ నవ గ్రంథం
బాశించిన రీతి లిఖిత
మై, సాగగ నవ్య వర్ష మానందముగాన్!
మిత్రులార! కొనుడు – మీ నవ వర్ష గ్రం
థమ్ములు వికసించి దాని పుటలు
సంతసమ్ముల నిడు సంపదలై నిల్వ –
అందజేయుదు నభినందనములు!
— @@@ —