సౌమనస్యం

సౌమనస్యం

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

అతడు చంద్రుణ్ణి చూసి గాని –

పండుగ చేసుకోడు !

ఇతడు పండుగ చేసుకొన్నాక –

చంద్రుణ్ణి చూడడు !

అయినా …

వాళ్ళిద్దరూ ఒకేరోజు

పండుగ చేసుకొంటున్నారు !

ఒకళ్ళనొకళ్ళు ఆలింగనం చేసుకొంటున్నారు !

’ అలై బలై ’ తీసుకొంటున్నారు !

అతడందించిన ’ సేమియా కీరు ’

ఇతడు ఆనందంగా సేవిస్తున్నాడు !

ఇతడందించిన ’ ఉండ్రాళ్ళ పాయసం ’

అతడు సంతోషంగా త్రాగుతున్నాడు !

ఇదే హైదరాబాదులో …

మత సామరస్యం !

ఇదీ భాగ్యనగరంలో …

జన సౌమనస్యం !

ఇక్కడ –

’ మక్కా మసీదు ’, ’ గణేశ మంటపం ’

అభిముఖంగా నిలుచొని, పరస్పరం

అభినందనలు తెలుపుకొంటున్నాయి !

అభివందనాలు సమర్పించుకొంటున్నాయి !

ఇప్పుడిక –

ఈ చవితి నాటి నుండి …

నగర వీధులంతా పున్నమి వెన్నెలలే !

’ హుసేన్ సాగర్ ’ నీళ్ళ నీలిమలో మెరుస్తూ

ఏకదంతుని ఏకైక దంత ధవళ కాంతులే !

— # # # —

[ హిందువులందరికీ ’ వినాయక చతుర్థి ’ శుభాకాంక్షలు !

మహమ్మదీయ సోదరులకు ’ ఈద్ ముబారక్ ’ !

– డా. ఆచార్య ఫణీంద్ర ]


విశాల భాస్వంత చరిత్ర

విశాల భాస్వంత చరిత్ర

రచన : ’పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

( హైదరాబాదులోని ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం’ యొక్క 110వ వ్యవస్థాపక దినం సందర్భంగా …
2010 సెప్టెంబర్ 1,2,3 తేదీలలో నిర్వహించబడుతున్న వార్షికోత్సవాలలో …
మొదటి రోజు … ప్రారంభ సమావేశంతోబాటు, డా. నిడమర్తి నిర్మలాదేవి రచించి, సమర్పించిన ’భామినీ భువన విజయం’ సాహిత్య రూపక ప్రదర్శన జరిగింది. ఇందులో డా. నిడమర్తి నిర్మలాదేవితోబాటు డా. వేలూరి రేణుకాదేవి, డా. రాజలలిత, డా. కుసుమకుమారి, శ్రీమతి రమణ కుమారి, శ్రీమతి భారతీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రెండవ రోజు … ’తెలుగు భాషా సాహిత్య సాంస్కృతిక వికాసం’ అన్న అంశంపై సదస్సు నిర్వహించబడింది. దీనికి సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్వీ రామారావు అధ్యక్షత వహించారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ’రిజిస్ట్రార్’ ఆచార్య టి. గౌరీశంకర్, ’ఆంధ్రజ్యోతి’ దిన పత్రిక సంపాదకులు డా. కె. శ్రీనివాస్, ప్రముఖ రచయిత్రి డా. అబ్బూరి ఛాయాదేవి, ప్రముఖ కవి, చిత్రకారులు శ్రీ శీలా వీర్రాజు సదస్సులో పాల్గొని ప్రసంగించారు. అనంతరం ’శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం భాషాసేవ’ అన్న అంశంపై డా. జె. బాపురెడ్డి అధ్యక్షతన ’కవి సమ్మేళనం’ జరిగింది. ఇందులో డా. తిరుమల శ్రీనివాసాచార్య, డా. వి. యల్. యస్. భీమశంకరం, డా. పోతుకూచి సాంబశివరావు, డా. రాపాక ఏకాంబరాచార్య, శ్రీమతి శైలజామిత్ర తదితరులతోబాటు నేనూ పాల్గొన్నాను.
మూడవ రోజు … ముగింపు సమావేశంతోబాటు, St. Patricks High School, సికింద్రాబాదు విద్యార్థులచే ’బాలల భువన విజయం’ నిర్వహించబడుతుంది.
ప్రతిష్ఠాత్మకమైన ఈ వార్షికోత్సవ సభలకు ’సమావేశ కర్త’ గా వ్యవహరించే భాగ్యం నాకు కలిగింది.
రెండవ రోజు నాటి ’కవి సమ్మేళనం’లో నేను చదివిన కవిత ఇది – )

రాజ ’రావిచెట్టు రంగరాయ’ని కల
సత్యమై నిలిచిన సదన మిద్ది –
’ఉరుదు’ వనిని తెలుగు పరిమళాల్ వెదజల్లు
మొట్ట మొదటి తెలుగు మొక్క ఇద్ది –

మున్ను ’పాల్వంచ’, ’మునగాల’ భూపతులును,
’కొమరరా’,’జాదిరా’జాది కోవిదులును,
’లక్ష్మి నరసమ్మ’ సహృదయ లక్ష్మి చలువ –
వెలసె ’భాషా నిలయ’ మిద్ది’, వెలుగు చూప !

’హైద్రాబాద్’ నడి బొడ్డున
నిద్రాణిత తెలుగు భాష నిగళాల్ తెగియున్,
భద్రత చేకూరుటకై –
ముద్రాంకితమాయె నిద్ది మూర్థన్యమునై !

వనితాభ్యుదయముకై పలు ప్రసంగాలిచ్చి,
’మాడపాటి’యె తెచ్చె మార్పు నిచట –
ఆంధ్రోద్యమాకాంక్ష కక్షతల్ జల్లిరి
’బూర్గుల’, ’సురవరము’ విదు లిచట –
’కదలి రండు ! ’నిజాము’ కథ తేల్చుదా’ మంచు
’కాళోజి’ ఇచ్చోట కంఠమెత్తె –
’నా తెలంగాణ రత్నాల వీణ’ యటంచు
’దాశరథి’ ఇట పద్యాలు పాడె –

ఎరుక గలుగ, గ్రంథాలయ మేరుపడగ –
జరుప సారస్వత సభల సంబరముగ –
పరిఢవిల్లె నాంధ్రోద్యమ గరిమ మిచట –
కరకు రక్కసి పాలకు నిరుకు బెట్ట !

ఇంతయి, ఇంతకింతయి, మరెంతయొ వర్ధిలి, ’హైద్రబాదు’ జ
న్మాంతర బంధమై నిలిచి, ఆంధ్ర జనావళి పాలి దివ్య క
ల్పాంతర వృక్షమౌచు, నజరామర కీర్తి గొనెన్ విశాల భా
స్వంత చరిత్రతో – తెలుగు జాతి సమస్తము గర్వమొందగాన్ !

జరిగెను రజతోత్సవములు –
వరలగ వైభవము స్వర్ణ, వజ్రోత్సవముల్ –
జరిపిరి అమృతోత్సవములు –
జరిగె శతాబ్ద్యుత్సవములు – జనతతు లలరన్ !

’చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి’, ’చిలకమర్తి’,
’సర్వెపల్లి’, ’మల్లంపల్లి’, ’జాష్వ’, ’అడివి’,
’విశ్వనాథ’, ’కాటూరి’ ప్రభృతులు వచ్చి –
పొంది సత్కారముల, నెంతొ పొంగి రిచట !

పూర్వ గ్రంథాలయోద్యమ పుణ్య చరిత
లో సువర్ణాక్షర లిఖిత శ్లోక మిద్ది –
అరయ, ’శ్రీకృష్ణదేవరా’యాంధ్ర విభుని
స్మృతికి నిలయమై నిలిచిన చిహ్నమిద్ది –

’కే. వీ. రమణ’యు, ’ఎమ్మెల్’
భావిని మరియింత వెలుగ, ’భాషా నిలయం’
బీ విధము తీర్చి దిద్దిరి –
ఈ విధి వర్ధిల్లు గాక ఎన్నొ శతాబ్దుల్ !

—- *** —-