జూన్ నెలలో బిజీ బిజీగా …

Image0501

జూన్ నెలలో బిజీ బిజీగా …
* డా || ఆచార్య ఫణీంద్ర

జూన్ నెల సాహిత్య కార్యక్రమాలతో చాలా బిజీ బిజీగా గడచి, నాలోని సాహితీ వేత్తకు ఎంతో సంతృప్తి నిచ్చింది.

ముందుగా 03 -06 – 2009 నాడు, ” నవ్య సాహితీ సమితి, హైదరాబాదు ” వారు నారాయణగూడలో ఉన్న YMCA హాలులో శ్రీశ్రీ శత జయంతి సంవత్సరం సందర్భంగా నా చేత శ్రీశ్రీ విరచిత ” మహా ప్రస్థానం ”  కావ్య గానం ఏర్పాటు చేసారు. సుమారు గంటన్నర సేపు వ్యాఖ్యాన యుక్తంగా సాగిన ఈ కావ్య గాన సభలో జ్ఞాన పీఠ్ అవార్డ్ గ్రహీత డా || సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డా || అబ్బూరి ఛాయాదేవి , డా || ముక్తేవి భారతి , డా || కె.బి. లక్ష్మి వంటి  విశిష్ట అతిథులు , మరెందరో ప్రముఖులతో కూడిన సభాసదుల సమక్షంలో నేను ” మహా ప్రస్థానం ” లోని దాదాపు 30 కి పైగా గేయాలను  ఎంతో ఉత్తేజ పూరితంగా , వేగం , లయలను ప్రతిఫలిస్తూ గానం చేసి సభాసదుల మన్ననలను అందుకొన్నాను. మరుసటి రోజు అన్ని దిన పత్రికలలో ఫోటోలతోసహా  మంచి ” కవరేజ్ ” వచ్చింది.

07 – 06 – 2009 నాడు ” ఆకాశ వాణి ” ( హైదరాబాదు కేంద్రం ) లో ” పద్యం _ భావం ” అన్న కార్యక్రమం కోసం రెండు భాగాలుగా నా ప్రసంగాలను రికార్డు చేసారు. మొదటి భాగంలో తిక్కన మహాకవి రచించిన ” ఆంధ్ర మహా భారతం ” లోని

పగయె గలిగెనేని పామున్న ఇంటిలో
ఉన్న యట్ల కాక, ఊరడిల్లి
యుండునెట్లు చిత్త మొక మాటు గావున _
వలవ దధిక దీర్ఘ వైర వృత్తి !

అన్న పద్యాన్ని రాగ యుక్తంగా పాడి, అందులోని భావాన్ని, సందేశాన్ని వివరించాను. రెండవ భాగం కోసం పోతన మహాకవి విరచిత ” ఆంధ్ర మహా భాగవతం ” లోని

చదువనివా డజ్ఞుండగు _
చదివిన సదసద్వివేక చతురత గలుగున్ _
చదువగ వలయును జనులకు !
చదివించెద నార్యులొద్ద చదువుము తండ్రీ !

అన్న పద్యాన్ని పాడి, చదువు యొక్క ప్రాధాన్యతను ఆ మహాకవి ఎంత చక్కగా తెలియజేసాడో వివరించాను.
మొదటి భాగం 12 – 06 – 2009 నాడు, రెండవ భాగం 26 – 06 – 2009 నాడు సాయంత్రం 5 – 30 గం||లకు ” హైదరాబాదు _ ఎ మీటర్ల ” పై ప్రసారమయ్యాయట ! నేను వినలేకపోయాను. విన్న మిత్రులు బాగున్నాయని మెచ్చుకోవడం ఒక తృప్తి.

08 – 06 – 2009 నుండి ఐదు రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ” రవీంద్ర భారతి ” లో మహా సహస్రావధాని డా || గరికపాటి నరసింహారావు గారిచే ” సంపూర్ణ శతావధానం ఏర్పాటు చేయబడింది. మొదటి రోజు ” సమస్య ” అంశంలో పృచ్ఛకునిగా పాల్గొనవలసిందిగా నన్ను ఆహ్వానించారు. అవధానికి నేనిచ్చిన సమస్య _

అవధానంబొక ” ట్వెంటి ట్వెంటి క్రికెటై ” ఆశ్చర్యమున్ గొల్పెడిన్ !

దానికి అవధాని పూరణ ఇది _

అవధానం బది ధారణా పటిమకే ఆస్థానమై యొప్పెడిన్ _
వ్యవధానం బొక ఇంత లేనటుల సా గత్యంత వేగంబుగాన్ _
సవరింతున్ ఇది ఐదు నెక్కువగుటన్ సామ్యమ్ము లేదందు నే !
అవధానంబొక ” ట్వెంటి ట్వెంటి క్రికెటై ” ఆశ్చర్యమున్ గొల్పెడిన్ !

గరికపాటి వారు ఈ శతావధానంలో 25 సమస్యలు, 25 దత్తపదులు, 25 వర్ణనలు, 25 ఆశువులు విజయవంతంగా పూరించారు. అందుకని ” ట్వెంటి_ ట్వెంటి ” కంటె ఐదు ఎక్కువ అని పద్యంలో పేర్కొన్నారు. సహజంగానే ఆయన చెప్పిన దాదాపు అన్ని పద్యాలు ఎంతో వేగంగా, అద్భుతంగా వచ్చాయి. అందుకే, ఆయన ప్రతిభను ప్రతిఫలింపజేసే అర్థంలో నేనా సమస్య ఇవ్వడం జరిగింది. కానీ, ఎందుకనో _ నాకందించిన పూరణ మాత్రం నా కంతగా నచ్చ లేదు. బహుశః నే నూహించింది వేరేలా ఉండడం వల్లేమో ! నా పూరణ ఇలా ఉంది _

అవధానంబున పృచ్ఛకుల్ విసురు ప్రశ్నాస్త్రంబులే బంతులై _
అవలీల న్నవధాని వేగముగ తా నందించు పద్యంబులే
కవనం బందున ” ఫోరు, సిక్సరుల ” సంకాశంబులై తోచగాన్ _
అవధానం బొక ” ట్వెంటి_ ట్వెంటి క్రికెటై ” ఆశ్చర్యమున్ గొల్పెడిన్ !

ఇక ఆ ఐదు రోజుల సాయంత్రాలు హైదరాబాదులోని సాహితీవేత్తలకు పండుగలా గడచాయి. చాలా మంది కవి మిత్రులను, కవయిత్రులను ఒక్కచోట కలుసుకొనే అవకాశం చిక్కడం వల్ల ఆనందంగా గడిపాము.

14 – 06 – 2009 నాడు ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక శాఖ నిర్వహిస్తున్న ” శత రూప ” కార్యక్రమాలలో భాగంగా  ” ఇంద్ర సభ ” సాహిత్య రూపక ప్రదర్శన జరిగింది. అందులో నన్ను శ్రీశ్రీ వేషం వేయమన్నారు.   ” మహా ప్రస్థానం ” లోని గేయాలను వేగంగా భావావేశంతో పాడే సరికి నిండు సభలో చప్పట్లు మారుమ్రోగాయి. సభ పూర్తయ్యాక, సహ నటు లయిన అవధాని డా || గండ్లూరి దత్తాత్రేయ శర్మ, కవి మిత్రులు డా || వై. రామకృష్ణారావు, డా || ఆచార్య వేణు, ఇంకా సాహితీ మిత్రులు _ శతావధాని జి.ఎం. రామ శర్మ, ఎం. అనంతాచార్య, సాధన నరసింహాచార్య తదితరులు ప్రశంసలు కురిపిస్తే చాలా ఆనందం కలిగింది.

21 – 06 – 2009 ( గత ఆదివారం ) నాడు మన ” రాతలు _ కోతలు ” బ్లాగు మిత్రుడు శ్రీ కస్తూరి మురళీకృష్ణ రచించిన ” తీవ్రవాదం ” గ్రంథావిష్కరణ సభ మా ” ఏ. ఎస్. రావు నగర్ ” లో జరిగితే  వెళ్ళాను. ఆ దంపతులను ప్రత్యక్షంగా కలుసుకొని, ముఖ్యంగా వారు చూపిన ఆత్మీయతకు చాలా సంతోషించాను. అదే సభలో ప్రఖ్యాత కవి, విమర్శకులు అద్దేపల్లి రామమోహన్ రావు గారిని చాలా రోజుల తరువాత కలుసుకోగలిగినందుకు ఆనందించాను.

మధ్యలో _ మిత్రులు, ప్రముఖ గాయకులు శ్రీ అమలాపురం కన్నారావు షష్టి పూర్తి సావనీరు సంచికకు పద్యాలు వ్రాసి పంపడం, ” సాహితీ కౌముది ” పత్రికకు ” హృద్య పద్యం ” ఫీచర్ తోబాటు, నిశాపతి కోరినట్టుగా _ మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ గారిపై పద్యాలు వ్రాసి పంపడం, బాలాజి టెలివిజన్ చానల్ కొరకు ఒక టెలీ సీరియల్ మూల కథను సిద్ధం చేయడం వంటి పనులతో కాలం సాగిపోయింది. ఇవి గాక బ్లాగుల నిర్వహణ సరే సరి !

29 – 06 – 2009 ( సోమవారం ) నాడు సుప్రసిద్ధ సాహితీ మూర్తి డా || పోతుకూచి సాంబశివరావు గారి పద్య శతకం ” ఆనంద లహరి ” గ్రంథంపై నన్ను ప్రసంగించమన్నారు. సభ ” త్యాగరాయ గాన సభ ” మిని హాలులో జరుగుతుంది. డా || సి. నారాయణ రెడ్డి ముఖ్య అతిథి.

ఇక, జూలై 1 వ తేదీ నాడు ఆంధ్ర మహిళా సభలో ” దుర్గాబాయి దేశ్ ముఖ్ ” గారి శత జయంతి సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొనమని నిన్నే ఆహ్వానం అందింది.

మొత్తానికి జూన్ నెల మంచి సాహిత్య వాతావరణంలో బిజీగా హాయిగా గడిచింది.

ఫణీంద్రుని ” విశ్వంభర ” కవితపై బేతవోలు రామబ్రహ్మం గారి విమర్శ

ఫణీంద్రుని ” విశ్వంభర ” కవితపై బేతవోలు రామబ్రహ్మం గారి విమర్శ
__________________________________________________________________

ఆధునిక పద్య కావ్యాలపై సుప్రసిద్ధ కవి, విమర్శకులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు కొన్నేళ్ళ క్రితం ” ఆంధ్ర భూమి ” దిన పత్రికలో విమర్శన వ్యాసాలు వ్రాసారు. తరువాత కొన్నాళ్ళకు వాటినన్నిటిని సంకలనం చేసి , ” పద్యారామం ” పేరిట విమర్శన గ్రంథంగా కూడా వేసారు. అందులోని ఒక వ్యాసంలో, డా || ఆచార్య ఫణీంద్ర రచించిన ” విశ్వంభర ” ( ఇంతకు ముందు టపాగా ఈ బ్లాగులో ఉంది ) కవితపై బేతవోలు వారు చేసిన విమర్శను ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

” కాలుష్య నివారణ, పర్యావరణ కోణాల నుంచి ఆవిర్భవించిన మరో అందమైన కవితా ఖండిక      ” విశ్వంభర “. భూదేవి తన గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు సాగింది.
హరిత వనమ్ముల వస్త్రము
ధరియించుచు మురియుచుండు ధాత్రిని నన్నున్
పురములు కట్టుట కొరకై
కరుణారహితులు వివస్త్ర గావింతురయో !

అని మొర పెట్టుకుంది. పుడమిని తల్లిగా భావిస్తాం కనుక ఇలా చెప్పించడంలో ప్రయోజనం ఎక్కువ. చెట్లను తెగ నరకడమంటే తల్లిని వివస్త్రను చెయ్యడం. ఈ పోలిక చూపే ప్రభావం గాఢంగా ఉంటుంది.
భూగర్భం నుండి ఎన్నింటినో తవ్వి తీసేస్తున్నాం. గుల్ల చేసేస్తున్నాం. భూకంపాలు వస్తున్నాయి. అప్పుడేమో
కఠినురాలు భూమి కంపించెనని మీద
దుమ్ము వోయుచుంద్రు తూలనాడి …

ఇదీ నా తప్పేనా ? అని వాపోతుంది భూదేవి. ఇన్ని దారుణాలు మీరు చేస్తున్నా _
… … … ఇన్ని నాళ్ళుగ మిమ్ము
మోయుచుంటి _ భావి మోయగలను
ఎదను తన్ను పాప నెత్తి ముద్దిడునట్టి
కన్న తల్లి వోలె కరుణ గల్గి !

ఇది పాఠకుణ్ణి ఆర్ద్ర పరిచే ఆవిష్కరణ. పర్యావరణాన్ని పరిరక్షించుకునే సంస్కారం, చైతన్యం కలిగించే ఖండిక ఇది. “

విశ్వంభర

” విశ్వంభర “
రచన : “పద్య కళా ప్రవీణ” డా || ఆచార్య ఫణీంద్ర

ఎవ్వరటంచు నెంచితివి ? ఏను మహీతల మోయి మానవా !
ఎవ్వరెరుంగ రాయె మునుపెన్నడు పుట్టితి నేను సృష్టిలో _
త్రవ్విన కొల్ది నా చరిత దర్శనమిచ్చును వింత వింతలై _
నివ్వెర పోక విన్ము నే వివరింతును నా చరిత్రమున్ !

పూర్వ కాలమందు వేర్వడి చల్లారె
గ్రహములు రవి నుండి ఖండములుగ _
శాస్త్రకారులంద్రు _ సౌర మండలమందు
పుట్టితటులె నేను ” భూమి ” పేర !

కలవు పేర్లు పెక్కు _ క్ష్మా, క్షితి, మేదిని,
పుడమి, క్షోణి, పృథ్వి, భువి, ధరిత్రి,
వసుమతి, ఇల, అవని, వసుధ, విశ్వంభర,
ధారుణి, ధర, ధరణి, ధాత్రి, ఉర్వి _

పుణ్యులైన, పాప పురుషులైనను గాని
ఏక దృష్టి గలిగి, ఎపుడు మిమ్ము
మోయుచుందు నేను ధ్యేయమై సహనమ్ము _
తరతరాల ప్రజకు తల్లి నేను !

చెట్టు మోయుచుందు _ పుట్ట మోయుచునుందు
చెరువు, నదియు, కడలి, బరువు కొండ;
మనుజులార ! మీరు మనుట కావశ్యకం
బిల్లు, పొలము, పురము లెల్ల మోతు !

విత్తు నిడిన దాని వృక్షంబుగా మార్చి,
ఫలము, పుష్పములను, పత్రములను
మీకు నందజేసి, మీ మంచి చెడు జూచు
తల్లినైన నాకు దక్కె నేమి ?

హరిత వనమ్ముల వస్త్రము
ధరియించుచు మురియుచుండు ధాత్రిని నన్నున్
పురములు కట్టుట కొరకై
కరుణారహితులు వివస్త్ర గావింతురయో !

త్రాగు నీరు కొరకు త్రవ్వేరు నా మేను _
తూట్లు పొడిచి పొడిచి తోడుచుంద్రు !
త్రాగుడేమొ ! మీదు దాహార్తి పాడ్గాను _
ఒంటిలో మిగుల్చ రొక్క చుక్క !

నీరు మొత్త మింకి, నిస్సత్తువై యుండ _
కనికరమ్ము లేక కఠినులగుచు
గుండెలోన దింపి గొట్టాలు లోతుగా
” పంపు ” తోడ తోడి చంపుచుంద్రు !

ఒళ్ళు డొల్ల యయ్యి, కళ్ళు చీకటి క్రమ్మి
తూట్లు పడిన నేను తూలుచుండ _
” కఠినురాలు భూమి కంపించె ” నని మీద
దుమ్ము వోయుచుంద్రు, తూలనాడి !

ఇన్ని చేయనేమి ? ఇన్ని నాళ్ళుగ మిమ్ము
మోయుచుంటి _ భావి మోయగలను !
ఎదను తన్ను పాప నెత్తి ముద్దిడునట్టి
కన్న తల్లి వోలె కరుణ గలిగి !

___***___moter earth

గుమాస్తా జీవితం

newimage1
గుమాస్తా జీవితం
రచన : డా || ఆచార్య ఫణీంద్ర

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం
అందివచ్చే మొత్తం జీతం
అప్పులకు, కటింగులకే పరిమితం
స్వంత ఇల్లు ఒక “సప్నా”
అద్దె కొంపే మరి “అప్నా”

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం

లాస్టు వరకు ఒత్తగా ఒత్తగా
ట్యూబు నుండి రానని మొరాయిస్తున్న
“టూతు పేస్టు”లా _
ఫాస్టుగా పెరిగిపోతున్న పాల ప్యాకెట్ ధరలకు
టేస్టు పడిపోతున్న తేనీటి చుక్కలా _
కరగిపోయి , మిగిలిన కాసింత కూడ
ఒంటిపై అరగదీసే ప్రయత్నంలో
నురగ రాని సబ్బు పిక్కలా _
పీకల దాకా ఆకలి నిండగా
కేకలేస్తున్న “లోప్రొఫైల్” డొక్కలా _

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం

“ఫాయిదా” లేకున్నా
వాయిదాల మీద నాల్గు వస్తువులను
కొనుక్కొనే లోపే
చేయి పట్టుకొని తిరిగే చిట్టి తల్లి
గుండెల మీద కుంపటై కూర్చుంటుంది _
“నాన్నా! నాన్నా!” అంటూ కాళ్ళ సందుల్లో
తిరిగే నానిగాడు
గొంతుపై గుదిబండై వేళ్ళాడుతుంటాడు _

వేసేది వేలెడంత తీసేది కాలెడంతగా ఉన్న
“ప్రావిడెంటు ఫండు” ఖాతా
పూర్తిగా “ఖతం” అయితే గానీ
గుండెల మీద కుంపటి ఆరదు.
గొంతుపై నుండి గుదిబండ దిగదు.

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం

“రిటైర్మెంట”య్యాక బ్రతుకు “క్యాసెట్టు”ను
“రివైండు” చేసి చూస్తే _
తోడుగా నడిచొస్తున్న జీవిత భాగస్వామికి
తొలి రోజుల్లో నాలుగయిదు
తెలుగు సినిమాలు మాత్రం చూపినట్టు గుర్తు!

గుమాస్తా జీవితం
సమస్తం సతమతం
“పెన్షను” మొత్తం
పిడికెడు మెతుకులకే అంకితం
స్వంత ఇల్లు ఒక “సప్నా”
అద్దె కొంపే మరి “అప్నా”

(ఈ కవిత రచనా కాలం 1989. ఇరవయ్యేళ్ళయినా పరిస్థితులు అలాగే ఉన్నాయి కదూ! )
___***___

గొడుగు

గొడుగు
రచన : ” పద్య కళా ప్రవీణ ” డా || ఆచార్య ఫణీంద్ర

umbrella

గొడుగును _ నే వర్షములో
అడుగిడుటకు వెరచు నరుల నార్ద్ర మనముతో _
పుడమిని మోయు ననంతుని
పడగ వలెన్ , పైన నిలిచి పరిరక్షింతున్ !

నేను తడిసి పోయి నీరైన కానిమ్ము !
జనులు తడియకుండ సాగుటకును
నిజము ! సలుపుచుందు నిస్వార్థ బుద్ధితో
వర్ష ధార తోడ ఘర్షణమ్ము !

మండు టెండలో సైతమ్ము మార్గమందు
మాడు పైన వేడిమి తాకి మాడకుండ _
సూర్య కిరణాలతో పోరి ధైర్యముగను ,
నీడ నొసగి మానవుల కాపాడుచుందు !

తల కెత్తుకొనుచు నాకు ప్ర
జ లిడ మహా గౌరవమును సంతోషింతున్ !
కలకాలము దీని నిలిపి
తలపున , నే తీర్చుకొందు తగిన ఋణంబున్ !

చిటపట చినుకులు పడ న
న్న్నిటు నటు వెదుకుదురు కొంద రెట నుంటినటన్ _
అటువంటిది లేనప్పుడు
అటకను పడవైచి ముఖము నటు జూపరయో !

ఎచటికైన కొంద రెంతొ ప్రేమను జూపి
వెంట నన్ను గొనుచు వెడలుచుంద్రు _
అసలు వారి ప్రేమ ఆ పైన నెరుగుదున్
మరలి వచ్చు వేళ మరచినపుడు !

ఎండకు నెండి , వర్షమున కెల్ల శరీరము ముద్దయైన , నే
దండిగ సేవ జేయుచు , సదా ప్రజ స్వాస్థ్యము గాచుచుందు ! ఇ
ట్లండగ నుండు నా తనువు , నంగము లించుక గాయమొందినన్ _
గుండియ లేక , స్వాస్థ్య మొనగూర్పరు నాకు సకాలమందునన్ !

గుర్తింపరు నా సేవలు _
పూర్తిగ ఆరోగ్యము చెడిపోయిన నన్నున్
ధూర్తుల వలె వర్జింతురు _
ఆర్తి యొకింతయును లేక , అయ్యో ! మనుజుల్ !

వారికి రాక పో దిటుల వార్ధక మెప్పటికైన _ అప్పుడున్
వారసులైన వా రిటులె వారిని కానక త్రోసి పుచ్చగా _
ఏ రకమైన బాధ ఇది _ ఎంతటి ఘోరమొ ! _ మోయలేని ఆ
భారము , మానసంబు కనుభావముగా విదితంబు గాదొకో !

___ * * * ___

చతుస్సహస్ర సందర్శనోత్సవం

flowers
చతుస్సహస్ర సందర్శనోత్సవం

10 జూన్ 2009 నాటికి నా బ్లాగును సందర్శించిన వీక్షకుల సంఖ్య 4000 దాటింది. ఈ ఆనంద శుభ వేళ నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా ధన్యవాదాలను సమర్పిస్తున్నాను.

_ డా || ఆచార్య ఫణీంద్ర

“స్వార్థ రహిత ప్రేమ”

rose with tears
“స్వార్థ రహిత ప్రేమ”
రచన: డా|| ఆచార్య ఫణీంద్ర

తీవ నుదయించి వికసించి పూవు ప్రజకు
పరిమళములొల్కి , కనువిందు పరుచు నెంతొ _
అంతగా ప్రసూనములపై అటులె తిరిగి ,
ప్రజల నుండి ప్రేమం బిల ప్రాప్తమగునె ?

త్రెంపి తీవల నుండి గంపలం దెత్తించి
బాజారులో నమ్మ బరగు నొకడు _
ప్రియురాలి కర్పించి , ప్రేమాదరము లొంద
బహుమాన రూపాన వాడు నొకడు _
గుడిలోని దైవమ్ము కోర్కి తీర్చగ , కట్టు
లంచమ్ముగా మాల లందు నొకడు _
కీలక స్థలములన్ గృహ సీమలం గట్టి
శోభ గూర్చుకొనగా జూచు నొకడు _

రెక్కలను పీకి, పొందు వెర్రి ముద మొకడు _
చూచి చూడని యట్లు పోజొచ్చు నొకడు _
నలుపు నొక్కండు ప్రక్కపై _ దులిపి ఊడ్చి ,
చేసి కుప్పగా చెత్తలో చేర్చు నొకడు _

ఎవడొ ఒకడు పుష్ప వికాస మెల్ల కాంచి
స్వార్థ రహితుడై ప్రేమతో సంతసిల్లు !
దినము గడచి , వాడి , భువిని తెగిపడ , కని
గుండెలో నెంతొ బాధతో కుమిలి పోవు !

Previous Older Entries