దాశరథి గారి “గాలిబు గీతాలు”

మహాకవి దాశరథి గారి కలం నుండి జాలువారిన అనర్ఘ రత్నాల వంటి “గాలిబు గీతాలు” కొన్ని …  ఆస్వాదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

——————————————————–

IMG_20150620_003500

 

బాధ కలిగినపుడు పల్లవింతును నేను –

నాది హృదయమోయి! కాదు రాయి!

 

గుండె దొంగిలించుకొనిపోయె జంకక –

ముద్దొసంగ వెనుక ముందులాడు!

 

ఏదొ వక్షమ్మునందు బాధింపదొడగె –

హృదయమా? కాదు- బాణంపు టినుప ముక్క !

 

వత్తునని రాక నా గృహ ద్వారమునకు –

నన్నె కాపలాగా నిల్పినా వదేమి?

 

ఏల కాళ్ళు నొచ్చె బాలామణికి ? రాత్రి

ఎవని స్వప్న సీమ కేగి వచ్చె?

 

తరుణి చేతి అంబు తగులునట్లుగ నిల్చి

గాయపడగ కోర్కి కలదు నాకు –

అంబు తగుల కేగ, అద్దాని కొని తెచ్చి

వెలది కిత్తు మరల వేయుమనుచు!

 

ఎంత తీయని పెదవులే ఇంతి నీవి? –

తిట్టుచున్నప్పుడును గూడ తీపి గురియు!

 

ఆమె దారి బోవుచు నాదు  సేమ మడుగు –

ఏమి చెప్పుదు దారిలో నింక నేను ?

 

మృత్యు  వేతెంచినపు డామె లేఖ వచ్చె –

చదువకయె వక్షమున నుంచి చచ్చినాను !

నేను మరణింప నా ఇంటిలోన దొరికె –

ప్రేయసి చిత్రపటాలు, లేఖలంతె!

ఏను మరణింప నామె చింతింపదొడగె –

ఎంత తొందరగా కరుణించె నన్ను!

 

ఎంతొ ఉత్సాహపడుచు కష్టింతు మౌర!

మృతియె లేకున్న రుచి యేది బ్రతుకులోన?

——————————————–

ప్రకటనలు

మాతృభాషా స్తుతి గీతం

ఈ రోజు “అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం” సందర్భంగా గతంలో నేను రచించిన నా మాతృభాషా స్తుతి గీతాన్ని ఆస్వాదించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

కమ్మనైన భాషరా

ఆంధ్రము!

[ లలిత గీతం ]

రచన :

డా. ఆచార్య ఫణీంద్ర

images

కమ్మనైన భాషరా ఆంధ్రము

కవి కోకిలల కళా కేంద్రము

కమనీయ మధు కవితా సాంద్రము

కావ్య తృష్ణ తీర్చే చలివేంద్రము

|| కమ్మనైన ||

 

భారతి నుదుటను దిద్దిన చెంద్రము

హారతి పట్టగ వెలిగిన చంద్రము

భావ కుసుమ నిలయమీ సుధీంద్రము

భాషలన్నిటిలో రాజేంద్రము

|| కమ్మనైన ||

 

గుసగుసలాడే వేళ మంద్రము

బుస కొట్టే వేళ నాగేంద్రము

సహృదయ జన చర్చలలో సంద్రము

సభలోన సరస మాహేంద్రము

|| కమ్మనైన ||

___ *** ___

“తెలంగాణ భాష మొత్తం .. గ్రాంథిక భాషకు చాల దగ్గరైనటువంటి భాష!”

భారతీ!

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

index

వికృతమనుట తప్పిదమే?
“ప్రకృతి”, “వికృతి” నేర్వ లేదె పదముల కెపుడున్?
వికృతమయిన పదమె “వికృతి”!
“వికృత” మనిన నెరుగకుండ విదు లెట్లైరో?

 

విలువల నెరుగని నీచులు,
పలువు రపండితులు – నీదు వర ఫలితముగా
కలిగిన నా పాండితినిన్
తులనాడిరి! వాణి! వారి దోషము గనుమా!

 

భాషాశాస్త్రపు చర్చను
భాషావేత్తగ సలుపుట పాపంబౌనో?
భాషాయోషా! సేయుము
దూషించిన వారి నోట దుమ్ము బడంగన్!

 

శాస్త్ర చర్చకు నిలువగా శక్తి లేని
ధూర్తులే వ్యక్తిగతమైన దూషణలకు
దిగుచునుందురు! వారిది దిగుడు స్థాయి!!
కూరుకొనిపోరె పాతాళ కుహరమందు!!!

 

“తప్పుడు శబ్దముల్ పలుక తప్పని నే ననబోను గాని, మా
ఒప్పుగ నున్న శబ్దముల నుమ్మడి రాష్ట్రమునందు నేళ్ళ కే
ళ్ళెప్పటి కప్పు డేల అవహేళన జేసి”రటంచు బాధతో
జెప్పిన నా పయిన్ విషము జిమ్ము ఖలుల్ నశియింత్రు భారతీ!

— xxx —

జన్మదిన శుభాకాంక్షలు

ఈ రోజు “నమస్తే తెలంగాణ” దినపత్రికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి గారి జన్మదిన సందర్భంగా ప్రచురించిన వ్యాసాన్ని నా పద్య పాదాలను కోట్ చేస్తూ ప్రారంభించారు. ఈ పద్యాలు గతంలో వెలువడిన “మా రమణ” గ్రంథంలో ప్రచురింపబడ్డవి.

తెలుగు సాహితీ సాంస్కృతిక నందనవనంలో కల్పతరువు డా. కె.వి. రమణాచారి గారికి జన్మదిన శుభాభినందనలతో –

డా. ఆచార్య ఫణీంద్ర

_20160208_131328

_20160208_132823

_20160208_132733

 

సమగ్ర సంపూర్ణ విజయం

సమగ్ర సంపూర్ణ విజయం

   – డా. ఆచార్య ఫణీంద్ర

Telangana-Government-welfar

“లేమావి చివురులను లెస్సగా మెసవేవు –
ఋతురాజు కీర్తిని గొప్పగా పాడేవు –
తిన్న తిండెవ్వారిదే? కోకిలా!
పాడు పాటెవ్వారిదే?”

 

    1940 వ దశకంలో రాయప్రోలు సుబ్బారావు గారు హైదరాబాదులో ఒక కవి సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తూ … సీమాంధ్ర మూలాలు గల కవులను గొప్పగా కీర్తిస్తూ, తెలంగాణ కవుల పట్ల కించిత్తు ఈసడింపుగా వ్యవహరించడం చూసి, ఆవేదన చెందిన మహాకవి కాళోజి అదే కవి సమ్మేళనంలో ఆశువుగా గానం చేసిన కవితలోని ప్రసిద్ధ భాగం ఇది.

      నిన్న మొన్నటి వరకు హైదరాబాదులో  సీమాంధ్ర మూలాలుగా ఉన్న తెలుగు వారిలో అందరూ అనలేం గానీ, అత్యధికుల వ్యవహారం రాయప్రోలు వారి పంథాలోనే సాగేది. ఏబయ్యేళ్ళుగా హైదరాబాదులో నివాసముంటున్నా, “మాది తెలంగాణ!” అని చెప్పుకోవడానికి వారికి మనస్కరించేది కాదు. ప్రతి విషయంలో – ” మా వేపిలా .. మా వేపలా …” అంటూ గొప్పలు చెప్పుతూ, ఇక్కడి విషయాలను తక్కువ చేయడం, దెప్పి పొడవడం జరిగేది. పైకి ప్రకటించినా, ప్రకటించకపోయినా, ఈ వ్యవహారం తెలంగాణ ప్రజల మనస్సులను బలంగా గాయపరుస్తూ వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి తెలంగాణ ప్రజలను పురికొల్పిన బలమైన కారణాలలో ఇదీ ఒక ప్రధాన కారణమైందని వేరుగా చెప్ప నక్కరలేదు.

     కాని, నిన్న ప్రకటించబడిన జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికల ఫలితాలలో ఈ పరిస్థితి పూర్తిగా మారి, ఒక సామూహిక సుహృద్భావ ఐక్య భావన ప్రస్ఫుటంగా గోచరమయ్యింది. టి.ఆర్.ఎస్. పార్టీకి హైదరాబాద్ ప్రజలంతా కలసికట్టుగా సంపూర్ణమైన విజయం చేకూర్చడం ద్వారా అందించిన సందేశం ఇక్కడ గమనార్హం. ఏ ప్రాంతం నుండి వచ్చినా, ఇక్కడ నివాసముంటున్న హైదరాబాదీలందరి బాగోగులు ఇక్కడి ప్రాంతంతో ముడిపడి ఉన్నాయన్న సత్యాన్ని అందరూ గ్రహించినట్టుగా తెలియవస్తున్నది. ఈ అవగాహన మరాఠీ, తమిళ ఇత్యాది అన్య భాషీయులకు మొదటినుండి ఉన్నా, సీమాంధ్ర మూలాలున్న హైదరాబాదీలు దీనిని బాహాటంగా వ్యతిరేకించేవారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి తెలంగాణ ఉద్యమకారులతో సీమాంధ్ర మూలాలున్న హైదరాబాదీల వాదన అదే. “మాది సీమాంధ్ర! హైదరాబాద్ మా రాజధాని! ఇక్కడ మేము పెద్ద సంఖ్యలో నివాసముంటున్నాం కాబట్టి ఇది మాదే!” అని వాదించిన వారిని చాల మందిని చూసాం. కాని నిన్నటి ఎన్నికలతో ఆ వాదన పూర్తిగా వీగిపోయిందనే చెప్పాలె. ముఖ్యంగా హైదరాబాదులో నివాసముంటున్న సీమాంధ్ర మూలాలున్న తెలుగు వారు కూడ “మాదీ తెలంగాణే! తెలంగాణ ఉద్యమ పార్టీ మా అస్థిత్వానికి కూడ ప్రాతినిధ్యం వహిస్తుంది.” అని మొట్ట మొదటిసారిగా అర్థం చేసుకొన్న విషయం ఇప్పుడు అవగతమవుతున్నది. ఇది శుభ పరిణామం!

      ఈ ఎన్నికలకు ఒకటి రెండు రోజుల ముందు కూడ … ” సెటిలర్ల పాదాలకు ముల్లు గ్రుచ్చుకొంటే పంటితో తీస్తామన్న వారే .. చంద్రబాబు నాయుడిని – నీకిక్కడేం పని అని ప్రశ్నించడమేమిటి?” అని సందేహం వ్యక్తం చేసిన వారు కొందరు లేకపోలేదు. కాని వారికి తెలంగాణ ఉద్యమ లక్ష్యమే ఇంకా అర్థం కాలేదని అర్థమవుతున్నది. ప్రాంతాలుగా విడిపోయినా ప్రజలుగా కలసి ఉందామని తెలంగాణ ఉద్యమకారులు మొదటి నుండి చెప్పుతూనే ఉన్నారు. కాని అన్య ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడి ప్రాంత ప్రయోజనాలను పణంగా పెట్టే పాలకులుగా సీమాంధ్రులను నెత్తిన పెట్టుకోవడానికి ఇక్కడి ప్రజలు ఇంకా సిద్ధంగా లేరన్నది గ్రహించవలసిన విషయం.
అందుకే కదా తెలంగాణ ప్రజలు స్వయంపాలనను కోరుకొన్నది. అదే కదా ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు దారి తీసింది.

      జి.హెచ్.ఎమ్.సి. ఎన్నికలలో విజయం కేవలం టి.ఆర్.ఎస్. పార్టీదే కాదు. ఇక్కడి తెలంగాణ ఉద్యమ కారులదే కాదు. తెలంగాణలో .. ముఖ్యంగా హైదరాబాదులో నివసిస్తున్న సీమాంధ్ర మూలాలున్న హైదరాబాదీలది కూడా. ప్రక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇన్నాళ్ళుగా అహేతుకంగా అధర్మంగా సాగి వస్తున్న అక్కడి ప్రయోజనాలను పణంగా పెట్టి,  ఇక్కడి ప్రాంతానికి సహేతుకంగా ధర్మంగా రావలసిన ప్రయోజనాలను కాపాడుతారనుకోవడం భ్రమేనని వారూ గుర్తించడం ముదావహం.

అందుకే …
ఈ ఎన్నికల విజయం తెలంగాణ ఉద్యమ లక్ష్యాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిందని చెప్పాలె. ఈ ఎన్నికల విజయంతో తెలంగాణ ఉద్యమ విజయం సమగ్రంగా సంపూర్ణమయిందని చెప్పాలె.

          — &&& —