శ్రవణ కుమారుడు
(బతుకమ్మ పాట)
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో –
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో –
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో –
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో –
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో –
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో –
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో –
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో –
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో –
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో –
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో –
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో –
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో –
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో –
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో –
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో –
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో –
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో –
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో –
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో –
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో –
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో –
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో –
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో –