తెలంగాణ భాగ్య గీతి

TEL3

నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై

ఆకాశమంత ఎత్తార్చినాను –
నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి
పద్యాలు గొంతెత్తి పాడినాను –
నే దాశరథి కవి నిప్పు లురుము గంట
మొడుపులన్ కొన్నింటి బడసినాను –
నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై
పద్య ప్రసూనాల పంచినాను –

ఐదు కోట్లాంధ్ర ప్రాంతీయు లందరికిని
మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి,
మూడునర కోట్ల తెలగాణ ముక్తి నొంద
పాడినాను తెలంగాణ భాగ్య గీతి!

ప్రకటనలు

టెలిగ్రామ్ ఒక సింహం!!

టెలిగ్రామ్ ఒక సింహం!!

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

Telegram 1

“టెలిగ్రామ్” –
పోస్ట్ మాన్ పొలికేక
ఇంటి గుమ్మాన్ని తట్టింది.
ఇంట్లో పిల్లల గుండెల్లో
రాళ్ళు పడ్డాయి.
మా అమ్మ కళ్ళలో
నీళ్ళు సుడులు తిరిగాయి.
నాన్న అడుగులు తడబడగా
దడ పుడుతున్న గుండెను
చేతిలో పట్టుకొని వెళ్ళి
వణుకుతున్న కలంతో చేవ్రాలు గీకి
విప్పి చూస్తే …
“తాతయ్య పరమపదించాడు” అన్న వార్త!
ఇంటిల్లిపాది గుండెలు ఘొల్లుమన్నాయి.
మరో సందర్భంలో –
విషాద వార్తే కాదు .. శుభ వార్తైనా
విప్పి చదివేవరకు అదే భయం!
టెలిగ్రామ్ అంటే మా చిన్ననాడు ఒక టెర్రర్!
బ్రతికినన్నాళ్ళు సింహంలా బ్రతికింది
టెలిగ్రామ్!
మరి ఇప్పుడూ –
మా ఇంటిల్లిపాది గుండెలు ఆర్ద్రమౌతున్నాయి.
ఇప్పుడు ఆత్మీయులెవరూ చావలేదు –
టెలిగ్రామ్ చచ్చిపోయింది!
అవును – ఈ దుఃఖం
టెలిగ్రామ్ వచ్చినందుకు కాదు.
టెలిగ్రామ్ చచ్చినందుకు!
దూరంగా ఉన్న
భారమైన వార్తలు ఎన్ని మోసిందో!
ఊళ్ళు .. జిల్లాలు … రాష్ట్రాలు ….
ఎంతెంత దూరాలు ప్రయాణించిందో!!
టెలిగ్రామ్ అలసిపోయింది.
కుర్ర ఈ-మెయిళ్ళతో, ఎస్.ఎమ్.ఎస్.లతో
పోటీ పడలేక మా టెలిగ్రామ్ చచ్చిపోయింది.
ఈ దుర్వార్తను తెలిపేందుకు
టెలిగ్రామ్ పంపాలని ఉంది –
కాని, ఎవరికి ?
ఎలా ??

 — @@@ —

Telegram 2