“యువభారతి” అధ్యక్షునిగా నా సారథ్యంలో తొలి సమావేశం ..

యువభారతి సాహితీ సమాలోచన సభ
————————————————–
          అర్ధ శతాబ్దానికి పైగా తెలుగు సాహిత్యానికి యువభారతి సాహిత్య సంస్థ ఎనలేని  సేవలు చేసిందని విశ్రాంత ఐఎఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి. రమణాచారి అన్నారు. యువభారతి సాహితీ సమాలోచన సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి యువభారతి కార్యక్రమాల నిర్వాహణలో సంస్థ సభ్యుల కృషి ప్రశంసనీయమని ఆయన చెప్పారు. డా. ఆచార్య ఫణీంద్ర అధ్యక్షతన ఏర్పడిన నూతన కార్యవర్గం ఆ ఒరవడిని అందిపుచ్చుకుని మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన సూచించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన యువభారతి ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య వంగపల్లి విశ్వనాథం మాట్లాడుతూ సంస్థ
నూతనంగా ఎన్నుకొన్న కార్యవర్గాన్ని సభకు పరిచయం చేశారు.
          ఆ తరువాత, డాక్టర్ కె.వి. రమణాచారి ప్రముఖ రచయిత, ఆకాశవాణి విశ్రాంత ప్రయోక్త శ్రీ సుధామ వివిధ గ్రంథాలకు వ్రాసిన ముందుమాటలు, పీఠికల సంకలన గ్రంథం “భూమిక”ను ఆవిష్కరించారు. యువభారతి నూతన అధ్యక్షుడు ఆచార్య ఫణీంద్ర తనను అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకొన్నందుకు సంస్థ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆ పైన “భూమిక” గ్రంథాన్ని ఆయన సభకు పరిచయం చేశారు. వివిధ గ్రంథాలకు సుధామ వ్రాసిన పీఠికలలోని విశేషాలను ఆయన సూచనప్రాయంగా పరిచయం చేసి, గ్రంథం చాల విజ్ఞానదాయకంగా ఉందని, ప్రతి ఒక్కరు చదివి ఆనందించాలని సభాసదులకు సూచించారు. అనంతరం సుధామ తన స్పందనను తెలియజేస్తూ, తాను సాహితీవేత్తగా ఎదగడానికి దోహదం చేసిన యువభారతి సంస్థ ద్వారా తన ఈ గ్రంథం ఆవిష్కరింపబడడం ఆనందంగా ఉందని అన్నారు.
              ఇక సాహితీ సమాలోచన కార్యక్రమంలో ప్రధాన భాగంగా ‘వానమామలై వరదాచార్యుల జీవితం – సాహిత్యం’ అన్న అంశంపై ప్రముఖ సాహితీవేత్త, కవి
డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ప్రసంగించారు. వానమామలై వారు రచించిన వివిధ గ్రంథాలలో ఆయన
వ్రాసిన ఆణిముత్యాల వంటి కొన్ని పద్యాలను ఉదహరిస్తూ .. వయసులోనూ, ప్రతిభలోనూ ఆ మహాకవి ఆధునిక తెలంగాణ కవిత్రయంలో నన్నయ వంటి వాడని ప్రశంసించారు. ఆయనలోని భావుకతా వైభవం ఆనాటి ఉద్దండ సాహితీవేత్తతలైన చెళ్లపిళ్ల, విశ్వనాథ వంటి వారిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిందని వివరించారు.
             ఈ సభలో సభామందిరం శ్రోతలతో నిండిపోగా అనేకంగా అదనపు ఆసనాలను వేయవలసి రావడం విశేషం. చివరగా సంస్థ సహాయ కార్యదర్శి నవీన్ గౌడ్ వందన సమర్పణ చేయగా, సామూహిక జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

“కట్టుకొంటి నేను కంకణమును!”

“కట్టుకొంటి నేను కంకణమును!”

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

పలువురు గూడి నన్ను “యువభారతి” నాయక పీఠమందునన్
వెలయగ జేసినారు! అది వేల్పు సరస్వతి యాజ్ఞగా మదిం
దలచుచు శక్తి మేర కృషి తప్పక సల్పెద, సంస్థ కున్న యా
విలువల గాచుచున్ సతము; విజ్ఞులు, పండితు లెల్ల మెచ్చగాన్!

చుట్టు నావరించు దట్టమౌ చీకటిన్
తిట్టిపోయు కన్న, తిమిర మార్ప –
చిట్టి దీప శిఖను చివురింప జేయగా
కట్టుకొంటి నేను కంకణమును!

ఓ హితవరులారా! ఓ
సాహిత్య ప్రముఖులార! సత్కవులారా!
సాహో యని ప్రార్థింతును
సౌహిత్యము జూపి నాకు సహకార మిడన్!

(దశాబ్దాల చరిత్ర గలిగిన సుప్రసిద్ధ సాహిత్య సంస్థ “యువభారతి” అధ్యక్షునిగా నేను ఏకగ్రీవంగా ఎన్నుకోబడిన సందర్భంగా నాలో స్పందనగా పెల్లుబికిన పద్యాలు!)

— &&& —