అంబుధులను దాటి…{పద్య కవిత}

ar-rahman2009-oscars1

అంబుధులను దాటి…{పద్య కవిత}
—————————————
రచన: ’పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర
——————————————————–

’చిన్ని చిన్ని ఆశ’ చిగురించి, పుష్పించి,
’సరిగమపదనిస’ల స్థాయి పెంచి,
అంబుధులను దాటి, ’ఆస్కారు’ వేదిపై
’విజయ గీతి’ పాడి వెలిగె నిపుడు!

సంగీతంబున సాధికారికతనే సాధించి, నిష్ణాతుడై
గంగా తుంగ మహా ప్రవాహ గతులన్ కల్గించి రాగాలకున్,
పొంగారన్ సరసుల్ – మనోజ్ఞ స్వరముల్ పుట్టించి, గీతావళీ
రంగంబందున రాణ కెక్కె భువిపై ’రహ్మాను’ గంధర్వుడై!

ఉత్తర, దక్షిణము లనక –
మొత్తము భరతావని స్వర మూర్తుల యందున్
సత్తువనే చాటుచు నిలు
వెత్తుగ ఘన కీర్తి నొందె ’ఏ. ఆర్. రహ్మాన్’!

” అగునా గెల్చుట భారతీయులకు నా ’ఆస్కార్’ పురస్కారమున్?
యుగముల్ బట్టునొ? లేక లేదొ మనవా డొక్కండు కా భాగ్యమే? ” –
సెగయై రేగెడి కోరికే మది నిటున్ చేజారుచున్నంతలో –
’ద్విగుణం’బందె తొలిం బ్రయత్నముననే ధీశాలి ’రహ్మా’ నహో!

భాషయె సంగీతమనగ –
ధ్యాసయె సంగీతమనగ – తనకీ జగతిన్
శ్వాసయె సంగీతమనగ
దేశమునకు కీర్తి దెచ్చె దేదీప్యముగాన్ !

(’ఆస్కార్’ పురస్కార విజేత ’ఏ.ఆర్. రహ్మాన్’కు అభినందనలతో…)

ప్రకటనలు

“ద్విసహస్ర సందర్శనోత్సవం”

“ద్విసహస్ర సందర్శనోత్సవం”
________________________________

namaste

ప్రారంభించిన మూడు నెలలలోపే వేయి మంది సాహితీ ప్రియులు నా బ్లాగును దర్శించగా, “సహస్ర దర్శనోత్సవం” జరుపుకొన్న విషయం మీకందరికీ విదితమే! ఇప్పుడు మరో ఇరవై ఐదు రోజుల్లోనే మరో వేయి మంది సాహితీ ప్రియులు నా బ్లాగును సందర్శించారు. “శివ రాత్రి” పర్వదినం(23-02-2009) నాడు నా బ్లాగు “ద్విసహస్ర సందర్శనోత్సవం” జరుపుకోవడం ఎంతో ముదావహం. ఆ రోజు నా బ్లాగు రెండు వేల ’హిట్ల’ సంఖ్యను దాటి, మరింత వేగంగా ముందుకు దూసుకుపోతూ ఉంది. ఈ ఇరవై ఐదు రోజుల్లో ఎంతో మంది పాఠకులు నా టపాలకు స్పందించి గౌరవప్రదమైన వ్యాఖ్యలను చేసారు. వాటిలో ముఖ్యమైనవి –

చింతా రామకృష్ణారావు గారు “వృక్ష కావ్యం” పై :
“మీ వృక్ష కావ్యం యదార్థ దర్పణంగా పరిఢవిల్లుతోందనడంలో సందేహం లేదు. చక్కని భావుకత. అభినందనలు.”

సత్యనారాయణ గారు “మార్నింగ్ కాఫీ” పై :
“కవిత బాగుంది. వారాంత దాంపత్యాలు చేస్తున్న ప్రస్తుత ఐ.టి. ఉద్యోగుల గురించి చక్కగా చెప్పారు.”

పద్మార్పిత గారు “మార్నింగ్ కాఫీ” పై :
“చాల చాల బాగా వ్రాసారు. ఇది కవిత కాదు, ఐ.టి. ఉద్యోగుల జీవన దర్పణం…”

రానారె గారు “మార్నింగ్ కాఫీ” పై :
“లిఫ్టులో దిగేప్పుడు కలిగే అనుభూతిని మీరు వర్ణించిన తీరు ఆత్మలను పలికించేదిగా ఉంది. అద్భుతమైన కవిత.”

నరసింహారావు మల్లిన గారు “నీలి కురుల నీడలో” పై :
“మీ కవితా మాధురిలో నా హృదయం కరిగింది.”

సుభద్ర గారు “అశ్రు నివాళి” పై :
“బాగుంది ఫణిగారు! ముఖ్యంగా లాస్ట్ సెంటెన్స్ – ’భారత కీర్తి మహాకావ్యంలో…’ – సూపర్ గా ఉంది.”

పద్మార్పిత గారు “చికునుగునియ” పై :
“చికునుగునియ వచ్చినవారు కూడ చిరునవ్వు నవ్వెదరు మీ పద్య కవితను చదివి … బాగు బాగు !!!!

వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు.

గణాంకాలు:

అత్యధికంగా వీక్షకులు దర్శించిన రోజులు:
dt.08-02-2009 : 111
dt.16-02-2009 : 87
dt.23-02-2009 : 86
dt.15-02-2009 : 81

అత్యధికంగా వీక్షకులు దర్శించిన వారం:
1st Week of February 2009 : 313
2nd Week of February 2009 : 298
3rd Week of February 2009 :260

ఈ ఇరవై ఐదు రోజుల్లో దర్శించిన
వీక్షకుల సంఖ్య : 1052

ఉత్తమ టపాలుగా గుర్తింపు పొందినవి:
“సాక్షి-ఫన్ డే లో”
(“అశ్రు నివాళి” కవిత) : 120
“Morning Coffee” : 108
“నీలి కురుల నీడలో” : 53
“వృక్ష కావ్యం” : 52

నా బ్లాగు “ద్విసహస్ర సందర్శనోత్సవం” జరుపుకొంటున్న శుభ వేళ – అనేక మార్లు నా టపాలను “వేడి టపాల”లో, నా బ్లాగును “వేడి బ్లాగుల”లో ఉంచిన “వర్డ్ ప్రెస్” వారికి, “కూడలి” వారికి, “జల్లెడ” వారికి, “జాలము” వారికి, “హారం” వారికి, “బ్లాగు కుటీ” వారికి, “బ్లాగ్ అడ్డ” వారికి, “నా కిష్టమైనవి”లో ఉంచే “నరసింహ (వేదుల బాలకృష్ణ మూర్తి)గారికి, ముఖ్యంగా శివ రాత్రి పండుగ రోజు “శివాత్మకమ్” అన్న నా కవితను అన్ని బ్లాగుల ప్రక్కన ప్రత్యేకంగా ఉంచి గౌరవించిన ’హారం’ భాస్కర రామి రెడ్డి గారికి నా శతాధిక కృతజ్ఞతాభివందనాలు.

– డా.ఆచార్య ఫణీంద్ర

“శివాత్మకమ్”

shivatmakam

తెలుగు ప్రజలంతా తెలుసుకోవలసిన విషయమేమిటంటే –

శివాంశయే “త్రిలింగ” భాషగా రూపుదిద్దుకొన్నది.
శివాత్మకమైనది మన తెలుగు భాష!

“శివాత్మకమ్”
—————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
——————————–

నెలవంక రూపమే ’తలకట్టు’గా వెల్గె –
శూలమే ’దీర్ఘ’మై శోభ గూర్చె –
మెడను నాగేంద్రుడే ’గుడి దీర్ఘ’మై నిల్చె –
’కొమ్ము’లాయెను నంది కొమ్ము లలరి –
’ఏత్వంబు’,’లోత్వంబు’లే నాగ భూషణాల్ –
’ఋత్వాలు’ జంగమ ఋషులు గాగ –
’పూర్ణ బిందువె’ అన్నపూర్ణ ముఖంబయ్యె –
ప్రమథ గణపతియే ’ప్రణవ’మయ్యె –

అక్షరములౌ ఘన శివ లింగాకృతులయె
అక్షరంబులుగా ’త్రిలింగావని’పయి –
చెలువముగ నలరారుచున్ వెలుగ లిపిని,
వరలగ ’త్రిలింగ భాష’యై తరతరాలు!

[ ’శివ రాత్రి’ పర్వ దిన శుభాభినందనలతో … ]

శివ స్తుతి (దండకం)

శివ స్తుతి (దండకం)
—————————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
———————————–

shiva

శ్రీ శంకరా! దేవ! శ్రీ కంధరా! శైవ సద్భావనా పూర! సద్భక్త సద్బుద్ధి సంచార! సాకార! ఓంకార! గంభీర! శ్రీ భావజాకార సంహార! జ్యోత్స్నాకరావాస సత్కేశ సంపన్న యోగీశ్వరా! భృంగి సంగేశ్వరా! లింగ రూపేశ్వరా! తుంగ గంగాధరా! శ్రీ హరా! పార్వతీ దేవి ప్రాణేశ్వరా! రాజ రాజేశ్వరా! శీత శైలేశ్వరా! శాత శూలేశ్వరా! భూత జాలేశ్వరా! రుద్ర భూమీశ్వరా! రౌద్ర కాలేశ్వరా! భద్ర కాళీశ్వరా! ఫాల నేత్రేశ్వరా! భవ్య నామేశ్వరా! దివ్య ధామేశ్వరా! సర్వ కామేశ్వరా! సప్త లోకేశ్వరా! నాయకా! నర్తనానంద సంధాయకా! నాగ రాజేంద్ర సద్భూషణా! భీషణా! పోషణా! శ్రీ శివా! శ్రీ భవా! శ్రీశ! కోటీశ్వరా! శ్రీ త్రికూటేశ్వరా! భూరి విశ్వేశ్వరా! పాహిమాం! పాహిమాం! పాహి సర్వేశ్వరా!

(విశ్వ వ్యాప్తంగా విస్తరిల్లి విజయ కేతనం ఎగురవేస్తున్న తెలుగు వారందరికీ “శివ రాత్రి” పర్వ దిన శుభాకాంక్షలతో…)

“చికునుగునియ” (పద్య కవిత)

“చికునుగునియ” (పద్య కవిత)
————————————-
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
—————————————
chikungunya-virus

అకట! ఇది ఏమి వ్యాధిరొ!
“చికునుగునియ” పేర వెలసి చిచ్చును రేపెన్
సకల నగరముల యందున –
టకటకమని వ్యాప్తి చెంది ఠారెత్తించెన్!

జ్వరములెన్ని రావు – వచ్చి తగ్గియు పోవు
వైద్యుడిచ్చు మందు వాడినంత!
తెలియదాయె నిద్ది – దీని తస్సాదియ్య!
వచ్చునెపుడొ! తుదకు వదలునెపుడొ!

మందులన్ని గూడ మాట మాత్రానకే!
ముందు జాగ్రతంత ముక్తసరికె!
జ్వరము తగ్గవచ్చు! వారాలు, మాసాలు
ఒంటి నొప్పులటులె ఉండిపోవు!

మోకాళ్ళును, మోచేతులు,
ఈ కాయమునందు కీళ్ళవెంతయొ నొచ్చున్!
ఏ కార్యమతడు సలిపిన –
లోకులకది కానిపించు “స్లో మోషను”లో!

కూరుచున్నచో లేవగానేరడాయె –
నిలిచియున్నచో కూర్చుండనేరడయ్యొ!
మంచమందు ప్రక్కకు కాస్త మలగలేడు!
కలము పట్టలే, డన్నమున్ కలుపలేడు!

పట్టుకొనుచు గోడ, పాదాలు కదిలించి,
తడిమి బల్లివోలె నడువ నతడు –
కాంచువారి కద్ది “కామెడీ” చిత్రమే!
అనుభవింప – బాధ అపుడు తెలియు!

చికునుగునియ! నీదు మహిమ –
చకితుండై నక్సలైటు “సాంబ శివుండే”
ఇక అడవి నుండలేనని,
ప్రకటించియు లొంగిపోయె ప్రభుతకు – బాబోయ్!!

–***–

“సాక్షి” దిన పత్రిక (ఆదివారం) – “ఫన్ డే”లో

“సాక్షి” దిన పత్రిక (ఆదివారం,15 – 02 – 2009) – “ఫన్ డే”లో
అచ్చయిన నా కవిత

d30703656

నీలి కురుల నీడలో …

(ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తెలుగు వారందరికి శుభాభినందనలతో…)

నీ నీలి కురుల నీడలో …(లలిత గీతం)
——————————
రచన: డా.ఆచార్య ఫణీంద్ర
———————
neeli-kurula-15
నీ నీలి కురుల నీడలో
నిదురించనీ నన్ను –
నీ పాల మనసు మేడలో
నివసించనీ నన్ను –

నీ ఆశల పందిరిలో
చిగురించనీ నన్ను –
నీ ఊహల పల్లకిలో
విహరించనీ నన్ను –

నీ సోగ కనుల సైగతో
కదలాడనీ నన్ను –
నీ లేత పెదవి పలుకుకు
తల ఊచనీ నన్ను –

నీ అడుగులోన అడుగు వేసి
నడయాడనీ నన్ను –
నీ ఒడిలో తుది శ్వాసను
విడనాడనీ నన్ను –

Previous Older Entries