ఆంధ్రప్రదేశ్ : జిల్లాల పునర్వ్యవస్థీకరణ

నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నూతనోత్సాహంతో, నూతనోత్తేజంతో ముందుకు సాగుతున్న యువ నాయకులు శ్రీ వై. యస్. జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక శుభాభినందనలను తెలియజేస్తూ, సోదర రాష్ట్ర తెలుగు ప్రజల సత్వరాభివృద్ధి, సంక్షేమార్థం నూతన ముఖ్యమంత్రి గారికి నేను ఒక ప్రత్యేకమైన సూచనను అందిస్తున్నాను.

తెలంగాణ రాష్ట్రంలోలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ జిల్లాల పునర్వ్యవస్థీకరణ చేపట్టి, ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలకు కనీసంగా మరో 8 జిల్లాలను చేర్చి, మొత్తంగా 21 జిల్లాలను ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా సూచన. దీని వలన అదనపు కలెక్టరేట్లతో యంత్రాంగం సమర్థత పెరిగి, చక్కని నియంత్రణతో అభివృద్ధి వేగం పెరుగుతుంది. అంతేకాదు. జిల్లాల ప్రాతిపదికన కేంద్ర నిధులు కూడ ఎక్కువగా అందే అవకాశం ఉంది. ఇంకా యువతకు అదనంగా ఉద్యోగాలు ఏర్పడుతాయి కూడా.

నా సూచన మేరకు ఆంధ్రప్రదేశ్ లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ఇట్లా జరిగితే బాగుంటుంది.

A.కడప>1.కడప,2.వై. యస్.ఆర్. జిల్లా
B.కర్నూలు> 3.కర్నూలు,4.శ్రీశైలం
C.అనంతపురం> 5.అనంతపురం,6.పుట్టపర్తి
D.చిత్తూరు> 7.చిత్తూరు,8.తిరుపతి
E.నెల్లూరు,F.ప్రకాశం> 9.నెల్లూరు,10.ప్రకాశం, 11.ఒంగోలు
G.గుంటూరు,H.కృష్ణా>12.గుంటూరు,13.కృష్ణా,14.అమరావతి
I.తూర్పుగోదావరి,J.పశ్చిమగోదావరి>15.తూర్పుగోదావరి,16.పశ్చిమగోదావరి,17.కోనసీమ
K.విశాఖపట్నం,L.విజయనగరం,M.శ్రీకాకుళం>18.విశాఖపట్నం,19.అరకు,20.విజయనగరం,21.శ్రీకాకుళం.

నవ యువ ముఖ్యమంత్రి శ్రీ వై.యస్. జగన్ గారు ఈ కోణంలో దృష్టి సారిస్తే మంచి ఫలితాలు లభిస్తాయని నేను భావిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

కవితాక్షరాలు

 

 

 

 

 

 

 

కవితాక్షరాలు

రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
              డా. ఆచార్య ఫణీంద్ర

“వాడెవడో గుర్తించడు –

వీడెవడో పిలిచి పీట వేయడ” టంచున్

ఏడిచెద వేల సుకవీ!

నేడది ప్రస్తుతము – రేపు నివురై పోవున్!

కాలమునందు నివ్వి చిరకాలము నిల్వవు! నిల్చు నెప్పుడున్

వేల జనంబు మెచ్చగల విచ్చిన నీ కవితా సుమంబులే!

కాల చరిత్రమందు కవి గణ్యుల సత్కృతులందు చల్లు నా

పూలవి వాడె – నిల్చె గద పొత్తములో కవితాక్షరంబులే!*

నగ్న సత్యము

నగ్న సత్యము

రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ” డా. ఆచార్య ఫణీంద్ర

 

“సత్య”,”మసత్యముల్” జగతి సాగగ నెవ్వరి దారి వారు, సాం

గత్యము గూడె నొక్క కడ! చక్కగ మాటలలోన దించి, సౌ

హిత్యమునున్ నటించె తెగ ఎచ్చులు వల్కుచు నా “అసత్యమున్”!

“సత్య” మమాయికత్వమున శాంతముగా విని, నమ్మె దానినిన్! – 1

 

కొన్ని రోజు లట్లు కూడి తిరిగినారు –

అక్క, చెల్లె లన్న యట్లు వారు!

వస్త్రములను గుర్తు పట్టకుండిన యెడ

కవల పిల్లల వలె కలుగు భ్రాంతి! – 2

 

చల్లని ఒక సాయంత్రము

వెల్లువగా పారు నదికి వెడలెద మనుచున్

కల్లరి – “అసత్య” మంతట –

అల్లన కోరిక దెలిపిన దా “సత్యము”తో! – 3

 

ఉత్సాహ పూర్ణులై ఉరికి చేరిరి వేగ

తరుణు లిర్వురు నదీ తటము కడకు!

వెల్లువెత్తు నదిని వెచ్చని నీటిలో

స్నానమాడుమని “అసత్య” మనియె!

యోచించుచున్న ఆ యోష – “సత్యము” గాంచి,

ఆ “అసత్యము” దుస్తు లంత విప్పె!

సఖికి తోడుగ వీడి “సత్యము” వస్త్రముల్

నగ్నమూర్తియయి తా నదిని మునిగె!

 

అప్పుడా “అసత్యము” జూపి అసలు బుద్ధి –

స్నానమాడుటకై తాను నదిని దిగక,

కట్టి “సత్యము” విడిచిన పుట్టములను

పారిపోయె – లేక రవంత పాప చింత! – 4

 

శుద్ధియె శుద్ధమునై పరి

శుద్ధంబైనటుల నగ్న శుద్ధిని గొని తా

నుద్ధరణము నొందితినని

బుద్ధిని తలపోసి సత్యము తటమును గనన్ – 5

 

అట “నసత్యము” తన కగుపింపకుండుట

గాంచి, నదిని వీడి కనె నటు, నిటు!

తన వలువలు గూడ కనరాక “సత్యము”

నిండ మునిగితంచు నీరుగారె! – 6

 

చేయునదేమి లేక, చెలి చేసిన మోసము చిత్తమందునన్

రోయుచు, నామె యొక్క ఒలె రోత పడన్ విధి లేక దాల్చియు

“న్నేయెడ తాను దాగినదొ? యేమొ?” యటం చిక తాను వీక్షణన్

జేయుచు సాగుచుండె – పురజీవులు గాంచుచు నీసడించగాన్! – 7

 

“నేనే సత్యము!” ననుచును

వేనోళ్ళను చెప్పుకొనుచు విహరించిన దా

జాణ – “అసత్యము” భువిలో!

నానా విధ స్వార్థ జనులు నడిచిరి తనతో! – 8

 

“సత్య” ముడుపు లూనిన ఆ “అసత్యము”నకు

ప్రజలు బట్టిరి నిత్య నీరాజనములు!

ఆ “అసత్యము” చేలము లమరు వెలది

నెంత మాత్రము గుర్తించ కీసడించ్రి! – 9

 

తుద కిట్లు గాదని తలచి

పొదివికొనిన బట్టలు విడి, పురవీధులలో

కదలెడు “సత్యము”ను గనుచు

పదుగురు నిందించినారు బాహాటముగాన్! – 10

 

“సత్యము”నకు చెందు శాటి ధరించిన

ఆ “అసత్యము” గని అబ్బురపడి

మాయలో బడిన అమానుష ప్రజలకు

“నగ్న సత్యము” గన నచ్చు నెట్లు? – 11

 

భగ్నమగు తన ప్రతిష్ఠ, ని

మగ్నమయి “అసత్య”పు వసమందున దిరుగన్!

నగ్నముగ తిరుగజాలదు!!

భగ్న హృదయ – “సత్య” మటుల పడె వేదనలో! – 12

 

బయట తిరుగగ తన బట్టలు దొరకక

సిగ్గుతోడ తాను చితికిపోయి,

నదిని చేరి తుదకు “నగ్న సత్య” మపుడు

నిలువ నీడ లేక నీట దాగె! – 13

 

తిరుగాడె “నసత్య” మటుల

ధరణిని తా “సత్యము”నని తరతరములుగాన్!

మరుగునపడె “సత్య” మకట!

ఎరుగము తా వెలికివచ్చు నెపుడో భావిన్? – 14*

 

(19వ శతాబ్ది ఫ్రెంచ్ జానపద కథ ఆధారంగా …)

 

 

 

 

 

“ఆంధ్రప్రభ” దినపత్రికలో …

నా “తెలంగాణ మహోదయం” కావ్యంపై
29 ఏప్రిల్ 2019 నాటి “ఆంధ్రప్రభ” దినపత్రికలో ప్రచురితమైన సమీక్ష …

– డా. ఆచార్య ఫణీంద్ర

“సాహితీ సల్లాపాలు”

ఈ నెల 29న ఆవిష్కరింపబడనున్న నా కొత్త పుస్తకం – “సాహితీ సల్లాపాలు”

– డా. ఆచార్య ఫణీంద్ర

 

“ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖ”కు అభివందనం! 

ఈ కవి – “ఆచార్య ఫణీంద్ర”కు పి.హెచ్.డి. పట్టాను ప్రసాదించి,
“డాక్టర్ ఆచార్య ఫణీంద్ర”గా మార్చిన వందేళ్ళ ప్రాయం గల
“ఉస్మానియా విశ్వవిద్యాలయ
తెలుగు శాఖ”కు
అభివందనం! 

– డా. ఆచార్య ఫణీంద్ర

రోహిత్ గోవర్ధనం ప్రతిభను శ్లాఘిస్తూ …

నా కుమారుడు చి|| రోహిత్ గోవర్ధనం ప్రతిభను శ్లాఘిస్తూ మరికొన్ని వార్తా పత్రికలు …

– డా.ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Previous Older Entries