‘పద్మభూషణు’నికి అభినందనలు

‘పద్మభూషణు’నికి అభినందనలు

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

ఏల మథించినారొ దివిజేంద్రులు, దైత్యులు క్షీరవారిధిన్

చాల శ్రమించి, తా మమృత సాధనకై? – మధుర స్వరాల, గీ

తాల వరాల రూపమున, ధాత్రిని గాన కళా విరించియౌ

‘బాలు’ గళమ్మునం దమృత భాండములో సుధ జాలువారగాన్!

 

ప్రథిత ‘శ్రీపతి పండితారాధ్య’ కుల మ

హా పయః పయోనిధి సోముడగుచు గాన

మూర్తి ‘బాల సుబ్రహ్మణ్యము’ ప్రభవించె

ధరణి – ‘లలిత గీతాల శ్రీ త్యాగరాజు’!

 

నలుబదేళ్ళ నుండి నవనీత మృదు గాన

మాధురీ మరంద మయములైన

ముప్పదారు వేల గొప్ప గీత సుమాల

పూచినట్టి కల్పభూజ మతడు!

 

నటనను ‘నంది’ని గెలిచెను –

పటుత్వముగ చిత్రములకు స్వరముల గూర్చెన్ –

దిటవుగ గాంధర్వ కళా

స్ఫుట పటిమను జూపి ‘పద్మ భూషణు’డయ్యెన్!

 

ఎన్ని పురస్కృతుల్ గొనియె, నెక్కె మహా శిఖరంబు లెన్నియో –

కొన్నియు నాంధ్ర రాష్ట్రమున, కొన్నియు దేశము, విశ్వ మెల్లెడన్!

ఇన్ని కిరీటముల్ గెలిచి, ఎంతొ వినమ్రత జూపు నాతనిన్

సన్నుతి జేయుదున్ – యశము శాశ్వతమై యలరార గోరెదన్!

[ఆంధ్రుల అభిమాన గాయకులు డా. ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం గారిని ‘పద్మభూషణ్’ పురస్కారం వరించిన సందర్భంగా అభినందనలతో … ]     

                            — *** —  

అసహ్యం

అసహ్యం

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

 

చరిత్ర , నాడు వర్తమానమై

తెలంగాణ ప్రజలకు

మాయని గాయం చేస్తున్నప్పుడు …

సెన్సార్ చేయని

ఈ స్వార్థపూరిత దుర్వ్యవస్థ –

ఇప్పుడు, అదే చరిత్రను

చలనచిత్రంగా మలచి

ప్రజల కళ్ళ ముందుంచబూనితే …

సెన్సార్ కత్తెరను అడ్డు వేస్తుంది!

పాపం!

అద్దంలో ముఖం చూసుకొంటుంటే

అసహ్యం వేస్తుందేమో!

గూగులమ్మ పదాలు

గూగులమ్మ పదాలు

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

నీది ఇంటరునెట్టు

నాది పాత మర్రి చెట్టు

జోడు కుదరదు – ఒట్టు!

ఓ గూగులమ్మా!

 

చేసెనెవడో ఐ.డి.

నా పేరునే వాడి –

ఎరుగ ’మెయిలు’ నాడి!

ఓ గూగులమ్మా!

 

ఎవడు చూడు – ’నెట్టు’!

చేయులే కనికట్టు –

నేను మాత్రం ’ఫట్టు’!

ఓ గూగులమ్మా!

 

పెట్టిన ’పాస్ వర్డు’

గుర్తుండడం ’హార్డు’ –

నేను అక్కు’బర్డు’*!           (* అక్కు పక్షి)

ఓ గూగులమ్మా!

 

చేతబట్టి ’మౌసు’

తిప్పుతుంటే ’నైసు’ –

తొలిమెట్టులో ’పాసు’!

ఓ గూగులమ్మా!

 

చేయ ’డబుల్ క్లిక్కు’

ఎక్కెనేమో ’కిక్కు’ –

’ఫ్రేము’లొచ్చెను పెక్కు!

ఓ గూగులమ్మా!

 

వెదుక ’యాహు మెసెంజరు’

’మౌసు’ జరిపితి ’కార్నరు’ –

మాయమయ్యెను ’కర్సరు’!

ఓ గూగులమ్మా!

—- 000 —-  

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

విశాఖలో నా ప్రసంగం

                 రసరమ్యంగా వెలువడిన “మాలిక పత్రిక” సంక్రాంతి(ప్రారంభ) సంచికలో – విశాఖ జిల్లాలో జరిగిన నా ప్రసంగ కార్యక్రమ వివరాలనందించారు విదుషీమణి డా. వి. సీతాలక్ష్మి గారు.
ఆ వివరాలు …
( మాలిక పత్రికా నిర్వాహకులకు కృతజ్ఞతలతో- )

ఆంధ్రపద్యకవితాసదస్సు- డా.ఆచార్య ఫణీంద్రగారికి సత్కారం

                   ఆంధ్ర పద్యకవితా సదస్సు విశాఖజిల్లా అష్టాదశ వార్షికోత్సవం డిసెంబరు 26, 2010 నాడు అనకాపల్లి పట్తణంలో జరిగింది. శ్రీ కే. కోటారావుగారు అధ్యక్షునిగా, డా.మెఱుగుమిల్లి వేంకటేశ్వరరావుగారు ప్రధాన కార్యదర్శిగా, సదస్సు రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పద్యభాస్కర శ్రీ శ్లిష్ట్లా వేంకటరావుగారు పాల్గొన్న ఈ సభ ) చాలా ఆహ్లాదంగా, విజ్ఞానదాయకంగా సాగింది.

                   పద్యకళాప్రవీణ డా.ఆచార్య ఫణింద్రగారు (ఉపాధ్యక్షులు, ఆంధ్ర పద్యకవితాసదస్సు) ఆనాటి ప్రధాన వక్తగా “19వ శతాబ్ది పద్యకవిత్వం” అనే అంశం మీద అద్భుతమైన ప్రసంగం చేశారు. దేనినైతే కొంతమంది ఆంధ్రసాహిత్యంలో క్షీణయుగమని నేటి వఱకూ చీకటిలో ఉంచే ప్రయత్నం చేస్తూ వచ్చారో, ఆ యుగానికి ఆయన “ఉషోదయ యుగం” అనే నామధేయాన్ని సృజించటం ముదావహం. దానిని ఉషోదయ యుగమనటానికి సహేతుకమైన కారణాలను విశదీకరిస్తూ, విశ్లేషిస్తూ ఆ యా కావ్యాలలోని అనేక పద్యాలను, కథాంశాలను, కావ్య వస్తు నిర్వహణను ఉట్టంకిస్తూ, ప్రస్తావిస్తూ తమ ప్రసంగంతో ఆయన శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

వృత్తిరీత్యా భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ లో శాస్త్రవేత్త అయినా, ఆయన ప్రవృత్తిరీత్యా కవి, సహృదయులు. “పద్యకళాప్రవీణు”నిగా ప్రసిధ్ధులు. “ముకుంద శతకం”, “కవితారస గుళికలు”, “పద్య ప్రసూనాలు”, “విజయ విక్రాంతి”, “ముద్దుగుమ్మ”, “మాస్కో స్మృతులు”, “వాక్యం రసాత్మకం” వంటి భిన్న సాహిత్య ప్రక్రియల నిర్వహణతో సాహితీ రంగానికి సుపరిచితులు. ఆయన తాజాగా రచించిన అధిక్షేప, హాస్య, వ్యంగ్యకృతి “వరాహ శతకం” ఈ సభలో ఆవిష్కరింపబడటం మరో విశేషం.

శ్రీ వేంకటరావుగారు పుస్తకాన్ని ఆవిష్కరించగా విశాఖజిల్లా పద్యకవితా సదస్సు ఉపాధ్యక్షురాలైన డా.వీ.సీతాలక్ష్మి శతకాన్ని సమీక్షించారు.

తదనంతరం “రైతులు – వఱదలు” అనే అంశం మీద డా.వేంకటేశ్వరరావుగారు కవిసమ్మేళనం నిర్వహించారు. తమ గళంతో స్వీయకవితలను వినిపించిన కవులను జ్ఞాపికలతో సత్కరించారు. అనంతరం కీ.శే. వేలూరి సత్యనారాయణ, కీ.శే. ఆచార్య బొడ్డుపల్లి పురుషోత్తం గార్ల స్మృత్యర్ధం పాఠశాల స్థాయిలో నిర్వహించిన పద్యపఠనపోటీలలో విజేతలకు బహుమతి ప్రదానం జరిగింది. ఈ సందర్భంగా ఆచార్య ఫణీంద్రగారిని సాహిత్యాభిమాని అయిన శ్రీ ఫణిరాజ భరద్వాజగారు సత్కరించారు.

ఆకలి చావులు

ఆకలి చావులు

రచన: ‘పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

ప్రొద్దున నిద్ర లేవగనె, పొట్టను గూర్చి తలంపు వచ్చి- ” ఓ
ముద్దయె చేతికందు నెటు? మూతికి, చేతికి పొత్తు గూడగా
ఎద్దియు దారి? లేక మరి ఇంతకు ముందటి రోజు వోలెనే
అద్ది లభింపదో? ” యని అనంత మనోవ్యథ గల్గు పేదకున్!

తనతో బాటుగ ఇంకను
తన భార్యకు, పిల్లలకును – దారిద్ర్యమునన్
దిన దినమిటు పస్తులతో
కొనసాగుట చూడ, గుండె కోతయె గాదే?

ఆకలి కన్న ఘోరమగు నాపద, శాపము, శిక్ష గల్గునే
ఈ కలి కాలమందు నరు లెవ్వరికైనను? నీరసంబునై
చీకటు లావరించి, తమ చేష్ట లుడుంగగ నేల కూలి, వా
రాకలి చావు నొందరొకొ – అన్నమొ, గంజియొ దక్కకుండినన్?

‘పాలమూరు‘నందు పలు పేద కూలీలు
పొట్ట కూటి కొరకు, పొలములందు
పనులు దక్కకున్న పస్తులుందురు గదా –
దీన గతిని ఇట్లు దిన దినమ్ము!

‘కృష్ణ‘యు, ‘గోదావరి‘ వ
ర్ధిష్ణువులై ప్రక్కనుండి రిత్తగ బోవన్,
తృష్ణయె దీరక, క్షుద్బా
ధోష్ణములో మాడి మసగుచుం ద్రిట బీదల్!

“పుట్టువు మాసిపోవు నిక ముద్ద లభించక” యంచు బాధతో
పుట్టిన గడ్డయైన ‘మహబూబునగర్‘ పురి వీడి ఎందరో
పొట్టలు చేత బట్టుకొని; మూటలు, ముల్లెలు సర్ది నెత్తిపై –
చెట్టుకు పుట్ట కొక్కరుగ చేరుదురే నగరమ్ము కూలికై!

వేనకు వేలుగ జను లిటు
కానక యే దారిని, తమ కడుపులు నింపన్ –
మానిని, మరి సంతతితో
కానలలో నడచి నడచి, కడు దీనముగాన్ –

ఆకలి, నీరస బాధకు
కేకలు వేయంగ తుదకు కించిత్తైనన్
లేక ఇక శక్తి, నగరపు
వాకిళులన్ సొమ్మసిల్లి పడిపోదురయో!

వలస పక్షులై నగరాన వ్రాలి ఇట్లు
‘ఫుట్టుపాతు‘లపై నిద్రబోవుచుండు
పేద కూలీ కుటుంబాల వెతలు జూడ –
కఠిన శిలలైన కన్నీరు గార్చు గాదె?

అదియొ, ఇదియొ పనిని అందించి ఎవరైన
అక్కు జేర్చుకొన్న అసువులుండు –
అదియు దక్కకున్న ఆకలి చావులే
వారి నుదుటి పైన వ్రాత యగును!

సకలైశ్వర్య విశేష భోగములు, సత్సాహిత్య సంస్కారముల్
ప్రకటంబై, ‘గదవాల‘, ‘ఆత్మకురు‘, ‘వనప‘ర్త్యాది సంస్థానముల్
ఒకనా డద్భుత వైభవమ్మొలికె – ఆ ఊర్లిట్లు దారిద్ర్యమం
దకటా! మ్రగ్గుట కేమి హేతు, వది యే మన్యాయమో దెల్పరే?

—***—

‘ఈవారం‘లో వరాహ శతక సమీక్ష

‘ఈవారం’ రాజకీయ సామాజిక వారపత్రికలో

 నా ‘వరాహ శతకము’ పై వచ్చిన సమీక్ష –

( ‘ఈవారం’ యాజమాన్యానికి, సమీక్షకులు ‘టి.యు.’ గారికి ధన్యవాదాలతో – )

– డా. ఆచార్య ఫణీంద్ర