“కవితాస్త్రాలయ”

“కవితాస్త్రాలయ”

(ఆస్ట్రేలియా తెలుగు కవులు, రచయితల సాహితీ సంకలనం)

“ఆస్ట్రేలియా తెలుగు సంఘం” వారు ఇటీవల అక్కడి తెలుగు కవులు, రచయితలు రచించిన కవితలు, కథలతో కూడిన ఒక సాహితీ సంకలనాన్ని వెలువరించారు. మెల్బోర్న్ తెలుగు సాహితీ సంస్కృతి వేదిక నిర్వాహకులు శ్రీ కొంచాడ మల్లికేశ్వరరావు గారి ఆధ్వర్యంలో రూపొందిన ఈ గ్రంథానికి నా చేత “ముందు మాట” వ్రాయించి, ప్రచురించారు. ఆస్ట్రేలియాలోని ప్రవాసాంధ్రుల మాతృ భాషాభిమానానికి, స్వీయ సంస్కృతి పట్ల గల అనురక్తికి అద్దం పట్టిన ఆ సంకలనం గురించి వివరణాత్మకంగా నేను అందించిన ఆ ముందు మాట – “ప్రవాసాంధ్ర భారతికి అభినందన హారతి”ని ఆసక్తి గలవారి కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

”   ప్రవాసాంధ్ర భారతికి అభినందన హారతి ”

” ఏ దేశమేగినా- ఎందు కాలిడినా-
ఏ పీఠమెక్కినా- ఎవ్వరెదురైనా-
పొగడరా నీ తల్లి భూమి భారతిని!
నిలుపరా నీ జాతి నిండు గౌరవము!! ”
– రాయప్రోలు

ఆధునిక సాంకేతిక, సమాచార, ఆర్థిక ప్రగతి ఫలితంగా ప్రపంచమంతా ఒక పల్లెగా పరిణమించిన వేళ, ఎందరో భారతీయులు వివిధ దేశాలలో ఔద్యోగిక బాధ్యతలు నిర్వర్తిస్తూ స్థిర నివాసం ఏర్పర్చుకొని, అక్కడ మన సాహితీ, సాంస్కృతిక విజయ పతాకలను ఎగురవేయడం – స్వదేశంలో నివసిస్తున్న భారతీయులందరికీ గర్వ కారణం. అందునా మన ఆంధ్రులు ఇందులో మరీ ముందుండడం ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకానికి మరింత ఆనంద దాయకం. నాటి రాయప్రోలు వారి సందేశ స్ఫూర్తి ఈనాటి ప్రవాసాంధ్రులలో ప్రతిఫలించి పరిఢవిల్లడం ఎంతో ముదావహం.
అలా … ఆస్ట్రేలియా గడ్డపై ’మెల్బోర్న్ తెలుగు సాహితీ సంస్కృతి సంవేదిక’ నొకటి ఏర్పర్చుకొని, ప్రవాసాంధ్రులనందరినీ ఒక చోట చేర్చి, వారిలో ఉన్న మాతృ భాషాభిమానాన్ని, స్వీయ సంస్కృతి పట్ల గల అనురక్తిని వెలికి తీసి, అనేక కార్యక్రమాలతో ఆస్ట్రేలియాలో ఆంధ్రాభ్యుదయానికి దోహదపడుతున్న పవిత్రాశయ సాధకులు శ్రీ మల్లికేశ్వరరావు కొంచాడ, శ్రీ యస్పి చారి, శ్రీ సరిపల్లి భాస్కరరావు ప్రభృతులు. ముఖ్యంగా శ్రీ మల్లికేశ్వరరావు గారు, వారి భార్యామణి శ్రీమతి ప్రత్యూష గారు, కుమారులు హరి గారితో కలసి ’స్రవంతి’ పేర, ఆస్ట్రేలియాలోని ప్రవాసాంధ్రుల రచనలతోబాటు వారికి ఉపయుక్తమైన సమాచారం గల ఒక చక్కని సాహిత్య ద్వైమాసిక పత్రికను నిర్వహిస్తుండడం నేనెరుగుదును. ప్రస్తుత సంకలనం ’కవితాస్త్రాలయ’ – అక్కడి రచయితల భాషా తృష్ణ, సాహిత్యాభిలాష, మాతృ దేశాభిమానాలతోబాటు సమకాలీన సామాజిక స్పృహ, కించిత్తు హాస్య ధోరణిని ప్రస్ఫుటించే కవితలు, కథలు, వ్యాసాలతో కూడిన సమగ్ర సాహితీ సమాహారం.
’కవితాస్త్రాలయ’ శీర్షికలోనే చమత్కారం ఉంది. ’కవితలనే అస్త్రాల పొది’గా వాచ్యార్థం. కాని ’ఆస్ట్రేలియా’ అన్న శబ్దాన్ని సంస్కరిస్తే, అది ’అస్త్రాలయ’గా పరివర్తితం అవుతుంది. కాబట్టి ’కవితాస్త్రాలయ’ అంటే ’ఆస్ట్రేలియా గడ్డపై మొలకెత్తిన కవితలు’ అన్న అర్థం అంతర్లీనంగా స్ఫురింపజేస్తుంది. ఈ సంకలనంలో కొన్ని ఇతర ప్రక్రియలకు చెందిన రచనలు ఉన్నప్పటికి, ప్రధానంగా కవితలు అధికంగా ఉండడం మూలాన ఈ శీర్షిక ఔచితీవంతంగా ఉందని భావించాలి.
మొదట ’సాహిత్యం’ అన్న విభాగంలో – దేశభక్తి, తెలుగు భాషా సంస్కృతుల పట్ల అభిమానం, మానవ సంబంధాలు మరియు అనుబంధాల పట్ల ప్రీతి, సామాజిక స్పృహ, ప్రవాసంలో తమ చుట్టూ ఉన్న ప్రకృతి పట్ల ఆరాధన … మొదలైన అంశాలపై చక్కని కవితలు చోటు చేసుకొన్నాయి.
ఈ సంకలనం కవుల భావ వ్యక్తీకరణలలో విభిన్న ధోరణులున్నా, అందరూ కోరేది ఆదర్శవంతమైన జీవన విధానమే!
ఒకవైపు సరిపల్లి భాస్కరరావు గారు
” ప్రాక్పశ్చిమాల నడుమ  సేతువై నిల్చిన
విమల ప్రతిభాశాలి, కీర్తిశాలి,
జాతి జాగృతి కారక యుగ వైతాళికాదర్శ మూర్తి
పరివ్రాజకాచార్య పరమ పావన మూర్తి ”
అని వివేకానందుని హిమ వన్నగ స్థాయి మూర్తిమత్వాన్ని కీర్తిస్తే, మరొకవైపు
” కృష్ణరాయలు ఏలిన ఈ తెలుగు నేల
ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణల ఐక్యవని!
కృష్ణ, గోదావరి పవిత్ర జలాల పునీత ధరిత్రి
తిరుమల, భద్రాద్రి, శ్రీశైల క్షేత్ర ధాత్రి! ”
అని కొంచాడ మల్లికేశ్వరరావు గారు జన్మభూమి ప్రస్తుతిలో పులకించిపోయారు. అంతే కాకుండా ఆయన,
” పచ్చని కొబ్బరి తోటల కోనసీమ
చల్ల గాలికి తలనూపే పైరు నేల
పరవళ్ళు తొక్కే పంట కాలువ
ప్రకృతి ప్రతిబింబాల హరివిల్లు ”
అంటూ మాతృభూమి అనుభూతులను పాఠకులతో పంచుకొన్నారు.  ఇంకొకవైపు పతనమవుతున్న మానవతా మూల్యాల పట్ల ఆవేదన చెందిన డా. వేణుగోపాల్ రాజపాలెం గారు –
” భాషలో దురుసుతనం
మనసుల్లో ఇరుకుతనం
మనుషుల్లో రాక్షసత్వం ”
అని నిట్టూర్చారు. ’మీ ఆశీస్సుల వర్షం చాలు’ అన్న కవితలో మురళి ధర్మపురి గారు
” మత్తు మధువులో కాదు –
ఉండేది నిషా కళ్ళలో!
భక్తి పూజలో కాదు –
ఉండాల్సింది శ్రద్ధలో! ”
అని తమదైన శైలిలో ఒక తాత్త్విక దృక్కోణాన్ని చాటారు.
” జీవితమే ఒక సమరం
నీ శౌర్యమే నీ సైన్యం
పోరాటమే నీకు మార్గం
పోరాడిన నీదే విజయం ”
అని చైతన్య స్ఫూర్తిని రగిలించారు సుధీర్ మాండలిక గారు మరో కవితలో.
ఈ సంకలనంలో స్నేహ మాధుర్యాన్ని చాటే చక్కని కవితలు కొన్ని ఉన్నాయి. వేణుగోపాల్ గారు రచించిన ఒక కవితలో
” స్నేహం ఒక పుష్పమైతే
ఆ పుష్పానికి నేను సుగంధమౌతా –
స్నేహమనేది వటవృక్షమైతే
ఆ వృక్షానికి నేను వేరునౌతా –
స్నేహమే మేరు పర్వతమైతే
వీచే మలయ మారుతమౌతా -”
అని స్నేహానుభూతిలో తడిసి ముద్ద అయ్యారు. మరో కవితలో కొంచాడ వారు
” నా ఆలోచనలకు ప్రేరణై, చేతిలో కలమై,
నా వాక్యంలో పదమై, ప్రతి పదంలో అక్షరమై,
నా కవితకు పల్లవై, పదాల వెల్లువై,
ప్రతి క్షణం నాలో నిలిచిన
నువ్వే నా నేస్తం ”
అంటూ స్నేహ ధర్మ ప్రాశస్త్యాన్ని కమనీయంగా వర్ణించారు.
కొన్ని కొన్ని కవితలలో నిశితమయిన వ్యంగ్యాస్త్ర ప్రయోగాలున్నాయి.
” ఆయుధ పోటీలే పరమావధి
మానవాభ్యున్నతికి సమాధి
యుద్ధ పరిణామాలు సృష్టించడమే ప్రగతి
దొరికిందంతా దోచుకోవడమే పద్ధతి ”
అని అగ్ర రాజ్యాల దుర్నీతిని ఎండగట్టారు మల్లికేశ్వరరావు గారు.
” సిగరెట్లు తాగడం అలవాటు చేసుకొంటాను
పొగాకు కార్మికుల ఉద్యోగాలు నిలబెడతాను
ఊదిన పొగలో మా ఆవిడ రూపం చూసుకొంటాను ”
అంటూ వ్యంగ్యోక్తులతో నవ్విస్తారు ’నూతన సంవత్సర తీర్మానం’ అన్నకవితలో శ్రీ మురళీ ధర్మపురి గారు.
ఈ సంకలనంలో కొందరు కవులు హృద్యమైన పద్య కవితలను కూడ వెలయించారు.
” డేండనాంగను గిరిమండల హరితాలు –
ఫిలిపు రేవున కద లలలు, పడవ –
సైంటుకిల్డ తటపు సైకత శయ్యలు –
మెల్లుబొర్ను కలల మెదలు నగరు! ”
అని ’మెల్బోర్న్’ నగర సౌందర్యాన్ని వర్ణిస్తారు కవి సరిపల్లె సూర్యనారాయణ గారు.
” తడబడు అడుగుల బుడుతడు
నడయాడగ తల్లి మురిసి నవ్వును గాదే!
బిడియము పడి యటు బిడ్డడు
అడుగే వేయక నిలిచిన అమ్మకు దిగులౌ! ”
అన్న పద్యంలో రాజుపాలెం వారి ధారాశుద్ధి, భావుకత పాఠకుణ్ణి కాసేపు కట్టిపడేసి, పోతనామాత్యుని స్మరణకు తెస్తాయి.
ఇందులో జానపద శైలిలో ఉన్న కొన్ని కవితలు పాఠకులను విశేషంగా ఆకర్షిస్తాయి. ముఖ్యంగా
” నా మాట తెలుగురో – నా పాట తెలుగురా –
నా బాట మెరుగురో – నా బాట వెలుగురా –
నా మాట తెలుగు – పాట తెలుగు – బాట తెలుగు –
పల్లె తెలుగురో – తనువెల్ల తెలుగురా – ”
అన్న చారి చిగురాల గారు రచించిన గీతం భలే హుషారుగా ఉంది. చారి గారే రచించిన మరో గీతంలో … ఆ మధ్య కాలంలో, ప్రవాసాంధ్రులపై ఆస్ట్రేలియా దుండగులు దాడులు చేసిన నేపథ్యాన్ని ఉటంకిస్తూ –
” తెలుగు తమ్ముళ్ళ మీద దుండగులు దాడి జేస్తే
తూర్పు పడమర నుండి ఉప్పెనలా లేసొచ్చి,
గల్లి గల్లి లొల్లి జేసి గందర గోళం జేసి,
అహింసా పంథాన అవలీలగ ఆదుకొన్న
తెలుగోళ్ళము! మేము తెలివైన వాళ్ళము!
తెలుగోళ్ళము! మేము తెలివైన వాళ్ళము! ”
అంటూ అక్కడి తెలుగు వారి ఐక్యతను తెలుగు వారంతా గర్వించేలా చాటారు.
గ్రంథంలో – బాల్యంలో, యవ్వనంలో, కౌమార్యంలో, వృద్ధాప్యంలో… మనిషి అంతరంగంలో కలిగే అంతర్మథనాన్ని చిత్రిస్తూ కొంచాడ మల్లికేశ్వరరావు గారు ధారావాహికగా అందించిన కవితలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి.
’నివాళి’ విభాగంలో సరిపల్లె సూర్యనారాయణ గారు
” మానవతా వాది వాడు
మనుషుల్లో మనీషి వాడు
మన మనసుల మనసైన వాడు
మన బ్రతుకుల బ్రతుకైన వాడు
వాడి పలుకుల వాడు
మేలుకొలిపెడి వాడు
ఎవడు వాడు …
శ్రీశ్రీ కవి పుంగవుడు ”
అని మహాకవి శ్రీశ్రీ కి శ్రద్ధాంజలి ఘటించారు. ఇంకా ఈ విభాగంలో ఆచార్య ఆత్రేయ, వేటూరి, డా|| రాజశేఖర రెడ్డి వంటి దివంగతులకు సమర్పించిన నివాళులున్నాయి.
ఇలా వివరించదగ్గ అంశాలు ఈ కవితలలో ఇంకా చాలానే ఉన్నాయి. కాని అలా వివరిస్తూ పోతే … ఈ ’ముందు మాట’ ఒక విమర్శన గ్రంథంగా విస్తరించే ప్రమాదముంది కాబట్టి విరమిస్తున్నాను. మొత్తానికి, ఈ కవులంతా సమకాలీన లబ్ధప్రతిష్ఠ కవుల కృతులను బాగా అధ్యయనం చేసి, ఇంకా కొంత భావుకతను పెంచుకొని, మరింత శిల్ప నిర్మాణ నైపుణ్యాన్ని సాధించుకొంటే, చక్కని కవులుగా రాణించగలరని నా విశ్వాసం.
చివరలో ఉన్న ’సాహితీ సంస్కృతి వేడుకలు’ విభాగంలో ఆ యా వేడుకల సందర్భంగా ఆస్ట్రేలియాలో… కవులు అల్లుకొని, వినిపించిన కవితలను చేర్చారు. ముఖ్యంగా ఈ భాగంలోని ఉగాది కవితలు ఆ యా కవులు ప్రవాసంలోఉన్నా, ఉగాది వేళ పొందిన పులకరింతలకు, ఆనందాతిశయాలకు అద్దం పడతాయి. ’చిత్రమాల’లోని చిత్రాలు అక్కడి తెలుగు ప్రజల గుండెలలో గూడు కట్టుకొని కొనసాగుతున్న అచ్చమైన తెలుగుదనం, ఉత్సాహం, చురుకుదనాలను ప్రాపంచికులకు బహిర్గతం చేసాయి.
ఇక, ’కథాగుచ్ఛం’ లోకి వెళితే … అన్ని కథలు, నవ్వుల పువ్వులను పూయించాయి. కథకులు జోస్యుల గంగాధర్, డా. ముడుంబై చారి, యోగి వాల్తాటి గార్ల కథన శైలులలో సున్నిత హాస్య స్ఫూర్తి పరిమళించింది. సమకాలీన వాస్తవిక సమాజంలోని చిన్ని చిన్ని అంశాల నుండి చక్కని హాస్యాన్ని చిలికే సామర్థ్యం వారిలో పుష్కలంగా ఉంది. వారికి నా ప్రత్యేక అభినందనలు.
దాదాపుగా అన్ని రకాల ప్రక్రియల గుభాళింపులతో రూపొందిన ఈ సాహిత్య కదంబంలో ఒక వ్యాసం కూడా ఉంది. ’ఆధునిక సమాజంలో స్త్రీ పాత్ర’ అన్న ఈ వ్యాసంలో సమాజంలో స్త్రీల యెడ గల విచక్షణ పట్ల శ్రీమతి కోడూరి నిర్మలాదేవి గారి ఆవేదన వ్యక్తం అయింది.
స్వదేశంలోనే, అందునా ముఖ్యంగా ఆంధ్ర దేశంలోనే – తెలుగు భాష పట్ల, సంస్కృతి పట్ల నిరాదరణ అధికమవుతున్న ఈ తరుణంలో ఆస్ట్రేలియాలో ఆంధ్రాభ్యుదయానికి పాటుపడుతున్న ఈ సంకలనం రచయితలు, ’మెల్బోర్న్ తెలుగు సాహితీ సంస్కృతి సంవేదిక’ సభ్యులందరూ ధన్య జీవులు. ముఖ్యంగా ఈ సంకలనాన్ని రూపొందించిన శ్రీ కొంచాడ మల్లికేశ్వరరావు గారి కృషి విశేషమైనదిగా భావిస్తున్నాను. ఆ కృషి ఫలితంగా వెలసిన ఈ ప్రవాసాంధ్ర భారతికి నా అభినందన హారతి.
దేశము కాని దేశమున, తీరిక లేని వ్యవస్థలోన – ఆ
కాశమె హద్దనంగ, మమకారము పొంగగ మాతృభాషపై –
లేశము వీలు చిక్కినను లీల – కథల్, కవితల్ రచించు మీ
ఆశయశుద్ధికిన్ ప్రణతి! ’ఆస్ట్రెలియాంధ్ర’  కవీంద్ర వర్గమా!

హైదరాబాదు                                               ( సం|| )
20 అక్టోబర్ 2010                               ఆచార్య ఫణీంద్ర

మరో భగత్ సింగ్ …

మరో భగత్ సింగ్ …

నియంతను నియంత్రించలేనప్పుడు
నిర్మూలనమే మార్గమని యెంచావు –
స్వాతంత్ర్యేచ్ఛతో తెలంగాణలో
మరో భగత్ సింగై అవతారమెత్తావు –
బాంబును విసిరి
భూమిని బ్రద్దలు చేసావు –
ప్రజా గర్జనను
నింగి దాకా ప్రతిధ్వనింపజేసావు –
గురి తప్పినా, గుండె లదరగొట్టావు –
నియంత మనస్థైర్యాన్ని నీరు గార్చావు –

పట్టుబడినా, నీవు పట్టు వీడలేదు –
తల తీస్తామన్నా, నీవు తల వంచలేదు –
నీ త్యాగ నిరతితో
స్వాతంత్ర్య యోధులకు స్ఫూర్తినందించావు –
నీ సాహసంతో
లక్షలాది యువకులకు లక్ష్యాన్ని నిర్దేశించావు –
తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలను
తెగగొట్టిన వీరుడవు నీవు !
ఈ గడ్డపై భారత పతాకను
నిలిపిన శూరుడవు నీవు !
కలలు గన్న స్వాతంత్ర్యాన్ని
కళ్ళారా చూసిన ధీరుడవు నీవు !
స్వాతంత్ర్యానికి ముందు, చావుకి సిద్ధపడి
ఉద్యమానికి ఊపిరులూదావు –
స్వాతంత్ర్యానంతరం, బ్రతుకును గెలిచి
స్వేచ్ఛా వాయువులను శ్వాసించావు –

పటాటోపాల లోకంలో
ముఠా మాయగాళ్ళ సమాజంలో
మామూలు మనిషిగా జీవించావు –
నిరాడంబరునిగా ఓ మూల నివసించావు – 

మా ‘ నారాయణరావు పవార్ ‘ !
ఓ ‘ తెలంగాణ భగత్ సింగ్ ‘ !
మరో స్వపరిపాలనోద్యమ వేళ –
మరో సూర్యోదయ వేళ –
అస్తమించావా ?
అమరత్వం పొందావా ?

సమైక్య రాష్ట్రంలో
పాఠ్యాంశాల్లో నీ ప్రస్తావన లేక పోవచ్చు –
కుహనా స్వాతంత్ర్య యోధుల నడుమ
నీకు గుర్తింపు లభించి ఉండక పోవచ్చు –
మా గుండెల్లో మాత్రం నీ వెప్పుడూ
అమరుడవే !
సాటి లేని మేటి
విప్లవ వీరుడవే !
దేశ భక్తుడవే !

( ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు – ‘ తెలంగాణ భగత్ సింగ్‘ 

శ్రీ నారాయణరావు పవార్ మృతికి నివాళిగా … )

– డా. ఆచార్య ఫణీంద్ర 

వరాహ శతక సమీక్ష

కవి కావ్య నిర్మాణ దృక్పథాన్ని క్షుణ్ణంగా అవగతం చేసుకొని, కృతి సమీక్ష చేసేవారు సమర్థ విమర్శకులుగా పరిగణింపబడతారు. అలాంటి సద్విమర్శకులు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు. ఆయన నా ” వరాహ శతకము ” పై చేసిన సమీక్ష నన్ను అబ్బురపరచింది. ఆయనకు ధన్యవాదాలు తెలుపుకొంటూ, ఆయన బ్లాగులో ప్రచురించిన ఆ సమీక్షను ఇక్కడ పునః ప్రచురిస్తున్నాను.

 – డా. ఆచార్య ఫణీంద్ర

 

 

వరాహశతకము – పుస్తక సమీక్ష 

– కోడీహళ్ళి మురళీమోహన్

[పుస్తకం పేరు: వరాహశతకము, రచన: డా. ఆచార్య ఫణీంద్ర, వెల: రూ.80/-, ప్రతులకు:శ్రీమతి జి.సావిత్రి, పూర్ణేందు ప్రచురణలు,102,శ్రీనివాస ఆర్కేడ్, ఈస్ట్ మారుతీనగర్,మౌలాలి, హైదరాబద్ 500040 మరియు ఆంధ్రసారస్వత పరిషత్, ఎ.వి.కె.ఫౌండేషన్,నవోదయ, ప్రజాశక్తి, విశాలాంధ్ర]

ఈ అధిక్షేప, హాస్య, వ్యంగ్య శతకం వరాహమా అంటూ వరాహాన్ని సంభోదిస్తూ చెప్పబడిన పద్యకవిత. వరాహమనేది ఒక కేవలం మిషగా తీసికొని ఈ శతకంలో మనుష్యజాతి విపరీత పోకడలను కవి ఎండగడుతున్నారు. పంది మీద శతకమేమిటని పండితులు ఘాటుగా తిట్టినా తిట్టనీ తాను వెనుదిరగనని కవి ఈ శతక రచనకు పూనుకున్నారు.

కవి వరాహానికి ఉన్న ప్రాముఖ్యతను వివరిస్తున్నారు ఈ పుస్తకంలో. కనకాక్షుడనే రాక్షసుణ్ని సంహరించటానికి విష్ణుమూర్తి వరాహ అవతారం ఎత్తినట్లు, హరి ఆదివరాహముగా కీర్తింపబడుతున్నట్లు, తిరుమల కొండ పై వరాహ తీర్థం ఏర్పడటానికి కారణమైనట్లు, నేటికినీ తిరుమలలో ముందు వరాహమూర్తి దర్శనమైన తరువాతనే వెంకటేశ్వరుని దర్శిస్తారని, సింహగిరిక్షేత్రంలోని దేవుణ్ని వరాహ నరసింహుడని పిలుస్తారని, కల్పములలో ఒకదానిని శ్వేతవరాహ కల్పమని పిలుస్తారని, అర్జునుడు పాశుపతాస్త్రము కోరి తపస్సు చేయగా శివుడు పరిక్షంప దలచిన సందర్భములో వారిరువురి బాణపు దెబ్బలను నిస్స్వార్థముగా సహించినట్లు, గణితశాస్త్ర కోవిదుడు వరాహమిహిరుని పేరులో కూడా వరాహము పేరు ఉన్నట్లు, కాకతీయ ప్రభువు రాజ్య పతాకముపై చిహ్నంగా ఉన్నట్లు కవి తెలుపుతున్నారు.

ఇంతటి పూర్వ చరిత్ర ఉన్న పందిని లోకులు ఎందుకు ఈసడిస్తారో కదా? అని కవిగారు వాపోతున్నారు. ప్రాణులన్నీ ఒకటేనని, అందరి శరీరాలలో పారే రక్తం ఒకటేనని,అందరికి అన్ని సమానంగా దక్కవలనని శాక్యముని మొదలుగా గాంధీ, అంబేద్కరు, జ్యోతీబాఫూలే మొదలైన వారు చాటినా ప్రజలు రంగులు వేరనీ, ప్రాంతాలు వేరనీ, పేద ధనిక వర్గాలనీ,జాతి, లింగ కుల వివక్షతను పట్టుకుని మూర్ఖముగా వేలాడుతున్నారని కవి ఆక్రోశిస్తున్నారు. పందులలో కూడా సీమ పందులు, ఊరపందులు, అడివి పందులు, ముళ్ల పందులు, తెల్లవి, నల్లవి ఎన్నో రకాలున్నప్పటికీ మానవుల వలె భేదభావములు లేవని కవి ప్రశంసిస్తున్నారు.

“కొందరు మనుష్యులు ముప్పూటలా మెక్కి ఏ పనీ చేయకుండా ఉంటారు. అట్టివారిని ‘పంది వలె బలుపు పట్టి ఉన్నా’వని తూలనాడితే నీ మనస్సుకు ఎంత బాధ కలుగుతుందో కదా? “అని కవి జాలిపడుతున్నారు. “నీపై ఎండా వానలు పడినా నీలో చలనం ఉండదు. మా నేతలకు కూడా ఈ గుణం అబ్బింది. ఎంత తిన్నా నీవు ఏది పడితే అది మెక్కుతావు. మా నేతలు కూడా పశుగ్రాసం, టెలివిజన్లు, పాలడబ్బాలు,బ్యాంకులు, చిట్ఫండ్లు, షేర్ మార్కెట్ స్క్రిప్పులు అవి ఇవి అని లేక ఏదిపడితే అది అచ్చంగా నీ వలే మేస్తారు. ఎవడు మంచి వాడో? ఎవడు నీ అవతారమో? అని మేము ముందుగా కనిపెట్టలేకపోతున్నాము.” అని కవి వ్యంగ్యంగా చెబుతున్నారు.

“దారిలో ఎక్కడ ఏ మురికి కనిపించినా శుభ్రంగా తినేస్తావు. నీ కృషి మా మున్సిపాలిటీ వారికి మార్గదర్శకం కావాలి” అని చమత్కారంగా అంటారు. “వీరబ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ‘ఒక స్త్రీకి పంది పిల్లలు పుడతా’రని ఎప్పుడో చెప్పారు. రూపం సంక్రమిస్తే వింతే గాని నడతను చూస్తే నీవలె ఏనాడో పుట్టారు” అని హాస్యభరితంగా అంటున్నారు. “గంపెడు పిల్లలను కను నీమాదిరి మానవులు కూడా పెక్కురు పిల్లలను కంటున్నారు. అది చూసి నిన్ను మదిలో తలచుకుని నీరసం కలుగుతున్నది. మానవజాతి కుటుంబ నియంత్రణ పాటించి నిన్ను ఆదర్శముగా తీసుకొనకూడద “ని కవి ఆశిస్తున్నారు.

“పల్లెల్లో ఇప్పటికీ పందులు వీరవిహారం చేస్తూ ఉంటాయి. పందులు లేనియెడల పల్లెలు వృద్ధి చెందినట్లే అనే భావం నీకు వేదన కలిగించవచ్చు. మెదడువాపు, స్వైన్ఫ్లూ మొదలైన వ్యాధులు వ్యాపింపచేయడం నీకు భావ్యమా?” అని ప్రశ్నిస్తున్నారు. “గిరిజనులు కొందరు సంప్రదాయము పేరున భుజించిన భుజించ వచ్చు కాని ఎన్నో రకాల శాకములన్నప్పటికీ నాగరికులు నిన్ను ‘పోర్క్’ అనే పేరుతో భుజించటం భావ్యమేనా? కొందరికైనా నీవు ఆకలి తీర్చేంచుకు ఆత్మ త్యాగం చేస్తున్నావు. పందుల పెంపకం లాభసాటి వ్యాపారంగా గుర్తించి కొందరు వర్తకులు దానిని చేపడుతున్నారు. తొలినాళ్లతో దూరదర్శన్లో ఎప్పుడూ పందుల పెంపకంపై కార్యక్రమాలను చూపేవారు. ఏమైనా కాని ఇట్లా పందులను సంతలో అమ్ముట విచారకరం” అని కవి జాలి చూపిస్తున్నారు.

ఈ శతకంలో ఆచార్య ఫణీంద్రగారు తాము చెప్పదలచిన భావాలను సుస్పష్టంగా చెబుతున్నారు. “అభ్యుదయమ్ము నా పథము! అట్టడుగందున నున్నవారి కే నభ్యుదయమ్ము గోరెదను”అంటున్నారు. దుబాయి షేకులకు హైదరాబాదు పాతనగరంలోని మహమ్మదీయులు తమ పసి పిల్లలను కాసుల మూటకై నిఖా జరిపించిన యథార్థ దుర్ఘటనలు కవిగారి హృదయాన్ని ద్రవింపజేస్తోంది. “లౌకిక సౌఖ్య సంపదల లౌల్యము పెంచునవాంగ్ల విద్యలు” అని నిరసిస్తున్నారు. “అరువది నాల్గు సత్కళలు, నంతకు మించిన మేటి క్రీడలుం”డగా “ఎరువుగ దెచ్చుకొన్న క్రికెటెంతురు మా యువకుల్!” అని వాపోతున్నారు. “రోమనులట్లు ప్రేమికుల రోజును క్రొత్తగా నేర్వనేటికో?” అని ప్రశ్నిస్తున్నారు. “తరగని ప్రేమ పెన్నిధుల తత్త్వము, సత్త్వమెరుంగకున్నచో ఒరుగునదేమి ప్రేమికుల కొక్క దినంబిడ” అని సూత్రీకరిస్తున్నారు. ఇంకా ఈ పద్యకృతిలో సినిమాలలో చూపుతున్న అసభ్యతను, డబ్బుకోసం ప్రజలు పడే కక్కుర్తిని, భార్యను చులకనగా చూసే భర్తలను, యువతులపై ప్రేమ పేరుతో జరుగుతున్న యాసిడ్ దాడులను, ఉగ్రవాదులను తయారు చేస్తున్న మదర్సాలను కవిగారు తూర్పారబట్టారు.

వరాహానికి గల పర్యాయపదాలనన్నింటినీ ఒకే పద్యంలో చక్కగా ఇమిడ్చి డా.ఆచార్య ఫణీంద్ర ‘పద్యకళా ప్రవీణ’ అని నిరూపించుకున్నారు. పందికి సంబంధించిన అన్ని విషయాలనూ సేకరించి ఈ కృతిలో చొప్పించి ఈ శతకాన్ని ‘సూకర సర్వస్వం’గా మార్చినారు. ఇది వీరి విషయగ్రాహ్యానికి దర్పణం పడుతోంది. సిద్ధాంతమనే గ్రామంలో ఒక పంది గుడిచుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న వింత వార్తను కూడా ఈ శతకంలో ప్రస్తావించటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది.

ఈ కృతికి డా.కె.వి.రమణ, ఆచార్య మసన చెన్నప్ప, ఆంధ్రపద్యకవితా సదస్సు శాశ్వతాధ్యక్షులు శ్రీ శిష్ట్లా వెంకటరావుగారి పీఠికలు శోభను గొలుపుతున్నాయి. ఈ కావ్యాన్ని ఇద్దరు మహాకవులు గుఱ్ఱం జాషువా, దాశరథి కృష్ణమాచార్యలకు అంకితమియ్యటం కవి అభిరుచిని చాటుతోంది.

ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా పరిచయకర్త శ్రీ జి.ఎం.రామశర్మ చెప్పినట్లుగా ఈ దశాబ్దంలో పద్యకవితకు లభించనున్న ఆదరణకు సూచిక ఈ వరాహశతకం. ఈ శతకాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమీప భవిష్యత్తులో బల్లిశతకం, మశక శతకం వంటివి వెలువడవచ్చని ఎవరైనా ఆశిస్తే అది ఏమాత్రం అత్యాశ కాబోదు.
                        — *** —

 

అందరికీ తెలియవలసిన ఆంధ్రుల చరిత్ర

ఉద్యమాల నేపథ్యంలో… ప్రతి తెలుగువాడు తెలుసుకోవలసిన ఆధునికాంధ్ర చరిత్ర ఇది. ఈ రోజు “ఈనాడు” దిన పత్రిక – సిటీ సప్లిమెంట్ లో ‘ప్రతిభ‘ శీర్షిక క్రింద ప్రచురించబడిన ఈ క్లుప్త వ్యాసం … ఈనాటి పరిస్థితులకు కారణమై నిలిచిన తప్పిదాల పట్ల, అన్ని ప్రాంతాల తెలుగు ప్రజలు ఆత్మ పరిశీలన చేసుకొనేందుకు ఉపకరిస్తుంది.

 “ఈనాడు” దిన పత్రికకు కృతజ్జతలతో –

– డా. ఆచార్య ఫణీంద్ర

 

 

 

 

 

ఆవిష్కరణ సభా దృశ్యాలు

“డా. ఆచార్య ఫణీంద్ర” విరచిత “వరాహ శతకము” గ్రంథావిష్కరణ సభా దృశ్యాలు :

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

నిండు సభలో ఆత్మీయంగా సాగిన గ్రంథావిష్కరణ

నిన్న(౩ డిసెంబర్) జరిగిన నా ‘వరాహ శతకము’ ఆవిష్కరణ సభ సాహిత్యాభిమానులు, ఆత్మీయులతో నిండుగా అలరి, వేదిక పైనున్న అతిథులకు, నాకు ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగించింది. ముఖ్యంగా, బ్లాగు మిత్రుడు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్ గారు నా మీద అభిమానంతో విచ్చేసి ప్రోత్సహించడం మరింత ఆనందాన్ని కలిగించింది. సభాధ్యక్షులు, ప్రముఖ కవి డా. జె. బాపురెడ్డి గారు; ముఖ్య అతిథి ప్రముఖ సాహితీవేత్త, రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డా. కే. వి. రమణ గారు; సుప్రసిద్ధ విమర్శకులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ ‘డీన్ ఆఫ్ ఆర్ట్స్’ అయిన నా పి.హెచ్.డి. గురువు గారు ఆచార్య యస్వీ. రామారావు గారు, ప్రముఖ కవి డా. దేవరాజు మహారాజు గారు; ఉస్మానియా తెలుగు శాఖాచార్యులు ఆచార్య మసన చెన్నప్ప గారు, మొదలైన వారంతా మనసు విప్పి మాట్లాడారు.

ప్రసంగాలలో వీరంతా నా పట్ల వర్షించిన ప్రేమ, వాత్సల్యానికి నా హృదయం ఎంతో పారవశ్యంలో తేలియాడింది. ‘వరాహ శతకము’ అనగానే ఇదేదో భక్తి శతకమనుకొన్న సభాసదులు అందులోని అభ్యుదయ భావాలు, అధిక్షేప హాస్య వ్యంగ్యాలను గురించి తెలుసుకొన్నాక, నన్ను మనసారా అభినందించడంతో నా ప్రయత్నం సార్థకమయిందని సంతోషించాను. ఈ రోజు ‘ఈనాడు’, ‘సాక్షి’, ‘ఆంధ్ర జ్యోతి’, ‘ఆంధ్ర భూమి’, ‘ఆంధ్ర ప్రభ’ వార్తా పత్రికలలో ఫోటోలతో కూడిన కథనాలు ప్రచురించబడి, చాలా సంతృప్తిని కలిగించాయి.

సాక్షి :

ఆంధ్ర జ్యోతి :

ఈనాడు :

ఆంధ్ర ప్రభ :

– డా. ఆచార్య ఫణీంద్ర

ఆహ్వానము

ఎన్నో రోజులుగా వాయిదాపడుతున్న నా “వరాహ శతకము” గ్రంథావిష్కరణ సభ ఎట్టకేలకు డిసెంబర్ 3 వ తేదీన సాయంత్రం 6 గం||లకు సుల్తాన్ బజార్, హైదరాబాద్ లోని “శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం” లో నిర్వహించబడుతోంది. జంట నగరాలలోని బ్లాగు మిత్రులందరూ ఈ సభకు విచ్చేసి, నన్ను ఆశీర్వదించగలరని ప్రార్థన.

      – డా. ఆచార్య ఫణీంద్ర

ఆహ్వాన పత్రిక: