“మండలి” సువంశ పయోనిధి రాజ రాజు

“మండలి” సువంశ పయోనిధి రాజ రాజు
(ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి, మాన్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారి షష్ట్యబ్ది పూర్తి అభినందన గ్రంథంలో ప్రచురణార్థం – ఆ గ్రంథ సంపాదకుల అభ్యర్థన మేరకు నేనందించిన పద్య ప్రశంస)

                           రచన: “పద్య కళా ప్రవీణ“, “కవి దిగ్గజ

                                           డా. ఆచార్య ఫణీంద్ర

 mandali

కం.    “సామాజిక సేవ”యె తా

          సామాన్యముగ మనలేక, సాకృతి గొనియున్

          శ్రీ “మండలి” వంశములో

          ప్రేముడి “బుద్ధ ప్రసాదు” పేరున వెలసెన్!

 

ఆ.వె.   ఉగ్గు పాల తోడ ఒంట బట్టె తనకు

         “గాంధి” తాత్త్విక గుణ గణము లెల్ల!

          విదుడు, పూర్వ మంత్రి “వెంకట కృష్ణరావ్” –

          తండ్రి పేరు నిలుపు తనయు డయ్యె! 

 

కం.      కృష్ణా జిల్లా ప్రగతికి

          “కృష్ణా రావ్” వారసునిగ కీర్తిని గొనుచున్ –

          కృష్ణా నదిపై వారధి,

          “కృష్ణా యూనివరిసిటి”ని కృషితో నిలిపెన్!

 

సీ.       నూనూగు మీసాల నూత్న యవ్వనమందె

               “దివిసీమ”లో గావ దీన జనుల –

          యువ సభ్యుడై సేయ ఉత్తేజమున సేవ

                తొలి “ప్రపంచ తెలుగు వెలుగు సభల” –

          ఎదిగి మంత్రిగ, తెల్గు కెల్ల దేశాలలో

                ప్రోత్సాహ మొసగ భాషోత్సవముల –

          “మత్స్య, పాడి పరిశ్రమల మంత్రి”యై బ్రోవ

                 బడుగు జనుల బహు “పథక” విధుల –

 

తే.గీ.     తెలుగు భాషకు “ప్రాచీన దీప్తు” లొసగ –

            తెలుగు “కధికార భాష”గా తేజ మిడగ –

            ప్రథమ “నవ్యాంధ్ర – ఉపసభాపతి”గ వెలుగ –

            పుట్టె నతడు! తెలుగు తల్లి ముద్దు బిడ్డ!!

 

చం.       విరివిగ సేవ లిట్లు పది వేలుగ సల్పుచు నాంధ్ర భూమికిన్,

            వరలెడునట్టి “మండలి” సువంశ పయోనిధి రాజ రాజుకున్

            తరగని స్వాస్థ్య, సౌఖ్యములు, దండిగ నాయువు గల్గ జేయుచున్ –

            అరువది యేండ్ల యౌవనము నభ్యుదయమ్మును, కీర్తి గూర్చుతన్!

   

                                           — &&& —

ప్రకటనలు

Confidence + Commitment + Communication Skills

పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పద్య సాహిత్యంపై …

మహాకవి “సరస్వతీ పుత్ర” శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల వారి పద్య సాహిత్యంపై నేను ప్రసంగించిన సభా విశేషాలు వివిధ పత్రికలలో …

– డా. ఆచార్య ఫణీంద్ర

“నమస్తేతెలంగాణ”    “ఆంధ్రజ్యోతి”          “వార్త”