ఎరుపు కారు

ఎరుపు కారు
రచన : “పద్య కళాప్రవీణ” డా. ఆచార్య ఫణీంద్ర

fb_img_1488244645525

పరుగులిడును సతత మెరుపు కారొక్కటి
నాదు మెదడులోని నరము మీద!
పరుగులిడెను నాదు బాల్యమ్ములో నద్ది
స్వగృహమున పరచిన చాప మీద!!

ఎరుపు రంగదేల? ఏనాడు తలపోయ
లేదు వేరు రంగు నాదు మదిని!
ఎరుప దెందుకన్న – ఎరుక నాకొ కెరుపే!
సహజమ దనుకొంటి స్వాంతమందు!

ఎవరు ముట్టుకొన్న నేడుపే నా పాట!
“నాది – నాది” యంచు వాదులాట!
జోరుగ తిరుగాడి “షోకేసు”లో “పార్కు”
చేయబడెడి దద్ది సేద దీర!

ఎదుగు పిదప గంటి నెన్నెన్ని కారులో –
వివిధ వర్ణములను వెలుగు వాని!
ఎన్ని చూడనేమి! చిన్నతనమున నా
ఎరుపు కారు నెపుడు మరువలేదు!

పెరిగినాక నేను తిరుగుచుంటి నిపుడు
కలుగ ప్రీతి, యెరుపు కారునందు!
ఎందుకనగ – తిరుగు నెరుపు కా రెప్పుడు
నాదు మెదడులోని నరము మీద!

(మార్క్ హల్లిడే కవి ఆంగ్ల కవిత – 2003 – “ద పింక్ కార్” కు స్వేచ్ఛానువాదం)

ప్రకటనలు

‘వరాహ శతకం’ కృతికి పురస్కారం

‘రాజమహేంద్రి’ లో ”ప్రజా పత్రిక” వారు నా ‘వరాహ శతకం’ కృతికి పురస్కారం అందించబోతున్నారు. “ప్రజా పత్రిక” యాజమాన్యానికి, కార్యక్రమ నిర్వాహకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
– డా. ఆచార్య ఫణీంద్ర

 

ఆంధ్ర సాహిత్యంలో నా బిరుదులు!

new-doc-2017-02-09_1

ప్రముఖ ర చయిత శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ ఇటీవల వెలయించిన ఒక ప్రత్యేకత గల గ్రంథం – ” ఆంధ్ర సాహిత్యంలో బిరుద నామములు”.IMG_20170210_000053.jpg new-doc-2017-02-09-1_1

 ఈ గ్రంథంలో నన్నయ నుండి నా వంటి ఆధునిక కవుల వరకు .. 599 కవి,పండితులకు గల 606 బిరుదాలను పట్టికలలో చేర్చి ప్రకటించారు రచయిత. ముందుమాటగా బిరుదాలలో గల వైవిధ్యం, కొన్ని బిరుదుల పుట్టు పూర్వోత్తరాల వివరాలు, బిరుదుల ఔచిత్యం .. తదితర విషయాల కథనాన్ని జోడించారు. మొదటి భాగంలో అక్షరక్రమంలో బిరుదాల పట్టికను, రెండవ భాగంలో అక్షరక్రమంలో కవి పండితుల పట్టికను అందించారు.
ఈ గ్రంథంలో నా బిరుదుల వివరాలు ఇలా ఉన్నాయి. రెండవ భాగంలో నా పేరు, బిరుదులతోబాటు, మా తాతగారు (మాతామహులు – ఆచి వేంకట నరసింహాచార్యులు), వారి నాన్నగారు (ఆచి రాఘవాచార్య శాస్త్రులు) యొక్క పేర్లు, బిరుదులను ప్రక్క ప్రక్కన పేర్కొనడం ఆనందాన్ని కలిగించింది. మొదటి భాగంలో “కవి దిగ్గజ” బిరుదాన్ని మహాకవి గుర్రం జాషువతో పంచుకోవడం నా జీవితాన్ని ధన్యం చేసిన ఒక మహద్భాగ్యమే!
విశిష్టమైన కృషి చేసి ఇలాంటి గొప్ప గ్రంథాన్ని కూర్చిన మిత్రులు కోడీహళ్లి మురళీమోహన్ గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు.
– డా.ఆచార్య ఫణీంద్ర

new-doc-2017-02-10_1