’ దశ సహస్ర సహృదయ సందర్శనోత్సవం ’

‘దశ సహస్ర సహృదయ సందర్శనోత్సవం’

12 సెప్టెంబరు 2009  నుండి 27 సెప్టెంబరు 2009 మధ్య ( మరో 15 రోజుల్లోనే ) మరో 1000 మంది సహృదయుల వీక్షణాలు నా బ్లాగుపై ప్రసరించాయి. అంటే, నా బ్లాగు ప్రారంభించిన నాటి ( నవంబర్ 2008 ) నుండి ఇప్పటికి, అంటే పది నెలలలో, మొత్తం 10000 మంది సహృదయ వీక్షకులు దానిని సందర్శించారన్న మాట ! అంటే, సగటున నెలకు వేయి మంది చొప్పున నా బ్లాగును దర్శిస్తున్నారన్న మాట !

bounquet

మొదటి సారిగా నా బ్లాగు సందర్శకుల సంఖ్య ’ ఒక వేయి ’ని దాటినప్పుడు, ’ సహస్ర సందర్శనోత్సవం ’ అంటూ, ఒక టపాను వ్రాసాను. బహుశః ఇలా మొదటిసారిగా ఒక టపా వ్రాసింది నేనే ననుకొంటున్నాను. ఎందుకంటే, అప్పుడొక బ్లాగు మిత్రుడు ( పేరు గుర్తు లేదు ), తన బ్లాగులో – ” ఆచార్య ఫణీంద్ర తన బ్లాగులో వెయ్యి హిట్లు పూర్తి కాగానే, ’ సహస్ర సందర్శనోత్సవం ’ అంటూ టపా రాసారు. బాగా ఆలోచిస్తే ఇదీ ఒక మైలు రాయేగా ! సంతోషించాల్సిన విషయమే ! ” అంటూ ఒక టపా వ్రాసి, సమర్థించిన సంగతి నాకు బాగా గుర్తు.

ఆ సహస్రమే తరువాత ద్విసహస్రమై, త్రిసహస్రమై, ఇలా.. ఇలా.. పెరిగి ఇప్పుడు దశ సహస్రం అయింది.

ఇక ఈ ఉత్సవాల ప్రమాణం మార్చవలసిన సమయమాసన్నమయింది. ఇకపై ప్రతి 5000 హిట్ల కొకమారు ఇలాంటి టపా వ్రాయాలని నిర్ణయించుకొన్నాను. అందాక …

ఈ ’ దశ సహస్ర సహృదయ సందర్శనోత్సవ ’ సందర్భంగా, నా బ్లాగును ఇన్నాళ్ళూ వీక్షిస్తూ,  వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ఆదరాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ , ‘ నరసింహ ‘, ‘ బ్లాగుకూట్ ’ మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

అందరూ మహానుభావులే !

అందరికీ పేరు పేరునా వందనాలు !

– డా.ఆచార్య ఫణీంద్ర

’ సరదాల దసరా ’

‘ సరదాల దసరా ‘

రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర

mahishasura mardini

స్తంభమ్ములో హరి సాక్షాత్కరించి, దై

త్యాగ్రణిన్ వధియించినట్టి దినము –

రావణాసురుని శ్రీరాముండు నిర్జించి

అవని భార మణచినట్టి దినము –

పాండవ వీరుల పండ్రెండు మాసాల

అజ్ఞాత వాసాంతమైన దినము –

మహిషాసురుని జగన్మాతయే కోపించి

అంతమొందించిన యట్టి దినము –


తరతరాల సంస్కృతిని ఈ తరము ప్రజకు

వారసత్వమున మరల పంచుటకును

’ దసర ’ వచ్చె – తిరిగి సరదాల తెచ్చె –

భారతీయుల కిది మహా పర్వ దినము !


యువకుల్, బాలురు వత్సరాని కొకమా రుత్సాహ సంపన్నులై

శివ పత్నిన్ ఘన భక్తితో కొలచి, ఆశీర్వాదమందన్, ’ మహా

నవ రాత్రోత్సవ ’ మండపాల నమితానందంబుగా నిల్పరే !

చివరన్, నేటి సమాపనం బవనికిన్ చేకూర్చు కల్యాణమున్ !


మామిడాకు తోరణము గుమ్మాల కట్టి,

పిండి వంటలను జనులు ప్రీతిని తిని,

క్రొత్త బట్టలను ధరించి, గుడికి వెళ్ళి,

భగవదర్చన చేతురు భక్తి మీర –


వాహనాధిపతులు వాహన పూజలు,

కార్మికులును ’ కారుఖాన ’ పూజ,

పాఠశాలలందు పంతుళ్ళ పూజలున్

జరుపుచుంద్రు నేడు సంతసమున –


’ దసర వేషము ’ కొందరు దాల్చి, జనుల –

నాడి పాడుచు ’ మామూళ్ళ ’ నడుగుచుంద్రు –

వేడుకలు నలుదెసలను వెల్లివిరియ,

తేజరిల్లు తెలుగునాట తెలుగుదనము !


పాల పిట్టను వీక్షించి ప్రజలు నేడు

’ జమ్మి చెట్టు ’ ను పూజించి, కొమ్మ రిల్లి,

ఆకులను వెంటగొని పంచి అందరకును,

పలుకరించుకొందురు సుహృద్భావమునను –


మతము, భాషల మరచియు మనుజులెల్ల

కలసి చెప్పుకొనుచు శుభ కామనలను

కౌగిలించుకొనుట నేడు కానుపించు –

సామరస్యము పెంచునీ సంబరములు !

_____ *** _____

విశ్వమెల్లెడ విస్తరించియున్న భారతీయులందరికీ

‘ విజయ దశమి ‘ పర్వ దిన శుభాభినందనలు !

ఇక్కడో వాగుండేది …

ఇక్కడో వాగుండేది …

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

batukamma - 1

ఇక్కడో వాగుండేది –

ఏమయింది ?


ఇరువయ్యేళ్ళ క్రితం

ఊరికి విడాకులిచ్చి,

నగరంతో కాపురం పెట్టాక

ఇదే చూడడం –

ఇక్కడో వాగుండేది –

ఏమయింది ?


సూర్యుడు వాగుపై

చూపు నిలుపక ముందే

తాతయ్య మూడు కాళ్ళతోబాటు

నా బుల్లి కాళ్ళు రెంటినీ నడిపించి

ప్రతినిత్యం

దంత ధావనం, జల క్రీడాస్నానం

చేసింది ఈ వాగులోనే !


సాయంత్రం బడి వదిలాక

శ్రీను మామయ్యతో

షికారు కెళ్ళినప్పుడు –

మామయ్య స్నేహితుల

చిలిపి ముచ్చట్లతో

వాగు నీటి అలల గలగలలు

పోటీ పడేవి !


’ బతుకమ్మ ’ పండుగ నాడు

ఊరు పట్టుచీర కట్టుకొని

వెండి కోలాటమాడుతూ

వాగు వంక సాగిపోయినట్టుండేది !

వయ్యారి భామలతో

సయ్యాటలాడిన రంగు రంగుల

అందచందాల బతుకమ్మలను

అక్కున జేర్చుకొన్న వాగు –

ఇప్పుడేమయింది ?


ఇప్పుడు ఆదరాబాదరా

బాత్ రూం స్నానం ముగించుకొని

కాన్వెంట్ యూనిఫాం కట్టుకొంటున్న

బాల బాలికలను చూసి –

సాయంత్రం కాగానే

ఊరి కళ్ళు బుల్లి తెరలకు

అతుక్కుపోవడం చూసి –

అరువు తెచ్చుకొన్న నగరం చీరను

ఊరు కట్టుకొని మురిసిపోవడం చూసి –

” బతుకమ్మ పండుగా ? అదేమిటి ? అనే

కొత్తతరం పల్లె పడుచులను చూసి –

వాగు గుండె పగిలినట్టుంది !

వాగు బతుకు ఎండినట్టుంది !!

( 2000  సంవత్సరంలో విజయవాడ ‘ ఎక్స్- రే ‘ సంస్థ

అఖిల భారత స్థాయిలో నిర్వహించిన వచన కవితల పోటీలో

‘ ఉత్తమ కవితా పురస్కారం ‘ పొందిన కవిత )

చిరు విరామము

‘చిరు విరామము’ ( ‘Short Interval’ )

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

drinking water

అదియొక పాఠశాల – అట అన్నెము పున్నె మెరుంగనట్టి సత్

హృదయులు బాల,బాలిక లనేకులు, నేక విధాన వస్త్రముల్

పొదిగిన దేహముల్ మరియు పొట్టి కరంబులు, చిట్టి పాదముల్,

చిదిమిన పాలు గారు చిరు చెక్కిళులన్ – తలపింత్రు మొగ్గలన్ !


క్రమశిక్షణతో వారలు

సమయంబునకన్న మున్నె చనుదెంతురు – తా

ము మరిక ఏమి భుజించిరొ ?

అమ లేమిడి నింపినారొ ఆ చిరు పొట్టల్ ?


ఎనిమిది గంటల వరకే

ప్రణమిల్లుచు పాడి వారు ప్రార్థన, పిదపన్ –

ధనధనమని తరగతులకు

చని, విందురు పాఠములను శ్రద్ధాసక్తిన్ !


రెండు గంటలటులె దండిగా పాఠాలు

తెరపి లేకయుండి తెలిసికొనుచు –

’ చిరు విరామ ’ మిడగ, సీత కోక చిలుక

లొకప రెగిరినట్టు లురుకుచుంద్రు !


ఈ విరామమ్ము కోసమై ఎంత సేపు

గా నిరీక్షించుచుండిరో కనగ వారు !

అరగిపోయెనో తిన్నదే – ఆకలగునొ ?

తరగిపోయెనో తేజమ్ము – దాహమగునొ ?


పరుగు పరుగునేగి, ’ వాటరు కూలరు ’

వద్ద నిలుతురొక్క వరుసయందు

ఒకరి పిదప నింక నొకరు త్రాగు కొరకు –

సుధను పంచు వేళ సురల యట్లు !


మూతి, కొళాయికిన్ నడుమ ముద్దుల చేతిని చేసి వారధిన్

’ స్వాతి ’ మనోజ్ఞ వర్షమున చాతక పక్షుల వోలె త్రావి, ఏ

దో తినుచుంద్రు జేబులను నుంచిన చాక్లెటొ ! లేక బిస్కెటో !

ఆ తరువాత కొందరెదొ హాస్యములాడుదు రంత నంతలో !


కొందరు ’ స్కూలు గేటు ’ కడ కుప్పలువోయుచు నమ్మునట్టి ఏ

బందరు లడ్లొ, జీళ్ళొ, మరి పాల మిఠాయిలొ, ఐసు ఫ్రూటులో –

తిందురు వేగ వేగ కొని – తిందురు కొందరు ’ కాకి ఎంగిళుల్ ’ !

సుందరమైన దృశ్యమది – చూడ కులాలు, మతాలు సిగ్గిలున్ !


కాలమున కంతలోననే కన్ను కుట్టు !

ఆ ’ చిరు విరామ ’ మంతలో నంతరించె –

ఖంగుమనియంచు మ్రోగెడి గంట వినగ,

పరువులెత్తి తరగతుల పరగిరెల్ల !


సందడి సమాప్త మొందెను –

అందరు తరగతుల జేర, ఆ స్థలమయ్యెన్

ముందటి వలె నిశ్శబ్దము !

కుందుచు నట వీచు గాలి కూలెను నేలన్ !

— *** —

నవ్య భూషణము

నవ్య భూషణము

( ’ లెదర్ బెల్టు ’ పై పద్య కవిత )

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

belt

పరమ శివుని గళముపై నాగు పామట్లు
నరుల నడుము చుట్టు నన్ను గనరె ?
చుట్టుకొని, జనాళి చూపు నాకర్షింతు –
’ బకిలు ’ తోచ, నాగు పడగ వోలె !

నాటి ’ ఒడ్డాణము ’ ను నేను ! నేటి కిట్లు
నూతనావతారము నెత్తి, ప్రీతి గొలుప –
’ బెల్టు ’ నామధేయంబుతో పిలువబడుచు,
నవ్య భూషణంబైతి – నే నరుల కొరకు !

పొట్టపయి ప్యాంటును నిలిపి
పట్టియు నుంచంగ కలిగి పట్టుదలను, నే
గట్టిగ నా ఊపిరి బిగ
బట్టి నరుని నడుము చుట్టు పరివేష్టింతున్ !

’ టిక్కు ’ ను, ’ టాకు ’ గా జనులు ’ డ్రెస్సు ’ ధరించిన లాభమేమి ? నా
చక్కని సోయగమ్మొలుకు చర్మ వినిర్మిత రూప మింక ఇం
పెక్కగ ప్యాంటుపై నిలిపి పెట్టక పోయిన; లోకు లెల్లరున్
ముక్కున వేలు వేసుకొని, ’ ముస్ముసి ’ నవ్వుచు వెక్కిరింపరే ?

చిత్ర చిత్రమైన చిన్నెవన్నెల నొల్కు
మమ్ము ’ షాపు ’ లందు నమ్ముచుంద్రు !
నాసి రకము కొన్ని, నాణ్యమైనవి కొన్ని –
కొనెడి వారలిచ్చు ధనము బట్టి !

పొట్ట నదిమి పట్టి, ’ ఫిట్టు ’ గా నుంతు – నా
పొడుగు చాల దింక పొట్ట పెరుగ !
పొట్ట ప్రజలు పెంచి, పొట్టిదయ్యెనటంచు
నన్ను తిట్టి పోయ న్యాయమగునె ?

జీర్ణమైన వేళ, చింతించకుండ నా
చేసినట్టి గొప్ప సేవ గూర్చి –
అల్లుకొన్నయట్టి అనుబంధమును గూర్చి –
నరుడు పారవేయు నన్ను బయట !

____***____

” నిన్ను కొంటారు తమ్ముడూ ! “

” నిన్ను కొంటారు తమ్ముడూ ! “

( ప్రబోధ గీతం )

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

happy_man_with_money

నిన్ను కొంటారు తమ్ముడూ !

అమ్ముడు పోతావా ?    ( 2 )

నిన్ను పైకానికో,

లేక బంగారుకో,

విలువ కట్టి మరీ కొంటారు –

అమ్ముడు పోతావా ?                      || నిన్ను కొంటారు ||


ఏ కన్న తండ్రో, నీ కన్న తండ్రిని

నీకై కోరుతాడు – బేరాలాడుతాడు –

’ వర కట్నం ’ అంటూ

అంగడి వస్తువులాగా

ఖరీదిచ్చి మరీ కొంటారు –

అమ్ముడు పోతావా ?                      || నిన్ను కొంటారు ||


ఆడ పిల్లల తండ్రి చెమట రక్తాలను,

ఆడ పిల్లలు కార్చే వేడి కన్నీళ్ళను

కలిపి పైకంగా మార్చి,

వర కట్నంగా ఇచ్చి,

పెళ్ళి పీటలపై కొంటారు –

అమ్ముడు పోతావా ?                     || నిన్ను కొంటారు ||


నీ చదువు, సంస్కారం –

నీ పదవి, హోదా –

అన్నిటినీ మరచి, నీ తండ్రికి వెరచి,

నీ మానం, ప్రాణం,

అన్నీ చంపుకొని –

పెళ్ళి కొడుకువై అందరిలో

అమ్ముడు పోతావా ?                    || నిన్ను కొంటారు ||


__ *** __

Single Sentence Delights (Part 2 )

నా ’ వాక్యం రసాత్మకం ’ అనే ’ ఏక వాక్య కవితల సంపుటిని ఇటీవల ప్రొఫెసర్ ఐ. వి. చలపతిరావు గారు [ Former Registrar, Central Institute of English & Foreign Languages ] మరియు శ్రీ జి. రామకృష్ణారావు గారు[ Former Director of Translations, Govt. of A.P. ] కలసి, ఆంగ్లంలోకి Single Sentence Delights పేరిట అనువదించారు.

ఆ గ్రంథంలోని కొన్ని ఏక వాక్య కవితలు  …

Telugu Poet Dr. Acharya Phaneendra’s

” VAKYAM RASATMAKAM ” in Engish

” Single Sentence Delights “

[ Part 2]

* Isn’t it innocence building permanent houses to pass short lived lives ?

* Strangely, all paths lead to graveyard.

* What for you run after through out life, is not yours at the end of life.

* Time is a warrior, who never shows his back.

* The knife of Time has two edges – past and future.

* Open the doors of future and bathe in the rays of hope.

* Death is a lover, who awaits life long.

* Poverty fixes shackles of slavery on tender hands.

* A happy marital life is like  a poem of pleasant thougts and letters.

* News paper is a bird, which alights at your front door, tying the whole  world to its wings.

* At the crack of dawn – damn povrty ! reminds of hunger.

* Rich man’s rupee converts poor man’sblood into sweat.

* Machine is man’s creation and man is God’s macine.

* Heartless man hangs the bag on his fingers,  which bears all the weight in its heart.

* Thrown into the dust by man, a seed serves him by growing into a tree.

* One can not be a poet, who does not know the nature of moist eyes.

* In the statement of life, disease is a ‘ comma ‘ and death is a ‘ full stop ‘.

* The tree bends down its branches and salutes the mother earth, which gave birth to it.

* The News paper looks to me red, with full of blood stains.

* That dimple on cheek ! has any plucked the flower of smile ?

—–***—

రాజ శేఖరా !

రాజ శేఖరా !

( దివంగత ముఖ్య మంత్రి, డా. వై. యస్. రాజ శేఖర రెడ్డి స్మృతికి నివాళి )

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

y.s.

’ రచ్చ బండ ’ చేరి, రాజ శేఖర ! నీవు

ప్రజల బాధ లెరిగి, వాని దీర్చ –

బయలుదేరినావు ! ప్రారబ్ధ మది యేమొ ?

గగన సీమ నీకు గమ్యమాయె !


రాజ శేఖరయ్యా ! ’ పావురాల గుట్ట ’

నీదు పాలిట మృత్యువై నిల్చి, మాదు

గుండెలందు నిల్పె నశాంతి ’ గుట్ట ’ యట్లు –

పలికె నెవడు ” శాంతికి గుర్తు పావుర ” మని ?


వ్యవసాయదారుల ప్రాణాలు నిలుపగా

సు’ జల యజ్ఞము ’ సల్పు సోమయాజి –

పండు ముసలులకు గుండె ధైర్యమిడగ

పింఛన్ల నందించు ప్రేమ మూర్తి –

కడు పేదలకు గూడ ’ కార్పొరేట్ ’ వైద్యమ్ము

నుచిత మందించు మహోన్నతుండు –

రెండు రూప్యాలకే నిండు మనము తోడ

కిలొ బియ్య మందించు కీర్తి శాలి –


భూమి లేనట్టి వారికి భూమి పంచి –

ఇల్లు లేనట్టి వారికి ఇళ్ళ నిచ్చి –

పేద వారల పాలిట పెన్నిధైన

మంత్రగా డిప్పు డెచ్చోట మాయ మయ్యె ?


” వరుణ దేవుడు మా ’ పార్టి ’ వా ” డటంచు

వర్షముల జూచి యంటివి హర్ష మొంది –

వరుణ దేవుడే ఇపుడు నీ ప్రాణములను

తోడి వేసె – ఎంతటి స్నేహ ద్రోహి వాడు ?


” రాజ శేఖరా ! నీ పైన మోజు తీర

లే ” దని మునిగి రాంధ్రులు వేదనాబ్ధి !

ముఖ్య మంత్రు లెందరొ – నీదు ముందు, వెనుక !

ముఖ్య మంత్రిగా ఇంక నీ ముద్ర నీదె !!


—– *** —–

’ నవ సహస్ర సహృదయ సందర్శనోత్సవం ’

24 ఆగస్టు 2009 నుండి 12 సెప్టెంబరు 2009 మధ్య ( మరో 19 రోజుల్లోనే ) మరో 1000 మంది సహృదయుల వీక్షణాలు నా బ్లాగుపై ప్రసరించాయి. అంటే, నా బ్లాగు ప్రారంభించిన నాటి ( నవంబర్ 2008 ) నుండి, ఇప్పటికి మొత్తం 9000 మంది సహృదయ వీక్షకులు దానిని సందర్శించారన్న మాట !

FLOWERS 1

’ నవ సహస్ర సహృదయ సందర్శనోత్సవ ’ సందర్భంగా, నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ఆదరాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ , ‘ నరసింహ ‘ మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

అందరూ మహానుభావులే !

అందరికీ పేరు పేరునా వందనాలు !

– డా.ఆచార్య ఫణీంద్ర

నింగి, నేలకు పెండ్లి

నింగి, నేలకు పెండ్లి

రచన : ’ పద్య కళా ప్రవీణ ’ డా. ఆచార్య ఫణీంద్ర

Rainbow

నింగికి నేలకున్ నడుమ నీరద పంక్తులు మధ్య వర్తులై
చెంగులు కూర్చి రెంటికిని చేయు వివాహము వర్ష మన్న; ఆ
మంగళ వేళలో నభము మంగళ సూత్రము నింద్ర చాపమున్
’ బంగరు చేలు ’ చేలమున భాసిలు భూమికి కట్టు ప్రేమతో !

త్రేతా యుగాదిగ పదే
సీతా రాములకు పెండ్లి చేసిన యట్లున్ –
భూతల, మాకాశములకు
నీ తీరుగ పెండ్లి జరుగు నెన్నో మారుల్ !

విచ్చి కనులు పెండ్లి వీక్షించుచుందురు
తరతరాల ప్రజలు తన్మయమున –
అవని కడుపు పండ నాశీర్వదింతురు
మరల మరల పెండ్లి జరిగినంత –

వాన కాలమందు పంటలెన్నో పండి
హరిత వర్ణ మవని నావరించు –
కాలమట్లు ’ నిత్య కల్యాణము మరియు
పచ్చ తోరణము ’ గ వరలుచుండు !

—— *** —–

rainy day

Previous Older Entries