పునఃప్రచురణ

సాంకేతిక కారణాల వలన ఈ టపా జల్లెడ, కూడలి, హారం నుండి లంకె వేసినపుడు ” పేజీ కనబడడం లేదు ” అని చూపుతున్నందు వలన మళ్ళీ ప్రచురిస్తున్నాను.

కార్గిల్ విజయ దశాబ్ద్యుత్సవ వేళ … ( రెండవ భాగం )

డా. ఆచార్య ఫణీంద్ర గత స్మృతులు

” విజయ విక్రాంతి ” గ్రంథావిష్కరణానంతరం పలు పత్రికలలో దానిపై సమీక్షా వ్యాసాలు వచ్చాయి. వాటిలో ముఖ్యమైనది _ ” మహతి ” మాస పత్రికలో, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డా. అబ్బూరి ఛాయాదేవి చేసిన సమీక్ష ! నా దీర్ఘ కవిత పూర్తి పాఠం అందించలేక పోయినా, ఆ సమీక్ష దాని పూర్తి సారాంశాన్ని అందిస్తుందన్న ఉద్దేశ్యంతో ఈ క్రింద పొందుపరుస్తున్నాను.

Image0660

కార్గిల్ విజయానికి అక్షరాంజలి

_ డా. అబ్బూరి ఛాయాదేవి

పరదేశంతో యుద్ధం సంభవిస్తే దేశ ప్రజలలో దేశ భక్తి మరింతగా జాగృతమవుతుంది. దేశ రక్షణ కోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వీర సైనికులకు స్ఫూర్తిని కలిగిస్తారు కవులూ, కళాకారులూ.

మే _ జూలై 1999 లో కార్గిల్ ప్రాంతంలో జరిగిన  భారత _ పాకిస్తాన్ యుద్ధంలో భారత సైన్యాలు విజయం సాధించడం వల్ల కలిగిన ఉత్సాహంలో కొంత మంది తెలుగు కవులు తమ కవితల్ని హైదరాబాదులో నవ్య సాహితీ సమితి ఏర్పాటు చేసిన సభలో చదివి వినిపించారు. ఆ సభలో ఆచార్య ఫణీంద్ర చదివిన దీర్ఘ కవిత ప్రేక్షకుల ప్రశంసల్ని అందుకొంది. ఆ కవిత ” విజయ విక్రాంతి ” ఇప్పుడు పుస్తక రూపంలో వెలువడింది. ఇంతవరకూ యువకవి ఆచార్య ఫణీంద్ర మంచి పద్య కవిగానూ, వచన కవిగానూ కూడా తన కవితా సంపుటాల ద్వారా గుర్తింపు పొందాడు.

ఈ ” కార్గిల్ కదనంపై దీర్ఘ కవిత ” కి వచన కవితా ప్రక్రియనే అనుసరించాడు. అయితే అంకితాన్ని మాత్రం పద్య రూపంలో రాశాడు. కవితాత్మకత ఉన్న కవి ఏ ప్రక్రియలోనైనా రాణిస్తాడని చెప్పడానికి ” విజయ విక్రాంతి ” ఒక నిదర్శనం.

” మంచు కొండల మాటున

పొంచి ఉన్నది నక్క “

అంటూ ఎత్తుగడలోనే పాఠకులను ఆకట్టుకొంటాడు ఫణీంద్ర. మంచు కొండల ఇవతల ఉన్న కాశ్మీరులోని ప్రకృతి సిద్ధమైన సుందర దృశ్యాలను, సుసంపన్నతను రసరమ్యంగా అభివర్ణించాడు.

” హిమ వన్నగ రోచిస్సుల

కాశ్మీరుకు నమస్సు ! “

అంటాడు ఆరాధనాపూర్వకంగా.

అటువైపు ఉన్నది ’ నక్క ’ అయితే, ఇటువైపు ఉన్నది ’ సింహం ’ అంటూ జిత్తులమారి పాకిస్తాన్ చేసిన ఆగడాలను వివరిస్తాడు. వాటి ఫలితం _

” ఒకనాడు పాండిత్యానికి చేసిన

సత్కారం _ కాశ్మీరు శాలువా !

ఈనాడది మృత కళేబరంపై

కప్పిన దుప్పటి !

ఒకనాటి పండితుల వేదిక

ఈనాడొక శ్మశాన వాటిక ! “

అంటూ కాశ్మీరు చరిత్రను క్లుప్తంగా, కవితాత్మకంగా కళ్ళకు కట్టేటట్లు చిత్రించాడు కవి. అలాగే, భారత దేశంలోని రాజకీయాల్ని, దేశ స్వాతంత్ర్యానంతరం ప్రారంభమైన భారత _ పాకిస్తాన్ శత్రుత్వాన్ని వివరిస్తాడు.

” భరత మాత శిరస్సు

బహు మతాల సదస్సు ” అని కాశ్మీరును వర్ణిస్తూ,

” కళకళలాడే కాశ్మీరును

కాంచిన గుంట నక్క

కన్ను కుట్టింది ” అంటాడు కవి.

” దేశమైనా, దేహమైనా

ఒక అంగానికి గాయమైతే

మరో అంగం చూస్తూ ఊరుకోదు “ అంటూ,

” తల నొప్పి ఎంతటిదైనా

తల వంచేది లేదు “ అంటూ పౌరుషాగ్నిని రగిలిస్తాడు.

” శత్రువు ప్రాణాలతో

దేశ రక్షణ దీపం వెలిగించు “ అని ప్రోత్సహిస్తాడు.

” దేశ రక్షణ దీపం వెలగాలంటే

కొన్ని ప్రాణాలు కర్పూరాలు కాక తప్పదు “

అన్న కఠోర సత్యాన్ని కూడా వెల్లడించాడు.

” నాటి భారత యుద్ధంలో

ఒక అభిమన్యుడు …

నేటి భారత యుద్ధంలో

ఒక వివేక్ గుప్తా …

ఒక హనీఫుద్దీన్ …

ఒక పద్మపాణి ఆచార్య …

వీరాభిమన్యులెందరో ! “

అంటూ వారికి జోహారులర్పించాడు. పాకిస్తానీ సైనికుడు ” రాబందు కన్న హీనం ” అనీ, ” ధర్మానికి అర్థం తెలియని రాక్షసుడు “ అని నిరసించాడు.

ఈ దీర్ఘ కవితను ఉద్రేకం ఉట్టిపడేలా, ప్రవాహ సదృశంగా రాయడంతోబాటు ” శివా రావాలు ” ( నక్కల శబ్దాలు );

” శార్దూల గిరులు ” ( టైగర్ హిల్స్ ) వంటి చక్కని పద బంధాలను ఔచిత్యవంతంగా ప్రయోగించాడు. పదహారు భాగాలతో సాగిన ఈ దీర్ఘ కవిత ఆచార్య ఫణీంద్ర కవితా విజిగీషకీ, విజయానికీ ప్రతీక.

( ” మహతి ” మాస పత్రిక – అక్టోబరు 2000 )

ఎంతలో పదేళ్ళు గడచిపోయాయి. ఆనాటి సంఘటనలను ఇప్పుడు గుర్తు చేసుకొంటుంటే, ఇప్పటికీ నా నరాలు ఉత్తేజితమవుతున్నాయి. గుండెలో ఆనందం ఉప్పొంగుతోంది.

( సమాప్తం )

ప్రకటనలు

కార్గిల్ విజయ దశాబ్ద్యుత్సవ వేళ …

కార్గిల్ విజయ దశాబ్ద్యుత్సవ వేళ …

డా. ఆచార్య ఫణీంద్ర గత స్మృతులు

operation-Vijay_army

26 జూలై 2009 నాటికి కార్గిల్ యుద్ధంలో మన దేశం ఘన విజయం సాధించి ఒక దశాబ్ది కాలం కడచింది. యుద్ధం జరుగుతున్న రోజుల్లోనే (1999 ), ఆ సంఘటనపై నేనొక దీర్ఘ కవితను రచించి, వివిధ సభలలో కావ్య గానం చేసి, పెద్దల ఆశీర్వాదాలను, మిత్రుల అభినందనలను పొందడం జరిగింది. తరువాత 6 నెలల వ్యవధిలో దానిని గ్రంథంగా ముద్రించి, డా. సి. నారాయణ రెడ్డి గారి చేతుల మీదుగా ఆవిష్కరింప జేయడం జరిగింది.
గ్రంథానికి అందించిన ముందు మాటలలో …

సినారె గారు

”   భరత మాత శిరస్సు

బహు మతాల సదస్సు

హిమ వన్నగ రోచిస్సుల

కాశ్మీరుకు నమస్సు !

మకుట సదృశంగా భాసించే ఈ పంక్తులలో ఆ శిరస్సు కాశ్మీర భూఖండమే. ఆ సదస్సు భిన్న మత సమన్వయానికి ప్రతీక. కవి కాశ్మీరానికి నమస్కరిస్తున్నాడు. అది ” స్వర్గానికి అద్దం ” లా ఉందంటున్నాడు. అంతటి స్తవనీయ స్థాయిలో ఉన్న కాశ్మీరు పైన జరిగిన కుటిల దండయాత్ర పట్ల తీవ్రంగా స్పందించి వెలువరించిన దీర్ఘ కవిత ఈ “విజయ విక్రాంతి”.
కథనం ప్రధానంగా ఉన్న ఈ దీర్ఘ కవితలో చిక్కని కవిత్వం దొరుకుతుంది. కాశ్మీరు ప్రకృతి సౌందర్యాన్ని ప్రస్తావిస్తూ _

ఇక్కడ అందం

యాపిల్ పండై కాస్తుంది.

ఇక్కడ నేలపై

వెండి తివాసీలు పరుచుకొంటాయి.

అంటాడు ఫణీంద్ర.. ఆ వెండి తివాసీలంటే మంచు ముద్దలే. ఇలాంటి వర్ణనల వరుసలో ఉన్న ఈ పంక్తి ఫణీంద్ర కవితా సాంద్రతకు నిదర్శనం.

ఇక్కడ బోలెడన్ని డాలర్లు

నక్షత్రాలై రాలుతాయి

ఈ అభివ్యక్తిలో విదేశీ సందర్శకులు ధ్వనిస్తారు.
ఫణీంద్ర ఈ కవిత ప్రారంభంలోనే

మంచు కొండల మాటున

పొంచి ఉన్నది నక్క

అంటూ వస్తు నిర్దేశం చేశాడు. దురాక్రమణదారు నక్కలాంటి పాకిస్తాన్. దుర్దమంగా నిలిచింది సింహంలాంటి హిందుస్తాన్. ఈ వస్తుగత సంకేతాలను కావ్యమంతటా సమర్థంగా నిర్వహించిన ఫణీంద్ర రచనా చణతను అభినందిస్తున్నాను. ” అని ;

డా. ఆచార్య తిరుమల గారు

” ఇది వీర రస ప్రధానమైన కవితా సంపుటి. మాతృ దేశాభిమానానికి అక్షరాకృతి ఈ కృతి. ’ జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి ’ అన్న రామ వాక్యానికి ఆచార్య ఫణీంద్ర చేసిన వ్యాఖ్యాన కథనమిది. ఇటీవల భారత దేశం మీద పాకిస్తాన్ చూపిన దౌర్జన్యానికి, దుర్మార్గానికి, దురాగతానికి రక్తం ఉడుకెత్తి ఫణీంద్ర చేసిన సింహ గర్జనమే ఈ ’విజయ విక్రాంతి’ ! భారత వీర సైనికులకు నైతిక ప్రోద్బలంగాను, భారత పౌరులకు కర్తవ్య ప్రబోధంగాను ఈ కావ్యేతిహాసాన్ని మలచిన ఫణీంద్ర ప్రతిభ ప్రశంసనీయం !
ఫణీంద్రలో దేశ భక్తి పొంగింది. ఉప్పొంగింది. పరవళ్ళు త్రొక్కింది. ఈ దేశంలో స్వేచ్ఛా వాయువులు ఊరకే ఉద్భవించ లేదని తెలిసిన ఫణీంద్ర _

అంగుళం జార విడుచుకొన్నాఅసమర్థతే అవుతుంది

అని హెచ్చరించాడు. ఫణీంద్ర కలం ఝళిపించాడు. ఒక వీర కవిగా తన కర్తవ్యాన్ని తాను నెరవేర్చాడు.

ఒక సంఘటనకు ఇదొక చరిత్ర !

ఒక చరిత్ర కిదొక సంఘటన !!

అని ఆశీర్వదించారు.

( ఇంకా ఉంది. )

27 జూలై … ఈరోజు …

Image0621

27 జూలై … ఈరోజు నా పుట్టిన రోజు. ఈరోజుతో నాకు 48 ఏళ్ళు నిండాయి.
కవిగా ఒక్కసారి వెనుకకు తిరిగి చూసుకొంటే …
12 ఏళ్ళ వయసులో ( 8వ తరగతి చదువుతుండగా ) తొలి కంద పద్యాన్ని వ్రాసాను.
20 ఏళ్ళ వయసులో ” గోరా శాస్త్రి ” సంపాదకత్వంలో వెలువడిన ” ఆంధ్ర భూమి ” దిన పత్రికలో మొదటి సారిగా పెద్ద పత్రికలో నా కవిత అచ్చయింది.
తరువాత ఎన్నెన్నో కవితలు, వ్యాసాలు రచించాను. ఎన్నో ఎన్నెన్నో పత్రికలలో అచ్చయ్యాయి.
ఎన్నెన్నో కవి సమ్మేళనాలలో, సభలలో కవి, పండిత దిగ్గజాలతో కలసి పాల్గొన్నాను.
ఎన్నో పురస్కారాలను పొందాను. ఎన్నెన్నో సత్కారాలను పొందాను.
మాస్కో పర్యటించి, తెలుగులో విదేశ యానంపై తొలి సంపూర్ణ పద్య కావ్యాన్ని రచించాను.
వృత్తి పరంగా ఇంజినీరునైనా, తెలుగులో డాక్టరేట్ పట్టా పొందాను.
ఇవన్నీ ఎంత సంతృప్తినిచ్చినా ,
* నా ” మాస్కో స్మృతులు ” కావ్యానికి వ్రాసిన పీఠికలో … గుంటూరు శేషేంద్ర శర్మ గారు ” ఆచార్య ఫణీంద్ర సూర్యుడ్ని ఆకాశంలో గాలి పటంలా ఎగురవేసే కవి. ఈ కవి హృదయానికి ఏ రంగులూ లేవు, వాసనలూ లేవు. నిర్మల కాంతిమంతమైన హృదయము. ఆయన భాష సరళము _ భావములు మణి మాణిక్యాలు. ” అన్న వాక్యాలు ;
* నా చాటుకు మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్య , ” నా జీవిత చరమాంకంలో ఫణీంద్ర నన్ను కలవడం, నాకు తోడుగా నిలవడం వల్ల నా ఆయుర్దాయం మరో పదేళ్ళు పెరిగిం ” దని చెప్పుకోవడం ;
* మా గురువు గారికి వ్రాసిన లేఖలో డా. నాగభైరవ గారు ” ఫణీంద్ర కవితలు చూస్తున్నాను. ఈరోజు మంచి పద్య కవులను పది మందిని ఎన్నుకొంటే, అందులో ఫణీంద్ర పేరు తప్పకుండా ఉంటుంది. భావిని ఏల గల సత్తా అతనిలో ఉంది. ” అన్న మాటలు ;
* ఉత్పల సత్యనారాయణాచార్య గారు నాతోనే స్వయంగా ” మా తరువాతి తరంలో ఎవరా ? అని చూస్తే, నాకు నువ్వొకడివి కనిపిస్తున్నావు” అన్న మాట _
ఇచ్చిన సంతృప్తి, ఆనందం వర్ణనాతీతం.
ఇప్పుడా మహానుభావులంతా లేరు. వారిచ్చిన ఆశీర్వాద బలం మాత్రం నా గుండెల్లో గూడు కట్టుకొని ఉంది. ఆ స్ఫూర్తితో మరిన్ని ముందడుగులు వేసే ప్రయత్నం చేస్తాను.
మునుముందు కూడా సాహితీ మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు ఎప్పటిలాగే నా పైన ఆదరాభిమానాలను చూపుతారని ఆశిస్తున్నాను.
నా జీవితానికి అంత కన్నా ధన్యత ఏముంటుంది ?
అందరికీ నా అభివందనాలు !

– డా. ఆచార్య ఫణీంద్ర

గాలి బ్రతుకులు

గాలి బ్రతుకులు

రచన : డా.ఆచార్య ఫణీంద్ర

apartments

జంట నగరముల ప్రజా జీవితా లిప్పు

డయొ ! ” అపార్టుమెంట్ల ” యందు వ్రేలె !

అందలమ్ములెక్కి ఆనందమే తొల్త _

కడకు తెలియు బోర్ల పడిన యట్లు !   …   1

నేల పైన కాదు _ నింగిలోనను కాదు _

ఆ ” త్రిశంకు స్వర్గ ” మనిన నిదియె !

క్రింద నుండు వాడు ” కేరు ” చేయడు నిన్ను _

పైన వాని కేది పట్టబోదు !   …   2

” లిఫ్టు ” పైకి నిన్ను ” షిఫ్టు ” చేయుచునుండు _

క్రొత్త యందు క్రొత్త క్రొత్త గుండు !

చెత్త కంపెనీదొ _ చెడు మాటిమాటికిన్ _

చిక్కి పోదువింక ఎక్కి మెట్లు !   …   3

” గ్రిల్లు ” మూయబోడు క్రింది కేగిన వాడు _

పైన ” లిఫ్టు ” నొక్క _ పైకి రాదు !

క్రింద కేగి చూడ _  గ్రిల్లు తెరచి యుండు _

ఒకని పైన నింద నొకడు వేయు !   …   4

ఒకతె ఇంటి ముందునున్న చెత్తను త్రోయు

ఎదుటనున్న వారి ఇంటి ముందు _

ఉన్న ” కారిడారు ” చిన్నదే ! అందొక్క

ముక్క తనది యగును _ ముగ్గులంతె !   …   5

పంపు నడుప నీళ్ళు పైవానికిన్ రావు

వాడుకొనును క్రిందివాడు నపుడె _

పంపు నాపినంత పైవాని గతి యంతె !

నిత్య యుద్ధమగును _ నీళ్ళ కొరకు !   …   6

” వాచుమన్ ” ను పిలువ _ వాడెక్కడో యుండు _

వలసినప్పు డెపుడు వాడు రాడు _

మందలించలేము మామూలుగా వాని _

వాడు పోవ, మరొక వాడు రాడు !   …   7

ప్రతిది గొడవ చేయు పంతాన నొక్కండు

” మేంటెనెన్సు ఫీజు ” మెలిక బెట్టి _

ఇచ్చు టాపివేయు నే చిన్న గొడవైన _

చచ్చి ఊరుకొంద్రు సభ్యు లపుడు !   …   8

చెప్పి పెట్టనేమి ” సెక్రెట్రి “, ” మీటింగు “

లోటుపాట్ల గూర్చి మాటలాడ _

కొందరే ” ప్రజెంటు ” _ ఎందరో ” ఆబ్సెంటు ” _

వచ్చు కొద్ది మంది చిచ్చు రేపు !   …   9

క్రొత్త బిచ్చగాడు కోశాధికారియే !

ఇంటి ఇంటి కేగి, ” మేంటెనెన్సు

ఫీజు ” నీయుమనగ _ విదిలింత్రు బాధగా !

మెక్క లేడు _ బాధ క్రక్క లేడు !   …   10

మిథ్య వోలె తోచు ” మీటింగు ” లవియన్ని _

గాలి మాటలన్ని _ తేల దేది !

వ్యథలు వ్యథలుగానె కథలుగా కొనసాగు !

గాలి బ్రదుకు లగును లీల తుదకు !   …   11

___ *** ___

షట్సహస్ర సందర్శనోత్సవం

షట్సహస్ర సందర్శనోత్సవం
——————————–
roses
4 జులై 2009 నుండి 20 జులై 2009 వరకు ( కేవలం 16 రోజుల్లోనే ) మరో 1000 మంది సహృదయుల దృక్కులు నా బ్లాగుపై ప్రసరించాయి. అంటే, నా బ్లాగు ప్రారంభించిన నాటి నుండి   ( నవంబర్ 2008 ), ఇప్పటికి మొత్తం 6000 మంది వీక్షకులు దానిని సందర్శించా రన్న మాట !

ఈ 16 రోజుల్లో _ చివరికి ఫలవంతం కాకపోయినా, నా ” ఏక వాక్య కవితల ” పై ” బొల్లోజు బాబా ” గారితో జరిగిన వాడి వేడి చర్చ పేర్కొనదగిన అంశమే !

ఈ షట్సహస్ర సందర్శనోత్సవ శుభ వేళ …

నా బ్లాగును వీక్షిస్తూ, వ్యాఖ్యల ద్వారా ప్రోత్సహిస్తున్న సాహిత్య ప్రియులకు, నా మీద ప్రేమాభిమానాలను వర్షిస్తున్న పలు ’బ్లాగు మిత్రులందరి’కీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు !

నా టపాలను ఎప్పటికప్పుడు వేగంగా ప్రదర్శిస్తున్న ‘ వర్డ్ ప్రెస్ ‘ వారికి , ‘ జల్లెడ ‘ , ‘ కూడలి ‘ , ‘ హారం ‘ ,  ‘ పద్యం ‘, ‘ నరసింహ ‘ , ‘ పవన్ ఫ్యాన్స్ . కాం ‘ , ‘ మంచు పూలు ‘  మొదలైన నిర్వాహకులకు నా నమోవాకాలు!

డా.ఆచార్య ఫణీంద్ర

మహాకవి దాశరథి

dasaradhi-Teluguwriterమహాకవి దాశరథి

—————————
రచన: డా. ఆచార్య ఫణీంద్ర

కవిత్వ బాంబులు కాల్చి, పేల్చి,
” అగ్ని ధార ” లకు ఆజ్యం పోసి,
నిజాము రాజును బజారుకీడ్చిన
ప్రజా కవీంద్రుడు దాశరథి !

స్వతంత్రమొందిన తెలంగాణమును
సమైక్యాంధ్రలో మిళితం చేసి,
” మహాంధ్రోదయం ” ఆకాంక్షించిన
విశాల హృదయుడు దాశరథి !

అంగారాన్ని, శృంగారాన్ని
బంగారంలా సింగారించి,
ఆంధ్ర కవితకే సొగసులు దిద్దిన
మహాకవీంద్రుడు దాశరథి !

సమతా వాదం, శాంతి నినాదం
జీవితమంతా నీకయె వేదం _
నీ ఆశయమే మా నవ కవులకు
ఆదర్శం, ఆచరణం _ దాశరథి !

[ 21 జులై నాడు కీ.శే. మహాకవి డా. దాశరథి 83 వ జయంతి సందర్భంగా నివాళిగా … ]

___ *** ___

వరాహ శతకము – 2

వరాహ శతకము – ( అధిక్షేప, హాస్య, వ్యంగ్య కృతి )
( రెండవ భాగము )

———————————————–
రచన : డా. ఆచార్య ఫణీంద్ర

ఎవ్వడు ” అంటరాని తన ” మీ భువి నాటెనొ తొట్ట తొల్లిగా,
అవ్వెధవాయి కంటబడ _ అందరి ముందర, నిట్ట నిల్వునన్
త్రవ్వియు గోతి నొక్కటిని, దానిని పాతర వేయగా వలెన్ ! _
ఇవ్విధి క్రోధమబ్బు నది ఏను తలంపగ _ ఓ వరాహమా !   …   17

నేనటు లోకమం దెవరి నెప్పుడు చూడను చిన్న చూపుతో _
కానగ విశ్వ కావ్యమున కాదని యెంచెద అల్పమేదియున్ !
ప్రాణి సమస్త మెల్ల సమ భావన జూచెద _ దీన, హీన, క
ల్యాణమె నాకు ప్రీతి _ మరి అట్టులె నీవన _ ఓ వరాహమా !   …   18

అభ్యుదయమ్ము నా పథము ! అట్టడుగందున నున్న వారి కే
నభ్యుదయమ్ముగోరెదను _ అందరు గూడ సమానమన్న ఆ
అభ్యుదయంపు భావనల నల్లుచు నద్భుత సత్కవిత్వమున్ _
సభ్య సమాజ నిర్మితికి సాధన మయ్యెద నో వరాహమా !   …   19

కాదు కవిత్వ వస్తువని ఘాటుగ తిట్టిన తిట్టనిమ్ము _ నే
పాదము త్రిప్పబోను ఘన పండితులేమి తలంప నేమి ? ” కా
దేది అనర్హమైన ” దని ఎప్పుడొ చెప్పె మహాకవీంద్రుడున్ !
నాదగు నీ మనోజ్ఞ కృతి నాయిక నీవిక _ ఓ వరాహమా !   …   20

లోకులు బాహ్య రూపమును లోకువ గట్టుచు కొంత మందికిన్
శోకము గల్గ జేయుదురు _ చుంబన మిత్తురు కొంత మందికిన్ _
లోకము చిత్రమైన దది  లోపలి లోతులు చూడబోదు ! ఆ
లోకన చేయలేరె మది లోపలి సోయగ మో వరాహమా !   …   21

( సశేషమ్ )pig

Previous Older Entries