క్రొత్త చట్టం ఎవరి చుట్టం?

క్రొత్త చట్టం ఎవరి చుట్టం?

రచన : "పద్య కళాప్రవీణ", "కవి దిగ్గజ"
            డా. ఆచార్య ఫణీంద్ర

క్రొత్త రైతు చట్టమ్ములో కూడి యున్న
మర్మ మేమిటో తెలియరో? మనుజులార!
షేరు మార్కెట్టులో “ఉతార్ – చెడవు” లట్లు
రైతు కష్టమ్ము “కార్పొరెట్ రంగ” మగును!

ఏ రైతైనను పంటను
ఏ రాష్ట్రము కైన వెడలి, ఎవ్వరికైనన్
ఆ రోజు వెలకు నమ్మక
వేరే మార్గమ్ము లేని విధియే మిగులున్!

రైతుకు రైతుకున్ నడుమ రచ్చను రేపెడి పిచ్చి చట్టమే
చేతను బట్టి “కార్పొరెటు సేఠులు” తక్కువ మూల్య మిచ్చియున్ –
ఘాతుక చర్యకౌచు బలి, కర్షకు డక్కట! కుప్ప గూలగా,
నాతని కష్ట మమ్ముకొని, అంతకు మించిన లాభ మొందరే?

ధనికుడు మరి ధనికుడుగా –
దిన దినమిక పేదవాడు దీనుడుగా నౌ
గుణ హీనమైన చట్టము –
జనులారా! ఎట్లు మీరు సహియింతురయా?

విద్యయె కార్పొరె టయ్యెను!
వైద్యమ్మును కార్పొరెటయె! వ్యవసాయంబౌ
మిధ్యయె కార్పొరెటయి! ఆ
వధ్య శిలను రైతు నిలిచె! వారింపుడయా!#