” ప్రథమ వార్షికోత్సవం “

” ప్రథమ వార్షికోత్సవం “

25 నవంబరు 2009 నాటికి, నేను ఈ బ్లాగ్ ద్వారా ” బ్లాగ్ లోకం ” లో ప్రవేశించి సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయింది.

ఈ సంవత్సర కాలంలో ఈ బ్లాగులో 97 టపాలను అందించాను. 12000 మందికి పైగా సహృదయులు నా బ్లాగును వీక్షించారు. [ అంటే సగటున నెలకు 1000 మంది అన్న మాట. ]

తరువాత ప్రారంభించిన మరో రెండు బ్లాగులు –

” నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ” లో 50కి పైగా టపాలను;

” మౌక్తికం ” లో 15 టపాలను అందించాను.

ఈ సంవత్సర కాలంలో ఎందరో సహృదయులు, రస హృదయులు నాపై అపారమైన ఆదరాభిమానాలను వర్షించారు.

కొందరు బ్లాగు మిత్రులు నన్నొక ప్రముఖ బ్లాగరుగా గుర్తిస్తూ, తమ బ్లాగులలో టపాలలో నా గురించి ఉటంకించడమే కాకుండా; నా వ్యాఖ్యలను, నా పద్యాలను వారి బ్లాగులలో టపాలుగా అందించారు. ఎంతో మంది బ్లాగర్లు నాకు ఆత్మీయ మిత్రులయ్యారు. ఇంతకన్న గొప్ప సంపద ఇంకేముంటుంది ?


ఒక సాహితీ వేత్తగా  రాష్ట్రంలో అనేక ప్రభుత్వ, ఇతర సాహితీ, సాంస్కృతిక సంస్థల సత్కారాలందుకొన్న నేను ఇలా “బ్లాగులోకం” లో కూడా పరిచయమై, విశ్వ వ్యాప్తంగా మరింత మంది అభిమానులను సంపాదించుకొన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది.

ఈ ” ప్రథమ వార్షికోత్సవ ” వేళ … మునుముందు కూడా మంచి, మంచి టపాలతో మిమ్మల్ని అలరించే ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, మీరంతా నన్ను ఇలాగే ఆదరిస్తారని, అభిమానిస్తారని, ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను.

నమస్సులతో

మీ

డా. ఆచార్య ఫణీంద్ర.

నా ప్రేమ ప్రేమే కానిచో …

నా ప్రేమ ప్రేమే కానిచో …

[ తెలుగు గజల్ ]

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

నా ప్రేమ ప్రేమే కానిచో

ఆ ప్రేమ సౌధమె కూలనీ !

నా గుండె గుండే కానిచో

అది మండి మసియై రాలనీ !          || నా ప్రేమ ||

తొలి చూపులోనే వలపును

నీ పైన జల్లుగ కురిసిన

నా కళ్ళు కళ్ళే కానిచో

అవి చితికి చిటపట ప్రేలనీ !             || నా ప్రేమ ||

నీ విరహమున మున్నీటిగా

కార్చానులే కన్నీటిని –

ఆ నీరు నీరే కానిచో

అది మురుగు కాల్వను తేలనీ !      || నా ప్రేమ ||

నీ పొందు కోరి తపించిన,

నిను పొందగోరి కృశించిన

నా తనువు తనువే కానిచో

అది వల్లకాటిని కాలనీ !                  || నా ప్రేమ ||

— *** —

మహాత్మురాలు

మహాత్మురాలు

రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర

ధీర వనితలందు, వీర వనితలందు –
పేరు మోసినట్టి వెలది ఎవరు ?
ఇలను లేరు సాటి ‘ ఇందిరా గాంధి ‘ కిన్ !
విశ్వ కీర్తి గొన్న విదుషి ఆమె !

స్వాతంత్ర్యోద్యమ సాధనమ్మున కవిశ్రాంతమ్ముగా పోరెడిన్
తాతన్, తండ్రియు, తల్లి గల్గు గృహ సత్సంతానమై పుట్టెనో –
చేతంబందున దేశభక్తి కలిగెన్ చిన్నారి ప్రాయంబునన్ !
జాతిన్ బ్రోవగ జన్మమెత్తె మగుడిన్ ‘ ఝాన్సీ మహారాణి ‘ యే !

‘ మంకి గ్రూపు ‘ గా సమాచార మందించ –
చిన్న పిల్ల యపుడె చేర్చి మిత్ర
బృంద మొకటి, నిర్వహించి సాయమొనర్చె
‘ కాంగ్రెసు ‘ కు, స్వరాజ్య కదనమందు !

జనకుని నీడగా కదలి, సాహస నారిగ నారితేరి, తా
దినదిన మెత్తుగా నెదిగి, దేశమునందున గొప్ప నాయికై –
అనితర సాధ్య కష్ట సమయంబున తాను ప్రధాన మంత్రియై –
వనితకు చేత గానిది ప్రపంచమునందిక లేదు – లేదనెన్ !

బ్యాంకుల జాతీయపరచె
జంకక యుద్ధాన పొందె జయ; మాహారం
బింక, పరిశ్రమలందన –
కంకణ బద్ధయయి జూపె ఘనమగు ప్రగతిన్ !

ఎంచి అమలుపరచె ‘ ఇరువది సూత్రాల
పథక ‘ మొకటి మంచి ఫలితములిడ –
పేదవారి యెడల పెన్నిధిగా నిల్చి,
అవని జనుల కామె ‘ అమ్మ ‘ యయ్యె !

‘ అణుశక్తి పరీక్ష ‘ సలిపె –
వినువీధి నుపగ్రహముల వేంచేపించెన్ –
ఘన ‘ దూర దర్శన ‘ మొసగె –
మన శాస్త్రోద్ధతికి పరులు మత్సరమందన్ !

దినదినమ్ము నెంతొ దేశాభివృద్ధితో
భారతాంబ కీర్తి వ్యాప్తినొంద –
పాటుబడిన ఆమె బ్రతుకు దివ్వియ నార్పె
తీవ్రవాదమనెడి తిమిర మకట !

భిన్న సంస్కృతుల్ గలిగి, విచ్ఛిన్నపడక –
ఐక్యముగ దేశ మభివృద్ధినంద – ఆమె
జీవితంబెల్ల కృషి చేసి, చేసి, తుదకు
ఆత్మ బలిదాన మిడిన మహాత్మురాలు !

[ నవంబరు 19 నాడు దివంగత ప్రధాని ‘ శ్రీమతి ఇందిరా గాంధి ‘ జయంతి సందర్భంలో నివాళిగా … ]

— *** —

వార్తా పత్రికలలో …

ఈ నెల 10వ తేదీన జరిగిన ’ భువన విజయం ’ సాహిత్య రూపకానికి సంబంధించిన వార్త, తెల్లవారి అన్ని దిన పత్రికలలో విశేషంగా ప్రచురించబడింది.

ఈనాడు :

eenaadu

వార్త :

vaarta

సాక్షి :

sakshi1

sakshi2

సూర్య :
soorya

రూపకంలో ’ నంది తిమ్మన ’ పాత్ర ధరించిన నా ఫోటోలు మరికొన్ని …

Image1384
Image1385
Image1386

‘భువన విజయం’ ఇదివరకు ఎన్నోమార్లు వేసినా, ఈ మారు వచ్చిన పబ్లిసిటికి, తీరుబడిగా కొన్ని ఫోటోలు తీయించుకోగల్గినందుకు చాల ఆనందంగా ఉంది.

— డా. ఆచార్య ఫణీంద్ర

‘భువన విజయం’ లో నేను …

download

ఈ రోజు ( 10 నవంబరు 2009 ), తెలుగు భాషకు విశేషమైన సేవ చేసిన ‘ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ‘ జయంతి సందర్భంగా, ‘ సి.పి.బ్రౌన్ అకాడమి, హైదరాబాద్ ‘ వారు ‘ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘ ఆడిటోరియంలో ‘ భువన విజయం ‘ సాహిత్య రూపకాన్ని నిర్వహించారు. అందులో నేను ‘ నంది తిమ్మన ‘ పాత్రను పోషించాను. సుమారు రెండు గంటల పాటు ఈ సాహిత్య రూపకం నాలుగు భాగాలుగా సాగింది. మొదటి భాగంలో రాయల వారి స్తుతి, రెండవ భాగంలో కావ్య గానం, మూడవ భాగంలో కొన్ని సమస్యా పూరణలు, నాలుగవ భాగంలో పెద్దన కవి మాలికా పఠనం తరువాత గండ పెండేర ప్రదానంతో రూపకం పరాకాష్ఠకు చేరుకొని ముగిసింది. మొదటి భాగంలో రాయల వారిపై సీస పద్యంతోబాటు, రెండవ భాగంలో నా కావ్య గానంగా ‘ పారిజాతాపహరణం ‘ లోని కొన్ని రమణీయ పద్యాలను రాగ యుక్తంగా గానం చేసాను.
దత్తాత్రేయ శర్మ ( శ్రీ కృష్ణ దేవ రాయలు ), సాధన నరసింహాచార్యులు ( అప్పాజీ ), జి.ఎం. రామశర్మ ( పెద్దన ), సూర్య నారాయణ మూర్తి ( తెనాలి రామకృష్ణుడు ), కె.వి.ఎన్. ఆచార్యులు ( నరస కవి ) మొదలైన వారు పాల్గొన్న ఈ భువన విజయ రూపకాన్ని తిలకించేందుకు శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ కులపతి ఆచార్య కొనకలూరి ఇనాక్, ప్రముఖ కవి డా.జె. బాపురెడ్డి, సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య చేకూరి రామారావు మొదలగు సాహితీమూర్తులతోబాటు జంట నగరాలలోని చాలా మంది సాహితీ ప్రియులు విచ్చేసి, ప్రదర్శనానంతరం ప్రశంసల జల్లును కురిపించారు.
పై చిత్రంలో రూపక ప్రదర్శనలో ఒక దృశ్యం, క్రింది చిత్రంలో తిమ్మన పాత్రధారినైన నాకు జరిగిన సత్కారం చూడవచ్చు.
— డా. ఆచార్య ఫణీంద్ర

కమ్మనైన భాషరా ఆంధ్రము!

telugu scriptకమ్మనైన భాషరా

ఆంధ్రము

[ లలిత గీతం ]

రచన :

డా. ఆచార్య ఫణీంద్ర

 

కమ్మనైన భాషరా ఆంధ్రము

కవి కోకిలల కళా కేంద్రము

కమనీయ మధు కవితా సాంద్రము

కావ్య తృష్ణ తీర్చే చలివేంద్రము              || కమ్మనైన ||


భారతి నుదుటను దిద్దిన చెంద్రము

హారతి పట్టగ వెలిగిన చంద్రము

భావ కుసుమ నిలయమీ సుధీంద్రము

భాషలన్నిటిలో రాజేంద్రము                  || కమ్మనైన ||


గుసగుసలాడే వేళ మంద్రము

బుస కొట్టే వేళ నాగేంద్రము

సహృదయ జన చర్చలలో సంద్రము

సభలోన సరస మాహేంద్రము               || కమ్మనైన ||

___ *** ___potana

వరాహ శతకము ( 5వ భాగము )

వరాహ శతకము

 

[ అధిక్షేప హాస్య వ్యంగ్య కృతి ]

( 5వ భాగము )

రచన : ‘ పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర

PigRoast

ఎంత భుజించినన్ కడుపు కింకను చాలదటన్న రీతి, నీ
వెంతయు నేది దక్క నది ఎట్టుల మేయుచునుందువో సుమా !
అంతయు నీదు పోలికయె ! అచ్చము మేయుదు రట్లె నాయకుల్,
గంతలు కట్టి మా కనుల – ’స్కాము’ల రూపున ! ఓ వరాహమా ! … 43

పశువుల గ్రాసమున్, బడుల పాఠము చెప్పు ’టెలీవిజన్ల’నున్
శిశువుల ’పాల డబ్బ’లును, ’షేరు బజారు’ల ’స్క్రిప్పు’లున్, ప్రజల్
దశలను మార్చుకోన్ ధనము దాచెడి ’బ్యాంకు’లు, ’చిట్టు ఫండ్లి’టున్ –
అశనము కేది కాదిక అనర్హము నేతలకో వరాహమా ! … 44

భూముల నాక్రమించి, అవె భూముల ప్రక్క విదేశ సంస్థకున్
’స్కాము’ను చేసి ’పర్మిటి’డి, సంస్థ యశస్సును చెప్పుకొంచు నా
భూముల కొక్కమారు పెద ’బూము’ను కల్గగ జేసి, అమ్ముకొం
ద్రేమని చెప్పుదింక సచివేంద్రుల ఆగడమో వరాహమా ! … 45

ఎవ్వడు నీతిమంతుడొ, మరెవ్వడు నీ యవతారమో యటన్
ఎవ్విధి ముందెరుంగుటయొ – ఎంతకు తోచుట లేదు మాకు ! నీ
వెవ్విధి కుంట వీడి దరికేగగ గుప్పున కంపు గొట్టునో –
అవ్విధి ’స్కాము’ గూర్చి తెలియన్ నిజమేర్పడునో వరాహమా ! … 46

దారిని ఎక్కడే మురికి దాగియునున్నను, శోధనమ్ముతో
చేరియు నాకి వేయుచు శుచిన్ కలిగింతువు ! ’మున్సిపాలిటీ’
నీరసమైనయట్టి విధి నిర్వహణమ్మును సల్పుచుండె – ’స
ర్కారు’కు మార్గ దర్శనము కావలె నీ కృషి ! ఓ వరాహమా ! … 47

” పడతియె జన్మనిచ్చునొక పందికి భావి “నటంచు పల్కెనే
కడచిన ఐదు వందలగు కాలము పూర్వము ’వీర బ్రహ్మమే’ !
విడమర చిద్ది చూడ – మరి వింతయె రూపము సంక్రమించినన్;
నడతను చూడ – నీకు వలె నాడె జనించిరి ! ఓ వరాహమా ! … 48

జన్మమునిచ్చి గంపెడును సంతతికీవు నొకొక్క కాన్పులో,
చన్మొనలన్ని పిల్లలకు చాపుచు నోటను, పాలు చేపెదో !
విన్మిపుడట్లె మానవులు పెక్కురు పిల్లల గన్న, కాంచుచో –
నిన్మదిలో తలంచి కడు నీరసమొందెద ! ఓ వరాహమా ! … 49

మీరుచు నొక్కరిద్దరికి మించిన సంతును తల్లిదండ్రులె
వ్వారును కల్గియున్న చెడు వారికినిన్, మరి దేశ వృద్దికిన్ !
భారత దేశమందు ననివార్య కుటుంబ నియంత్రణపు స్వీ
కారమె సంతరించును సుఖప్రద జీవనమో వరాహమా ! … 50

ఒక్కరు లేక నిద్దరు సుతుల్, సుతలంచని గాక దంపతుల్
దక్కినయట్టి బిడ్డలను తామదె చాలను తృప్తి బెంచుచున్
మిక్కిలి గారవమ్ముగను; మేలిమి బంగరు జీవితమ్ములన్
చక్కగ వారలందుటకు సాధన చేయవలెన్ వరాహమా ! … 51

పల్లెలయందు నేటికిని పందుల వీర విహార యాత్రలన్
కళ్ళకు కట్టుచుండు ! ఇది కాని పనేమియు కాక పోయినన్ –
పల్లెలు వృద్ధి చెందినటు పందులు లేని యెడన్న భావముల్
వెల్లడియౌను ! నీకు నది వేదన గూర్చునొ ? ఓ వరాహమా ! … 52

పాపపు కాలమిద్ది – ఇదె వచ్చెను వ్యాధులు వింత వింతలై !
నీ పయి దోమ కుట్టి, మరి నేరుగ ఏ నరునింక కుట్టినన్ –
పాపము ! వానికిన్ ’ మెదడు వాప ’ను వ్యాధియె వచ్చు ! అద్ది ఏ
శాపమొ గాని, వానికిడు శాశ్వత నిద్రయె – ఓ వరాహమా ! … 53

గడగడలాడుచుండె ప్రజ గాదె ఇటీవల ’ స్వైను ఫ్లూ ’ యనన్ –
గడబిడయంత నీదె ! అది కల్గెడి దింతకు ముందు నీకు – నే
డడుగిడె నద్ది మానవుల యందున హంతగ, నీదు పుణ్యమై !
వడివడి వ్యాప్తిజేయు టిటు భావ్యమె నీకది ? ఓ వరాహమా ! … 54

ముదిరియు వ్యాప్తిజెందుటకు ముందె జనంబుల కిట్టి రోగముల్,
కదలరు మంత్రులే తగిన కార్య ప్రణాళిక పూని; వారలా
పదవి సుఖాల దేలు చది పట్టనిచో – ప్రతిపక్ష మార్చినన్,
” అదియొక రాజకీయ ” మని యందురె అంధులునై ! వరాహమా ! … 55

శాకములెన్నియున్న, నర జాతిని కొందరదేల మాంసమున్
చేకురగా తలంచెదరొ జిహ్వకు లోబడి భోజనంబునన్ ?
నీకును తప్పదాయెను కనీసము కొందరి భోజనంబులో
ఆకలి దీర్పగా, సలుపు టాత్మను త్యాగము ! ఓ వరాహమా ! … 56

ఇప్పటికింక గ్రామముల నెచ్చట పందులు కానిపించినన్,
చప్పున వెంట పర్విడుచు సల్పుట జూతుము వేట నాడుటన్ !
తప్పని యెంచకుండ, అది తాతల నాటి కులాగ్ర వృత్తిగా
చెప్పు కిరాతులే ! అదియె చేటయె నీకిక ! ఓ వరాహమా ! … 57

పట్టగ సూకరం బురుకు పర్గుల వెట్టెడి వారినిన్, జనుల్
చుట్టుగ నిల్చి చూచెదరు చోద్యము వోలె – అదేదొ క్రొత్తగా
’ నట్టువుడున్, కిరీటియు పునః కిరికై సమరంబు సల్పెడున్ ’
ఘట్టము చర్మ చక్షువుల కాంచిన యట్టుల ! ఓ వరాహమా ! … 58

తరతరముల్ గతించినను తాతలు తండ్రుల సంప్రదాయమున్
గిరిజనులాచరించుచు నొకించుక నిన్ను భుజించుటన్ సరే !
పురజనులైన వారు నిను ’ పోర్క ’ ను పేరిట హోటలందునన్
కరచుచు, నాకుచుందు, రది కాంచిన చిత్రమె ! ఓ వరాహమా ! … 59

అందులకేమొ ! లాభకరమంచును కొందరు వర్తకాగ్రణుల్
’ పందుల పెంపకం ’ బనెడు భవ్య పరిశ్రమ స్వీకరింతురే !
ముందుగ ’ దూర దర్శను ’ న మొత్తమిదే తొలుదొల్త నాళులన్
సుందర దృశ్య కావ్యమటు చూపిరి గాదె ! అహో వరాహమా ! … 60

[ సశేషం ]

—– *** —–

Previous Older Entries