దోషమె కంఠమెత్తినన్ ?

దోషమె కంఠమెత్తినన్ ?

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

ఏ రైతాంగమె ఆ ‘నిజాము’ విభుతో, ఈ భూమి మాదేయటన్
పోరాటంబును సల్పి సాయుధులునై, పొందెన్ తెలంగాణమున్ –
ఆ రైతాంగము నష్టపోయెను విశాలాంధ్రమ్ములో చేరుటన్ !
నీరే అందదు పంట కాల్వలకు – కన్నీరేమొ పొంగారెడిన్ !

కోస్తా, సీమల ముఖ్యమంత్రులకు సంకోచమ్మె లేకుండ, ఆ
కోస్తా ప్రాంతపు రైతు లాభములయెన్ కొండంత లక్ష్యంబుగాన్ !
బస్తాల్ నింపుచు బండ్ల కెత్తుటయె ఆ ప్రాంతంపు భాగ్యంబునై;
పస్తుల్ పండుట, ప్రాణముల్ విడుట ఈ ప్రాంతంపు ప్రారబ్ధమా ?

కిలకిలా నగవుల కృష్ణ , గోదావరుల్
తొలుత తాకు నిచట తెలుగు నేల !
పారి, దాటిపోవు – పంట భూముల యొక్క
దాహములను తీర్ప తలపడెవడు !

సకలారిష్టములన్ని దాటి, తుదకున్ సాధించి ఈ ప్రాంతమం
దొకరో, ఇద్దరొ ముఖ్యమంత్రులయి, తామూనంగ సద్వృద్ధికై
వికలంబౌనటు ‘లాంధ్ర’* నాయకులయో ! విద్వేషముల్ చిందరే ?
ఒకటే లక్ష్యము – వారి పెత్తనమె ! లేకున్నన్ ప్రభుత్వమ్మె ’హుష్’ !
( * ఇది ఇక్కడ ’భాషా వాచకం’గా కాక, ’ప్రాంత వాచకం’గా ప్రయోగింపబడిందని గమనించ గలరు )

ఏటికి ఎంచుట ఇవి ? ఆ
మాటయె పలుక – తెలగాణ మంత్రులయందున్
నూటికి తొంబది, ఎంగిలి
కూటికి ఆశపడుచుండు కుత్సితు లకటా !

వ్యవసాయంబున కూత లేదు – మరి విద్యా సంస్థ, లుద్యోగముల్,
భవనాల్, భూములవన్ని దోచ వలసల్ వచ్చున్న కామందులే;
అవి పోవన్, మిగులేవొ కొన్ని ఇట వారందేరు ! దుర్భాగ్యులౌ
యువకుల్ గాంచిది గుండె మండి, మరి పోరో ‘నక్సలైట్’ దారిలోన్ ?

ఇవియునన్ని గాక, ఇంక దారుణ మిద్ది –
ఇచటి పేదలన్న ఏదొ లోకు,
విచటి భాషయన్న ఏదో చులకన ! ఇం
కిచటి సంస్కృతియన హేళనమ్ము !

ఏకమైయున్న, ఆగబోదింక దోపి
డిట్లు ! అయిన దేదియొ ఆయె – నింక మీద
వీడి, అన్నదమ్ముల వోలె వేరుపడిన –
ఎవరి అభివృద్ధికై వార లేగవచ్చు ! 

అమ్మ ! ఇదేమి చిత్రమొ ! ఇదంతయు నింతగ సత్యమై కనన్ –
ఇమ్ముగ పల్కుచుంద్రు, కడుపెల్లయు నిండగ, జీవితమ్ము ప
బ్బమ్ముగ గడ్పుకొంచు గలవారె ‘సమైక్యత’ యంచు ! నోటిలో
దుమ్మునుబడ్డ వారలిక దోషమె వేర్పడ కంఠమెత్తినన్ ?
___ *** ___