‘రవీంద్రభారతి’లో రాష్ట్ర ప్రభుత్వం ‘ఉగాది వేడుకలు’

ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో హైదరాబాద్ ‘రవీంద్రభారతి’లో ఉగాది వేదుకలు వైభవోపేతంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ పి.కె. మహంతి ముఖ్య అతిథిగా పాల్గొని పంచాంగాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. అనంతరం పంచాంగ పఠనం చేసిన శ్రీ వేణుగోపాల్ గారిని, కవి సమ్మేళనంలో పాల్గొన్న మా కవులందరినీ, ఇతర అతిథులను సత్కరించారు.

ఆ కార్యక్రమ చిత్రాలను, కవిసమ్మేళనంలో నేను చదివిన కవితను పాఠకులకు అందిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

పల్లె వాతావరణంలో అలంకరించబడిన వేదిక :

31br73o

 

31br73i

పంచాంగం మరియు ఇతర గ్రంథాల ఆవిష్కరిస్తున్న శ్రీ మహంతి గారు :

31br73l

కవిసమ్మేళనంలో పాల్గొన్న కవులు :

(కుడి నుండి వరుసగా : శ్రీమతి కొండేపూడి నిర్మల, నేను, శ్రీ వాడ్రేవ్ చిన వీరభద్రుడు, డా. రాళ్ళబండి కవితాప్రసాద్, డా. ఎల్లూరి శివారెడ్డి (కవి సమ్మేళనం అధ్యక్షులు), శ్రీ ముక్తేశ్వర రావ్ (గౌరవ అతిథి), శ్రీ శేషం రామానుజాచార్యులు, డా. మసన చెన్నప్ప, శ్రీ యాకూబ్, డా. ఉండేల మాలకొండా రెడ్డి, డా. తిరుమల శ్రీనివాసాచార్య మొ||గు వారు)

31br73k

(Photos : Courtesy – ‘Eenaadu’)

 కవిసమ్మేళనంలో నేను వినిపించిన కవిత :

 

రెండు కోకిలలు!

రచన: కవి దిగ్గజ డా. ఆచార్య ఫణీంద్ర

 

జయము! జయము! జయము! జయనామ సంవత్స

రాంబికా! ఇదే జయమ్ము నీకు!

సకల జయము లింక, సంతోషముల దెచ్చు

జనని! వత్సరాది! స్వాగతమ్ము!

 

విస్తరించి మావి వృక్షమ్ము పెద్దగా

రెండు శాఖ లెదిగె నిండుగాను!

ఒక్కటి తెలగాణ‘, మొక్క టాంధ్ర ప్రదేశ్‘ –

తెలుగు మావి రుచులు ద్విగుణమయ్యె!

ఉవ్వెత్తు నెగసిన ఉద్యమ గ్రీష్మాల

మండుటెండల లోన మాడినాము –

విరుచుక పడుచును వీపులందు కురియు

లాఠి వర్షాల కల్లాడినాము –

బందు, హర్తాళ్ళతో వణుకు శరత్తులన్

పలుమార్లు వడవడ వణికినాము –

ఆకులట్లు యువకు లన్యాయముగ రాలు

శిశిరాలనే గాంచి చితికినాము –

 

తుదకు నిన్నినాళ్ళ కిపుడు పదియునాల్గు

వత్సరముల బాధ లుడిగి, ఫలిత మబ్బి,

నేటికి కదా విరియుచు నీ తోటి మాకు

చివురులెత్తు వసంతమ్ము చేరుచుండె!

 

భారీ తుఫాను లుడిగెను

నీ రాక ఉగాది‘! మాకు! నిజము! యుగాదే‘!

వేరుపడె తెలుగుభ్రాతలు!

వారికి, వీరికి శుభమిడు బ్రహ్మాండముగాన్!

 

కార, ముప్పు, వగరు, కడు చేదు, పులుపులే

కడచి, కడచి, తుదకు కలిగె తీపి!

క్రొత్త వత్సరమున క్రొంగొత్త రుచులతో

వండినా ముగాది పచ్చడిదిగొ!

 

మెలగుచు స్నేహభావమున మెండుగ నొక్కరితో మరొక్కరున్

తెలుగు సహోదరుల్ పరమదివ్యముగా సహకారమందుచున్,

వెలసెడి రెండు రాష్ట్రముల వేగముగా నభివృద్ధి జెందినన్

తెలుగిక రెండు భాగముల తేజమునన్ ద్విగుణీకృతంబగున్!

నిండుకుండ లట్లు రెండు రాష్ట్రాలలో

పూర్తిగ నదులెల్ల పొంగి, పొరలి –

దండిగా ప్రజలకు దాహార్తి తీర్చుచున్,

పంటభూములకును ప్రాణమిడుత!

 

యాదగిరి నారసింహుని యమిత భక్తి

నరిగి, మ్రొక్కులనిడుత సీమాంధ్ర జనులు;

సింహగిరి నారసింహుని చేరి, ఇంక

మ్రొక్కులిడుత తెలంగాణ భూమి ప్రజలు!

 

జయాఖ్య వర్షమ! కను డుత్సహించి

రెండు కోకిలల్ కూసె నీ పండుగ కిక!

ఈవు తెలగాణ‘, ‘సీమాంధ్రఇరు గృహాల

తిని ఉగాది పచ్చడి‘, నిడు దీవెనలను!

          — &&& —

 jaya ugadi

ఉమ్మడి రాష్ట్రంలో … చివరి ‘ఉగాది వేడుకల’లో …

UGADI

             ఉమ్మడి రాష్ట్రంలో… రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే చివరి ‘ఉగాది వేడుకల’లో భాగంగా, రేపు ‘రవీంద్ర భారతి’లో ఏర్పాటు చేయబడిన ‘ఉగాది కవి సమ్మేళనం’లో పాల్గొనవలసిందిగా నాకు ఆహ్వానం అందింది.

             “వెలసెడి రెండు రాష్ట్రములు వేగముగా అభివృద్ధి చెందగాన్” అంటూ… రెండు ప్రాంతాల ప్రజలకు శుభాభినందనలను తెలియజేస్తూ కవితను వినిపించాలని అనుకొంటున్నాను.

             ఈ కార్యక్రమాన్ని టీ.వీ. చానళ్ళలో లైవ్ కవరేజ్ చేయవచ్చు. ఆసక్తి గలవారు చూడవచ్చు!

           –  డా. ఆచార్య ఫణీంద్ర

“చేతన” మాస పత్రిక – ఏప్రిల్ 2014 సంచికలో …

రాష్ట్రవిభజన బిల్లు పాసైన తరువాత నేను రచించిన “తెలుగు భాష వారధులం” అన్న కవిత “చేతన” మాస పత్రిక – ఏప్రిల్ 2014 సంచికలో ప్రచురితమయింది. ఈ కవిత ‘ఫేస్ బుక్’ లో కూడ బాగా ప్రజాదరణను పొందింది. రెండు ప్రాంతాల ప్రజల ఆమోదాన్ని పొందిన ఆ కవిత ముద్రిత ప్రతిని వీక్షించగలరు.

– డా. ఆచార్య ఫణీంద్ర 

 

ch2

ch1

‘స్నేహ సంస్కృతి’

irani chai

’రాస్తా’ లన్నిట ప్రక్కలన్ వెలయు ’యీరానీ కెఫే’ లందునన్
’మస్తుం’డున్ గద ’రద్ది’! ఐన నట, ’ఛాయ్’మాధుర్యమున్ గ్రోలరే –
దోస్తుల్ పల్వుర గూడి రోజు, యువకుల్ ’దోతీను బా’రేగుచున్!
ఆస్తుల్ గాంచగ స్నేహ సంస్కృతి కవేగా ’హైదరాబాదు’లో!

 (రచన : ‘పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర )

నేటి సంగీత సాహిత్యాలపై వ్యంగ్య బాణం!!!

మా ‘Rock Star’ (చి. రోహిత్) ఆశువుగా అందించిన Comedy Music ను వినండి. అందులోని వ్యంగ్య కోణాన్ని దర్శించి ఆనందించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

http://www.youtube.com/watch?v=1TBb8lS8p4Q

జోహారులు యేసుదాసు గారు!

ఈ హోళీ పర్వదినాన ఈ శ్రీకృష్ణ భక్తిగాన రసామృత డోలలో ఊగి తేలండి. సంగీతానికి భాషతో పనేముంది? పాట పతాక స్థాయిలో యేసుదాసు “కన్నా!” అని పిలుస్తుంటే శ్రీకృష్ణుడు పరిగెత్తుకుంటూ వస్తాడేమో… అనిపించకపోదు! జోహారులు యేసుదాసు గారు!  

http://www.youtube.com/watch?v=DngurpPulvM&list=RDq7pyo6SuFhk

డా. ఆచార్య ఫణీంద్ర 

Happy Holi

“గ్రంథావలోకనం”

                       ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ తెలుగు శాఖాధిపతి, సుప్రసిద్ధ విమర్శకులు ఆచార్య ఎస్.వి.రామారావు గారు వివిధ గ్రంథాలకు తను రచించిన పీఠికలను,సమీక్షలను సంకలనం చేసి ఇటీవల “గ్రంథావలోకనం” పేరీట ఒక గ్రంథంగా వెలువరించారు. అందులో గతంలో నా “ముద్దుగుమ్మ” కావ్యానికి ఆయన రచించిన పీఠిక కూడా చోటు చేసుకొంది. ఆ పునర్ముద్రిత పీఠికను పాఠకుల కోసం ఇక్కడ ప్రచురిస్తునాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

svr

svr1

svr2

Previous Older Entries