మృత్యువుకు ఉరిశిక్ష వేస్తా!

మృత్యువుకు ఉరిశిక్ష వేస్తా!

 

 

 

 

 

చిన్నప్పటి నుండి
నన్ను నవ్విస్తున్న ‘బుడుగు‘
కంటికి మంటికి ఏకధారగా
ఏడుస్తున్నాడేమిటి?
కళ్ళతో చిలిపిగా మాట్లాడే
బాపు బొమ్మలు
మౌనంగా రోదిస్తున్నాయెందుకు?
అయ్యయ్యో!
వెండి తెరకు చెందిన
రెండు కళ్ళలో ఒకటి చితికిపోయిందే!
అరెరే! కలం విరిగిపోయిందని
కుంచె కుమిలిపోతుందే!
రవి నుండి రశ్మి రాలిపోయిందే!
శశి నుండి జ్యోత్స్న కూలిపోయిందే!
ఏమిటీ దారుణం –
పెనవేసుకొన్న గీతల, రాతల
చేతులను విడదీసింది ఎవరు?
స్నేహానికి పాఠాలు నేర్పిన
చిరకాల మిత్రులను
భూమీ, ఆకాశంలా వేరు చేసిన
నిర్దాక్షిణ్యులు ఎవరు?
‘రమణ‘ నీలి మేఘాలలో కలసి పోతే –
‘బాపు‘ నేలపై మోడు వారిన చెట్టులా మిగిలాడే!
‘బాపు‘ నుండి ‘రమణ‘ను
దూరం చేసిన
కఠినాత్ములు ఎవరు?
అయ్యో!
నా గుండెలు మండిపోతున్నాయి –
‘మడిసికీ, గొడ్డుకూ తేడా తెలియని‘
మృత్యువు ఎంత పని చేసింది?
నాకే గాని, అధికారముంటే …
మృత్యువుకు ఉరిశిక్ష వేస్తా!

 

 

 

 

 

 

 

( పరమపదించిన ప్రముఖ రచయిత ‘ముళ్ళపూడి వెంకట రమణ‘ గారికి బాష్పాంజలితో …)

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

సిగ్గు .. సిగ్గు …!

సిగ్గు .. సిగ్గు …!

ఒక సుప్రీం కోర్ట్ పూర్వ న్యాయమూర్తి నేతృత్వంలో ఏర్పడిన ఒక కమిటీ ఇచ్చిన రిపోర్టులోని అసంగతమైన, అసత్యాలైన విషయాలను చూచి కలత చెంది, ఒక హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలను చదివాక – ఇలాంటి వ్యవస్థలో జీవిస్తున్నందుకు సిగ్గుతో తలదించుకొంటున్నాను.

[ “సాక్షి” ( 18-02-2011 ) దినపత్రికకు కృతజ్ఞతలతో … ]

– డా. ఆచార్య ఫణీంద్ర


’సాక్షి’లో…

14 ఫిబ్రవరి 2011 నాటి ’సాక్షి’ దినపత్రిక మెయిన్ ఎడిషన్ ’సాహిత్యం’ పేజీలో నా ’వాక్యం రసాత్మకం’ ఆంగ్లానువాద గ్రంథం – ‘SINGLE SENTENCE DELIGHTS’ చిరు సమీక్ష ప్రచురించబడింది. మిత్రుల పఠనార్థం ఇక్కడ ప్రచురిస్తున్నాను.

– డా.ఆచార్య ఫణీంద్ర

గడ్డి పూవు

గడ్డి పూవు

రచన: ‘పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

నేనొక గడ్డి పూవు – మరి నీవొక సాగెడి బాటసారి – నీ
ధ్యానము వింత వింతలయి, దర్శన భోగ్యములౌ స్థలంబులున్;
చానల సోయగమ్ములును; సంపెగ, జాజులు, మల్లె తోటలం
దానునులే! గరీబునిక – ఆదర మెట్టుల యబ్బు నా కిలన్?

నీరదమే, ధరిత్రిపయి నిక్కియు నిల్చిన పర్వతంబుతో

తా రమియింపగా, కురియు ధారలు గట్టిన వీర్యవర్షమే

పారుచు నొక్కమూల నెదొ పాపమెరుంగని నేల గుంతలో

జారగ, రూపు దిద్దుకొని జన్మమునొందు ననాధనే సుమా!

 

పూజలు సేయగా; సొగసు పొల్తుకలే సిగలోన దాల్చగా;
రాజుల గౌరవింప, మెడ రాజిల వేసెడి మాల గూర్చగా;
మోజుల యందు దంపతులు మున్గెడి శయ్య నలంకరింపగా –
ఏ జనమైన మెచ్చెదరె ఈ ముదనష్టపు గడ్డి పూవులన్?

త్రొక్కుచు పోవునొక్కడు; సుదూర ప్రయాణము సేయు బండికిన్
ప్రక్కల గల్గు చక్రములు పైబడి సాగగ నడ్పు నొక్కడున్;
క్రక్కి విషంబు నొక్కడయొ! గ్రక్కున నేలను పీకివేయు – నే
వెక్కియు వెక్కి యేడ్చెదను – విన్నటువంటి మహాత్ముడెవ్వడే?

పుట్టెద నెందుకో యను నపోహయె గల్గును మానసంబునన్ –
పట్టదు నాదు జీవితము, భాగ్యము నేరికి లోకమందునన్!
పుట్టెడు సౌరభమ్ములను, పుష్ప మరందము లీయలేను – నే
కట్టలు త్రెంచుకొన్న గతి కార్చెద కన్నుల నీరు మాత్రమే!

పూవులందు ’దళిత’ పూవునై నిలుతును –
అగ్ర వర్ణ పుష్ప మందునట్టి
గౌరవమ్ము నేను కాసింత నోచనా?
అణచివేత నాకు నబ్బె గాదె!

’సమ సమాజ’మని ప్రసంగించు మానవా!
సుమ సమాజము నటు చూడలేవె?
సుమ సమాజమందు చూపించి కరుణనే
సమ సమాజ దృష్టి సాగనిమ్ము!

=== *** ===

సూర్య ప్రశస్తి

సూర్య ప్రశస్తి

రచన : ” పద్య కళా ప్రవీణ ” డా || ఆచార్య ఫణీంద్ర

గ్రహ మండల మధ్యంబున
దహియించుచు నిన్ను నీవు త్యాగ నిరతితో
మహికి వెలుంగుల నిత్తువు _
ఇహ పరముల నీకు సాటి ఎవరాదిత్యా ?

నీ తేజస్సును, నీ మహస్సు, సతమున్ నీ లోక సంచారమున్,
నీ తీవ్ర భ్రమణంబు చిమ్మ దిశలన్ నీ కాంతి పుంజమ్ములన్,
చేతోమోదముతో సదా పరులకై చేపట్టు నీ త్యాగమున్,
ఏ తీరీ ధరణిన్ కవీంద్రులకు వర్ణింపంగ శక్యంబగున్ ?

నీ రాకతో గల్గు పవలు, కలిగించు నీ పోక రేయి _
ఊరువుల్ లే
ని సారథియె త్రోల, నీ వూరేగ దినము,
వారమ్ము, పక్షమ్ము, మాసములు గల్గు _ వత్సరంబులగు _
ధారుణీ ప్రజలకున్ నీదు ధృతితో శతాబ్దులే కల్గు _
( ఛందస్సు : మధ్యాక్కర )

” నీవె యున్న వెలుగు _ నీ లేమి చీకటౌ ”
అనుచు పొగడ నెవరినైన కవులు;
అదియె అక్షరాల అతిశయోక్తియె గాని,
నీ యెడ అది సతము నిజము సుమ్ము !

సూర్య నమస్కారమ్ముల
ఆర్యు లుదయ మాచరించి _ ఆరోగ్య, మనో
ధైర్యమ్ముల బడసిరి _ ఘన
కార్యమ్ముల సలుప గల్గ, కడు దక్షులుగన్ !

ఆధునిక కాలమందు నిత్యావసరము
విద్యుదుత్పత్తి తగినంత విస్తరిలక _
సౌర శక్తియె మరల మా సాధనమయె !
మిత్ర ! నిజముగా మా జగన్మిత్రు డీవు !

కృష్ణ భగవాను, బుద్ధుని, క్రీస్తు దేవు
నేరుగా చూచినట్టి వారేరి నేడు ?
నరుల కానాటి నుండి ఈనాటి వరకు
తరతరాలుగా ప్రత్యక్ష దైవ మీవు !

(అందరికీ “రథ సప్తమి” శుభాకాంక్షలతో…)

—-***—-