సస్యశ్యామల తెలంగాణ

అంజనేయ దండకం

ఈ రోజు హనుమజ్జయంతి.
30 ఏళ్ళ క్రితం ఆ అంజనేయ స్వామిపై
నేను రచించిన దండకం ఇది.
మళ్ళీ మననం చేసుకొన్నాను. మీరూ స్తుతించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

శ్రీ ఆంజనేయా! మహా దివ్య కాయా! మహేశాంశ భూషా! విశేషాద్రి వాసా! దివారత్న శిష్యా! శుభాభీష్ట భాష్యా! విశాలాగ్ని నేత్రా! మహా వాయు పుత్రా! చిరంజీవి! సంజీవినీ శైల ధారీ! మహా వీర! దైత్యాగ్రణీ సైన్య సంహారి! లంకా పురారీ! గదా దండ ధారీ! మహా సాధ్వి సీతాంబ శోకాంబుధీ నాశకారీ! మనంబందు నీ యందు భక్తి ప్రపత్తుల్ సదా కల్గి నేనుందు – హన్మంత! భాస్వంత! శ్రీమంత! ధీమంత! నా చింతలన్ బాపి, నా కోర్కులన్ దీర్చి, యానందమున్ గూర్చి రక్షింపరా! మారుతీ నామ ధన్యా! హరే రామ భక్తాగ్ర గణ్యా! సదా రామ నామోక్త పుణ్యా! నమస్తే! నమస్తే! నమస్తే! నమః!

ప్రథమ గురువు

  • ప్రథమ గురువు

రచన : డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~~~~~~~~~~~~

ఆత్మకు రూపాన్ని అందించి
అనంత లోకాల నుండి అవని పైకి
దిగుమతి చేసే దేవత – అమ్మ!
నెల తప్పిన నాటి నుండి
నిలువెల్లా మురిసిపోతూ –
కడుపులో కదలికలు మెదలుతుంటే
కలలలో తేలిపోతూ –
కూర్చున్నా, లేస్తున్నా, నడుస్తున్నా,
ఆపసోపాలు పడుతూనే
ఆనందంలో మునుగాడుతూ –
జవ సత్త్వాలు ఉడుగుతున్నా
నవ మాసాలు మోసి,
నిండు గర్భిణిగా నొప్పులన్నీ భరించి,
ప్రసవించి, ప్రభవింపజేస్తుంది
పండంటి పసికందును!
పడతి నుండి పరిణామం చెందుతుంది
ప్రపంచంలో మాతృమూర్తిగా !!
కనుల ముందు నిజమైన
తన కలను చూచి
కష్టాన్నంత క్షణంలో మరిచిపోయే
కమనీయ హృదయ – అమ్మ!
చనుబాలే అమృతంగా పంచి,
తన ఒడినే ఊయలగా మలచి,
జోలపాటతో యోగ నిద్రలోకి
ప్రయాణింపజేసే ప్రథమ గురువు – అమ్మ!
అమ్మ అడుగులు వేయిస్తుంది
అమ్మ నుడుగులు నేర్పిస్తుంది
అమ్మ ఆకలి తీరుస్తుంది
అమ్మ లోకం చూపిస్తుంది
అమలినమైన అనురాగానికి
ఆకృతి దిద్దితే – అది అమ్మ!
ఆమెకు సరితూగడు తానైనా
ఆ సృష్టికర్త బ్రహ్మ!!#

(మాతృ దినోత్సవ శుభాకాంక్షలతో …)

దీర్ఘ వాసర నిశల్

లాక్ డౌన్ కారణంగా పగళ్ళు, రాత్రులు సాగదీతగా సాగుతుంటే .. నాకు నన్నయ భారతంలోని “దీర్ఘ వాసర నిశల్” గుర్తుకు వచ్చింది. కాకపోతే, నావి ఏమీ తోచక “దీర్ఘ వాసర నిశల్” అయితే .. అక్కడ ఆ పద్యంలో మాత్రం – విప్రలంభ శృంగార “దీర్ఘ వాసర నిశల్”.
అది గుర్తుకు రాగానే … పదేళ్ళ క్రితం “సాహితీ కౌముది” పత్రిక కోసం “హృద్య పద్యం” శీర్షికన నేను కవిత్రయ మహాభారతం లోని ఆణిముత్యాల వంటి పద్యాలకు వ్రాసిన వ్యాఖ్యానాలలోని ఆ పద్య వ్యాఖ్యానం తీసి చదువుకొన్నాను. మీరూ ఆస్వాదించండి.

~~~~~~~~~~~~~~~~~~~~~~~
నల దమయంతు లిద్దరు మనః ప్రభవానల బాధ్యమానులై
సలిపిరి దీర్ఘ వాసర నిశల్ విలసన్నవ నందనంబులన్
నలిన దళంబులన్, మృదు మృణాళములన్, ఘన సార పాంసులం
దలిరుల శయ్యలన్ సలిల ధారల, జందన చారు చర్చలన్!
~~~~~~~~~~~~~~~~~~~~~~~
నన్నయ భట్టారక విరచితమైన ఆంధ్ర మహా భారతంలోని ఆరణ్య పర్వంలో, ద్వితీయాశ్వాసంలోని హృద్య పద్యం ఇది. అరణ్య వాసంలో ధర్మరాజుకు బృహదశ్వ మహర్షి చెప్పిన నల దమయంతుల ఉపాఖ్యానంలోని ఈ పద్యం బహుళ ప్రసిద్ధం. నల దమయంతుల నడుమ హంస రాయబారం నడిచాక, ఒకరి పట్ల ఒకరికి ఏర్పడిన ప్రణయ భావనతో అంకురించిన విరహ వేదనను వర్ణించే పద్యంగా నన్నయ దీనిని వినూత్నంగా తీర్చి దిద్దాడు.
నల దమయంతు లిద్దరు విరహం వలన మనః ప్రభవానలం (మన్మథ తాపం) తో బాధపడుతూ, ఆ తాపాన్ని చల్లార్చుకోడానికి ప్రకాశవంతమైన నందన వనాల వంటి కొత్త పూదోటలలో – తామర పూల రేకులలో మృదువైన తామర తూండ్లలోని కర్పూర పరాగంతో, మంచి గంధపు మైపూతలతో, పన్నీటి జల్లులతో చిగురుటాకుల శయ్యలపై దీర్ఘమైన పగళ్ళను, రాత్రులను గడిపారని ఈ పద్య సారాంశం. విప్రలంభ శృంగారానికి తార్కాణం ఈ పద్యం.
“దీర్ఘ వాసర నిశల్” అనడంలో – విరహ వేదనలో పగళ్ళు, రాత్రులు ఎంతకూ ఎడతెగక సాగదీసినట్లుగా సాగుతున్నాయని ధ్వని. అంతే కాకుండా దీర్ఘమైన పగళ్ళు అంటే గ్రీష్మ ఋతు కాలాన్ని, దీర్ఘ రాత్రులు అంటే హేమంత ఋతు కాలాన్ని స్ఫురింప జేయడం మరొక ధ్వని. మొత్తానికి వివిధ ఋతువులలో విరహంతో దీర్ఘ కాలం వేదనను అనుభవించారని భావం.
నన్నయ భట్టు రచించిన ఈ పద్యం తరువాతి కాలంలో ప్రబంధ కవులకు స్ఫూర్తి నిచ్చి ఉంటుంది – అనడంలో అతిశయోక్తి లేదు.
ఆధునిక కాలంలో ఈ పద్యం మరింత ప్రసిద్ధి చెందడానికి, గురజాడ అప్పారావు గారి ‘కన్యాశుల్కం’ నాటకంలో ఈ పద్య ప్రస్తావన ఉండడం ఒక కారణంగా చెప్పవచ్చు. సెలవుల్లో ఇంటికి వచ్చిన విద్యార్థి వెంకటేశంతో మేనమామ కరటక శాస్త్రి ఒక పద్యం చెప్పు మన్నప్పుడు, వాడు ఈ పద్యాన్ని అప్పజెప్పుతాడు. అప్పుడు కరటక శాస్త్రి “మనః ప్రభవానలం” అంటే అర్థం చెప్పుమని అడుగుతాడు. నీళ్ళు నములుతున్న వెంకటేశంను చూసి, వాని పాలి గురువు గిరీశం “ఈ ఇంగ్లీషు చదువులలో అంత పెద్ద సమాసాలకు అర్థం చెప్ప” రని చక్రం అడ్డు వేస్తాడు. “పద్యాలకు అర్థం చెప్పరూ .. ?” అంటూ వెంకటేశం తండ్రి అగ్నిహోత్రావధాన్లు ఆశ్చర్యపోతాడు. ఆ విధంగా నల దమయంతుల ‘మనఃప్రభవానలం’ ఆధునిక కాలంలో హాస్యానికి కూడ బాటలు వేసింది.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~

ఇతరుల దుఃఖము …

మహాత్మ గాంధీ మనసుకు నచ్చిన, “నరసింహ మెహతా” అనే గుజరాతీ కవి రచన – “వైష్ణవ జనతో తేనే కహియెజు …” అన్న ప్రసిద్ధ కీర్తనకు నా అనుసృజన “మంజరీ ద్విపద” ఛందంలో … (చిత్రమేమిటంటే .. దీనిని మూల గీతం ట్యూనులోనే పాడుకోవచ్చు.)

ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు –
వాడె గదా భువి – వైష్ణవుడనగ!

ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు –
ఎరిగి, సహాయము నెవ్వడు సేయు –
చిత్త మహంకృతి చేరగనీడు –
వాడె గదా భువి – వైష్ణవుడనగ!

ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు –
వాడె గదా భువి – వైష్ణవుడనగ!

సకల లోకుల గను సాదరంబుగను –
పరులను నిందల పాల్జేయకుండు –
బుద్ధి వాక్కర్మల శుద్ధిగ నుంచు –
తత్పురుషుని గను తల్లి ధన్యయగు!

ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు –
వాడె గదా భువి – వైష్ణవుడనగ!

సమదృష్టి గలుగు – తృష్ణల త్యజియించు –
పర కాంతలను మాత పగిదిగ జూచు –
జిహ్వ యసత్యము చెప్ప దెప్పుడును –
అన్యుల ధనముల నంట డెప్పుడును –

ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు –
వాడె గదా భువి – వైష్ణవుడనగ!

కామ మోహ క్రోధ కపట లోభముల
మునుగకుండ మదిని ముక్తిని గోరు –
రామ నామమును నిరతము ధ్యానించు –
తనువున పుణ్య తీర్థముల ధరించు –

ఇతరుల దుఃఖము నెవ్వ డెరుంగు –
వాడె గదా భువి – వైష్ణవుడనగ! #

శాంత సమరం

శాంత సమరం
~~~~~~~~~~~~~~~~~~~~
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~~~~~~~~~~~~~
ఎవ్వడు ఎవ్వడి మీద దాడి చేయాలని
ఏం ఎత్తులు వేసాడో గానీ ..
ఇప్పుడు ప్రపంచమంతా
మూడవ ప్రపంచ యుద్ధమే జరుగుతున్నది.
అస్త్రాల హోరు వినిపించదు –
హాహాకారాలు తప్ప!
శత్రువు కనిపించడు –
మరణ శాసనం తప్ప!
దగ్గితే దారుణం జరిగిపోతున్నది
తుమ్మితే తుఫాను బీభత్సం చెలరేగుతున్నది
పట్టుమని పది రోజుల్లో అంతా
పిట్టల్లా రాలిపోతున్నారు.
ఇప్పుడిక అందరూ
యుద్ధానికి సిద్ధం కండి!
కలసికట్టుగా కాదు –
విడివిడిగా పోరాడడమే ఈ యుద్ధ నీతి!
అందరూ కదలి రాకండి –
ఇళ్ళల్లో కూర్చోవడమే ఈ యుద్ధ రీతి!
కాళ్ళూ చేతులు కడుక్కొని
పోరాటాన్ని ప్రారంభిద్దాం.
అవసరమైతే మళ్ళీ మళ్ళీ కడుక్కొందాం.
కత్తి తిప్పనవసరం లేదు.
గన్నులు పేల్చనక్కర లేదు.
ఎవరింట్లో వాళ్ళు
విశ్రాంతి తీసుకోవడమే!
ఈ మౌన పోరాటమే
మనకు విజయాన్ని సిద్ధింపజేస్తుంది.
ఈ శాంత సమరమే
ఇలపై శాంతిని నెలకొల్పుతుంది.
వీధులన్నిటా వికటాట్టహాసం చేస్తూ
విచ్చలవిడిగా తిరుగుతున్న శత్రువు
ఈ భయంకర శూన్యానికి
పిచ్చెత్తి పోవాలి.
ఈ భరించలేని మౌనానికి
బిక్కచచ్చి చావాలి.
మూడు వారాలు చాలు …
అవసరమైతే మరొక్క వారం!
శత్రువు పలాయనం చిత్తగించక తప్పదు!!
విడివిడిగా విజయాన్ని సాధించి
కలసికట్టుగా ఆనందిద్దాం! *

“శార్వరీ”!

“శార్వరీ”! (ఉగాది కవిత)

రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”

డా. ఆచార్య ఫణీంద్ర

~~~~~~~~~~~~~~~~

మావి చిగురు వౌచు, మధుమాస మీవౌచు,

కోయిలమ్మ తీపి కూత వౌచు,

కొలది కొలది మదిని క్రొత్త ఆశలు రేపు

నవ యుగాది! వేగ నడచి రావె!

 

కార, ముప్పు, వగరు, కడు చేదు, పులుపునున్,

తీపి యనెడి రుచుల తీర్చి యొకట –

బ్రదుకులోని వివిధ వర్ణాల నుపమింప,

వండితిని ‘ఉగాది పచ్చ’ డిదిగొ!

 

నిర్భయముగ నడి రాతిరి

అర్భకురాండ్రైన వీధి నరిగెడు ఘన సం

దర్భము లికపై నిలుపుము –

దుర్భాగ్య “దిశ ఘటన” లిక దొరలనియటులన్!!

 

చేతులన్ కలుపుట, చెంపలానించుట

ఆధునికత యనునట్టి వారు –

కౌగిలించుకొనుచు, కడు చేరువగ నుంచు

అతి ప్రేమ నటియించునట్టి వారు –

ఆకు కూరలు, ఫలాహారాల వలదని

బర్గర్లు, పిజ్జాల వలచు వారు –

అన్నమ్ము, రొట్టె, శాకాహార మేలని

మాంసమ్ము, బిర్యాని మరుగు వారు –

 

మాని హోటళ్ళు, సినిమాలు, మాల్సు, పబ్సు,

ఇంట నుండి, శాకాహార మింత దినుచు,

తప్పక బయటి కేగ, ఇతరుల కిపుడు

దూరముగ నిలిచి యొనరింతురు “నమస్తె”!

 

“శార్వరి” నామ సుందర ప్రసన్న నవీన సువత్సరాంగనా!

ఉర్విని నీదు రాక – ఒక ఉజ్జ్వల పూర్ణిమ రాత్రి జ్యోత్స్నయై –

సర్వ భువిన్ భయంపు తమసంబున నిల్పు “కరోన” వ్యాధికిన్

గర్వము భంగమున్ సలిపి కావుము, బ్రోవుము మానవాళినిన్!

 

కళకళ లాడగ పొలములు,

గలగలమని పొంగి పొరలి కాళేశ్వర స

జ్జలములె అభిషేకింపగ –

తెలగాణకు వెలుగు నిమ్ము తెలుగు యుగాదీ!

 

ఎప్పుడు మన ప్రజలందరు

గొప్పగ జీవితము గడుపు కొలువుల నిడుచున్,

ముప్పులవి ఎన్ని వచ్చిన –

చప్పున తొలగించుము నవ సంవత్సరమా! #

Previous Older Entries