“ఆత్మార్పణము”

‘రంజని తెలుగు సాహితీ సమితి, హైదరబాదు’ వారు, ‘ఆంధ్రప్రభ’ దిన పత్రిక సౌజన్యంతో నిర్వహించిన

2010 రంజని – విశ్వనాథ పద్య కవితా పోటీలలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత :

“ఆత్మార్పణము”

( తెలంగాణ ఉద్యమంకై ఆత్మార్పణ చేసుకొన్న విద్యార్థి కన్న తల్లి ఆత్మ ఘోష – )

రచన : ’పద్య కళా ప్రవీణ’ డా|| ఆచార్య ఫణీంద్ర

చిన్ని చురుకంట ” అమ్మా ! “
యన్నదె నా కెరుక గాని – అయ్యయ్యో ! నా
కన్నా! ఎటు లోర్చితివో –
నిన్నే నీవిటు దహించి నివురై పోవన్ ? 

ఎన్ని క్షేత్రాల తిరిగితి నిన్ను కనగ –
ఎన్ని దేవుళ్ళ మ్రొక్కితి నిన్ను కోరి –
అన్ని ఫలియింప, కలిగితివంచు మురిసి –
నిన్ను పెంచుకొంటిని గదా చిన్ని నాన్న !

అన్నదెల్ల ఇచ్చి అల్లారుముద్దుగా
నిన్ను చూచుకొనెను నీదు తండ్రి !
ఎన్ని కలల మేడ లెక్కి కూర్చుండెనో –
వినియు నీ మృతి, నిలువెల్ల కూలె !

చిన్నతనాన నాన్న నిను చెప్పిన పాఠము ప్రశ్న లేయగా –
దున్నినటున్ జవాబులను తొందర తొందర నీవు చెప్పగా –
” విన్నవటే ! కుమారుని ప్రవీణత – వీడు కలెక్టరౌ ” నటం
చన్నటువంటి మాట – తనయా ! చెవులందున మారుమ్రోగురా !

పెరిగి నీవు విశ్వవిద్యాలయమ్ములో
సీటు పొంది, పట్న సీమ కేగ –
చెప్పుకొంటిమెంతొ గొప్పగా  – ” మా వాడు
పట్నమందు చదువువాడ ” టంచు !

ఏటికి పంపినామొ గద ! ఏ గడియన్ చదువంగ పట్నమం –
దేటిని ముంచినామొ; మరి ఏ దవ కీలల దించినామొ; ఆ
పూట గ్రహించలేక చెడిపోతిమిరా ! ఎరుకాయె నిప్పుడే –
కాటికి పంపినామనుచు కన్న కుమారుని దారుణమ్ముగాన్ !

నీ గూర్చి నీవు తలపవు –
నా గూర్చియు తలపబోవు – నాన్నను గూడన్
నీ గుండియలో తలపవు –
పోగాలం బెట్లు వచ్చి పోతివి తండ్రీ !

చదివిన లాభమేమొ, మరి చక్కగ పట్టము పొందు పిమ్మటన్
పదవిని భావి పొందగల భాగ్యము కల్గునొ, లేదొ గాని – నీ
హృదినిటు రాజకీయముల నేటికి నింపితి చిన్ని నాయనా !
వదలక ఎంత పోరినను వచ్చున ? చచ్చున ? రాష్ట్ర మక్కటా !

ఎందరొ కొల్వు లేక – మరి ఎందరొ కూడును, గుడ్డ లేక – ఇం
కెందరొ గూడు లేక – పడి రీ తెలగాణమునందు బాధటం
చందరి కోసమై మదిని అంతగ వేదన చెందినావు ! ఆ
అందరి తోడు – నాన్నయును, అమ్మను గూరిచి తల్చకుంటివో ?

నీవు చచ్చి ఇట్లు నిరసన తెల్పినన్ –
కఠిన హృదులు కాంచి కరుగ గలర ?
రాజకీయమాడు రాజకీయులు గాని –
రాష్ట్ర సాధనమ్ము వ్రాసి ఇడున ?

ఆ కిరోసి నెత్తినప్పుడైనను గాని –
అగ్గి పుల్ల గీచినపుడు గాని –
రెప్ప పాటు నీవు రెండవ యోచన
చేయకుంటి వేల ? చిట్టి తండ్రి !

రాదో – వచ్చునొ – ఇంకిటు
మీద తెలంగాణ మద్ది మే మెరుగమయా !
“రాదిక నీతో బ్రతు” కను
వేదన మా గుండె జీల్చు వే వ్రక్కలుగా !

— *** —పుట్టుమయ్య గాంధి ! పుడమి నింకొకమారు !

పుట్టుమయ్య గాంధి! పుడమి నింకొకమారు!

రచన : ‘పద్య కళాప్రవీణ’ డా.ఆచార్య ఫణీంద్ర

బుద్ధుడు పుట్టినాడొ ! మరి పుట్టెనొ క్రీస్తుయె ! శాంతి బోధనా
బద్ధుడునై మరొక్కపరి భారత భూమిని నీదు రూపులో !
ఉద్ధతి కోరి పీడితుల, కుర్విని శాంతియె ఆయుధంబుగా
యుద్ధము సేయ నేర్పితివి – ఓ కరుణాబ్ధి ! మహాత్మ గాంధిజీ !

సత్య, మహింస, శాంతి – భువి స్థాపన జేయగ నుద్భవించి, స
త్కృత్యములాచరించుచును; కీర్తన సల్పుచు ‘నీశ్వ, రల్లలన్’;
నిత్యము బోధ గూర్చితివి – నిర్మల జీవన మార్గమేదొ ! ఔ
న్నత్యమునెంచి మ్రొక్కెద ననారతమున్ నిను – ఓయి బాపుజీ !

వశమయి ఆంగ్ల నేతలకు భారత మాతయె బానిసాయె – ఏ
దిశయును, మార్గమేదియును దేశ జనావళి కానదాయె – ఆ
దశ నరుదెంచి చూపితివి దారిని, సల్పుచు శాంతి యుద్ధమున్ –
యశము, స్వరాజ్యమందె భరతావనిలో జనమెల్ల నీ కృషిన్ !

ఋషి జీవనమును గడుపుచు
కృషితో నెలకొలిపి శాంతి, కీర్తి గొను నినున్ –
విషమును గ్రక్కుచు కూల్చెను
విష హృదయుం డొక్కడు, మీరు విద్వేషముతో !

హింస పెచ్చు మీరె – హెచ్చాయె స్వార్థమ్ము –
ధర్మ మంతరించె ధరణి నిపుడు !
పుట్టుమయ్య గాంధి ! పుడమి నింకొకమారు –
శాంతి, సత్య మవని సంతరింప !

[ విశ్వమందున్న అహింసా ప్రేమికులందరికీ ‘గాంధీ జయంతి’ శుభాభినందనలు !
– డా.ఆచార్య ఫణీంద్ర ]