కవితను నేను …

అందరికీ “ప్రపంచ కవితా దినోత్సవ” శుభాభినందనలతో …

రచన : డా. ఆచార్య ఫణీంద్ర

కవితను నేను! పుట్టి కవిగారి మనంబను నీలి నింగిలో
ప్రవిమల శంప వోలె నవ భావనగా తొలుదొల్త – పిమ్మటన్,
వివిధములౌ యలంకృతుల వేషము, భాషయు దీర్చ, కావ్య వై
భవముల నొంది, సాగెద సభాజన రంజక శబ్ద గీతినై !

కాంచ మనోజ్ఞ దృశ్యమును కన్నుల పండువుగా కవీంద్రుడే –
కుంచియతోడ రూపు గొని, కుడ్యముపై యలరారు చిత్రమున్
మించిన దృశ్య కావ్యమయి, మేదినిపై విహరింతు స్వేచ్ఛగా –
మంచి రసజ్ఞ పండితుల మాటలలో పలుమార్లు దొర్లగాన్ !

మోదము, శాంతము, ఖేదం
బాదిగ యేదైన సరె ! రసావిష్కరణన్
నాదైన రీతి సలిపెద –
పాదము, పాదమును చదువ స్పందన కలుగన్ !

అన్నము లేక సంఘమున ఆదరమన్నది కాన రాక, సం
పన్నుల ఛీత్కృతుల్ గొనుచు, పస్తులతో బ్రదుకెల్ల నెట్టుచున్,
కన్నుల తేలవేసెడి బికారుల గాంచు కవీంద్రు గుండెలో
మిన్నుల గూలజేసెద, నమేయ విషాద కవిత్వ సింధువై !

“మనుజు లెటు మనవలె – మానవత్వము విరా
జిల్లు నెటుల – మాన్య జీవన గతి
యేదొ -” తెలిపి, సంఘహిత మిడు ‘సూక్తి సు
ధా నిధి’ నయి శాశ్వతముగ నిలుతు !

తొలుత శిలలు, తాళ తరుల
దళములు, నా పైన కాగితాల్, కంప్యుటరుల్
నెలవయె గాని – నిలుతు నే
నలుదెసలన్ జనుల హృదుల, నాల్కల నెపుడున్ !

అక్షర రూపము నందు వి
లక్షణముగ తీర్చి దిద్ది లక్ష్యము తోడన్,
రక్షింప నను సతము – నే
రక్షింతు సమాజ మక్షరంబుగ నిలువన్ ! #