ఏక వాక్య కవితలు (ఇంకొన్ని) …
[లోగడ నేను ప్రచురించిన టపాలలో కవిత్వాంశకు సంబంధించి – చాలా మందికి నచ్చిన, బాగా చర్చనీయాంశమైన, బహుళ ప్రచారం పొందిన టపాలు రెండున్నాయి. అవి – మార్చ్ 2009 లో, జూలై 2009 లో ప్రచురించబడిన నా ’ఏక వాక్య కవితలు’. అవి ఎంతగా ప్రసిద్ధి చెందాయంటే – అవి ప్రచురించబడి దాదాపు మూడేళ్ళవుతున్నా, ఇప్పటికీ వారానికి ఇరవై నుండి ముప్పయ్ మంది సాహిత్యాభిమానులు వాటిని వీక్షిస్తూనే ఉన్నారు. అవి సాహిత్యాభిమానుల హృదయాలకు ఎంతగా హత్తుకోన్నాయంటే – ఇప్పటికీ అడపా దడపా మంచి మంచి వ్యాఖ్యలను చేస్తూనే ఉన్నారు.
ఫణీంద్ర గారు,
ఒక్కోక్క వాక్యం ఒక్కోక్క సంహిత.ఎంతబాగా మాల కట్టారండి.
నమస్సులు.
మీ బ్లాగ్ బాగుంది.
ఏక వాక్య సంయోజనలో కవితావిష్కరణ ప్రయోగం అభినందనీయం.
-డా.తాడేపల్లి పతంజలి
namasthe
vakyam rasatmakam – the coinage is justified in your beautifully short expressions.
Telugu theyyadanam parimalalalo olaladinchina meeku ede na namassumanjali.
meeru vrasina kavitha నీ kosam jeevithakalam nireekshinche preyasi mrutyuvu annaru , a okkapadam tho nenu jeevitamlo marachipolekapotunna nannu prminchina { mosaginchina } naa preyasini marachipoyi jeevitamlo hayiga untunnanu , meeku dhanyvaadalu .
velakakattakattleni vakyala harivillukada idhi
Sri Phaneedra Garu
kasta manasu bagoleka telugu kavitalu clicks chesa, me kavitalu chusakame Eka vakya kavitalu – manasuki manchi kick la panichesayi
Thanks
కలి
—————————————————————–
ఇలాంటి వ్యాఖ్యలు కవిగా నాకు మంచి సంతృప్తిని కలిగిస్తాయి. అలాంటి సాహిత్యాభిమానుల కోసం నా ఏక వాక్య కవితలు ఇంకొన్నింటిని ప్రచురిస్తున్నాను. మనసారా ఆస్వాదించి, ఆశీర్వదించండి.
– డా. ఆచార్య ఫణీంద్ర ]

*కరిగి కురిసే మేఘమైనా , గర్జిస్తే దిక్కులు కంపిస్తాయి.
*కుందింది మనసైతే, బుగ్గా! నువ్వెందుకే కందడం?
*చిరుత ప్రాయం – గాండ్రింపులు మామూలే!
*జీవితం కాలిపోతున్నా జీవితాల్ని వెలిగించు.
*కష్టాల్లో ఆత్మీయుల పలకరింపులు – వేడి వేసవిలో గొంతులో జారే చన్నీటి చుక్కలు.
*ప్రాణం అంటే తీపి – చస్తే చావను!
*వేల మైళ్ళ ప్రయాణమైనా వేసేది ముందు ఒక అడుగే!
*ఒక బుల్లి పెట్టె వల్ల ఇల్లిల్లూ కల్లోలమే!
*గుండెలు ద్రవించాయి – కళ్ళు వర్షించాయి
*వందలాది ‘లబ్ డబ్’ లకు ‘ఛుక్ ఛుక్’ అంటూ శ్రుతి కలుపుతోంది రైలు!
*నింగి పొయ్యిలో నిప్పు రాజేసి భూగోళాన్ని ‘ఫ్రై’ చేస్తున్నాడు సూర్యుడు.
* కాకికేం తెలుసు విగ్రహం వీర శివాజీదని – రెట్ట వేసింది.
*పురిటి నొప్పులు పడుతున్న పూర్ణ గర్భిణిలా నడుస్తోంది బస్సు.
*ప్రొద్దున్నే సూర్యుడేమిటి – చెట్టు చాటు నుండి దొంగ చూపులు?
*అమాయికత్వం కాకపొతే, అశాశ్వత జీవితాలు వెళ్ళబుచ్చడానికి శాశ్వత భవనాలు కట్టుకోవడమేమిటి?
*కాలం కత్తికి రెండు పార్శ్వాలు – గతం, భవిష్యత్తు!
*నిరక్షరాస్యత – పాల బుగ్గపై కన్నీటి చార!
*ప్రపంచాన్ని రెక్కలకు కట్టుకొని గుమ్మంలో వాలే పక్షి – వార్తా పత్రిక!
*భ్రమలో తేలే మనసుకు వాస్తవాలు ములుకుల్లా గుచ్చుతాయి.
*నీ మునివాకిట్లో వేచి వేచి, నీ పిలుపందేసరికి నివురైపోయాను.
* యంత్రం మానవుని మంత్రం -మానవుడు దేవుని యంత్రం!
*కొందరికి తిండి దొరకక హాహాకారాలు – కొందరికి తిన్నదరగక వ్యాయామాలు!
*ఇంధనం లేక వాహనం, ధనం లేక జీవనం – ముందుకు సాగవు!
*చెట్టులా పెరిగి ఏం లాభం? – బుద్ధి చిగురించనప్పుడు!
*బరువంతా గుండెల్లో దాచుకొన్న సంచిని చేతి వేళ్ళకు ఉరేస్తాడు మనిషి.
*మట్టిలోకి తోసేసిన మనిషికే చెట్టై సేవ చేస్తుంది విత్తనం.
*కంటి తడి తెలియని వాడు కవి కాలేడు.
*జీవన వాక్యంలో అనారోగ్యం కామా; మృత్యువు ఫుల్ స్టాప్!
*ఆమెకు, నాకు మధ్య చూపుల తోరణాలు.
*బాల్య చాపల్యం కాకపోతే, భగవంతుడు విశ్వాన్ని బొంగరంలా తిప్పి ఆడుకోవడమేమిటి?
*కరిగిపోయేది కాలం కాదు – నీ ఆయువు!
*నువ్వు తడవకుండా ఉండేందుకు తాను తడిసిపోయే త్యాగి – గొడుగు!
*గుండెదిటువు గలవానికి జీవించడం – ఇరానీ కేఫ్ లో టీ త్రాగినంత సులువు!
*తలబిరుసుతనంతో తరలి వెళుతుంటే, గుడిలో గీతా శ్లోకం కొరడా చరుపై వినిపించింది.
*నిద్రిస్తున్న నగరంలో నడుస్తున్న దివిటీ -గూర్ఖా!
*కన్నీటి కెరటాలలో స్వప్న శకలాలు తేలియాడుతున్నాయి!
*ఎండా వానల స్నేహం ఏడు రంగులతో మెరిసింది!
*తమస్సులో ప్రయాణిస్తున్నాను – ఉషస్సుకై అన్వేషిస్తూ!
*బ్రతుకవచ్చిన కప్ప బావినే మింగితే ఎలా?
* దివి నుండి భువికి దిగివచ్చే దేవత వర్షధార!
*కొండ గుండె పగిలిందేమో – కన్నీరు జలపాతం!
*ఆ వృద్ధ దంపతుల దేహాలు ఇండియాలో – ఆత్మలు అమెరికాలో!
*భావానికి స్నానం చేయించి, పెళ్ళికూతురిలా అలంకరించడమే కవిత్వం!
—***—