“ఏక వాక్య కవితలు ఎలా పుట్టాయి?”

“ఏక్ తార”, “ఏక వాక్యం” – ఫేస్ బుక్ గ్రూపుల ద్వారా ఎందరో యువ కవులు, కవయిత్రులు నేను తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన “ఏక వాక్య కవిత”ల ప్రక్రియలో విస్తృతంగా కృషి చేస్తున్నారు. అసలు “ఈ ఏక వాక్య కవితలు ఎలా పుట్టాయి?” అన్న ప్రశ్నకు సమాధానం చాల ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి ఈ “ఏక వాక్య కవితా ప్రక్రియ” కు నేను రూపకల్పన చేసి కొన్ని వందల ఏక వాక్య కవితలను రచించి, గ్రంథంగా ముద్రిస్తూ ముందుమాటను వ్రాయించుకొందామని ప్రముఖ కవి, విమర్శకులు శ్రీ అద్దేపల్లి రామమోహన రావు గారిని కలిసే వరకు … విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ఆంగ్లంలో “Stray Birds” పేరిట ఇలా ఏక వాక్యాలలో కవితలను వ్రాసారని తెలియదు. అద్దేపల్లి వారు వ్రాసిన ముందుమాట్లో ఈ విషయాన్ని ఉటంకించారు. నిజం చెప్పాలంటే – నేను ఏక వాక్య కవితా ప్రక్రియను సృజించేందుకు ప్రేరణ కలిగించింది “ఆంధ్ర ప్రభ” వార పత్రికలో కార్టూనిస్ట్ “సరసి” గారు గీసిన ఒక కార్టూన్. ఆ విషయాలన్నీ నా గ్రంథంలో వివరంగా తెలియజేసాను. ఆ వివరాలు మరొక్కమారు మీ కోసం …

– డా. ఆచార్య ఫణీంద్ర

eka1eka2eka3

ప్రకటనలు

‘ఏక వాక్య కవితా ప్రక్రియ ‘

ఇటీవల నాకు ఫేస్ బుక్ లో పరిచయమైన ‘పద్మ శ్రీరాం’ గారు నాకు పంపిన లేఖ ఇది. నా ‘ఏక వాక్య కవితా ప్రక్రియ ‘ ఇలా దశ దిశల వ్యాప్తి చెందడం… నాకు చాల ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని కలిగించింది. ‘పద్మ శ్రీరాం’ గారికి, ఈ ప్రక్రియలో ఇంకా విశేష కృషి చేస్తున్న చాల మంది కవులు, కవయిత్రులకు నా శుభాభినందనలు!

– డా. ఆచార్య ఫణీంద్ర

vrssd

“సాహిత్యం వ్రాయగలిగేవారికి నల్లేరు నడక …. చేతకానివారికి పల్లేరు పడక.
కవిత్వం …. నిన్ను నువ్వు ఆవిష్కరించుకోగలిగే ఏకైక ప్రక్రియ.
నీలోని నిన్ను నీకు పరిచయించే ఏకైక ఏకలవ్య విద్య.

కవిత్వం వ్రాయాలని చాలామందికి అనిపించినా ఎలా వ్రాయాలో తెలియక భావ ప్రకటనకు అవసరమైన అనువైన పదాలు దొరక్క చాలామంది ఔత్సాహికులు వెనకడుగు వేస్తున్న సమయంలో కొత్తగా ముఖపుస్తకంలో ప్రవేశించిన నా స్పందనలకు ప్రతి స్పందనలకు చాలామంది ఆకర్షితులై “ మాకు కవిత్వం నేర్పరూ..మీరు ఆఁ అన్నా ఊఁ అన్నా కవిత్వమైపోతుంది” అని ప్రశంసిస్తూండేవారు. పదే పదే అది పునశ్చరణ అవుతూండడంతో అభిరుచి ఉన్న అందరికీ సాహిత్యాన్ని నేర్పించాలనే భావన కలిగింది. నానీలు,నానోలు,హైకూలు,ఫెంటోలు అప్పటికే ప్రాచుర్యంలో ఉండండంతో మణిమాలికలు అనే ద్విపాద కవితల ప్రక్రియ ఆరంభించిన “అట్లూరి ప్రసాద్” గారితో చర్చించడం జరిగింది. ప్రసాద్ జీ అప్పుడు కవితా ప్రక్రియలు గురించి గూగుల్ లో వెతికి ఒక సైట్ అడ్రస్ ఇవ్వడంతో ఆ సైట్ లో శ్రీ ఆచార్య ఫణీంద్రగారి బ్లాగ్ లోవారు పరిచయించిన ఏకవాక్య కవితా విధానాన్ని చూడడం తటస్థించింది. ఏక వాక్యం లో అర్ధవంతమైన అనన్య భావాలు. భావ ప్రకటనలోని క్లుప్తత ,పదాల ఎంపిక, సూటిగా స్పష్టంగా పొసగబడిన అర్ధవంతమైన భావాలతో ఈ అద్భుత మైన ప్రక్రియ నన్నెంతగానో ఆకట్టుకొంది.కానీ భావావేశానికి పరిమితులుండకూడదని గురువుగారి ఆలోచన కూడా అక్కడ ప్రస్ఫుటమౌతూ కనిపించింది. భావాన్ని సైతం తక్కువ అక్షరాల్లో పొసగేలా ఏక వాక్యాలు రూపొందిద్దాం అని అనుకొని 28 అక్షరాలు పరిమితిగా నిర్ణయించుకున్నాక శీర్షిక ఏం పెట్టాలా అని మణిమాలిక సభ్యులందరితో చర్చించడం జరిగింది. ఏక తీగతో అనంత రాగాలాలపించగల “ఏక్ తార” స్ఫూర్తిగా ఏక్ తార అనే శీర్షికతో 5th సెప్టెంబర్ 2012 వ తేదీన ఏకవాక్య కవితల ప్రక్రియకు ఆలవాలమౌ సమూహానికి అంకురార్పణ చేయడం జరిగింది. శరవేగంగా ఎదుగుతున్న గ్రూప్ లోకి 14th నవంబర్ 2012 న వచ్చిన Rvss Srinivas ఆసక్తిని గమనించి నిర్వాహకులు, సహ సభ్యులు తమ తమ వేగాన్ని నియంత్రించుకుని సహాయ సహకారాలందించడంతో అతి త్వరితంగా ఆర్నెల్లు తిరక్కుండానే వేయితారలు వెలిగించగలిగి పుస్తకం ప్రచురించుకున్నారు. ఆ ఘనత సైతం ఏక్ తార ఆవిష్కరణకు స్ఫూర్తి ప్రదాత అయిన డా. శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు పరిచయించిన ప్రక్రియదే అవుతుంది.

ఏక్ తార…. భావాలు మీటే సితార….ఎద ఎదనూ కదిలించే వెన్నెల పద ధార.

తెలుగు సాహిత్యంలో ఒక నూతన ప్రక్రియ ఏకవాక్య కవితా రచన. రవీంద్ర నాథ్ ఠాగూర్ జీ “స్టే బర్డ్స్” తో మొదలై తెలుగులో డా. ఆచార్య ఫణీంద్ర గారు ప్రవేశపెట్టిన ” ఏక వాక్య కవితలు ” . ఆ రసాత్మక వాక్యాలను అర్ధవంతంగా అందించగలిగి మన భావాలలో మనని ప్రతిబింబించగలిగే ఈ ప్రక్రియను మనమూ స్వాగతిద్దాం…. . ఒకే వాక్యంలో అర్ధవంతంగా భావాన్ని వ్యక్తీకరించండి…అక్షర పరిమితి 28…మధ్యలో – తో బ్రేక్ ఇవ్వొచ్చు…

మాకీ ఏకవాక్య కవితా ప్రక్రియకు ఆద్యులై నిలిచి సాహితీ మాతకు ఇతోధిక సేవ చేసుకునే అక్షరభాగ్యాన్ని ప్రసాదించిన గురుతుల్యులు శ్రీ ఆచార్య ఫణీంద్ర గారు సైతం మాకు పరిచయమవడం మా పూర్వజన్మ సుకృతమేనని ఈ సందర్భంగా మనవిస్తూ…. ఈ సందర్భంగా ఒక రెండు ఏక్ తారలు గురువుగారి కలం నుంచి

* అక్షరాల ఇటుకలు అయిదారు చాలు _ భావ సౌధం నిర్మించేందుకు !
* హృదయం విశాలమే _ భావాలే సంకుచితం !”

మహా కవి ‘కాళోజీ’ శతజయంతి సందర్భంగా, నివాళిగా …

kaloji

మహా కవి ‘కాళోజీ’ శతజయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తూ, ఆయన ఆలోచనా విధాన గరిమను తెలియజేసే ఒక సంఘటనను వివరిస్తున్నాను. చదివి ఆనందించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

 

narasimha swami

నిజాం రాష్ట్రంలో కమ్యూనిస్ట్ భావాలతో ఫ్యూడల్ వ్యతిరేక పోరాట కవిగా అప్పుడప్పుడే ప్రసిద్ధిని పొందుతున్న ’ కాళోజి ’ ని, అప్పటి ’ యాదగిరి గుట్ట ’ దేవస్థానం కార్యవర్గం, ఒక కార్యక్రమంలో కావ్యగానం చేయమని ఆహ్వానించింది. ఆ యువకవి అందిందే అవకాశమనుకొని, తన ’ నిజాం వ్యతిరేక పోరాట కవిత్వం ’ వినిపించి, ప్రజలను ఉర్రూతలూగించాడు.

ఆ తరువాత ఒక కమ్యూనిస్ట్ స్నేహితుడు, కాళోజిని ” నువ్వొక అభ్యుదయ కవివైయుండి, దేవస్థానంలో కవిత్వం చదువుతావా ? ” అంటూ నిలదీసాడు. దానికి కాళోజి ” నేను దేవస్థానంలో చదివినా, చదివింది మాత్రం అభ్యుదయ కవిత్వమే ! ” అని చెప్పి, ” పైగా … నాకు నరసింహ స్వామి ఆదర్శం ! ” అన్నాడు. ఆశ్చర్యంగా చూసిన ఆమిత్రునికి కాళోజి ఇలా వివరించాడు –
” విశ్వ చరిత్రలో అరాచకాలు చేసిన మొట్టమొదటి నియంతృత్వ చక్రవర్తి – హిరణ్య కశిపుడు ! ఆ నియంత ఎంత వేధించినా, శాంతియుతంగా సత్యాగ్రహం ద్వారా తన స్వాతంత్ర్యం కోసం పోరాడిన మొట్టమొదటి స్వాతంత్ర్య సమర యోధుడు – ప్రహ్లాదుడు ! ఆ నియంతకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, చట్టాన్ని చేతిలోకి తీసుకొని, చక్రవర్తినే హత్య చేసిన మొట్టమొదటి విప్లవకారుడు – నరసింహ స్వామి ! ”
ఆ సమాధానం విని నిరుత్తరుడయిన సదరు కమ్యూనిస్ట్ మిత్రుడు తోక ముడిచి వెళ్ళిపోయాడు.

                                                                      ***

 

పరమపదించె నయ్యొ మన ‘బాపు ‘ …!

bapu

పరమపదించె నయ్యొ మన ‘బాపు ‘ – మహోన్నత కార్టునిస్టు; చి
త్తరువుల సృష్టిలో యశము దాల్చు మహాద్భుత శిల్పి; అక్షరాల్
పరువపు కన్నె సోయగపు వంపుల రీతి లిఖించు స్రష్టయున్;
తెర పయి తెల్గు సంస్కృతికి దృశ్య మనోజ్ఞత గూర్చు దర్శకుం
డరయ – తెలుంగు లోకమున అంద మికెట్టుల బట్ట గట్టురో!

అశ్రు నయనాలతో…

– డా. ఆచార్య ఫణీంద్ర