టైటానిక్ లాంటి ప్రమాదాన్ని 24 ఏళ్ళ ముందే ఊహించిన తెలుగు కవి!


“ తెలుగు బ్లాగు – సీ’రియల్’ ముచ్చట్లు “ అన్న బ్లాగులో …
“టైటానిక్ ప్రమాదం 14 ఏళ్ళ కి ముందే ఉహించినదా!!!” అన్న పోస్టులో …
ఆ బ్లాగు రచయిత ఇలా వివరాల నందించారు –

“ టైటానిక్ ప్రమాదం జరగడానికి 14 ఏళ్ళ ముందు, అమెరికన్ రచయిత మోర్గాన్ రోబెరస్టన్ ఒక నవల రచించారు. ఆ నవల పేరు Futility – The wreck of the Titan (1898).
ఈ నవలలోని సంఘటనలకి టైటానిక్ ప్రమాదానికి ఎన్నోపోలికలున్నాయి.
ఈ నవలలోని టైటాన్ అనే బ్రిటిష్ నౌక “నార్త్ అట్లాంటా” లో ని మంచు పర్వతాన్ని ఢీ కొని మునిగిపోతుంది. టైటానిక్ కూడా 1912 ఏప్రిల్ 14 అర్ధరాత్రి మంచు పర్వతాన్ని ఢీ కొంది. “

కానీ, 14 ఏళ్ళు కాదు …
ఆ ప్రమాదం జరగడానికి 24 ఏళ్ళ పూర్వమే అలాంటి సంఘటనను ఊహించి ఒక పద్య కావ్యాన్ని ఒక ప్రసిద్ధ తెలుగు కవి రచించాడంటే నమ్మగలరా? అవును! ఇది సత్యం!!
ఆ కావ్యం పేరు – “బాటసారి“. అది రచించబడింది – 1888 లో.
‘టైటానిక్‘ దుర్ఘటన జరిగింది – 1912 లో.
ఆ ప్రసిద్ధ కవి ఎవరో కాదు – ‘హరి కథా పితామహుడు‘ గా ప్రఖ్యాతి గాంచిన ‘ఆదిభట్ట నారాయణదాసు‘.
ఈ వివరాలన్నీ నా పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం (“19వ శతాబ్ది తెలుగు కవిత్వంలో నవ్యత” – రచించిన కాలం: 2006) లో  సోదాహరణంగా వివరించాను. అవలోకించండి –
————————————————————-

విచిత్ర కల్పనలతో కావ్య వస్తువులు :

క్రీ.శ. 1912 లో అమెరికా దేశానికి ప్రయాణిస్తున్న‘టైటానిక్‘ అనే పేరు గల ఓడ రాత్రి వేళ ‘ఐస్ బర్గ్‘ అనే కొండను ఢీకొని ఘోర ప్రమాదానికి గురి అయింది. చాలా మంది సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ప్రాణ రక్షణకై చేసిన ప్రయత్నంలో ఒకే కుటుంబంలోని సభ్యులు ఒకరికి ఒకరు కాకుండా వేరయిపోయారు. ఇది యదార్థ ఘటన. ఈ వాస్తవ సంఘటన జరగడానికి 24 సంవత్సరాల ముందే అనగా క్రీ.శ. 1888 లో ఒక తెలుగు కవి ఇలాంటి సంఘటనను ఊహించి, ఒక కావ్య నిర్మాణం చేసాడంటే ఎవరికైనా నమ్మశక్యం కాని విషయం. కాని ఇది సత్యం. ప్రఖ్యాత హరికథా పితామహుడు ‘ఆదిభట్ట నారాయణదాసు‘ కవి రచించిన ‘బాటసారి‘ అన్న కావ్యం ఇలాంటి ఘటనతోనే ప్రారంభమవుతుంది –

ఉ||
ఒక్క మహానుభావుడు మహోదధి యానము చేసి ముప్పునం
దక్కి తొలంగిపోవు నిజ దార సుతార్థమునై సరోనదీ
పక్కణ సీమలన్ వెదకి, వారలు సుస్థితినుంట గాంచి పెం
పెక్కును బాటసారియయి – ఇక్కథ పేర యశో విహారియై!

ఉ||
ఎచ్చట నుంటి – నే నిచటి కెట్టుల వచ్చితి – గన్నులెంతయున్
విచ్చిన గానరా దిదియు నిక్కమ – యేమది పెద్ద మ్రోత? నా
కచ్చెరువై వినంబడు – గటా! తెలిసెన్ – మది దిట్ట జేతు – బై
వచ్చిన నీటి తాకువడి – బ్రాకుచు నెట్టన నొడ్డు చేరితిన్!

ఆ||వె||
చిన్ని కొడుకు తోడ చెలియ యేమయ్యెనో –
కొండ తగిలి యోడ కొట్టబడిన
తెన్ను తోచకుండె – తెరపి నీ దిటు మబ్బు
గ్రమ్మ రేయి మిగులు గాన రాదు!

పై పద్యాలలో కవి వర్ణించిన ‘ముప్పు‘ను, టైటానిక్ దుర్ఘటనతో పోల్చి చూడవచ్చు.
‘టైటానిక్‘ ప్రయాణం మహా సముద్రంలో జరిగింది. కవి కూడ ‘మహోదధి యానము‘ అనే అన్నారు. ‘టైటానిక్‘ పెద్ద ఓడ. కవి కూడ దానిని ఓడ అన్నారే గాని, నావ లేక పడవ అనలేదు. టైటానిక్ ఓడ మంచు కొండను ఢీకొన్నది. కవి కూడా, “కొండ తగిలి యోడ కొట్టబడిన“ దన్నారు. టైటానిక్ ప్రమాదం జరిగింది రాత్రి వేళలో. కవి కూడ ‘రేయి‘ అని పేర్కొన్నారు.
సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే ఈ కల్పన – తరువాతి కాలంలో విశ్వ గోళానికి మరో వైపు జరుగబోయే ఒక వాస్తవ ఘటనను ఇంత అచ్చంగా పోలి ఉండడం కవి దార్శనికతకు పరాకాష్ఠగా భావించవచ్చు. “ఈ బాటసారి కథ స్వకల్పితము గాని, ఇంకొక భాషా కావ్యమున కనువాద మెంత మాత్రమున్ గాదు.“ అని; “ ఈ బాటసారిన్ జేసి యాడుచు, బాడుచున్ దెలుగు వారలకు నే వినిపింప మొదలిడినపుడు నా యీ డిరువది నాలుగేండ్లు“ అని నారాయణ దాసు కవి ఈ గ్రంథ పీఠికలో చెప్పుకొన్నారు. ఆదిభట్ట వారు కేవలం ప్రమాద వర్ణనతో వదలివేయకుండా, అదనంగా దీనిని ఒక తాత్త్విక కావ్యంగా తీర్చిదిద్ది, భారతీయ భావజాల ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటారు. మహోదధి – సంసారమయితే, పాపమనే కొండకు తగిలి పగిలిన ఓడ – మాయా గర్భం లాంటిది. ఆ మాయాగర్భం నుండి బయటపడిన మానవుడు – జన్మాంతరాల బాటసారి. ఆ బాటసారి తిరిగి అన్వేషించి విద్యా వివేకాలనే దార సుతులను పొందడమే ఈ కావ్యం చూపే పరమార్థం. అదే విషయాన్ని కవి తన ఆంగ్ల పీఠికలో వివరిస్తూ – “The story embodied in this book is an allegory of human life, which begins in sheer ignorance and ends in perfect knowledge.” అని తెలియజేసారు. టైటానిక్ ఓడ ప్రమాదం వంటి దుర్ఘటనను ముందే ఊహించి కల్పించడమే గొప్పతన మనుకొంటే .. దానికి ఇంతటి తాత్త్వికతను జోడించడం – అసామాన్య ప్రతిభగా, ఘనతగా చెప్పక తప్పదు. ”
————————————————————

ప్రాపంచిక సంబంధాలు పూర్తిగా నెలకొనని కాలంలో.. విద్యా, సమాచార రంగాలు అంతగా అభివృద్ధి చెందని పరిస్థితులలో … యూరపుకు ఎంతో దూరంలో, ఆసియాలో బానిస దేశంగా ఉన్న మన భారతదేశంలో, ఒక మారుమూల ఉన్న విజయనగరం గ్రామ నివాసి అయిన ఒక తెలుగు కవి – శ్రీ ఆదిభట్ట నారాయణదాసు ఇలాంటి ఊహాకల్పన చేయగలగడం … తెలుగు వారిగా మనందరికి గర్వ కారణం!!!

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

తీక్ష్ణ వీక్షణాలు

తీక్ష్ణ వీక్షణాలు

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

కార్యాలయ మేగుట, కని
వార్యపు జాగైన నేను వడిగ ద్విచక్రిన్
వీర్యము నేగ – ఒక జనని
పర్యంకము వీడి బుడుత పరిగిడె నటకున్!

“అడ్డుగ వచ్చిన బాలుడు
గ్రుడ్డై చితు కింక బండి గ్రుద్దిన -” యని నే
దొడ్డ ప్రయత్నము జేసితి
గడ్డు ప్రమాదమ్ము దప్పి గట్టెక్కుటకై!

అయినను, వాహనంబు నటు లాపగ శక్యము గాక పోయె – నే
‘రయి’ మని వాని ఢీకొనగ ప్రక్కన వాడటు గూలి పోయె – ఆ
పయి మరి కాస్త ముందు జని బండి చటుక్కున నాగె గాని, నా
కయినటువంటి దుర్ఘటన కంతకు ముందరె గుండె లాగెనే!

దిక్కు తోచక నా బుర్ర తిమ్మిరెక్కె –
బండి డిగక చూచుచునుంటి బాలు నటులె!
అంతలో వాని తల్లియే అటకు జేరి,
తనయు లేపి వానొడలెల్ల తడిమి జూచె!

ఆ మూలన, ఈ మూలన,
ఆమూలము వాని దేహ మాత్రముగ గనం
గా – మోకాలికి, చేతికి
మామూలుగ గాయములయె! మది కుదుట పడెన్!

ఏడుపు లంఘించుకొనిన
తోడనె, తన పుత్రుని ముఖ తోయజమును ము
ద్దాడి, వని “తేమి కాలే
దేడువ కేడువ” కటంచు నెద హత్తుకొనెన్!

తిట్టదు – చుట్టు చేరిన తతిన్ పురి కొల్పదు నన్ను తిట్టగాన్ –
పట్టుక మల్లె మొగ్గ వలె భాసిలు పుత్రుని రెండు చేతులన్,
కట్టలు త్రెంచి సాగి పెను కాలువ గట్టగ కంటి నీటినే
వెట్టుచు నిల్చియుండె – కని వీధియె వేదన యందు మున్గగాన్!

అపుడు బండిని దిగి, ఆ యమ్మ కడ కేగి
వివరణ నిడ నేను విప్ప నోరు –
కాంచి తీక్ష్ణముగా కనుల్ పెద్దవి చేసి,
పిదప బాలుని గొని వెడలి పోయె!

అల దుర్వాసుడు క్రౌంచ పక్షి నతి క్రోధావేశుడై చూడగాన్
విలయోత్తుంగ హుతాశనోగ్ర శిఖలై వీక్షించు నా చూపులన్
మలమల్మాడి మసైన రీతి రగిలెన్ మన్మానసం బంతటన్!
పలుకున్ మించిన వాడి వేడి శరముల్ భావింప నా దృక్కులే!

“అవశము నైన వేగమున నర్హము గా దెపుడైన నడ్పుటన్,
వివశుడు నౌచు వాహనము వీధిని ఎవ్వరికేని – యన్న సూ
త్ర విధి పరాకు నందు బడి తప్పితి నమ్మ! క్షమించు!” మంచు నే
చివరికి బాధతో తలచి చిత్తము నందున, సాగి పోయితిన్!

—***—