ఎవ్వరివో !

ఎవ్వరివో !

రచన : డా . ఆచార్య ఫణీంద్ర

ఎవ్వరివో ! నీ వెవ్వరివో !
ఎవ్వరివో ! నీ వెవ్వరివో !
నా గుండెను దోచిన జవ్వనివో !
నా గుండియ మ్రోసిన సవ్వడివో !

జక్కన చెక్కిన శిల్పమువో !
తిక్కన చేసిన కల్పనవో !
రాజా రవివర్మ చిత్రమువో !
త్యాగరాజు మధుగాత్రమువో !

అన్నమయ్య పద కీర్తనవో !
సిద్ధేంద్రుని పద నర్తనవో !
రుద్రమ దేవీ ప్రతాపానివో !
గౌతమీ నదీ ప్రవాహానివో !

వేయి ఆమనుల తెలుగువో !
రేయి చంద్రికల వెలుగువో !
వాణి పాదముల అందెవో!
వేల్పుల అమృతపు బిందెవో !

— *** —

అభినందన !

అశీతి జన్మదినాన –

అభినందన !


ఎవని నామము నాంధ్రు లెవరు విన్నను చాలు
కనులు గర్వమ్ముతో కదలుచుండు –
ఎవని వాగ్విభవ మ్మొకింత కన్నను చాలు
పులకించి కర్ణముల్ పురులు విప్పు –
ఎవని కైతల రాణి ఇంపు సొంపుల గాంచి
రస రమ్య హృదయాలు ’ఖుషి’ని బొందు –
ఎవని ప్రఖ్యాతి ఖండేతరంబుల గూడ
మోడ్చినట్టి కరాల మ్రొక్కు లందు –

ఎవనిచే కృతు లావిష్కరింప గోరు –
ఎవని కాతిథ్య మిడ సభ లిచ్చగించు –
ప్రియతముడు – ’ సి.నారాయణ రెడ్డి ’ యతడు !
కావ్య జగతిలో బంగారు కడ్డి యతడు !!

’సాగరము’న గాంభీర్యము,
త్యాగము ’కర్పూర’ మందు – దర్శనమయ్యెన్
రాగము ’మట్టి’ని, ’మనిషి’ని –
వేగము నీ సత్కవిత్వ ’విశ్వంభర’లో !

మాటకు, పాటకు, మట్టికి –
ధాటిగ నమ్మిన మనిషికి దండ మటంచున్
చాటిన తత్త్వజ్ఞ ఘనా
పాటివి ! నీ పాటి కవి ఎవండు ధరిత్రిన్ ?

’రాజ్య సభ’ను మున్ను రత్నదీపము నీవు !
భూరి కావ్య ’పద్మ భూషణు’డవు !
జగతిని నడయాడు ’జ్ఞాన పీఠము’ నీవు !
భరత మాత ముద్దు పట్టి నీవు !

ఏ కవి లేఖినీ – అరువదేండ్లుగ సాగుచు నాంధ్ర సాహితీ
లోక రసజ్ఞ శేఖరుల లోచన యుగ్మము పాలి విందుగా
శ్రీ కవితా సుధా రస విశేషము లెన్నియొ చిల్కుచుండెనో –
శ్రీకరుడా ’సి.నా.రె.’కు నశీతి సుజన్మదినాభినందనల్ !

జులై 29 నాడు … జ్ఞాన పీఠ పురస్కార గ్రహీత, ’పద్మ భూషణ్’ డా. సి. నారాయణ రెడ్డి గారి అశీతి జన్మదినోత్సవ సందర్భంగా …

శుభాకాంక్షలతో –

డా. ఆచార్య ఫణీంద్ర

ఈ రోజు …

27 జులై .. ఈ రోజు …

నా పుట్టిన రోజు !

1961 వ సంవత్సరంలో ఇదే రోజు ( ఆనాడు గురు పౌర్ణమి ) నేను ’ఇందూరు’ (నిజామాబాదు)లో జన్మించాను. ఈ రోజుతో నాకు 49 సంవత్సరాలు పూర్తయి, ఇది నా 50 వ జన్మదినం.

ఈ రోజు ముందుగా నాకు జన్మనిచ్చి నన్నింతవాణ్ణి చేసిన నా తల్లిదండ్రులను స్మరించుకొని, పరమపదంలో ఉన్న వారిరువురికి అంజలి ఘటిస్తున్నాను.
ఇక … నాలోని సాహిత్యాభినివేశాన్ని గుర్తించి, నన్ను శిష్యునిగా స్వీకరించి, మంచి పద్య కవిగా తీర్చిదిద్దిన మా గురువు గారు డా. నండూరి రామకృష్ణమాచార్యుల వారికి కూడా వినమ్రాంజలి సమర్పించుకొంటున్నాను
వారిప్పుడు భౌతికంగా నా చెంత లేకున్నా, వారు నాపయి వర్షించిన ఆశీరభినందనలు నాకెప్పుడూ స్ఫూర్తినిస్తుంటాయి.

అవి …

విమల కవిత చెప్పు విద్యుల్లతలు పేని –

మానవత్వమునకు మచ్చు తునక!

ఎవని ఎడద కరిగి ప్రవహించు మెదడులో –

అతడు శ్రీ ఫణీంద్ర! అమృత హృదుడు!

ఆత డింజనీరు అణుశక్తి కేంద్రాన –

వృత్తి అది – అతని ప్రవృత్తి కవిత –

కరము పగటి వేళ కర్తవ్యములు తీర్చు!

కలము రేల పసిడి కలలు కనును!

మ్రోయు అతని గుండె వేయి తంత్రుల వీణ –

కమ్మ తెమ్మెరలకు కదల గలదు –

అతని మనసు తెరచినట్టి ద్వారములతో

సౌరభముల కిడును స్వాగతమ్ము!

చూడుమా! ఫణీంద్ర సుకవి మాత్రుడె కాడు –

గుండె పండినట్టి గొప్ప వ్యక్తి!

సాహితీ తపస్వి! సాహిత్య కలశాబ్ధి!

ప్రతిభ రూపు దాల్చు ప్రగతి యోగి!

బ్లాగు మిత్రులు, పెద్దలు … అందరి ఆశీస్సులను, దీవెనలను కోరుతూ …

భవదీయుడు

డా. ఆచార్య ఫణీంద్ర

’మహాకవి దాశరథి’ గురించి ఆయన సోదరులు ’రంగాచార్య’ గారితో ముఖాముఖి

‘మహాకవి దాశరథి’ గురించి ఆయన సోదరులు ‘రంగాచార్య’ గారితో ముఖాముఖి

పరిచయకర్త : డా. ఆచార్య ఫణీంద్ర

( ‘సాహితీ కౌముది’ పత్రిక ‘అక్టోబర్ 2002’ సంచికలో ప్రచురితం )

( 22 జులై 2010 నాడు డా. దాశరథి గారి 83వ జయంతి సందర్భంగా post చేయబడినది )

‘అమ్మ’ బొమ్మ

‘ అమ్మ’  బొమ్మ

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర


గీతమాలిక :

మహిని సృజియింప తొలుదొల్త ‘మాతృమూర్తి’

తలమునుకలునై ‘శ్రీహరి’ దైవముండె !

స్వామి ఏకాగ్రతయు, దీక్ష – సాధ్వి ‘లక్ష్మి’

కాంచి, తుడిచి స్వేదమ్ము చేలాంచలమున,

” అంత విశ్వంబు సృష్టించునపుడు గూడ

ఇంతగాను శ్రమించి మీ రెరుగబోరు !

కొంచె మెక్కువే కష్టంబు కోర్చి, మీరు

అతిగ ఆయాసపడుచుంటి ” రనిన – అతడు

” అవును ! నే తీర్చుచున్నట్టి ‘అమ్మ’ బొమ్మ

నూట ఎనిమిది కీళ్ళతో నుండి కదులు !

ఆరు జతల హస్తా, లింక ఆరు కళ్ళు –

మిగులు తిండితో ఇవియన్ని మెదలవలయు –

ఊపునూయలై పాపాయి నొక్క చేయి –

ఒలికి జలము, ‘లాలలు’ పోయు నొక్క చేయి –

‘ఉంగ’ యని నోట బువ్వొత్తు నొక్క చేయి –

దిద్ది తీరుచు నొక చేయి దిష్టి చుక్క !

ఎడతెగని యట్టు లా తల్లి కెప్పుడైన

ఇంక రెండు చేతుల కుండు నింటి పనులు !”

” ఆరు కళ్ళేల ? ” ఆసక్తి నడిగినంత –

” రెండు కళ్ళు చూచుచు ముందు నుండి, బిడ్డ

నూరకే నయము భయమునుంచ నడుగు

‘ఏమి చేయుచున్నా’ వంచు, ఎరిగి గూడ !

రెండు కళ్ళు వెనుక వైపు నుండి చూచు

బిడ్డ యొనరించకుండ నే చెడ్డ పనులు !

మరియు రెండు కళ్ళు కరుణ, మమత కురిసి

పలుకు ‘బిడ్డయే నా పంచ ప్రాణము’ లని !

ఉక్కువలె లక్ష్యమున్నట్టి ఉల్లముండు –

తుప్పు పట్టబోదైన నే తునక గూడ !

అలసినంత నెవ్వరి కద్ది తెలియనీదు –

తెరవుగొని తనంతట తాను తేరుకొనును !

ఆమె కూర్చుండ ‘ఒడి’ తీరు నాదరింప –

ఆమె నిలుచుండ, మాయమౌ నదియె – వింత !

ఆమె చుంబించ నుదుటిపై అమృతమొలికి,

గాయపడినట్టి గుండెలో కరవు దీరు !

ఇన్ని మాటలేల ? – ఇది నా కించుమించు

బింబ, ప్రతిబింబ భావమై పిలువబడును ! “

అనిన శ్రీనాథు, కాశ్చర్యమంది లక్ష్మి

పలికెనిటు, చూచి యది పరిపరి విధాల –

” ఇద్ది యేమి చెక్కిలి పైన ఈ ద్రవమ్ము ?

తమకు లేనట్టి దేదొ ఈ యమకు గలదు ! ” –

” అదియె కన్నీరు ! నా సృష్టి యద్ది కాదు !

ఇన్ని పొదుగంగ, తనకు తా నేరుపడెను !

ఆమె ఆవేదనను పొంద నద్ది కారు –

ఆమె మోదంబు మితిమీర నద్ది కారు –

ఆమె తన్మయంబొందగా నద్ది కారు –

ఆమె ఆత్మీయతను పంచ నద్ది కారు ! “

అనగ వినగ నా శ్రీదేవి కంతలోన

ఏమి అనుభూతి కలిగెనో హృదయమందు –

ఆమె చెక్కిళ్ళ జాల్వారె నా ద్రవమ్మె !

‘అమ్మతన’ మొందె నారీతి ఆమె గూడ ! *

( Steve Pegos రచించిన ” Motherhood – The second oldest proffession ” అన్న ఆంగ్ల గ్రంథంలోని ఒక చిన్ని గద్య భాగానికి భారతీయ సంస్కృతి ననుసరించి మార్పులు చేసి, రూపొందించిన తెలుగు పద్య కవిత. )

—-***—-

కవాటోపాఖ్యానము

కవాటోపాఖ్యానము

రచన: ‘పద్య కళా ప్రవీణ’ డా. ఆచార్య ఫణీంద్ర

ఎట్టి హర్మ్యమైన – ఏ చిన్ని ఇల్లైన –

ముఖమువోలె నద్ది ముందు నిలుచు !

గదికి గదికి నడుమ కలిపి సంధానమ్ము,

మధ్యవర్తివోలె మైత్రి గూర్చు !

తలపులందు దాని తెలుసుకొంటిరొ ? లేదొ ?
‘తలుపు’ సుమ్మి అద్ది ద్వారమందు !
మూసియున్న – మనము ముక్తి బొందినయట్లె !
తెరచుకొన్న – హృదులు తెరచినట్లె !

అది గవాక్షమైనను, ద్వారమైనగాని
ఈ కవాటమ్ములే లేనియెడల కనుడు –
పక్షములు లేని విహగాల భంగి తోచు !
తెలియరే తలుపులకున్న విలువనింక ?

ఒంటిగనుండు నొక్కకడ – ఉన్నతదీక్షను బ్రహ్మచారియై !
జంటగనుండు నొక్కకడ – సంగమమొందుచు రాత్రులందునన్ ;
మింటను సూర్యుడే పొడువ, మేనులు వీడి పవళ్ళు నిల్చి, క్రీ
గంటను చూచుకొం చెదురుగా, యువదంపతులట్లు కుల్కుచున్ !

పొందుగోరెడి దంపతుల్ ముందు , వాని
పొత్తుగూర్చెద రవియెంతొ పులకరింప !
పిల్లలెవరైన ‘కాలింగు బెల్లు’నొత్త –
భంగమగు వారితోబాటు వానికింక !

జంటగనుండిన నేమి ? మ
రొంటిగనుండినను నేమి ? ఉర్విని తలుపుల్
కంటికి రెప్పగ కాపా
డింటిని విశ్వాసబుద్ధి నేలిక పట్లన్ !

నోటికి తాళమువేయుచు
మాటికి చనుచుందురు యజమానులు పని, నా
పూటెవ రింటికి వచ్చిన –
మాటాడగలేక తలుపు మౌనము దాల్చున్ !

ఊరికేగు వేళ నొప్పజెప్ప గృహమ్ము –
సైనికునిగ నిలువజాలు తలుపు !
దొంగ లరుగుదెంచ – దుర్భేద్యమై నిల్చి,
సలుపు పోరును తుది శ్వాస వరకు !

ప్రాణములుండుదాక తమ స్వాముల సంపద పైన చోరులున్
పాణిని వేయజాలనటు పట్టుగ నిల్చు కవాటరాజముల్ !
వానిని ఖండఖండముల పాలొనరించినగాని, దోచగా
నౌనను మాట సత్యము గదా ! అదె వీర్యము ! స్వామి భక్తియున్ !

—–***—–

ముందు మాట

నా ‘వరాహ శతకము’ కృతికి రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్య

కార్యదర్శి, ప్రముఖ సాహితీవేత్త డా|| కె. వి. రమణాచారి IAS

గారు అందజేసిన ముందుమాట: