“స్వీట్ సిక్ష్టీన్”

రచన: డా. ఆచార్య ఫణీంద్ర

(31/12/2015 సాయంత్రం కవిసమ్మేళనంలో గానం చేసిన కవిత)

image

పరువములో అడుగిడె నిక –

ఇరువది యొకటవ శతాబ్ది ఈ వత్సరమే!

కరిగెను పదునైదేడులు!

చిరు ప్రాయము దాటి స్వీటు సిక్ష్టీనయ్యెన్!

 

అందరి కన్నులు నిలిచెను

అందముగా నడచి నీవి టరుదెంచగ, నీ

సుందర రూపము పైనే!

ఉందురు దుర్మార్గులు – కాచుకోవలె సొగసుల్!

 

ఉన్నత విద్యలు నేర్చుచు,

ఉన్నతముగ నిలిచి, తగిన ఉద్యోగముతో

కన్న సమాజము సేవను

సన్నుతి గొనుమమ సలుపుచు  సాటి యుగములన్!

 

నీవు మెట్టు చోట, నిత్య మెల్లరు గూడ

సంతసమ్ము నొంది సాగవలయు!

నీదు సేవలంది నిర్భాగ్యు లగువారి

కందవలయు గొప్పనైన మేలు!

 

తరుణము నిద్దియే తరుణి! ధర్మము, సత్యము, సద్గుణంబులున్

వరలగ నొంట బట్టగ! ప్రపంచమునందున నెల్ల వారికిన్

చెరగని నవ్వుతో కరము చేయుము సాయము! కీర్తి నొందు మీ

తెరగున సాగి, శ్రేష్ఠముగ తీరిచి దిద్ద శతాబ్ది కాలమున్!

— &&& —

శవంతో సెల్ఫీ .. !!

రచన : డా. ఆచార్య ఫణీంద్ర
get-selfie-ready-with-ponds-white-beauty-bb-f-L-WWhg5E
సెల్ఫీ .. సెల్ఫీ .. సెల్ఫీ ..
ఎక్కడ చూసినా సెల్ఫీ!
జానెడంత కుర్రాడి నుండి
పీనుగ లాంటి ముసలాడి వరకు
ప్రతి వాడి చేతిలో ఒక సెల్ఫోన్!
ప్రతి వాడికీ ఒకే పిచ్చి – సెల్ఫీ!!
బడి ముందు సెల్ఫీ –
గుడి ముందు సెల్ఫీ –
ఫ్రెండుతో సెల్ఫీ –
గుండుతో సెల్ఫీ –
చెడ్డీ మీద సెల్ఫీ –
షేర్వానీలో సెల్ఫీ –
కొండ పైన సెల్ఫీ –
కోతితోటి సెల్ఫీ –
పుట్టిన పిల్లాడితో సెల్ఫీ –
చివరికి ..
చచ్చిన శవంతో సెల్ఫీ –
ఈ సెల్ఫీ పిచ్చి ముదిరి
రోకలి అందరి తలలకూ
చుట్టుకొన్నది!
సెల్ఫీ పిచ్చిలో మొన్న ఒక ప్రాణం
యాక్సిడెంటులో
ఫట్టుమన్నది!!

వీడిని చూడండి ..
కుల్ఫీ నాకుతూ
సెల్ఫీ ఏంటిరా బడుద్ధాయ్?
నువ్వేంటమ్మా ..
అలా తోసేస్తున్నావ్?
ఓ .. సెల్ఫీ తీసుకొంటున్నావా?
కానీయమ్మా! కానీ!!

— &&& —

“అదిగో – మరో ద్వారక ..!

రచన : “పద్య కళాప్రవీణ”

           డా. ఆచార్య ఫణీంద్ర

An aerial view of flood affected areas of Chennai

ఘోరము! చెన్న పట్టణము కూరుక పోయెను వర్ష ధారలన్ –

నీరము, నీరమే .. కనగ నీరమె మొత్తము! నీరమందునన్

జారిన ద్వారకా పురికి ఛాయ వలెన్ కనిపించు నీ పురం

బారయ, నిప్పుడీ జనుల నాదుకొనంగల నాథు డెవ్వడే?

 

మునిగె దుకాణము, లిండ్లును,

మునిగెను రో, డ్లేరు పోర్టు, మొత్తము రైల్వే,

మునిగెను సెల్ఫోన్ టవరులు,

మునిగిరి మా తమిళ ప్రజలు, మునిగెను బ్రతుకుల్!

 

వరుణుం డుగ్రుడునై యపారమగు పెన్ వర్షంబులన్ ధాటిగా

కురియం బూనె దినంబు లెన్నొ వరుసన్! క్రోధం బదేలయ్యెనో?

నిరతంబు న్నిట త్రాగగా జనులకున్ నీరందకే యక్కటా!

కరువున్ జూతుము గాని, యిట్లు జలమే ఖడ్గంబ దేలయ్యెనో?

 

“ప్రక్కన గల కర్ణాటక

తక్కువ నీరు వదులు” నని, తగు పాళ్ళకునై

నిక్కచ్చిగా నడుగువా

రెక్కడ గన నక్కడ .. ఇపు డెల్లెడ నీరే!

 

 

అయినచో ననావృష్టి, లేదన్న యెడల

నిట్టు లతివృష్టి యనుచో నికెట్టు లయ్య?

‘పార్థ సారథీ’! మౌనివై బండ యటుల

కూరుచుంటివో కను చిద్ది గుడిని, పురిని!

(“పార్థ సారథి దేవాలయం” – ‘చెన్నై’లో అతి ప్రాచీనం, బహుళ ప్రసిద్ధం)

 

 

నాడిటు లుగ్ర రూపుడయి నాశము గూర్చగ నింద్రు డెంచియున్

దాడిని సేయగా, గిరిని తక్షణ మెత్తియు నీదు వ్రేలిపై

నీడను గూర్చి గాచితివి నీ పరివారము, బంధు మిత్రులన్!

నేడిటు లూరుకొంటి వెటు నీ కను ముందర నీట మున్గినన్?

 

 

త్వరగ కోలుకొనెడి దారు లన్వేషించి

ప్రభుత, దాత లింక పరగు గాక!

దైవ మింక పైన తగినంత వర్షమే

కురియు గాక! ప్రజలు మురియు గాక!

           — &&& —

 

 

“కవి సహస్రం”

ఆదివారం (13/12/2015) నాడు ‘వాట్సాప్’ గ్రూప్ “కవి సహస్రం” సభ్యుల సమావేశం, నగరంలోని  ఇందిరా పార్కులో జరిగింది. ఆ సమావేశంలో ప్రసంగిస్తున్న నేను .

  • డా. ఆచార్య ఫణీంద్ర
  • IMG_20151213_135659_1450006276007

IMG_20151213_135626_1450006275504


 

 

 

శివ కవి సమ్మేళనం

కార్తీక మాసం సందర్భంగా నగరంలోని ‘శంకర మఠ్’ లో నిన్న నిర్వహించిన “శివ కవి సమ్మేళనం”లో  నేను గానం చేసిన శివ దండకం .. కార్యక్రమంపై వార్తా పత్రికల కథనం .. తిలకించండి.

– డా. ఆచార్య ఫణీంద్ర

IMG_20151205_221851

“సాక్షి” దిన పత్రిక :

_20151206_131436

“నమస్తే తెలంగాణ” దిన పత్రిక :

_20151206_125002

మరిన్ని