NATA వారి ఆహ్వానం!

నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్ (NATA) వారు 4 జూలై 2014 నుండి 6 జూలై 2014 వరకు ‘అట్లాంటా’లో నిర్వహించనున్న తెలుగు మహాసభలలో పాల్గొనవలసిందిగా నాకు ఆహ్వానం అందింది. జూన్ 30న  అమెరికాకు ప్రయాణమవుతున్నాను.

ఆహ్వానితుల వివరాలను ఈ క్రింది లింకుపై క్లిక్ చేసి చూడవచ్చు.

http://www.nata2014.com/invitees.php

– డా. ఆచార్య ఫణీంద్ర

ప్రకటనలు

“నమో భరతమాత” – కవిసమ్మేళనం

9 జూన్ 2014 నాడు హైదరాబాదులోని త్యాగరాయ గానసభలో “నమో భరతమాత” – కవిసమ్మేళనం జరిగింది.

ప్రముఖ కవి “సుధామ” గారి అధ్యక్షతన జరిగిన ఆ కవిసమ్మేళనంలో “డా. జె. బాపురెడ్డి”, “డా. ఉండేల మాలకొండారెడ్డి”, “డా. ముదిగొండ శివప్రసాద్”, “డా. సి.భవానీ దేవి”, “డా. వెనిగళ్ళ రాంబాబు” మొదలైన వారితోబాటు నేను పాల్గొన్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర

nt100614

ఆనాడు నేను వినిపించిన నా పద్య కవిత –

శక్తివంత భారతం

రచన: “కవి దిగ్గజ” డా. ఆచార్య ఫణీంద్ర

తలపై హిమాద్రి మకుటము;
గళమున హారములు పుణ్య గంగా, యమునల్;
జలధి త్రయ సంధి స్థలి
పలు వన్నెల పాదపీఠి – భారతి నీకౌ!

క్రొత్త దనము నిండె – క్రొంగొత్త కాషాయ
వర్ణశోభిత మయె భరతభూమి!
కడచి పోయిన కడగండ్లు – గతము గతః
స్వర్ణ యుగము లింక వరలు గాక!

నాడొక “నరేంద్రు” డుదయించి, నాటి విశ్వ
వేదిపై భారతీయ తాత్త్వికత చాటె!
నేడొక “నరేంద్రు” డుదయించె – నిలుపు గాక
భరత దేశమ్ము నుత్తుంగ పదము పైన!!

ఇరువ దెనిమిది రాష్ట్రాల కింక తోడు
కంటివి నవ శిశువు, “తెలంగాణ” పేర –
పచ్చి బాలెంతరాల! మా భరత మాత!
ప్రీతి లాలించి, పాలించి పెంచుమమ్మ!

అన్ని రాష్ట్రము లిక అభివృద్ధి పథములన్
తురగ వేగ గతిని పరుగు లిడుత!
అచిర కాల మందె అవనిపై భరతాంబ
అమిత శక్తివంత దేశ మగును గాక!

— &&&—

తెలుగు భాషానుబంధమ్ము

తెలుగు భాషానుబంధమ్ము

రచన : ‘కవి దిగ్గజ’ డా. ఆచార్య ఫణీంద్ర

andhra-telangana

ఆంధ్ర, తెలగాణ వేర్వడె, నైన నేమి?
తెలుగు భాషానుబంధమ్ము తెగునటయ్య?
నిండు జామకాయను కోసి, రెండు జేయ –
రూపు మారినన్, మారునా రుచియు, రంగు?

పులుగుకు రెండు రెక్క, లవి పూని ప్రపంచము చుట్టి వచ్చెడిన్ –
వెలుగుకు రెండు దిక్కు, లవి వెల్లడి జేయు ప్రదేశ మెల్లడన్ –
జలధికి రెండు నొడ్డు, లవి శాశ్వత లబ్ధి ప్రజాళి కిచ్చెడిన్ –
తెలుగుకు రెండు రాష్ట్రములు … దివ్యముగా అభివృద్ధి చెందెడిన్!

తెలంగాణ రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు!

celebrations

 

 

 

 

 

‘అరువది తొమ్మిది’న్ మరియు నా పయి రేగిన ఉద్యమాలలో
ఒరిగిన కంఠ మాలల మహోన్నత త్యాగ ఫలంబునౌచు, నే
డరుగుచు నుండె గాదె ’తెలగాణము’ పూర్ణ స్వతంత్ర మొందుచున్!
అరువది యేండ్ల స్వప్న మిది, ఆకృతి దాలిచి ముందు నిల్చెడిన్!!

నా ‘తెలంగాణ’ కోటి రత్నాల వీణ
సర్వ స్వాతంత్ర్య రాష్ట్రమై సాకృతి గొన –
అమరులైన వీరుల ఆత్మ లందె శాంతి!
మురియుచుండ్రి ’తెలంగాణ’ భూమి సుతులు!!

నేనురా తెలగాణ నిజ రాష్ట్ర సిద్ధికై
ఆకాశమంత ఎత్తార్చినాను –
నేను దాయాది దుర్నీతి పాలన గూర్చి
పద్యాలు గొంతెత్తి పాడినాను –
నే దాశరథి కవి నిప్పు లురుము గంట
మొడుపులన్ కొన్నింటి బడసినాను –
నేను భాగ్యనగరిన్ నిత్య వసంతుడై
పద్య ప్రసూనాల పంచినాను –

ఐదు కోటుల సీమాంధ్రు లందరికిని
మా తెలంగాణ వ్యథ విడమరచి చెప్పి,
మూడునర కోట్ల ప్రజలకు ముక్తి గలుగ –
పాడినాను తెలంగాణ భాగ్య గీతి!

శ్రీలంగూర్చగ దివ్య ‘భద్రగిరి’పై సీతమ్మగా ‘లక్ష్మి’యున్ –
ఫాలంబందున జ్ఞాన రేఖలు లిఖింపన్ ‘బాసర’న్ ‘వాణి’యున్ –
‘ఆలంపూరు’న జోగులాంబగ శుభాలందింపగా ‘గౌరి’యున్ –
మూలల్ మూడిట నిల్చి ముగ్గురమలున్ బ్రోచున్ తెలంగాణమున్!

                               యావత్ తెలంగాణ ప్రజలకు

         తెలంగాణ రాష్ట్రావిర్భావ శుభాకాంక్షలు!

                                    – డా. ఆచార్య ఫణీంద్ర

Telangana