‘సాహితీ కౌముది’ పత్రికలో …

“వరాహ శతకం” కావ్య సమీక్ష

[ “సాహితీ కౌముది” త్రైమాసిక పత్రిక జనవరి 2012 సంచికలో ప్రచురితం]

సమీక్షకులు : డా. వీరా సూర్యనారాయణ

ఒక్కటై బ్రతకాలంటూ… (విరహ గీతం)

ఒక్కటై బ్రతకాలంటూ…

(విరహ గీతం)

 రచన : డా. ఆచార్య ఫణీంద్ర 

ఒక్కటై బ్రతకాలంటూ …

ఒక్కటై బ్రతకాలంటూ 

ఒట్టు తీసుకొన్నాను –

ఒక్కటే మరిచాను –

గుర్తు పెట్టుకొమ్మనడం!

చిట్టచివరి దాక దానిని

గుర్తు పెట్టుకొమ్మనడం!                                        || ఒక్కటై  ||

నీ ఆశకు నేను శ్వాస కావాలని –

నా ఊసుకు నీవు భాష కావాలని –

మన ఇరువురి మనసు లొక్క టని

మాట తీసుకొన్నాను –

ఒక్కటే మరిచాను –

గుర్తు పెట్టుకొమ్మనడం!

చిట్టచివరి దాక దానిని

గుర్తు పెట్టుకొమ్మనడం!                                        || ఒక్కటై  ||

కాలాలు మారినా, కరిగి పోనిదై –

స్థానాలు వేరైనా, చెరగి పోనిదై –

వాడిపోని ప్రేమ మనదని 

బాస చేసుకొన్నాము –

ఒక్కటే మరిచాను –

గుర్తు పెట్టుకొమ్మనడం!

చిట్టచివరి దాక దానిని

గుర్తు పెట్టుకొమ్మనడం!                                        || ఒక్కటై  ||

ధనం ముందు ప్రేమ 

దాసోహమని అందా?

అంతస్తుల ఆరాటంలో 

ఆత్మ చంపుకొందా?

నయ వంచన జీవితానికి 

నటనలే నేర్పిందా? 

రంగుటద్దాల కోసం   

రత్న దీప మార్పిందా?                                       || ఒక్కటై  ||   

— ***—

షష్టి పూర్తి శంస

రిటైర్డ్ ఐ.ఎ.ఎస్ ఆఫీసర్, తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ ‘కార్య నిర్వహణాధికారి’ డా. కె.వి. రమణాచారి గారి ‘షష్టి పూర్తి’ మహోత్సవం నిన్న(8 ఫిబ్రవరి 2012) హైదరాబాదులోని ‘రవీంద్ర భారతి’లో వైభవోపేతంగా, నేత్ర పర్వంగా జరిగింది. ఈ సందర్భంగా ‘కృష్ణా పత్రిక’ దిన పత్రిక వారు ఒక ప్రత్యేక అభినందన సంచికను వెలువరించారు. అందులో రమణాచారి గారిపై నేను రచించిన పద్యాలు ప్రచురించబడ్డాయి. బ్లాగు మిత్రులకు ఆ పద్యాలను అందిస్తున్నాను.

షష్టి పూర్తి శంస

రచన: ‘పద్య కళా ప్రవీణ’  డా. ఆచార్య ఫణీంద్ర

ధీరోదాత్తు, డుదార చిత్తుడు, స్ఫురద్దివ్య స్వరూపుండు, గం

భీరాంభోనిధి సార తుల్య కవితా విజ్ఞాన సంపన్నుడున్,

పేరుంబొందిన దక్ష పాలకుడు, సద్విద్వత్సభా బంధుడున్, 

‘కారంచేటి’ కులాన్వయుండు ‘రమణా’ఖ్యా భూషితుం డీతడే!   …1

అల ‘పాత బస్తి’ ప్రజలకు

వెలుగిడ కృషి జేసి, బహుళ విఖ్యాతి గొనెన్

‘కులి కుతుబు సంస్థ’ పతియై! 

‘మలికిభ రాము’ డన నతడె మా తరమందున్!   …2

ఖాదీ, గ్రామోద్యోగము,

శ్రీ దేవాదాయ మింక, గృహ నిర్మాణం,

బాదిగ పలు శాఖలలో 

ఏదైన – నత డభివృద్ధి  నెంతయొ సలిపెన్!   …3

సాహిత్య సాంస్కృతిక సభ

“లోహో!” యని ప్రజలు మెచ్చ నొనరించుటకై

తా హితవరిగ నిలిచి యుం 

డాహా! ఈనాటి ‘రాయ’ లతడే గాదే!   …4

తిరుమల వేంకటేశ్వరుని దివ్య పదాంబుజ సన్నిధానమం 

దరిగి ప్రభుత్వ పాలకుడునై విలువల్ పునరుద్ధరించి, ఆ 

పరమ పవిత్రతన్ నిలిపె భక్తిని సార్థక వైష్ణవుండునై!

‘అరువది ప్రాయ’మం దిక శ్రియఃపతి యాతని మెచ్చి గాచుతన్!   …5         

               —***—

పద్య కవిత్వం – కొన్ని సందేహాలు

నిన్న ఎందుకో నా బ్లాగులన్నీ మళ్ళీ ఆమూలాగ్రం చదివాను. ఎన్నో విలువైన పోస్టులు కనిపించాయి. ముఖ్యంగా మూడేళ్ళ క్రితం నా ” నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం ” బ్లాగులో శ్రీ భాస్కర రామిరెడ్డి గారు ( ‘హారం’ నిర్వాహకులు ) నాతో జరిపిన అంతర్జాల ముఖాముఖీ ( INTERNET INTERVIEW ) చదివాక చాల ఆనందం కలిగింది. వర్ధిష్ణువులైన పద్య కవులకు ఎంతో ఉపయుక్తమైన ఆ ముఖాముఖిని ఈ బ్లాగులో పునః ప్రచురిస్తున్నాను.

– డా. ఆచార్య ఫణీంద్ర  

పద్య కవిత్వం – కొన్ని సందేహాలు (డా||ఆచార్య ఫణీంద్ర తో

‘haaram.com’ భాస్కర రామిరెడ్డి ముఖాముఖి)

భాస్కర రామిరెడ్డి: ఫణీంద్ర గారు! ఈ రోజు మీ ‘నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం’ బ్లాగును చూశాను. పద్య కవిత్వ వ్యాప్తికి ఈ బ్లాగు ద్వారా మీరు చేస్తున్న కృషికి ధన్యవాదాలు. బ్లాగులోని మీ పాఠాలు చదవడం వల్ల పద్య కవిత్వానికి , తెలుగు భాషకు సంబంధించిన సందేహాలు తీరుతాయి. ఇటువంటి బ్లాగు కోసం గత రెండు నెలలుగా వెదుకుతున్నాను. ముందు ముందు నాకున్న సందేహాలన్నింటికి మీ బ్లాగు సమాధానాలు ఇస్తుందని ఆశిస్తాను. 
అయితే ఈ ముఖాముఖి ద్వారా ముందుగా మాలాంటి వారికి ఉండే కొన్ని సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకొంటున్నాను.
ఆచార్య ఫణీంద్ర: చాలా సంతోషం. ఆనందంగా అడగండి.
భా.రా.:పద్యం ఎన్నుకొని వర్ణన చేస్తారా? లేక వర్ణనకి కొన్ని రకాల పద్యాలు బాగా అతుకుతాయా?
ఆ.ఫ :ఏ కవితకైనా ముందు వస్తువు, దాని గురించి ఏం చెప్ప దలచుకొన్నామో ఆ భావం ముఖ్యం. అది వచన కవిత్వమయినా, పద్య కవిత్వమయినా లేక మరేదైనా. ఆ భావం ఒక గాఢమైన స్పందన వల్ల కలుగుతుంది. ఏ కవికైనా ఆ భావం ఒక సమగ్ర రూపం సంతరించుకోగానే అది పదాల రూపంలో దొర్లుకొంటూ వస్తుంది. శిల్పి శిల్పం చెక్కినట్లుగా కవి అప్పుడు ఆ పదాల ప్రవాహాన్ని భావంతో సమన్వయం చేస్తూ కవితను చెక్కుతాడు. ఏ కవైనా ఒకే దెబ్బలో కవిత రాసి పారేసానంటే అతనికి పరిపక్వత లేనట్టే. శిల్పి ఒక సుందరి ముక్కు చెక్కాలనుకొంటే, ముందుగా ముఖ భాగంలో ఒక ముద్దలాంటి బొడిపెను చెక్కుతాడు. తరువాత సన్నగా, పొడువుగా మృదువుగా మొనదేలేలా చెక్కుతాడు. ఆ పైన చెలిమలు అందంగా చెక్కుతాడు. అలా సంతృప్తికరంగా వచ్చే దాకా చెక్కుతూనే ఉంటాడు.కవిత కూడా అంతే. పద్యం గురించి చెప్పమంటే ఇదంతా చెప్పుతారేంటి అనుకోకండి. అక్కడికే వస్తున్నా. అన్ని రకాల ఛందస్సులపై బాగా అభ్యాసం చేసి సిద్దంగా ఉంటే, ప్రవాహంలా దొర్లుకు వచ్చే పదాలు ఏదో ఒక ఛందస్సు ప్రారంభ గణాలలో ఒదిగి ఉంటుంది. ఇక
అక్కడి నుండి శిల్పిలా చెక్కుతూ పోవడమే.పద్యం పూర్తయినా సంతృప్తికరంగా వచ్చేవరకు అక్కడక్కడా మారుస్తూ చెక్కుతూ ఉండాలి. పూర్తిగా సంతృప్తిగా వచ్చాక శిల్పి శిల్పాన్ని ప్రదర్శనకు ఉంచినట్టు, అప్పుడు కవితను ప్రచురించాలి. ఇది సాధారణంగా ఒక మంచి పధ్ధతి.
అయితే అన్ని రకాల ఛందస్సులను అభ్యాసం చేసి అధికారం సాధించడం కొంచం కష్టమే. కాబట్టే మన ప్రాచీన కవులు కూడా ‘ఉత్పల మాల’,’చంపకమాల’, ‘శార్దూలం’, ‘మత్తేభం’, ‘కందం’, ‘సీసం’, ‘ఆట వెలది’, ‘తేట గీతి’ , అప్పుడప్పుడు ‘మత్త కోకిల’ – ఈ ఛందస్సుల లోనే విరివిగా వ్రాసేవారు. ఆధునికులు కూడా ఈ ఛందస్సులలో అధికారం సాధిస్తే చాలు. మిగితావి కావాలనుకొన్నప్పుడు కాస్త శ్రమ పడైనా ఒకటి అరా వ్రాయవచ్చు.
అయితే కొన్ని మార్లు పద్యం ఎన్నుకొని కూడా రచన చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు ఒక విషయాన్ని గూర్చి నాలుగు పాదాలలో నాలుగు రకాలుగా వర్ణించి తుదిలో conclusion లాంటిది ఇవ్వాలనుకొంటే , సీస పద్యం బాగా ఒదుగుతుంది. అలాగే కొన్ని పేర్లను పొదుగాలి అనుకోండి. ఆ పేర్లు ఏ గణాలలో, ఏ ఛందస్సులో ఇముడుతాయో వాటినే ముందుగానే ఎన్నుకోవలసి ఉంటుంది. ఉదాహరణకు మీ పేరే తీసుకోండి. ‘భాస్కర రామిరెడ్డి’. ఇది ‘ఉత్పలమాల’ లో ప్రారంభ గణాలలో గాని, ‘తేట గీతి’ పాదం చివరి గణాలలో గాని, సరిగ్గా ఒదుగుతుంది.

భా.రా.: గణాలు చూసుకుంటూ పద్యం రాస్తారా లేక పద్యం వ్రాసే టప్పుడు వచ్చేపదాల గణాలను చూసుకొని పద్యం మారుస్తారా?
ఆ.ఫ.:”కవి యన్న వాడు ఆర్తితో అరిస్తే అది ఏదో ఒక ఛందస్సులో ఉంటుంది” అన్నారు ఆరుద్ర . ఇంతకు ముందు ప్రశ్నకు చెప్పిన సమాధానంలో అన్నట్టు ‘ఉత్పల మాల’, చంపక మాల’, ‘కందం’, ‘సీసం’ మొదలైన ఛందస్సులలో పూర్తి సాధికారత పొందేలా అభ్యాసం చేసిన వారికి – తొలి భావం ఏ ఛందస్సులో పలుకుతుందో, అదే ఛందస్సులోనే మిగితా భావం కూడా సునాయాసంగా సాగిపోతుంది. అప్పుడు ఆ కవి దృష్టి – గణాలు, ఛందస్సుపై ఉండదు. సముచితమైన పదాలను వాడుతున్నానా? లేక ఇంకా మెరుగైన పదాలను వాడగలనా? అనుకొన్న భావాన్ని పలికించ గలుగుతున్నానా? లేక ఇంక మెరుగైన భావ వ్యక్తీకరణ సాధ్యమా? – అని ఆలోచిస్తాడు. తాను ఇదివరకే చేసిన అభ్యాస ఫలితంగా ఎలాంటి దోషాలు లేకుండా గణాలు పరిగెత్తుతుంటాయి. తన అభివ్యక్తిలో పరిపక్వత కోసం కవి పద్యాన్ని పునస్సమీక్షించుకొంటూ పద్యంలో అవసరమనుకొన్న చోట్ల మార్పులు చేస్తూ పరిపూర్ణంగా సంతృప్తి కలిగే వరకు దానిని చెక్కుతూనే ఉంటాడు. 
భా.రా.: యతి చాలా రకాలుగదా ? సులభంగా గుర్తుంచుకొనే మార్గాలు ఏమైనావున్నాయా?
ఆ.ఫ.: నిజమే! యతులలో చాలా రకాలున్నాయి. అందులో ‘ప్రాస యతి’ వృత్తాలలో, ‘కందం’లో చెల్లుబాటు కాదు. కాని ‘సీసం’లో, ‘ఆట వెలది’, ‘తేట గీతి’ మొదలైన పద్యాలలో అది చాల అందాన్ని సమకూరుస్తుంది. ‘ప్రాస యతి’ అంటే ‘యతి’ బదులు ప్రక్క అక్షరంతో ప్రాస వేయడం. ఉదాహరణకు – “ఇల్లు మొత్త మతడు గుల్ల చేసె”. ఇందులో ‘ఇ’కి, ‘గు’కి యతి కుదర లేదు. వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస(ఇల్లు – గుల్ల) పడింది.
‘అఖండ యతి’ అని ఉంది. దీనిని ‘అప్ప కవి’ వంటి లాక్షణికులు అంగీకరించ లేదు. కానీ ప్రాచీన కవులలోనే కొంత మంది ఆయన మాటను పెడ చెవిన పెట్టి దీనిని ప్రయోగించారు. సరే – ఇవన్నీ కవికి వెసులుబాటు కల్పించేందుకు ఉన్నవే కాని, కవి తప్పకుండా తెలుసుకొని ప్రయోగించాలన్న నియమమేమీ లేదు. వీటి కన్నా కవి డైరెక్టుగా ‘యతి మైత్రి’ వేస్తేనే పండితులు హర్షిస్తారు. కాబట్టి కవి ‘యతి’ వేయ వలసిన స్థానంలో ‘స్వర(అచ్చు) మైత్రి, వ్యంజన(హల్లు) మైత్రి కుదిరిందా చూసుకొంటే సరిపోతుంది.

తెలుగు భాషకు ఎంతో అందాన్ని కొనితెచ్చిన అమూల్య వరాలు యతిప్రాసలు. తెలుగు భాషకు అవి సహజ కవచ కుండలాల వంటివని మా గురువు గారు కీ. శే. నండూరి రామకృష్ణమాచార్య చమత్కరించే వారు. ఈ యతి ప్రాసలు కేవలం పద్యాలలోనే ఉంటాయనుకొంటే పొరపాటే. మన భాషలో అడుగడుగునా కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు ఊళ్లలో నిరక్షరాస్యులు చెప్పుకొనే సామెతల్లో అవి విరవిగా కనిపిస్తాయి.
“కడుపు చించుకొంటే కాళ్ళ మీద పడుతుంది.” – ఇందులో ప్రారంభాక్షరం ‘క’ ఉంటే, కొంత విరామం తరువాత ‘కాళ్ళ’ అనే పదంలో ‘కా’ అన్న అక్షరం ఉంది. అంటే ఇక్కడ ‘క’కి, ‘కా’కి యతి కుదిరిందన్న మాట. దీనినే ‘యతి మైత్రి’ అంటారు.
“ధిల్లీకి రాజైనా –
తల్లికి కొడుకే.” – ఇందులో మొదటి లైన్లో (పద్యంలో దీనినే పాదం అంటారు) రెండో అక్షరం ‘ల్ల’ ఉంటే రెండో పాదంలో కూడా అదే ‘ల్ల’ అక్షరం ఉంది. దీనినే ‘ప్రాస’ అంటారు. 90 శాతం పద్యాల్లో ఈ ప్రాస నియమం ఉంటుంది. కొన్ని రకాల పద్యాల్లో ఈ నియమం అవసరం లేదు. అంటే అవి వ్రాయడం మరింత సులువన్న మాట.
” కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు” అన్న అన్నమాచార్య కీర్తనలో ‘కొం’కి , ‘కోనేటి’ లోని ‘కో’కి యతి మైత్రిని గమనించారా?
“ఇందరికీ అభయమ్ము నిచ్చు చేయి –
కందువగు మంచి బంగారు చేయి !” అన్న అన్నమయ్య కృతిలో పై పాదంలో రెండో అక్షరం (సున్నాతో కూడుకొన్న) ‘ద’ రెండో పాదంలోనూ అదే ఉంది. ఇదే ప్రాస. అలాగే మొదటి పాదంలో ‘ఇం’కి , ‘ఇచ్చు’లోని ‘ఇ’కి యతి మైత్రి. రెండో పాదంలో ‘కం’కి ‘బంగారు’లోని ‘గా’కి యతి మైత్రి’.
ఇది గమనించకుండా మనలో చాలా మంది “పద్యాల్లో యతి ప్రాసలు – అవి చాలా కష్ట”మంటూ భయపెడుతూ ఉంటారు. ఆ భయం పోవాలంటే భాషలో పలు చోట్ల వచ్చే యతి ప్రాసలను అవి భాషకు తెచ్చే అందాలను గమనించండి.
ఈ నెలంతా ఈ దృష్టితో ఒక కంట భాషను గమనిస్తూ, మీ పనులు మీరు చేసుకొంటూ పొండి. మీరు రోజూ మాటాడే భాషలోనే యతిప్రాసలను చేరుస్తూ భాషకు చేకూరే సొగసును గమనించండి.

మన అక్షరాలను మనం ’అచ్చులు’, ’హల్లులు’ అని రెండు విభాగాలుగా నేర్చుకొన్నాం. 
’అ’ నుండి ’ఆః’ వరకు ఉన్నవి అచ్చులు –
’క’ నుండి ’ఱ’ వరకు ఉన్నవి హల్లులు.
మన భాషలోని పదాలలో ప్రతి అక్షరంలో అచ్చు, హల్లు రెండు మిళితమై ఉంటాయి. అందుకే మనం ’గుణింతా’లని నేర్చుకొనేది.
మనం పద్యాలలో ’యతి మైత్రి’ వేసేప్పుడు అటు ’స్వర (అచ్చు) మైత్రి’, ఇటు ’వ్యంజన (హల్లు) మైత్రి’ రెండూ కుదిరేలా చూసుకోవాలి.
అచ్చులలో క్రింద పేర్కొన్న జట్టులలో వాటిలో వాటికే యతి కుదురుతుంది కానీ , వేరే వాటితో కుదరదు.
* అ,ఆ,ఐ,ఔ,అం,ఆః,య,హ
ఉదా|| ’అ’ల్పుడెపుడు పలుకు ’ఆ’డంబరముగాను
* ఇ,ఈ,ఎ,ఏ,ఋ,ౠ,
ఉదా|| ’ఇ’తరులెరుగకున్న ’ఈ’శ్వరు డెరుగడా?
* ఉ,ఊ,ఒ,ఓ
ఉదా|| ’ఉ’ప్పు కప్పురంబు ’ఒ’క్క పోలిక నుండు
పై మూడు జట్టులలోని అక్షరాలను గుర్తుంచుకొని, ఉదాహరణలను పరిశీలిస్తే విషయం బోధపడుతుంది. 
’య’,’హ’ హల్లులైనా ఉచ్చారణ దగ్గరగా ఉండడం వలన ’అ’ జట్టులోని అచ్చులతో కూడి ఉంటే, ఆ అచ్చులతో యతి మైత్రి కుదురుతుంది. 
ఉదా|| ’అ’ల్లరి మూక నేతలు మ’హా’త్ములటన్నను నమ్మ శక్యమే?
ఇందులో ’అ’కి, ’హా’కి యతి కుదిరింది. అలాగే మరొక 
ఉదా|| ’య’జ్ఞ ఫలము నందుకొనిరి ’ఆ’తని పత్నుల్!
ఇక్కడ ’య’కి, ’ఆ’కి యతి మైత్రి కుదిరింది.
ఇక హల్లులలో ఏ ఏ జట్టులలో ఏ ఏ అక్షరాలకు యతి కుదురుతుందో చూద్దాం.
* క, ఖ, గ, ఘ, క్ష
ఉదా|| ’కం’చు మ్రోగినట్లు ’క’నకంబు మ్రోగునా?
ఇలాగే మిగితా జట్టులు …
* చ, ఛ, జ, ఝ, శ, ష, స, క్ష, జ్ఞ
* ట, ఠ, డ, ఢ
* త, థ, ద, ధ
* న, ణ, o
* ప, ఫ, బ, భ, వ
* మ, oప, oఫ, oబ, oభ (ప్రత్యేకంగా… పు, పూ, పొ, పో, ఫు, ఫూ, ఫొ, ఫో, బు, బూ, బొ, బో, భు, భూ, భొ, భో- లతో … ము, మూ, మొ, మో లకు యతి కుదురుతుంది.)
ఉదా|| ’మా’దు జనని! దుర్గమ్మ! అ’oబ’! దయ జూడు
అలాగే, మరో ఉదా|| ’పు’లతి అందమైన ’మో’ము జూడు
ఇంకా మిగిలిన జట్టులు ఇవి –
* ర, ఱ
* ల, ళ
* య, హ, అ,ఆ, ఐ, ఔ, అం, ఆః
ఒక ముఖ్య విషయమేమిటంటే, యతి మైత్రి అంటే – అచ్చు మైత్రి, హల్లు మైత్రి రెండూ తప్పకుండా కుదరాలి.
ఉదా|| ’దే’శ భాషలందు ’తె’లుగు లెస్స
ఇందులో ’ద’ కి, ’త’ కి హల్లు మైత్రి, అందులోని ’ఏ’ కి, ఇందులోని ’ఎ’కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి.
ఉదా|| ’స’జ్జనుండు పలుకు ’చ’ల్లగాను
ఇందులో ’స’ కి ’చ’ కి మధ్య హల్లు మైత్రి – మళ్ళీ అందులోని ’అ’ కి, ఇందులోని ’అ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి. మరొక ఉదా|| 
’చి’త్త శుద్ధి లేని ’శి’వ పూజలేలయా?
ఇందులో ’చ’ కి ’శ’ కి హల్లు మైత్రి మరియు అందులోని ’ఇ’ కి, ఇందులోని ’ఇ’ కి అచ్చు మైత్రి రెండూ కుదిరాయి గదా!
ఇవి గాక ’ప్రాస యతి’ అని ఒకటుంది. ఇది అన్ని ఛందస్సులలో పనికి రాదు. కొన్ని ఛందస్సులలో అంగీకరింపబడుతుంది. ఉదాహరణకు ’సీసము’, ’తేట గీతి’, ’ఆట వెలది’ మొ||వి. పైగా, ఈ ఛందస్సులలో ప్రాస యతి వాడితే ఆ పద్యాలకు మంచి అందం కూడా వస్తుంది. 
’ప్రాస యతి’ అంటే, ఆ యా అక్షరాలకు మధ్య యతి బదులు వాటి ప్రక్క అక్షరాలకు ప్రాస వేయడం. 
ఉదా|| ’ఇల్లు’ మొత్తమపుడు ’గుల్ల’యయ్యె
ఇందులో ’ఇ’ కి ’గు’ కి యతి కుదర లేదు. కాని వాటి ప్రక్కన రెండు చోట్లా ’ల్ల’ అన్న ప్రాస పడింది. ఇది ’ప్రాస యతి’ 
’యతి’ గురించి ఈ జ్ఞానం సరిపోతుంది.
ఇక ’ప్రాస’ – ఇది ఇంతకు ముందు పాఠంలో చెప్పుకొన్నట్టు పద్యంలోని ప్రతి పాదంలో రెండవ అక్షరం ఒకటే అదే హల్లుకు సంబంధించినది ఉండడం. అందులోని అచ్చు మారినా ఫరవా లేదు.
ఉదా|| క’oదు’కము వోలె సుజనుడు
క్రి’oదం’బడి మగుడి మీది 
కెగయు జుమీ
మ’oదు’డు మృత్పిండము వలె
గ్రి’oదం’బడి యడగి యుండు
గృపణత్వమునన్ 
ఈ పద్యంలో బిందు పూర్వక దకార( oద) ప్రాస వేయబడింది. గమనించారు కదా!

భా.రా.:సంస్కృత పదాలను సులభంగా ఎలా గుర్తించాలి? సంధిచేసేటప్పుడు ప్రతిసారినాకు ఈ ప్రశ్న వుత్పన్నమౌతుంది.
ఆ.ఫ.:సంస్కృత పదాలను, తెలుగు పదాలను కలిపి మిశ్రమ సమాసాలు చేయడం తప్పు. పండితులు వీటిని ‘దుష్ట సమాసాలు’ అంటారు. వార్తా పత్రికలలో భాషా ప్రమాణాలు మరీ దిగజారి ఈ మధ్య ఇవి బాగా వ్యాపించి భాషను ఖూనీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ మధ్య ఏ వార్తా పత్రికను చూసినా ‘పాలాభిషేకం’ అని వ్రాస్తున్నారు. ఇక్కడ ‘పాలు’- తెలుగు పదం; ‘అభిషేకం’- సంస్కృత పదం. వీటిని సమాసం చేయకూడదు. దీనిని ‘క్షీరాభిషేకం’ అనాలి. దురదృష్ట మేమిటంటే ఇప్పుడు పొద్దున్న లేచి చూస్తే, ప్రసిద్ధి చెందిన వార్తా పత్రికలలోనే ఇలాంటి దోషాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. అయితే వ్యవహార భాషలో ఎలా ‘ఏడ్చినా’, పద్యాలలో వీటిని పండితులు అంగీకరించరు. మరి ఈ తప్పులు చేయకుండా ఉండాలంటే ఏది సంస్కృత శబ్దం, ఏది తెలుగు శబ్దం అన్న పరిజ్ఞానం ఉండాలి.
ఒక చిన్న బండ గుర్తు ఉంది. మన అక్షరాలలో ‘అల్ప ప్రాణాలు’, ‘మహా ప్రాణాలు’ అని ఉన్నాయి. ‘క, గ, చ, జ, త, ప, బ, మ, య, ల…’ మొ||వి అల్ప ప్రాణాలు. ‘ ఖ, ఘ, ఛ, ఝ, థ, ధ, ఫ, భ…’ మొ||వి మహాప్రాణాలు. అన్ని అల్ప ప్రాణాలున్న పదాలు ‘తెలుగు పదాలు’ అని చెప్పలేం గానీ – పదంలో ఒక్క మహాప్రాణమున్నా అది సంస్కృత పదమని కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే తెలుగులో మహాప్రాణ అక్షరాలు లేవు. అవి సంసృతం నుండి గ్రహించినవే. ‘బడి, గుడి, బండ, మల్లె, పువ్వు, తీగ … ఇలా అన్నీ తెలుగు పదాలు. అంత మాత్రాన ‘లత, దేవాలయం, కాలం, జగతి…’ కూడా తెలుగు పదాలు కావు. ఎందుకంటే సంస్కృతంలో కూడా అల్పప్రాణ అక్షరాలు ఉంటాయి. కానీ, ‘ధర్మం, ఫలం, మోక్షం, భయం…’ ఇలా మహాప్రాణం ఒక్కటున్నా అది కచ్చితంగా సంస్కృత శబ్దమే! అయితే ఈ అయోమయమేమీ లేకుండా ఉండాలంటే ‘ శబ్ద రత్నాకరం’ లేదా ‘సూర్య రాయాంధ్ర నిఘంటువు’ – ఈ రెండు నిఘంటువులలో ఏది చూచినా, ప్రతి పదం పక్కన అది సంస్కృత పదమా, లేక తెలుగు పదమా వ్రాసి ఉంటుంది. సమాసం చేసేప్పుడు ఏదైనా సందేహం వస్తే వాటిలో చూసుకోవచ్చు.
భా.రా.:నానార్థాల,వ్యుత్పత్తి అర్థాల కొరకు మంచి నిఘంటువులేమైనా వుంటే తెలియ జేయండి.
ఆ.ఫ.: తెలుగులో ఇటీవల నానార్థాలపై ఒక చక్కని గ్రంథం వచ్చింది. డా. పి. నరసింహా రెడ్డి రచించిన ‘తెలుగు నానార్థ పద నిఘంటువు’ అది. ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాదు వారి ప్రచురణ. అలాగే పర్యాయ పదాలపై జి. ఎన్. రెడ్డి గారి ‘తెలుగు పర్యాయ పద నిఘంటువు’ కూడా ఒక మంచి గ్రంథం. ఇక తెలుగు పదాలకు వ్యుత్పత్తి అర్థాలు ఉండవనే చెప్పాలి. ‘చెంబు, గుడి, బండ…’ మొ||న పదాలకు ఏం వ్యుత్పత్తి అర్థాలు ఉంటాయి. సంస్కృత పదాలకే వ్యుత్పత్తి అర్థాలు చెప్పవచ్చు. వీటి గురించి తెలుసుకోవాలంటే శ్రీ చలమచర్ల వేంకట శేషాచార్యులు రచించిన ‘అమర కోశం- సంస్కృతాంధ్ర వివరణము’ అన్న గ్రంథం చాలా అమూల్యమైనది. 
భా.రా.: ఆచార్య ఫణీంద్ర గారు! సహృదయంతో శ్రమకోర్చి మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి ఓర్పుతో నా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సదా కృతఙ్ఞుడను.
ఆ.ఫ.: రామిరెడ్డి గారు! మీ వల్ల బ్లాగు మిత్రులకు తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి నాలుగు మంచి మాటలు చెప్పే అవకాశం లభించింది. నేనే మీకు ధన్యవాదాలు చెప్పాలి.

(సమాప్తం)