జీవితమంటే … (గీతం)

జీవితమంటే … (గీతం)
రచన : డా. ఆచార్య ఫణీంద్ర
జీవితమంటే …
ఒక రైలు ప్రయాణం!
చెవిలో వినిపిస్తుందా
“చుక్ – చుక్” జీవన గానం? ||జీవితమంటే||
ఎక్కే వారెందరో –
దిగేటి వారెందరో –
ఎక్కువ కాలం నీతో
ప్రయాణించేది కొందరే! ||జీవితమంటే||
ఏ స్టేషన్లో ఎక్కేవో
నీకే తెలియదు –
ఏ స్టేషన్లో దిగేవో
నీకే తెలియదు –
ఎంత దూరం సాగేవో
నీకే తెలియదు –
ఎవరూ నీతో రారు –
ఇది మాత్రం తెలుసుకో! ||జీవితమంటే||
ఎండ ఎంత కాచినా
సాగిపోయేనులే –
వాన ఎంత కురిసినా
సాగిపోయేనులే –
రాత్రి ఎంత చీకటైనా
సాగిపోయేనులే –
ఎర్ర ‘సిగ్నల్’ పడిందా …
ఆగిపోయేనులే! ||జీవితమంటే||
దేవుడు వేసిన పట్టాలు –
దేవుడు చేసిన పెట్టెలు –
దేవుడు వేసిన పట్టాలు –
దేవుడు చేసిన పెట్టెలు –
కాలం ‘ఇంజిన్’ కదులుతుంటే …
దాటేనది చెట్టూ, పుట్టలు! ||జీవితమంటే||*

గత నెల రోజులుగా …

గత నెల రోజులుగా నాకు జరిగిన సత్కారాలు, లభించిన పురస్కారాలు :

1.”కమలాకర ఛారిటబుల్ ట్రస్ట్” వారిచే “వైజ్ఞానిక రత్న” పురస్కారం ;

2. “శ్రీకృష్ణ దేవరాయ తెలుభాషానిలయం” వార్షికోత్సవ కవిసమ్మేళనంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి శ్రీ నిరంజన్ రెడ్డి గారిచే సత్కారం :

3. “తెలంగాణ జాగృతి” సంస్థ “కాళోజీ జయంతి” సందర్భంగా నిర్వహించిన కవిసమ్మేళనంలో సత్కారం :


4. “శ్రీగిరిరాజు విజయలక్ష్మి ఫౌండేషన్” వారిచే “అమ్మ పురస్కారం” :

ఉద్యమ మతని భాష!

ఈ రోజు “కాళోజీ” జయంతి సందర్భంగా “తెలంగాణ భాషా దినోత్పప్జరుపుకొంటున్న శుభ వేళ .. ఆ మహాకవిని సంస్మరిస్తూ నా కవిత:
——————————————–
ఉద్యమ మతని భాష!
———————————–
రచన : “పద్య కళాప్రవీణ”, “కవి దిగ్గజ”
డా. ఆచార్య ఫణీంద్ర
~~~~~~~~~~~~~~~~~~~~~~~
గ్రంథాలయోద్యమ కార్యకర్తగ నిల్చి,
విద్యా ప్రచారమ్ము వెలయ జేసె!
సత్యాగ్రహోద్యమ సారథియై, దేశ
భక్తునిగా జైలు పాలునయ్యె!
జాతి పతాకను జన హృది వీధులం
దెత్తి, తా నగర బహిష్కృతుడయె!
“ఉస్మానియ” యువత నుద్యమంబున నిల్పి
ఆ “నిజాం రాజు”ను హడలగొట్టె!

తల్లి కన్నడమ్ము, మరాఠి తండ్రి తనకు –
తీర్చి తా నసలు సిసలు తెలుగు బిడ్ద!
అతడు “కాళోజి”; ఉద్యమ మతని భాష!
కదలె నుద్యమమై తెలంగాణమందు!

“సారస్వత పరిషత్తు”ను
సారస్వత వ్యాప్తి కొరకు స్థాపించిన యా
సారస్వత మూర్తులలో
ధీరుడు తా నొక్కడునయి తెలుగును బ్రోచెన్!

“బడి పలుకుల భాష” వదలి
వడలిన మన “పలుకుబడుల భాష”ను నిలుపన్
నడుమును బిగించి సతతము
నడయాడుచు మార్గదర్శనంబును జేసెన్!

సామాన్యుండన దేవుడంచు మదిలో స్థాపించి సద్భావనన్,
సామాన్యుం డిల నొందు కష్టములకున్ సంతాపమే పొంగగాన్,
ధీమంతుండయి చాటి “నా గొడవ” గా దీక్షా నిబద్ధుండునై,
తా మాన్యుండయెరా “ప్రజాకవి”గ ప్రస్థానించి “కాళోజి”యే!

అతని కలమందు జాల్వారునట్టి ప్రతి యొ
కొక సిరాచుక్క పలు మెదళ్ళకు కదలిక!
పుటుక యతనిదె; అట్లె చావును నతనిదె;
తెరచి చూడ నా బ్రతు కెల్ల దేశమునది!
తెరచి చూడ నా బ్రతు కెల్ల దేశమునది!!

— @@@ —