హిమ నగరి
రచన: ‘ పద్య కళా ప్రవీణ ‘ డా. ఆచార్య ఫణీంద్ర
( మాస్కో నగరాన్ని సందర్శించినపుడు …
ఆ నగరంపై వ్రాసిన పద్య కవిత – )
హిమ సమూహము లిట, ఎచ్చోట కాంచినన్!
చెట్టు మీద – కొట్టు మెట్టు మీద –
మార్గమందు – పెద్ద మైదానములయందు –
చెప్పు క్రింద – ఇంటి కప్పు మీద –
ఎవ్వడొ నేల ’ బ్రెడ్డు ’ పయి ఇంపుగ వెన్నను పూసినట్టులన్ –
ఎవ్వడొ పాల మీగడల ఈ భువి నెల్లెడ ఒల్కినట్టులన్ –
ఎవ్వడొ మాయతో ఇసుక నెల్లయు మంచుగ మార్చినట్టులన్ –
ఇవ్విధి ఉల్లమందు తలపించును కాంచగ ’ మాస్కొ ’ వీధులన్!
నిశ సమయంబున నిచ్చట
శశి అవనిని హిమము గాంచి సందేహించున్ –
” దిశ మారిచి ఏ రీతిని
విశు డవనిని నిలిపె నాదు వెన్నెల? ” లనుచున్!
మంచు వాన కురియ మహినెల్ల నిండుగా
చెట్టు కొమ్మల పయి చేరి హిమము;
కానిపించినంత కలిగించు విభ్రాంతి –
మదికి తోచి ’ క్రిస్సుమస్సు చెట్టు ’!
బాల్య చాపల్య మది యేమొ వాడ దింక!
కనుల ముందున్న హిమ మెల్ల కనుల ముందె
మధురమైన ’ ఐస్క్రీము ’ గా మారు నెడల –
ఎంత బాగుండు ననిపించు వింతగాను!
సూర్య కాంతి భువిని సోకకుండక మున్నె
ఇచ్చట ఉదయించు నెవడొ వీడు?
మార్గములను నిండు మంచు ముద్దల నెల్ల
తొలగజేయు – బాట వెలుగ జేయు!
దారిని తొలగించు హిమము
దారికి అటు నిటును వేయ – ధవళాద్రు లటున్
పేరుకొన – దారి కననగు
నారి కుచంబుల పయి గల నల్లని పయిటై!
తెలుగు దేశమునందు వాకిలి తీసి, ఊడ్చియు ముగ్గిడున్
తెలుగు నాతి శుభోదయంబున తెల్గు సంస్కృతి చాటగాన్!
తెలిసె నిచ్చట – రష్య పూరుష ధీమణీంద్రులు వాకిలిన్
తొలగ జేయుచునుంద్రు మంచును తూర్పులో తెలవారినన్!
( తరళ వృత్తము )
కనిపించును తెల్లదనము
మనుజుల హృదయముల – నగర మార్గంబులలో!
అనుభవమగు చల్లదనము
మనుజుల ప్రేమాదరముల – మరియు ప్రకృతిలో!
— *** —
ప్రకటనలు